ఇది విన్నారా కన్నారా ! 25 36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -8(చివరి భాగం )

ఇది విన్నారా కన్నారా !  25

36-ఆమని కోయిల సంగీతం మహా మహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రిగారి వీణా గానం -8(చివరి భాగం )

272-శంకర శాస్త్రి గారి ప్రతిభ సాంప్రదాయ శాస్త్రీయ సంగీతం లో ఎంత ఉందో ,ఆధునిక శాస్త్రీయ సంగీతం లోనూ అంతే ఉంది .ఆర్కెస్ట్రా సంగీతం భారతీయం కాదు .మన సంగీతం లో ఒక్క కళాకారుడే సంగీత విద్యా ప్రదర్శన చేస్స్తాడు.తాళ ,మృదంగాలు కేవలం సహకారాలే .కాని ఆర్కెస్ట్రాలో అనేక వాద్యాలు ఒకే స్వరాన్ని పలికించటం విశేషం .అంటే గాత్రం లో బృంద గానం లాంటిది ఆర్కెస్ట్రా  అన్నమాట . అదుకే దీన్ని’’ వాద్య బృందం’’ అన్నారు .వాద్యబృందం లో శాస్త్రీయ సంగీతాన్ని వినిపింప జేయటం ,అందులో కూడా రాగం ,తానం ,పల్లవులను వినిపింప జేయటం ,అందులో మరీ ముఖ్యంగా తోడి రాగ౦ తానం ,పల్లవి కట్టటం అన్నీ  శాస్త్రి గారు చేసిన అద్భుతాలే .అద్భుతాలకే అద్భుతం .అద్భుతాలకే అద్భుతం అని పించారు .వీణపై తోడి రాగాన్ని వాయించటం లో శాస్త్రి గారు అద్వితీయులు ..తోడి రాగం లో ఇతర వాద్యాల తోడు గా వాద్య సమ్మేళన రచన గా తీర్చి దిద్ది కొత్త దారి వేసి మార్గ దర్శకులయ్యారు ..వాద్య సంగీతం అంటే సినిమాలో రీ రికార్డింగ్ సంగీతం లా ,లలిత సంగీతంలాఅని పిస్తుంది .శాస్త్రి గారు దీని ట్రాక్ లోంచి తప్పించి శాస్త్రీయ సంగీతాన్ని కూడా ,అందులోనూ రాగం ,తానం ,పల్లవి ని వాద్య సమ్మేళన రచనగా రూపొందించి దివ్యానుభూతిని కలిగించారు అంటారు ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు .శాస్త్రి గారి వాద్య బృంద సంగీతం వింటుంటే ‘’ఆధునిక కర్నాటక వర్ణాలా !’’అని పిస్తాయన్నారు ఆచార్య శ్రీ .’’మనో ధర్మ సంగీతం శంకర శాస్త్రి గారి లో కొత్త రూపు ఎత్తింది .వీరి వాద్య బృంద సంగీత రచనలన్నీ వారి సృజనాత్మక ప్రతిభకు ఎత్తిన పతాకలు అని ముదిగొండ వారు అన్నమాట అక్షర లక్షలు చేసే సత్య వాక్యం .

273  -సంగీతం లో ఎన్ని ప్రయోగాలు చేసినా శాస్త్రిగారు శాస్త్రీయ సంగీతాన్ని వదిలి పెట్టలేదు .సంగీత శాఖలన్నిటిపైనా వారికి గౌరవమున్నా శాస్త్రీయ సంగీతాన్ని వీణ కచేరీలను వదలలేదు .తనకు అన్ని రాగాలు ఇష్టమే నని ముదిగొండవారి తో జరిగిన ఇష్టా గోష్టి లో చెప్పారు .కాని ‘’శంకర శాస్త్రి తనాన్ని’’ వాయించిన రాగాలలో శంకరాభరణం ,కల్యాణి ,తోడి ,గానమూర్తి ,కీర వాణి రాగాలున్నాయని’’ పసిగట్టారు ఆచార్య వర్యులు .’’శివ దీక్షా పరు రాలనురా ‘’అనే కురువంజి రాగ జావళి వారి వలన కొత్త ప్రాణం పోసుకొన్నదని ,ఆ రాగాలకు ’ పేటెంట్  ‘’శాస్త్రి గారిదే నని ముదిగొండ ఉవాచ .

275-దీర్ఘ ,లఘు కంపితాలతో,మంద్ర ,అనుమంద్ర తంత్రుల విని యోగం లో శాస్త్రి గారు మలయ మారుత వీచికలనే కాక ,ప్రళయ కాల ఝ౦ఝామారుతాలవరకు సృష్టించేవారు .రాగాలాపనలో అనవసర ప్రయోగాలు ,పునరుక్తులు ఉండేవికావు .స్వర ప్రస్తారం లో తాళం తీగెల మీద మీటు శాస్త్రి గారి మరో ప్రత్యేకత .కీర్తన పాఠం శంకర శాస్త్రి గారు వాయించి నంత స్పష్టంగా వాయించ గల వైణికులు ఒకరో ఇద్దరో ఉన్నారేమో నంటారు వీరభద్రయ్య గారు .తానం శాస్త్రి గారి చేతిలో కొత్త అందాలు సంతరించు కొన్నదని ,కచేరీలలో యే రాగం తర్వాత యే రాగం వాయించాలి ,యే రాగాలకీర్తనలకు రాగాలాపన ,స్వర ప్రస్తారం చేయాలి మొదలైన వాటికి శాస్త్రిగారు పెట్టిందే ఒరవడి గా నిలిచింది అన్నారు ముదిగొండ వారు .

276-ప్రతి కచేరీ చివర వీణ పై ‘’మంత్రం పుష్పం ‘’వాయించటం శాస్త్రి గారి ప్రత్యేకత .దీనికి ముందు ‘’కం సెప్టెంబర్ ‘’లోని పాశ్చాత్య సంగీతాన్ని వినిపించేవారు .దీన్ని ఎందుకు వాయించేవారు ?అనే ప్రశ్నకు ‘’ఇందులో ఒక రహస్యం ఉంది .దీని మీటు ‘’స్టక్కాటో’’ పద్ధతిది .తీగ మీద కలిగే’’ అనురణ నాన్ని ‘’ అంటే నిరంతర ప్రవాహాన్ని ఆపే పధ్ధతి అది అన్నమాట .వీణ మీద అన్నీ సాధ్యమేనన్న ‘’ధిషణాహంకారంప్రదర్శనం ‘’‘’శాస్త్రి గారిది అని మనకు తెలియ జెప్పారు ఆచార్య ముదిగొండ .విశ్వనాధ కున్న’’ ధిషణాహంకారమూ’’ ఇలాంటిదే .అది వారిద్దరి గర్వానికి చిహ్నాలు కావు. ప్రతిభ ఉత్పత్తి లకుదర్పణాలు.,పట్టాభి షేకాలు .వీణ లో మమైకం అయి శాస్త్రి గారు చేస్తే భారతీయ సాహిత్యం లో మమేకమై విశ్వనాధ చేశారు .కచేరీ చివరలో శాస్త్రి గారు ప్రవేశ పెట్టిన ఈ రెండు అంశాలు  వారిముఖ్య శిష్యుడైన చిట్టిబాబు గారి లో వృద్ధి పొంది ‘’వెడ్డింగ్ బెల్స్ ‘’అనే పాశ్చాత్య సంగీత క్యాసెట్ ఆవిష్కారమైంది .వేదమంత్రాలను చిట్టిబాబు గారు కూడా కచేరీ చివరలోనే వాయించి గురు సంప్రదాయాన్ని కొన సాగించారు

278 –శంకర శాస్స్త్రిగారు కచేరీలలో విద్వత్ ను ఎంతగా ప్రదర్శించేవారో ,అంతగానూ మాధుర్యాన్ని ఒలికి౦చేవారు . ఈ లక్షణం తోనే  వారి వాయిద్యం వీణ చిరస్మరణీయ మైంది .లాలిత్య ,మాధుర్యాలే లేక పోతే ఈమని శంకర శాస్త్రి లేరు .మాధుర్యానికి అడ్డం వచ్చేదాన్ని దేనినీ వారు అంగీకరించ లేదు .శాస్త్రిగారు అంటే  నిరహం కారులు , నిగర్వులు .తమ విద్య విషయం లో అహంకరించారు .’’సరస్వతీ మాత నా గుప్పిటి లో ఉంది ‘’అని చాటి చెప్పిన రోజూ ఉంది .అయితే ఇది విద్యాబలం వలన చేకూరిన శక్తి అని విస్పష్టంగా ప్రకటించారు ఆచార్య ముదిగొండ .

279-తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులుగా నియమింపబడి శాస్త్రి గారు గౌరవం పొందారు .యూని వర్సిటి  గ్రాంట్స్ కమిషన్  సభ్యులుగా నియమింప బడ్డారు .మద్రాస్ మ్యూజిక్ అకాడెమి లో ఎక్స్ పర్ట్ కమిటీ సభ్యులైనారు .కేంద్ర సంగీత నాటక అకాడెమీ గౌరవ సలహాదారుగా ఉండి,ప్రతిభకల విద్వాంసులనుజాతీయ స్థాయి లో  ఎంపిక చేసే బాధ్యతను స్వీకరించారు  .విద్యా మంత్రిత్వ శాఖకు చెందినా .కర్నాటక సంగీతానికి ఫౌండర్ చైర్మన్ గా  ,ఫిలిం అవార్డ్ కమిటీ  సభ్యులుగాఉన్నారు .

280 –‘’వైణిక శిరోమణి ,వీణా గాన గాంధర్వ ,గాన రూప కళా సరస్వతి ,వీణా వాదన తత్వజ్ఞ,,గాంధర్వ కళానిధి ,గాన కలాధర ,వీణా చక్ర వర్తి ,వల్లకీ వల్లభ’’ మొదలైన బిరుదాలు  శాస్త్రి గారి కీర్తి కిరీటం లో కలికితురాయిల వలె ధగ ధగ లాడాయి వారి ప్రతిభకు తార్కాణాలయ్యాయి .దక్షిణ భారత దేశ సంగీత విద్వాంసులలో  ప్రప్రధమంగా  వారికి ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదు లభించింది .సంగీత నాటక అకాడెమి ,సాహిత్య కళా పరిషత్ లు అవార్డులనిస్తే ,,ఆంద్ర విశ్వ విద్యాలయాలు గౌరవ డాక్టరేట్ ప్రదానంచేసింది . సంగీత సరస్వతికి చేసిన సేవను గుర్తించి భారత ఉప రాష్ట్ర పతి శాస్త్రి గారికి ‘’చతుర్దండి పండితః ‘’అని బిరుదునిస్తే భారత ప్రభుత్వం ‘’పద్మశ్రీ ‘’పురస్కారాన్ని ప్రదానం చేసి ఈ సంగీత సరస్వతిని  సన్మానించి ధన్యమైంది .

శాస్త్రిగారి కుమార్తె శ్రీమతి కళ్యాణీ నారాయణ రావు దూర దర్శన్ ,ఆకాశ వాణి లలో వీణ పై గొప్ప ప్రదర్శనలు చేసి తండ్రిగారి కీర్తి పతాకను ధరించి ముందుకు దూసుకు పోయింది .

 

సశేషం

Inline image 1  Inline image 2

భారత స్వాతంత్ర దినోత్సవ శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -14-8-16- ఉయ్యూరు

 

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.