ఇది విన్నారా కన్నారా ! 21
36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -4
250-రేడియోలు గ్రామ ఫోన్లు ఇంకా జనం కొనుక్కోలేని రోజులవి .సంగీత విద్వాంసులు రికార్డులను తెస్తూనే ఉన్నా ప్రతి ఇంట్లో వినే అవకాశం లేని రోజులు .మోజున్నవారు డబ్బున్నవారు మాత్రమేకొని, విని ఆనది౦చ గలిగే రోజులవి .అలా౦టికాలం లో ఈమనివారు 1943 తిరుచినాపల్లి ఆలిండియా రేడియో స్టేషన్ నుంచి మొదటి వీణ సంగీత కచేరీ ఒక గంట సేపు చేశారు .ఆ కచేరీతో కాకినాడ సరస్వతీమహళ్ సభాధ్యక్షులు శ్రీ దివాన్ బహదూర్ కొమ్మిరెడ్డి సూర్య నారాయణ మూర్తి నాయుడు గారితో పాటు ,అట్టడుగు వర్గం దాకా ఈమని వారి అభిమాను లయ్యారు .ఈ నాయుడు గారి వద్దనే శాస్త్రిగారు హిందూస్తానీ ,పాశ్చాత్య సంగీత మర్మాలను తెలిసికొన్నారు .వీటివలన శాస్త్రి గారి వీణా వాదన సామర్ధ్యం కొత్త అవతారమెత్తి అందరి అభిమానానికి పాత్రమైంది .
251-ఆ నాటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ సాంబ మూర్తి గారి సలహా మేరకు శాస్త్రి గారి తండ్రిగారు కుటుంబాన్ని మద్రాస్ కు 1940లో మార్చారు .ఇంటర్ పూర్తీ చేసి వాసన్ గారు నిర్మించిన జెమిని స్టూడియో లో పాప నాశన౦ శివన్ ,దండపాణి దేశికర్ ,సాలూరి రాజేశ్వర రావు వంటి దిగ్దంతుల సరసన 18 ఏళ్ళ శాస్త్రిగారు సంగీత బృందం లో చేరటానికి వీణను వాయించమంటే మూడు గంటలసేపు శాస్త్రిగారు కచేరీ చేయగా ముగ్ధులై వాసన్ గారు బృందం లో చేర్చుకున్నారు .తండ్రి పిల్లాడు పాడైపోతాడేమోనని బాధ పడ్డారు .శాస్త్రిగారికి చిన్నప్పటి నుంచి ఇతరులలో మేలిమి గ్రహించటం ,దాన్ని తనబాణీలోఒదిగేట్లుచేయటం రివాజు .చతురత సాధించాక వీణపై పాశ్చాత్య సంగీతాన్ని వాయించి మెప్పు పొందారు .దీని మీటు ,పధ్ధతి వేరు .కుడి ,ఎడమ చేతుల రెండింటి పని కర్నాటక సంగీతానికి బహు దూరం .సినిమాలకు వీణ వాయించినా ,సగీతదర్శకత్వం వహించినా వారి సృజన శక్తియే అగ్ర శ్రేణిలో నిలబెట్టింది .సినిమాలకు వాయించి ఉండక పొతే జాతీయ వాద్య బృందానికి నాయకత్వం వహించటానికి అవకాశం వచ్చి ఉండేదికాదు .శాస్త్రి గారి వాద్య బృంద రచనలు తర్వాత కాలం లో ప్రాంతీయ రేడియో స్టేషన్ లలోని వాద్య బృందాలకు ఒరవడి పెట్టాయి .
252 –జెమినీలో ఉండగా రెండవ ప్రపంచ యుద్ధకాలం లో సంగీత సంరంభం కొంత కాలం ఆగి పోయింది .దాక్షారామం వెళ్లి కచేరీలు చేయటం మళ్ళీ మొదలు పెట్టారు .జెమినీ నుంచి మళ్ళీ పిలుపు వచ్చి వెళ్లి చేరారు .జెమినీ సినిమా ‘’దాసీ అపరంజి ‘’సినిమాకు రెండుపాటలు శాస్త్రి గారే కట్టారు .’’శ్రీ జయ పరమేశ’’పాట బాగా జన రంజక మయింది .సంగీత దర్శకులు కాకుండానే ఇలా ఎన్నో పాటలకు స్వరాలు కూర్చారు .బి యే పూర్తిచేయటానికి కాకినాడ వెళ్లి పాసై తిరిగి వచ్చారు .వాసన్ గారి దగ్గర మళ్ళీ చేరి ,తాము తీస్తున్న ‘’మంగళ ‘’హిందీ సినిమాకుట్యూన్లు కట్టమని కోరగా మాంచి బాణీలు కట్టారు తెలుగు సినిమా ‘’సంసారం ‘’కు శాస్స్త్రి గారు కట్టిన ట్యూన్లు ఆంధ్రదేశాన్ని ఒక ఊపు ఊపాయి .ఇవికాక ‘’బహుత్ దిన్ హుయే ‘’,మిస్టర్ సంపత్ ‘’,నిషాన్ ,’’చంద్రలేఖ ‘’సినిమాలు శాస్త్రి గారి బాణీల ఓణీల తోనే జనాన్ని మెప్పించి దిగ్విజయమయ్యాయి .చంద్ర లేఖ సినీ సంగీతం రికార్డ్ లను సృష్టించింది
253 –జెమినీలో ఉండగానే శాస్త్రిగారు వీణా వాద్యానికి ఎన లేనిసేవ చేశారు .వాద్య బృందం లో అప్పటి దాకా వీణ వెనక వరుసలో ఉండేది .ఎవరికీ దాని స్వారస్యం ఆనేదికాదు. ‘’అగస్త్య భ్రాత ‘’అయింది అప్పుడు వీణ .జెమినీలోని పాశ్చాత్య సౌండ్ ఇంజనీర్ ఏడాదికోసారి తన దేశానికి సెలవు మీద వెళ్లి వచ్చేవాడు .ఒకసారి అలాగే వెళ్లి వచ్చి అక్కడ గిటార్ కు కాంటాక్ట్ మైక్ అంటే పికప్ పెడుతున్నారని చెప్పి తెచ్చిచ్చాడు .ఈ పికప్ ను వీణకు అమర్చి తమ సంగీతాన్ని బాగా పికప్ చేశారు శాస్త్రీజీ .సున్నిత గమకాలను నాజూకు మీట్లను పట్టుకొని శ్రోతలకు వాటిని వీణపై అందించి పరవశులను చేసేవారు .దీనితో వీణకు మళ్ళీ నాజూకుల నగలు ఆభరణాలుగా భాసి౦చాయి వీటికన్నిటికీ ఆద్యులు శంకర శాస్త్రి గారే .ఆ తర్వాత పికప్ అందరికీ ఆరాధ్యమై, మాంచి పికప్ సాధించింది
254 -1959 డిసెంబర్ 1 న శాస్త్రి గారు మద్రాస్ రేడియో స్టేషన్ లో మ్యూజిక్ ప్రొడ్యూసర్ గా చేరారు .1961 లో ఢిల్లీ లో నేషనల్ ఆర్కెస్ట్రా కు కంపోజర్ గా ,కండక్టర్ గా ,డైరెక్టర్ గా పని చేశారు .అంతకు ముందే కొన్ని వాద్య బృంద రచనలు చేసి శ్రోతలను మంత్రం ముగ్ధులను చేశారు .
255-1940 నుండి -76 వరకు శంకర శాస్త్రి గారి సంగీత జీవితం విశిష్టంగా పాతికేళ్ళు సాగింది .అనుక్షణ సంప్రదాయ ,ప్రయోగాలు సాగాయి .వీణా వాదాన్నిశర వేగంగా ముందుకు తీసుకు వెళ్ళారు .శాస్త్రీయ సంగీతం తోపాటు లలిత ,వాద్య సంగీతాలకూ సత్పరిణామాలు సాధించి చూపారు .
256 –వీణ కర్నాటక సంగీతానికి ,సితార్ ,సరోద్ లు హిందూ స్తానీకి ప్రత్యేకత అని భావించే రోజులవి .ప్రపంచ సంగీత చరిత్రలో మొదటి సారిగా శాస్త్రిగారు శ్రీ రవి శంకర్ తో సితారా తో కలిసి వీణ వాయించారు ఆధార శ్రుతి నుంచి రెండు రీతుల బాణీలవరకుఅన్నీ సమస్యలే .వీటినన్నిటినీ పరిష్కరించు కొంటూ శాస్త్రిగారు సరి కొత్త ప్రయోగం చేసి రెండు వాద్యాలనుంచి రెండు బాణీల సంగీతం నుంచి మేలిమి ని ఈ కచేరీలో రాబట్టారు .దీన్ని ఆకాశ వాణి ప్రసారం చేసింది .భారతీయ సంగీత చరిత్రలో’’ తొలిజుగళ్ బందీ ‘’ఇదే .దీనికి ఆద్యుడుతెలుగు బిడ్డ శాస్త్రి గారే కావటం మన అదృష్టం .వీణ వాయిస్తూ ఒక భజన పాడి వినిపించిన శాస్త్రి గారిని భారత ఉప రాష్ట్ర పతి, శాస్త్రి గారిని ‘’ఇంటే గ్రేటర్ ‘’అని ప్రశంసించారు .సితారా ,వీణా ,సరోద్ బాణీలను ఇంటేగ్రేట్ చేసిన ఘనత శాస్త్రి గారిదే .
257 -సినీ సంగీత ప్రపంచానికి పి బి శ్రీనివాస్ ను ,ఎ.ఏం రాజా ను గాయకులుగా పరిచయం చేసి కానుకగా ఇచ్చిన వారు శాస్త్రి గారే .ఇక వీణకు కానుకగా శ్రీ చిట్టి బాబు ‘’ను ,శ్రీమతి వి యెన్ సరస్వతిని వారసులుగా అందించారు శాస్త్రి గారు.
సశేషం
కృష్ణా పుష్కర ప్రారంభ , వరలక్ష్మీ వ్రతం శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-8-16- కాంప్ –బాచుపల్లి –హైదరాబాద్

