ఇది విన్నారా కన్నారా ! 27
37-వీణా పాణి విశ్వేశ్వరన్ -2(చివరి భాగం )
288—వాగ్గేయ కారుడైన విశ్వేశ్వరన్ వందకు పైగా కృతులు ,తిల్లానాలు ,పదాలు ,వర్ణాలు ,కొన్ని లఘు సంగీత రచనలు చేశారు తెలుగు కన్నడ సంస్కృతాలలో ఈ రచనలున్నాయి .దర్బారు ,నాయకి ,ఆరభి ,దేవ గాంధారి ,రీతి గౌళ ,ఆనంద భైరవి ,వరాళి ,శుభ పంతు వరాళి, భైరవి ,శ్రీ ,మనిరంగు ,మధ్యమావతి వంటి గొప్పరాగాలలోనూ రచన చేశారు కొన్ని హిందుస్తానీ లో చేశారు .కర్నాటక సంగీతం గొప్పతనాన్ని గురించి వీరభద్రయ్య గారితో ‘’Ours is enormously Evolved –ours best chiselled one ‘’అన్నారట .దీక్షితులవారి హిందోళ రాగ కృతి ‘’నీరజాక్షి కామాక్షి ‘’హిందూ స్థానీ బాణీ లో మాల్కోస్ రాగం అనిపించేట్లు పాడేవారట .
289 –వీణా వాదనకు గాత్రానికి భేదం లేకుండా వాయించిన ఆమహా వైణికులు విశ్వేశ్వరన్ .యాజ్న వల్క్య మహర్షి చెప్పిన –
‘’వీణా వాదన తత్వజ్ఞః శ్రుతి జాతి విశారదః –తాలజ్నశ్చ ప్రయాసేన మోక్ష మార్గం స గచ్చతి ‘’అన్న శ్లోకం సంగీతోపాసకులందరికి గీతోపదేశం లాంటిది అన్నారు ముదిగొండవారు .
290-మహోన్నతులని వైణికులు తంత్రులపై వాయిస్తుంటే అది వారి గొంతుకలోని స్వర తంత్రులను అనునాదం లో కదిలిస్తాయి .ఏ ధ్వని వోకల్ కార్డ్ లను కదలించ లేక పోతుందో అది గాత్ర హీనమైనదని ఆచార్య ఉవాచ .బహుశా యే వైణికునికీ లభి౦చనిఅరుదైన అదృష్టం విశ్వేశ్వరన్ గారికి దక్కింది .దీక్షితులవారు ఒక సారి కాశీలో గంగా స్నానం చేస్తుండగా వారికి మంత్రం దీక్ష నిచ్చిన చిదంబర యోగి ‘’నీకు మంత్రం సిద్ధి అయింది ‘’అని చెప్పబోయే తరుణం లో దీక్షితులవారి కర కమలాలలోకి వీణ వచ్చి నిలిచింది .నాద జ్యోతి ముత్తుస్వామి దీక్షితులు వాయించిన వీణపై వాయించే అరుదైన అవకాశం విశ్వేశ్వరన్ గారికి కలిగింది .దీక్షితులవారు నిత్యమూ అర్చించుకొనే శ్రీ చక్ర యంత్రం ,గణపతి విగ్రహం ,సుబ్రహ్మణ్య స్వామి పటాలకు రెండు రోజులు పూజించే అదృష్టమూ కలిగింది .దీక్షితులవారి వీణకు యాళి ఊర్ధ్వ ముఖంగా ఉన్నట్లే విశ్వేశ్వరన్ గారు తమ వీణలకూ అలాగే ఉండేట్లు తయారు చేయి౦చు కొన్నారు .దక్షిణాది శిల్పాలన్నిటిలో వీణ యాళి ఊర్ధ్వ ముఖం గా ఉంటుంది అని ఆచార్య శ్రీ పరిశీలించి చెప్పారు.
291-Never has Lakshana is in the leading position ,and it is only Lakshya that has always hearled ,only followed Lakshana’’
‘’Lakshya and lakshana should be inseparable .It is only when this tribe grows that there is a meaningful progress in the art and benefit to the recipients of the experience from music be it in the musicians or the listeners ‘’అన్నది విశ్వేశ్వర సంగీత తీర్ధ సారాంశం .
ఆయన లక్ష్య ,లక్షణ సమన్వయానికి ముఖారి రాగం లో విశ్వేశ్వరన్ గారు కట్టిన గీతం గొప్ప ఉదాహరణ
పల్లవి –‘’లక్ష్య లక్షణ సమన్వయ ముఖ్యత నెంతని తెలప నా తరమా ‘’
అనుపల్లవి –‘’లక్ష్యమే ముందుండి రాజిల్లు సంగీతములో
స్వర మేల,కళానిధిని రామామాత్యుడు వ్రాసినది ఈ
సమన్వయ స్తాపనకే నని వినలేదా ?
స్వర లయా౦ కార గమక రాగ భావ రసములతో
పరమునకు ,ఇహమునకు ఏక సాధనమని చెప్పిన
వర నిశ్శంకునికి యశము నిచ్చిన అంతక ప్రముఖారి
విశ్వేశ్వరుని వర ప్రసాదమైన సంగీతములో ‘’ .
292 –విశ్వేశ్వరన్ గారికి దేశ ,విదేశాలలో ఎన్నో గౌరవ పురస్కారాలు లభించాయి .చెన్నై శ్రీ కృష్ణ గాన సభ ‘’సంగీత చూడామణి ‘’బెంగుళూర్ వారు ‘’పలని సుబ్రహ్మణ్య పిళ్లే ‘’పురస్కారాన్ని ,కర్నాటక గాన కళా పరిషత్ ‘గాన కళా భూషణ ‘’బిరుదు తోపాటు ‘’ఆలిండియా మ్యుజీషియన్స్ సిల్వర్ జూబిలీ కాన్ఫ రెన్స్ ‘’కు అధ్యక్షునిగా ఎన్నుకొన్నది .వ్యాస రాజ ధర్మ సంస్థానం పరివ్రాజకాచార్యులు ‘’సంగీత సార్వ భౌమ ‘’ను ,ప్రపంచ సంగీత దినోత్సవం నాడు ఆకాశ వాణి ‘’జాతీయ పురస్కారాన్నిఅందించగా ,అమెరికాలో కాలిఫోర్నియా ‘’ధియోడోర్ ధామస్ విశ్వేశ్వరన్ గారిపై ఒక డాక్యు మెంటరిని తీశారు .20 02 లో కర్నాటక ప్రభుత్వం ‘’రాజ్య సంగీత విద్వాన్ ‘’ప్రదానం చేసింది
293 –ఇంగ్లాండ్ ,ఐర్లాండ్ లకు మూడు సార్లు వెళ్ళారు .బి బి సి వీరి కచేరీ రికార్డ్ చేసింది కేంబ్రిడ్జ్ ,డబ్లిన్ ,బర్మింగ్ హాం బెల్ ఫాస్ట్ మొదలైన రేడియో కేంద్రాలు టి వి కేంద్రాలు వీరి సంగీతాన్ని ప్రసారం చేశాయి .వీరి వీణా వాదన ను సంగీత కంపెని –సంగీత వీణా వైభవ ,గ్రేట్ రాగాస్ ,సోల్ స్టర్రింగ్ రాగాస్ మొదలైన కేసెట్లుగా తెచ్చింది .’’ఏకత లో భిన్నత ‘’సర్వం ఖల్విదం బ్రహ్మ ,వాది రాజు మొత్తం రచనలకు ‘’భ్రమర గీతం ‘’రచన చేసి రికార్డ్ చేశారు
294 –విశ్వేశ్వరన్ గారి భార్య ఉషాదేవి .కూతుళ్ళు విద్యా నటరాజ్ ,వీణా జయంత్ లు .కుమారుడు కార్తీక్ అందరూ వైణికులే .ఆయన చదువు ఏం యే –ఇండాలజీ .1965 లో మైసూర్ విశ్వ విద్యాలయం సంగీత నృత్య కళాశాల స్థాపించి విశ్వేశ్వరన్ ను మ్యూజికాలజిస్ట్ గా నియమించింది .1973 లో వీణ అధ్యాపకులై 78లో వాద్య సంగీతాఆచార్యులుగా పదోన్నతి పొంది ఎందరెందరికో వీణ విద్యనూ నేర్పారు
295 –‘’ధన్యుడనైతి ని సంగీతమును నేర్చి నందువలన ‘’అని కీర్తనలో తన మనో ప్రవ్రుత్తి చాటారు .కన్నడదేశం లో తెలుగు మర్చి పోతున్న తెలుగు కుటుంబీకుడు అయిన విశ్వేశ్వరన్ దేవ గాంధారి రాగం కీర్తన ఆయన ఎంతటి వినీతులో తెలియ జేస్తుంది –
‘’అంతరంగము తెలిసి పాడిన –సంగీతమునకు మాత్రమే పూర్ణార్ధము
చింతన ,మనన ,సాధన జత గూర్చి –మన కెంతో చక్కని మార్గము జూపిన పెద్దల ‘’.ఒక్కటి చాలు ఆయన అంత రంగ ఆవిష్కారానికి. సితార్ విద్వాంసుడు పండిట్ శివ కుమార్ శర్మ వద్ద సితార్ అభ్యసించిన విశ్వేశ్వరన్ ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు జి .యెన్ .బాల సుబ్రహ్మణ్య౦ గారికి’’ నెవ్యు’’. 2007 లో 63 వ ఏట వీణా పాణి విశ్వేశ్వరన్ తన తల్లి సంగీత సరస్వతీమాత సంగీత సామ్రాజ్యం లో ఆస్థాన విద్వాంసుడు గా చేరటానికి ఇహలోకం వీడారు .
g.n bala subramanyam
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-8-16 –కాంప్-బాచుపల్లి –హైదరాబాద్

