ఇది విన్నారా కన్నారా ! 24
36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -7
267-కేవలం వాద్యాలమీదనే కొన్ని స్వరాలతో సంగీత రచన చేసి ,దానిలో సంఘటనల వలన కలిగే అను భూతులను శ్రోతలలో కలిగించాలి అనే మహా విద్యలో శంకర శాస్త్రి గారు అద్వితీయులు .ఈఅనుభవం తో 80 కి పైగా ‘’వాద్య బృంద రచనలు ‘’చేసి వినిపించారు .ఇందులో కొన్ని సంఘటనా నేపధ్యం లో ఉంటె ,మరికొన్ని మహా పురుష జీవిత ఘటనా నేపధ్యం తో ఉన్నాయి .’’సౌమ్య పురుష ‘’అనే పేరుతొ మహాత్మా గాంధీ శత జయంతి ఉత్సవాలకు రచించారు .అలాగే ‘’భారత జ్యోతి ‘’,’’జవహర్ జ్యోతి ‘’దేనికది ప్రత్యేకం గా చేశారు .వీటిలో వీరి కీర్తిని ఎవరెస్ట్ శిఖరం పై అత్యున్నతంగా నిలిపినవి రెండు –ఒకటి ‘’ఆదర్శ శిఖరా రోహణ’’,రెండవది ‘’భ్రమర విన్యాసం ‘’అని ముందే చెప్పుకున్నాం .టేన్జింగ్ నార్కే ఎవరెస్ట్ ను ఎక్కటాన్ని ‘’ఆదర్శం ‘’గా భావించి ఆ పేరు పెట్టారు ధ్వన్యాత్మకంగా .వాక్కు లేని హృదయ భాషను వారి వాద్య బృందం పలికించి ఆ సంఘటనను ‘’చిరస్మరణీయం ‘’చేశారు శాస్త్రి గారు .అలాగే తుమ్మెద అంటే భ్రమరం జీవితం లోని ఒక్క రోజు జీవితాన్ని సంగీతంగా అనువదించి మాటలకందని భావ వ్యక్తీకరణ చేసి తమ వీణానాదం లోని ఝ౦కా రాలను సహస్రదళ పద్మంగా వికసింప జేసి మహా మధురాను భూతి కలిగించారు .’’రస తేనే పట్టు ‘’ను నిర్మించి జుమ్మనే నాదం తో ,అమృతమయమైన కమ్మని జుంటి తేనె తాగించారు .
268 –ఈమని వారి ప్రతిభను యే కొంతకో పరిమితం చేయలేము .వారి ప్రయోగ వైవిధ్యం ఎల్లలు లేని సముద్రమే .సంప్రదాయ శాస్త్రీయ ,లలిత ,సినీ ,పాశ్చాత్య ,ఆర్కెస్ట్రా హిందూ స్థానీ సంగీతాలలో ఎన్నో ఎన్నెన్నో మూలాలు , కిటుకులు తెలిసిన మహా విద్వా౦సులాయన .అందుకే ఆర్కెస్ట్రా సంగీతం లో తోడి రాగ ఆలాపన ,తానం ,పల్లవులను రచించి లక్షలాది శ్రోతలకు సంతోషాన్ని, సంతృప్తిని కలిగించారు .శుద్ధ కర్నాటక శాస్త్రీయతను రంగరించుకొన్న తోడి రాగాన్ని వాద్య బృందానికి శాస్త్రి గారు తీసుకోన్నారంటే వారి గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి .సాహసం, గుండె ధైర్యం ఉన్న వారు కనుకనే ఈపని చేశారు సార్ధకత నూ చేకూర్చారు .
269 -50 దేశాలు పాల్గొన్న ‘’ఏషియా రోష్ట్రం ఫైల్’’లో శంకర శాస్త్రిగారు ‘’స్వర రాగ సుధా రస ‘’అనే శంకరాభరణ కీర్తనను రాగ ,తాన ,స్వర కల్పన లతో మద్రాస్ ఆకాశ వాణి కేంద్రం లో రికార్డ్ చేసి ఆ పోటీకి పంపగా, దానికి న్యాయ నిర్ణేతలు ప్రధమ బహుమతినిచ్చి వారి సృజనకు నీరాజనాలు అందించారు .ఆ కాలం లో రష్యా దేశం లో శాస్త్రి గారి వీణా వాదన చాతుర్యాన్ని మెచ్చుకొని వారు లేనేలేరు అంటే అతిశయోక్తి కాదు అంటారు ఆచార్య ముదిగొండ వారు .’’యహూదీమెనుహిన్ ‘’ఈ పోటీ కి న్యాయ నిర్ణేత. శుద్ధ శాస్త్రీమైనా , సుందర లలిత సంగీతమైనా శాస్త్రి గారు దేనికి దానికే కట్టుబడి శ్రోతలను ముగ్ధులను చేయగలరు అన్నది శుద్ధ సత్యం అంటారు వీరభద్రయ్య జీ .
270-శాస్త్రి గారి ప్రయోగాలలో శిఖరారోహణం అయినది వారు రచించిన ‘’ఇందు ‘’.దీన్నే శ్రీ బి వి కె శాస్త్రిగారు ‘’మాగ్నం ఓపస్ ‘’అన్నారట .’’ఇందు ‘’వాద్య బృందం రచన లో కొన్ని ముఖ్యమైన సంగీత పర అంశాలున్నాయి .72 మేళ కర్తలు ,అందులో 6 రాగాలు .వీటిని ఒక్కొక్క సమూహంగా ,చేసి 12 సమూహాలుగా ఏర్పరచి ,ఒక్కో సమూహాన్ని ‘’చక్రం ‘’అనే పేరు పెట్టి ,మొత్తం 12 చక్రాల ఆవర్తనాన్ని సృష్టించారు .వీటికి 1-ఇందు 2 నేత్ర 3-అగ్ని 4 వేద 5-బాణ ,6-ఋతు7-ఋషి 8-వసు ,9-బ్రహ్మ ,10-దిశి ,11-రుద్ర 12 –ఆదిత్య అని నామకరణ౦ చేశారు .ఈ 12 చక్రాలలో మొదటి చక్రం ఇందు .
271 –ఇందుచక్రం లో 6 రాగాలు –కనకాంగి ,రత్నా౦గి ,గాన మూర్తి ,వనస్పతి ,మానవతి ,తాన రూపి లను పొందుపరచారు .ఈ ఆరు రాగాలలోనూ రిషభం శుద్ధ రిషభమే .అలాగే గాంధార మధ్యమాలు కూడా అంటే రి ,గ లు ప్రక్క ప్రక్కనే ఉంటాయి .ఇంకా తేలికగా అర్ధమవ్వాలంటే చతుశ్రుతి రిషభమే శుద్ధ గాంధారం .మధ్యమమూ శుద్ధమే .మరి ఈ ఆరు రాగాలకు ప్రత్యేకత దేనివలన వచ్చింది ?అంటే దైవత ,నిషాదాల వల్లనే వచ్చింది. కనకా౦గి లో అన్నీ శుద్ధస్వరాలు ,రాత్నా౦గి లో కైశికి నిషాదం ,గాన మూర్తి లో కాకలి నిషాదం ఏర్పడింది .ఈ ఆరు రాగాలతో ‘’ఇందు ‘’పేరు తో స్వర రచన చేసిన స్వర బ్రహ్మ శాస్త్రిగారు .అసలు ఈ ఊహ రావటమే మహా గొప్ప విషయం ,దాన్నిసవాలుగా సాధించి నిరూపించి తమ ఉపజ్నను వెలుగులోకి తెచ్చారు .’’గాన మూర్తి ‘’రాగం పై శాస్త్రి గారికి –మహా గొప్పఅంటే అపారమైన సాధికారత ఉంది .ఒక్క ఎం .ఎల్. వసంత కుమారి తప్ప వేరెవ్వరూ ఈ రాగాన్ని ఇంతగా స్వాధీనం చేసుకో లేదు .గమకం లో స్పష్టత సాధించుకోలేని వైణికునికి ఇందు చక్ర రాగాలను పలికించటం అసాధ్యమైన పని .అంతటి తపనా తపస్సు శాస్త్రి గారిది .సంగీత వైడుష్యాన్నీ ,మాధుర్యాన్నీ రెండిటినీ ద్రుష్టి లో పెట్టుకొని వాద్య బృంద రచన చేసి చిర యశస్సు సాధించిన ‘’మకుటం లేని మహావీణా సంగీత చక్ర వర్తి’’ శ్రీ ఈమని శంకర శాస్త్రి గారు అని సామాన్యులకు అర్ధం కాని ఈ విషయాలను అలవోకగా కరతలామలకం చేసి చెప్పారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గురు మూర్తులు .
సశేషం
70 వ స్వాతంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-16- ఉయ్యూరు

