గీర్వాణ కవులకవితా గీర్వాణం-2 (రెండవ భాగం )
481—శివ కర్ణామృతం రాసిన సరస్వతీ పుత్ర పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు
స్వామిశివానంద చే’’ సరస్వతీ పుత్ర’’బిరుదాన్ని పొంది ,14 భాషలలో అఖండ పాండిత్యాన్ని సాధించి, తాను రాసిన ‘’పెనుగొండ లక్ష్మి ‘’కావ్యానికి తానే విద్యార్ధిగా ఇంటర్ లో పాఠ్య గ్రంధంగా చదివిన ప్రపంచం లోనే అరుదైన వ్యక్తీ ,రెండు విశ్వ విద్యాలయాలనుండి గౌరవ డాక్టరేట్లు పొంది ,శతాధిక గ్రంధ కర్తయై ,పరమ వైష్ణవులైనా ‘’శివ తాండవ’’ కావ్యం నభూతో గా రాసి అఖండ కీర్తినార్జించి,భారత ప్రభుత్వం చే పద్మశ్రీ బిరుదాన్ని తమ అద్వితీయ కవితా, పాండిత్యాలకు అందుకొన్నవారు శ్రీ పుట్ట పర్తి నారాయణా చార్యుల వారు .అయితే వారు సంస్కృతం లో కూడా గ్రంధ రచన చేసిన విషయం శివ తాండవం మరుగున పడేసింది .అంతేకాదు 50 ఏళ్ళ తర్వాత మాత్రమె వారి ‘’శివకర్ణామృతం ‘’వెలుగు లోకి రావటం కూడా వింత విషయమే అయింది గీర్వాణ కవుల కవితా గీర్వాణం రెండవ భాగం లో 481వ గీర్వాణకవిగా వారిని ఆలస్యంగా పరి చయం చేస్తున్నందుకు మన్నించమని కోరుతూ వారి సంస్కృత భాషా వైశద్యాన్ని వివరిస్తున్నాను .
ఆచార్యుల వారి సంస్కృత రచనలు –శివ కర్ణామృతం ,త్యాగ రాజ సుప్రభాతం ,అగస్త్యేశ్వర సుప్రభాతఃమ్ ,మల్లి కార్జున సుప్రభాతం ,మార్కాపుర చెన్నకేశవ సుప్రభాతం ,శివసహస్ర౦ అనే ఆరు రచనలు .ఇవికాక వారి శివ తాండవం లోనూ గీర్వాణ భాషను సందర్భాన్ని బట్టి వాడి,శోభ చేకూర్చారు .ముందుగా శివ తాండవ గీర్వాణ సౌందర్యం దర్శిద్దాం –
శివ తాండవం
కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం లో ఉదయ సాయంత్రాలలో ప్రతి నిత్యం 108 ప్రదక్షిణాలు 40 రోజులు చేసి ,అలౌకికానందాన్ని అనుభవించి శివ భక్తీ మహా ప్రవాహంగా మహోద్రుతంగా జాలువారి శివ తాండవం గా రూపు దాల్చింది .భక్తికి శివ కేశవ భేదం లేదని రుజువైంది .కన్నడం లోని రగడ ఛందస్సును తీసుకొని ,ఆ గేయ౦ ఛందస్సులో నర్తించే వైనాన్ని గ్రహించి కవితా తాండవమే చేశారు . నందీశ్వరుని నోట నా౦దీవాచాకాన్ని పుట్టపర్తివారు సంస్కృతం లో చెప్పించి అఖండ గౌరవం ప్రత్యేకతలను చేకూర్చారు .తాండవాన్ని గూర్చి నంది వివరిస్తూ –
‘’అర్దే౦దూత్ఫుల్ల కేశం స్మిత రుచి పటలీ దంశితంగౌర వర్ణం –తార్తీయీకం ,వహంతం ,నయన ,మహికుల ప్రత్న భూషా వితానం
వృత్తారంభాట్ట హాస విచలిత కకుప్చక్ర ,మానంద కందం—తమ్ వందే నీలకంఠం త్రిదశపతి శిరస్చు౦బి పదాబ్జ పీఠం ‘’
భావం –తలపై ఉన్న చంద్ర ఆభరణ కాంతులతో ,విచ్చుకొన్ని పరమ శివుని జటలు నిగనిగ లాడుతూ ,ఆయన చిరు నవ్వులు మూసుకున్న మూడవ కంటి పై గౌసన తొడగి నట్లుగా ,గట్టిగా నవ్వుతూ శివుడు తాండవం చేస్తున్నాడు .ఆ నవ్వుకు దిక్చక్రాలు అల్లలాడిపోతున్నాయి .ఆయన పాద౦ పీఠంపై ఒంగి నమస్కరిస్తున్న దేవేంద్రుని శిరసును తాకు తోంది .
శివుని తాండవ రూపాన్ని వర్ణిస్తూ నందీశ్వరుడు –
‘’పాటల జటా ఘటిత ,జూట రుచి కోటి భ్రుష పాటిత తమిస్ర వలయం –కూట శబరం పటునిశాటకుల,జహాత సుఖ మోటనర సిక నిలయం
కోటి శత కోటి సమ కోటి నయనోత్దిత కృపీట భవ దగ్ధ మండనం –నాటితభువం ప్రళయ నాటక మహా రచన పాటవ చణం హృది భజే ‘’
తాత్పర్యం –యఎర్రని జటా జూట౦ కాంతులతో చీకట్లను పార ద్రోలు తున్నాయి .రాక్షసుల సుఖ హారి ,మాయా కిరాతకుడు నూరు వజ్రాయుదాల కాంతితో సమాన కా౦తి కల మూడవ కంటి మంటతో మన్మధదహనం చేసినవాడు ,ప్రళయ నాటకం ఆడేవాడు సమస్త విశ్వాన్ని తా౦డవం తో సమ్మోహన ౦ తో అలరించే పరమ శివునికి ప్రణతులు .
పార్వతీ దేవి కడగంటి చూపు తో శివుని వక్షస్థలం నెమలి పురుగుల రంగుగా మారిందట .పార్వతి తన అందాలు చూసుకోవటానికి భర్త నేత్రాలే దర్పణాలుగా ఉపయోగిస్తోందట .వేదాలనే స్త్రీకి ఆయన సొమ్ము .జ్ఞాస్వరూపుడు శివుడు .శివాట్టహాసాలతో దిక్కులు పగిలిపోతున్నాయట ..చేతులు పైకెత్తి నాట్యం చేస్తుంటే ఆకాశం వెనక్కి పోతోందట .కాలి కదలికలకు భూమి ,పర్వతాలు కంపించి పోతున్నాయి .మొలకు చుట్టిన సర్పాభరణం మధ్య మధ్యలో ఊడి పోతుంటే సరి చేసుకొంటున్నాడు .ఇలాంటి శివునికి నందీశ్వరుడు –
‘’జయ జయ శంకర ,శత్రు భయంకర –జయ జయ ప్రధమ పిశాచన శంకర –జయ జయ తాండవ సంభ్రమ సుందర –జయ జయ ధైర్య విచలిత మందర ‘’అనిజయం పలికాడు .తరువాత శివతాండవాన్ని చక్కని తెలుగులో రాసి శివునితోపాటు మనల్నీ నర్తి౦చేట్లు చేశారు సరస్వతీపుత్రులు .గీర్వాణ ఆంద్ర భాషలలో తమ కవితా పాండితీ విభూతిని పండించి జన హృదయాలను రంజింప జేసే కవిత్వం రాసిన పుట్ట పర్తి వారు ధన్యులు .చదివి మనమూ ధన్యుల మవుతాం .ఆ అనుభూతి నాన్యతో దర్శనీయమని పిస్తుంది
తరువాత శివ కర్ణామృత విశేషాలు తెలుసుకొందాం
ఆధారం –సాహిత్య అకాడెమి ప్రచురించిన శ్రీ శశిశ్రీ రాసిన ‘’పుట్ట పర్తి నారాయణా చార్య ‘’గ్రంధం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -6-8-16- కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

