దిగ్విజయంగా ముగిసిన మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం
ఆగస్ట్ 19, 20, 21 (2016) తేదీలలో సాయంత్రం హైదరాబాద్ లో శ్రీ త్యాగరాజ గాన సభలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ఆధ్వర్యంలో మూడవ జాతీయ మహిళా రచయితల సాహిత్య సమ్మేళనం విజయవంతంగా జరిగింది. పలు రాష్ట్రాలు, నగరాల నుండి సుమారు 100 మంది మహిళా రచయితలూ, సాహితీవేత్తలూ ఈ మహా సభలలో పాల్గొని ప్రసంగించారు.
మొదటి రోజు (ఆగస్ట్ 19, 2016) సాయంత్రం 6 గంటలకి సుప్రసిద్ధ రచయిత్రి డి. కామేశ్వరి గారి జ్యోతి ప్రజ్వలన, లక్ష్మీ పద్మజ ప్రార్థనా గీతంతో కేవలం మహిళా రచయితలకి మాత్రమే అయిన ఈ ప్రత్యేక సాహిత్య వేదికకి డా. ముక్తేవి భారతి అధ్యక్షత వహించగా డా. ముదిగంటి సుజాతా రెడ్డి గారు ముఖ్య అతిధిగానూ, శారదా అశోక వర్ధన్, పోల్కంపల్లి శాంతా దేవి, డా. అమృత లత (నిజామాబాద్), కొండవీటి సత్యవతి, కళా శారద విశిష్ట అతిధులుగా వేదికని అలంకరించారు. డా. తెన్నేటి సుధా దేవి గారు స్వాగత వచనాలు పలికి సభా నిర్వహణకి నాందీ ప్రస్తావన చేయగా పలకగా సుప్రసిద్ద గాయని సుచిత్ర బాలాంత్రపు ఆహ్వానిత అతిథుల సత్కార కార్యక్రమం నిర్వహించారు. వక్తలు ఈ నాటి సాహిత్య వాతావరణం, పుస్తక ప్రచురణలో రచయిత్రులకి ఉన్న ఇబ్బందులు, సంఘటితం గానూ, వ్యక్తిపరంగానూ సాహిత్యాభివృద్ధికి చేయ వలసిన అంశాల మీద సముచితంగా ప్రసంగించారు. పొత్తూరి విజయ లక్ష్మి, నెల్లుట్ల రమా దేవి తమ హాస్య కథానికలని వినిపించి ఆహుతులని నవ్వులతో ముంచెత్తగా, తమిరిశ జానకి, శైలజా మిత్ర, ఐనంపూడి శ్రీ లక్ష్మి, సి. భవానీ దేవి, మండపాక మహేశ్వరి, తదితరులు స్వీయ రచనా పఠనం, పద్య పఠనం, తదితర సాహిత్య ప్రసంగాలతో సుమారు వంద మంది సాహిత్యాభిమానులని ఆకట్టుకున్నారు.
రెండవ రోజు ఆగస్ట్ 20, 2016 ఉదయం 10 గంటలకి జ్యోతి ప్రజ్వలన అనంతరం ముందుగా స్త్ర్రీల పాటల మీద స్నేహలతా మురళి గారి సోదాహరణ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. తరువాత విరామం లేకుండా సుమారు నాలుగు గంటల పాటు 18 మంది రచయిత్రులు అనేక అంశాలపై సాధికారంగా తమ ప్రసంగాలు వినిపించారు. తెనాలి రామకృష్ణుడు తీర్చిదిద్దిన స్త్రీ పాత్రల మీద నందివాడ అనంత లక్ష్మి తాళ్ళపాక తిమ్మక్క మీద మంగళగిరి ప్రమీలా దేవి, భాగవతంలో మానవతా విలువల మీద వారిజా రాణి గారు, మొల్ల రామాయణం మీద సర్వ మంగళ గౌరి, ప్రాచీన సాహిత్యంలో సామాజిక బాధ్యతల మీద కస్తూరీ అలివేణి, శతక సాహిత్యం మీద కూలంకషంగా జరిగిన కోటంరాజు రమా దేవి గారి ప్రసంగం, నవలా సాహిత్యం మీద సమగ్ర సమీక్ష చేసిన ఇంద్రగంటి జానకీ బాల ప్రసంగం, ఆధునిక సాహిత్యంలో కవిత్వం మీద అత్యంత ఆసక్తికరంగా, సాధికారంగా ఆచార్య శరత్ జ్యోత్స్నా రాణి అభిభాషణ, ఆధునిక సాహిత్యంలో కథానిక మీద కె. బి. లక్ష్మి సమగ్ర విశ్లేషణ, రాయసం లక్ష్మి, వి. త్రివేణి, వై. కామేశ్వరి, ప్రభల జానకి, కె. లలిత, సంధ్యా రాణి, బి.జ్యోతి, శ్రీ మణి గారి ప్రసంగాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
తరువాత జరిగినన స్వీయ రచనా విభాగంలో మున్నంగి కుసుమ, లంక సీత, మల్లాది పద్మజ, ములుగు లక్ష్మీ మైథిలి, శ్రీ వల్లీ రాధిక, వరలక్ష్మి, మీనీషా జోస్యుల, వారణాసి నాగ లక్ష్మి గారి ఆకట్టుకున్న కవిత, రాజీవ, శ్రీ లక్ష్మి, ఘంటసాల నిర్మల, మిరియాల లలిత గారి ప్రచార కవిత్వం, పోతన జ్యోతి, లక్కరాజు నిర్మల వైవిధ్యమైన కవితా పఠనం, లావణ్య, సీనియర్ రచయిత్రి వెంపటి హేమ మొదలైన వారు తమ రచనలు వినిపించారు.
ఆఖరి విభాగంలో ఆధునిక సాహిత్యంలో కథానిక మీద సాధికారంగా ప్రసంగించిన సీనియర్ రచయిత్రి పోలాప్రగడ రాజ్యలక్ష్మి, టీవీ చానెల్స్ -సమాజ ప్రభావం మీద తమ అనుభవాలని క్రోడీకరించి ప్రసంగించిన విజయ దుర్గ, టీవీ చానెల్స్ లో స్త్రీ పాత్రల చిత్రీకరణ, సీరియల్స్ ప్రభావం మీద ఆవేదనా భరితంగా ప్రసంగించిన ఉషా రాణి, గురజాడ శోభా పేరిందేవి, చలన చిత్రాలలో జానపద గేయాలపై ఆయా పాటలు పాడుతూ విశేషించిన సుప్రసిద్ద గాయని, వ్యాఖ్యాత సుచిత్ర ప్రసంగం సభికులని బాగా ఆకట్టుకున్నాయి. ఆఖరి అంశంగా కేతవరపు రాజ్యశ్రీ ఆదునిక కవితా రీతుల పై సమగ్ర ప్రసంగం చేశారు.
ఉదయం 10 గంటల నుండి సాయత్రం 6 దాకా నిర్విరామంగా సాగిన ఈ రెండవ రోజు కార్యక్రమంలో సుమారు 50 మంది మహిళా రచయితలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుప్రసిద్ధ సాహితీ వేత్త ఆచార్య ఆవుల మంజులత గారు సభకి విచ్చేసి తమ సందేశాన్ని వినిపించి ఈ నాటి సాహిత్య సమ్మేళనాన్ని విజయవంతం చేశారు.
ఆగస్ట్ 21, 2016 ఉదయం 10 గంటలకి జ్యోతి ప్రజ్వలన అనంతరం ముందుగా కన్నెగంటి అనసూయ, కుప్పిలి పద్మ, తెన్నేటి సుధా దేవి ల స్వీయ కథా పఠనంతో సభ ప్రారంభం అయింది. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో వి. శైలజ (సిద్ధ్దిపేట), వాణిశ్రీ, శ్రీ లక్ష్మి (గుడివాడ), కందేటి రాణి ప్రసాద్ (సిరిసిల్లా),సుజనా దేవి (కరీం నగర్), మెర్సీ మార్గరెట్, గొడవర్తి సంధ్య తమ కవితలు వినిపించారు. తరువాత విభాగంలో పత్రికా నిర్వహణలో ఇబ్బందుల మీద కాశీనాధుని సువర్చలా దేవి, పత్రికా నిర్వహణ బాధ్యతలపై పొత్తూరి జయ లక్ష్మి సుదీర్ఘ ప్రసంగం, పత్రికా రంగంలో మహిళల పాత్ర మీద సూర్య కుమారి (ఖమ్మం), నిజ జీవితానికీ, టీవీ సీరియల్స్ లో స్త్రీ పాత్రలకీ తేడా పై చెంగల్వల కామేశ్వరి, బతుకమ్మ పాటల మీద తిరునగరి దేవకీ దేవి, తెలంగాణా పండుగల మీద ఆచార్య సూర్య ధనుంజయ్, మన పండుగలు, సంప్రదాయాల మీద తెన్నేటి హేమ నళిని, నాటక రంగం లో స్త్రీలు అనే అంశం మీద అత్తలూరి విజయ లక్ష్మి సాధికార ప్రసంగం, చలన చిత్రాలలో సెన్సార్ బోర్డ్ పాత్ర మీద సెన్సార్ బోర్డ్ సభ్యులు, నటీమణి, దివ్యాంగులకి ఆదర్శ మహిళ పద్మ ప్రియ ప్రసంగం, జానపద సాహిత్యంలో స్త్రీ అనే అంశం మీద రాజ మల్లమ్మ, వల్లూరి రేవతి స్వీయ కవితా గానం అందరినీ ఆకట్టుకున్నాయి.
ముగింపు సమావేశం లో డా. నందమూరి లక్ష్మీ పార్వతి ముఖ్య అతిథిగా మంచి సాహిత్య ప్రసంగం చేశారు. డా. కె.వి. కృష్ణ కుమారి, డా. మంథా భానుమతి విశిష్ట ప్రసంగాల అనంతరం మహిళా రచయితలకి పురస్కార ప్రదానం జరిగింది. ఈ ముగింపు సభలో వంగూరి చిట్టెన్ రాజు పాల్గొన్నారు.
దిగ్విజయంగా జరిగిన మూడవ జాతీయ మహిళా రచయిల సమ్మేళనం ఫోటోలు కొన్ని ఇందుతో జతపరుస్తున్నాను. మూడు రోజుల ఫోటోలు అన్నీ ఈ క్రింది లంకెలలో చూడవచ్చును.
August 19, 2016: Inagural Day photo.
August 20, 2016 : Photos
August 21, 2016: Photos

