ఇది విన్నారా కన్నారా ! 19
36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -2
242-‘’హాలులో నాలుగు గోడలమధ్యబందీ అయిన వీణా వాద్యాన్ని ,ఆధునికకాలపు అభి రుచులకు అనుగుణంగా ,మైదానం లోకి తెచ్చి ,ప్రపంచ వ్యాప్త సంగీత రసికులను’’ శాంత రసం ‘’లోము౦చినవారు ఈమనివారు .ఇదివారి సంకల్ప శక్తీ ,నిరంతర అభ్యసనం ,సాధనారక్తీ ,వాద్యం పైనిబద్ధత ,నిరంతర కృషి ,పరిశోధనాసక్తీ,పరిశీలా దృష్టి వల్లనే సాధ్యమైంది .త్రిలింగ క్షేత్రమైన ద్రాక్షారామం లో పుట్టి,ఆనాటి తెలుగు దేశపు అగ్రశ్రేణి వైణిక విద్వాంసులైన పితృపాదులు శ్రీ అచ్యుత రామ శాస్త్రి గారి వద్ద నే వీణా వాదనా సామార్ధ్యాన్ని పొంది ,వీణను ’’తెలుగు వీణ ‘’గా అవతార మెత్తించి అంతర్జాతీయ కీర్తిని తెచ్చిపెట్టారు. వీణను తెలుగు వీణగా ప్రతిష్టించిన ఘనత శాస్త్రి గారిదే .వీణ అంటే తెలుగు వాళ్ళది ,అనే గౌరవం సత్కీర్తి ఈమని వారే కలిగించారు .సంగీత వ్యాప్తికి తమిళులు ఎంతగా కృషి చేశారో వీణ వ్యాప్తికి ఈమని శంకర శాస్త్రి గారు అంతటి కృషి చేశారు’’అని విశ్లేషించిన ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారి పలుకులు ‘’ప్రాబలుకులే ‘’.
243-ఈమని వీణావాదనం ఎవరి వాద్యాన్నీ పోలి ఉండదు .అందులో వారి వ్యక్తిత్వమే ప్రతిధ్వనిస్తుంది .వాద్య రీతు లో వారి వాద్య రీతి కల్తీ చేయబడలేదు .అతి సున్నితమైన గులాబీ రెక్కల రెపరరెపలను చూపారు .మేఘ గంభీర నాదంతో ధను౦జయుని ధనుస్ట౦ కారాన్నీ చూపుతూ ,ఒక్కో రసానికి ఒక్కొక్క రీతిని ప్రయోగించిన విశేష నేర్పు వారిది .
244-ఈమని వారి వీణా నాద వైవిధ్యం అనితర సాధ్యం .ఒక్కొక్క సారి సితారా లాగా ,మరోసారి సరోద్ వలె ,మరికొన్ని సార్లు గిటార్ మెరుపులతో ,వేరొక సారి గోటు వాయిద్యంగా తంత్రీ వాయిద్యాల విభిన్న వ్యక్తిత్వాలనన్నిటినీ తమ వీణ లోనే పలికించి మెరిపించి మురిపించ గల నాద యోగ సిద్ధులు శంకర శాస్త్రి గారు .హృదయం లో మోగే ‘’అనాహతాన్ని ‘’తమ మీటుల నడుమ ‘’నిశ్శబ్దం’’ లో ‘’మ్రోగించే ‘’ఘనత శాస్త్రి గారిది .దీనినే వారు ‘’మ్యూజికల్ సైలెన్స్ ‘’అన్నారు .’’దీన్ని అనుభవించి ఆలాపనలో ఈ నిశ్శబ్ద స్థితి ని చూపలేని సంగీత కళాకారుడు ఎవ్వరికీ యే అనుభవాన్నీ ఇవ్వలేడు’’అన్న ఆచార్య ముదిగొండవారి మాటలు వారి అనుభవానికి చిరునామాలు .
245-భారత దేశం లో ‘’కాంటాక్ట్ మైక్’’(పికప్ )ను మొట్టమొదటగా వాడిన వారు ఈమని వారే .పికప్ వాడి వీణా నాదం లో ,మీటు లో ,నాజూకులు ,నయగారాలు తెచ్చిన ప్రప్రధమ వైణికులు శంకర శాస్త్రి గారు .లలిత సంగీతం లో శాస్త్రీయ వాసనలను ,శాస్త్రీయ సంగీతంలో లలిత సంగీత ‘’లే పరిమళాలను ఘుమ ఘుమలను ‘’అద్దిన ప్రయోగ శీలి శాస్త్రి గారు . ఈప్రయోగ శీలత యే వారిని ఢిల్లీ ఆకాశ వాణి కేంద్ర వాద్య బృంద సంగీత దర్శకుని ,మద్రాస్ జెమనీ సినీ స్టూడియో లో కొన్ని హిందీ ,తెలుగు సినిమాలకు సంగీత దర్శకుని చేసింది .
246 –లోకాన్ని ,లోకపు సంఘటనలను వీణా నాదం లోకి అనువదించటం అంతకు ముందు ఎన్నడూ లేనిది .శాస్తి గార ఈ పని చేసి చూపి ఆశ్చర్య పరచారు .టెన్సింగ్ నార్కే ఎవ రెస్ట్ శిఖా రాన్ని అది రోహించిన వార్త విని స్వయంగా స్పందించి ‘’ఆదర్శ శిఖరా రోహణ౦ ‘’అనే గొప్ప వాద్య బృంద సంగీతాన్ని సృష్టించి ప్రసారం చేయించారు .దీన్ని విన్న శ్రోతలందరూ తామే అధిరోహిస్తున్న అనుభూతికి లోనయ్యారు .అంటే వీణా వాదనతో ఇతర వాద్యాలను జోడించి సంగీతాన్ని ఎవరెస్ట్ శిఖరా రోహణ౦ చేయి౦చా రన్నమాట ఈమని వారు .టెన్సింగ్ ఎక్కి చరిత్ర సృష్టిస్తే సంగీతం తో ఎవరెస్ట్ నెక్కించి శంకర శాస్త్రి గారు మరో చరిత్ర సృష్టించారు .అలాగే ‘’భ్రమర విలాసం ‘’అనే రసమయ సంగీత రచన చేసి వినేవారికి ‘’భ్రమర ఝంకారాన్ని ‘’అను భూతిలోకి తెచ్చారు .దీనిలోని సంగీత విశేషాలను తెలుసుకోనేట్లుకూడా చేశారు .ఇలా తమ సంగీత యాత్రలో శాస్త్రి గారు వందలాది ప్రయోగాలు చేసి భేష్ సెహభాష్ అని పించుకొన్నారు .ఇలాశాస్త్రి గారి గురించి యెంత రాసినా ,యెంత చెప్పినా తనివి తీరదు ..అద్భుత రసానందమే అనుభవైక వేద్యం అవుతుంది .ఒళ్ళు పులకించి పోతుంది .
సశేషం
రేపు 12-8-16 శుక్రవారం శ్రీ కృష్ణ వేణీ పుష్కర ప్రారంభ ,శ్రీ వరలక్ష్మీ వ్రత శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -11-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

