పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -2
4-తవైశ్వర్యం యత్తత్ జగదుదయ రక్షా ప్రలయ కృత్—త్రయీ వస్తుం వ్యస్తం తిసృషు గుణ భిన్నాసు తనుషు
అభవ్యానా మస్మిన్ వరద !రమణీయామ రమణీ౦ –విహన్తుం వ్యాక్రోశం విదధత ఇహైకే జడదియః ‘’
భావం –కొలిచే భక్తులకు వాత్సల్యం తో వరాలిచ్చే దేవరా 1 రుక్ యజు సామ అనే మూడు వేదాలకీ నీ విశ్వాధి పత్యమే వస్తువు .వాటి లక్ష్యం నీ సార్వ భౌమత్వాన్ని వర్ణించటమే .అది ఒక్కటిగానే ఉంటుంది .కానీ రజోగుణ ,సత్వ గుణ ,తమో గుణ అనే మూడు రూపాలుగా విభజింప బడుతుంది .అదే బ్రహ్మ ,విష్ణు ,రుద్ర రూపాలు ధరిస్తూ సమస్తలోకాలను సృష్టిస్తూ ,రక్షిస్తూ చివరికి ప్రళయం చేస్తుంది .అలాంటి సర్వోత్క్రు స్ట మైన నీ ఆధిపత్యాన్ని ,ఎంతోరమణీయమైన దాన్ని దుర్మార్గులకు అరమణీయం గా కన్పించి నిన్ను నిందిస్తున్నారు .
5-కిమీహం కిం కాయ స్సఖలు కిముపాయాస్త్రి భువనం –కిమాధారో ధాతా సృజతి కిముపాదన ఇతి చ
అత ర్క్యైశ్వర్యే త్వయ్యవనసర దుస్త్దో హతదియః –కుతర్కోయం కా౦శ్చిన్ముఖర యతి మోహాయ జగతః ‘’
తా-పరమేశా !తార్కికులు కొందరు లోకాలకు సృష్టి కర్త అయిన నువ్వు ఏ కోరికతో సృష్టి చేస్తున్నావని ప్రశ్నిస్తున్నారు .నీ ఆకారం ఏమిటి ?సృష్టికి నీ ఉపాయ౦ ఏమిటి ?నీకు ఆధారం ఏమిటి ? ఏ ఉపాదానం తో సృస్తిస్తున్నావు ?అంటూ ఊహకు అందని నీ ఆధిపత్యాన్ని గూర్చి ,నీ పై ఉన్న చెడు తలంపును బట్టి ,లోకం లో భ్రాంతిని కలిగించటానికి వాచాలత ప్రదర్శిస్తున్నారు ఇదంతా .భేషజమే ,కుతర్కమే .
6-అజన్మానో లోకాః కిమవయవ వంతో పి జగతాం –అధిస్టాతారం కిం భవ విధి రానాదృత్య భవతి
అనీశో వా కుర్యాత్ భువన జననే కః పరికరః –యతో మందస్త్వా౦ ప్రత్యమరవర !సంషేరత ఇమే ‘’
భావం –దేవతా శ్రేస్టా ఈశా !ఈ లోకాలన్నీ విభిన్న అవయవాలు కలవి .అవయవాలున్న వస్తువుకు జన్మ ఉంటుందని శాస్త్రం చెప్పింది. కనుక లోకాలు సృష్టింప బడినవే .మరి సృష్టికర్త లేకుండా సృష్టి జరుగుతుందా ?జరుగదు .లోకాల సృష్టికి పరమేశ్వరునికంటే సమర్ధుడెవ్వరు?సృష్టి నిర్వహణకు ఆయనకు పరిజనం దేనికి ?అయన సర్వ సమర్ధుడు కదా .మంద బుద్ధులు కొందరు ఇలాంటి నీ సామర్ధ్యాన్ని అనుమానిస్తున్నారు .కనుకనే లోకం లో దీనిపై చర్చ జరిగింది.
7-త్రయీ సౌఖ్యం యోగః పశుపతి మతం వైష్ణవమితి-ప్రభిన్నే ప్రస్థానే పరమిదమదః పధ్యమితి చ
రుచీనాం వైచిత్ర్యా దృజు కుటిల నానాపధ జుషాం-నృణా మేకో గంయస్త్వ మసి పయసా మవర్ణవ ఇవ . ‘’
భావం –సంసార విముక్తికోసం కొందరు వేదోక్త కర్మ ,కొందరు సాంఖ్యం ,కొందరు యోగం ,మరికొందరు పాశుపతం ,ఇంకొందరు వైష్ణవం అంటూ వేరు వేరు మార్గాలు ఉపదేశిస్తూ ఉంటారు .ఎవరికివారు తమదే విశిష్టమైనదని ప్రచారం చేస్తారు .మరికొంతమంది అది పధ్యం అంటారు .ఇలా వారి వారి అభిరుచి ,వైచిత్రిని బట్టి విభిన్న మార్గాలు నిర్ణయిస్తారు .కాని అన్నిరకాల జలాలకు సముద్రం లాగా సమస్తమానవులకు నువ్వే చేరదగిన వాడవు .
8-మహోక్షః ఖట్ట్వాంగ౦ పరశురజినం భస్మ ఫణినః-కపాలం చేతీయత్ తవ వరద !తంత్రోపకరణం
సురాస్తాం తామృద్ధిం దధతి చ భావద్భ్రూ ప్రణిహితాం –నహి స్వాత్మా రామం విషయ మృగ తృష్ణా భ్రమయతి ‘’
భావం –ఈశా !సృష్టి కార్య నిర్వహణలో నీకు సాధన సామగ్రి వృషభ రాజమైన నంది ,మంచం కోడు ,గండ్ర గొడ్డలి ,గజ చర్మం ,విభూతి ,పాములు ,మనిషి పుర్రె అనేవి .అయినా దేవతలు నిన్నే భక్తితో కొలుస్తారు .నువ్వు నీ కంటి సంజ్న చేత వాళ్లకు కావలసిన సంపదలతోపాటు కోరికలన్నీ తీరుస్తావు .అనంత సంపద ప్రదానం చేస్తున్నా నువ్వుమాత్రం సంపదలు అనుభవించాలన్న కోరిక ఈషన్మాత్రం కూడా లేని వాడవు .ఆత్మలోనే నిరంతరం క్రీడిస్తూ ఆనందాను భూతి పొందుతున్న నిన్ను ఏ వస్తువూ మొహాన్ని కలిగించనే లేదు. అందుకని ఏ సమప్దపైనా నీకు అనుభవి౦చాలన్న కోరికే కలగదు .
9-ధృవం కశ్చిత్ సర్వం సకల మపరస్త్వ ధ్రువ మిదం –పరో ధ్రౌవ్యే జగతి గదతి వ్యస్త విషయే
సమస్తే ప్యేతస్మిన్ పుర మధన !తైర్విస్మిత ఇవ –స్తువన్ జిహ్రేమి త్వాం న ఖలు నను ద్రుస్టాముఖరతా ‘’
భావం –త్రిపురాసుర భంజకా శివా !జగత్తు నిత్యం అని ఒకడు అనిత్యం అని మరొకడు అంటున్నారు .మరొకడు నిత్యా నిత్య నిర్ణయం లో కొంత నిత్యం కొంత అనిత్యం అన్నాడు .వారి వాదాలు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి .నిన్ను స్తుతిస్తూ వాళ్ళ ప్రతిపాదనలకు సిగ్గుపడటం లేదుకాని వాళ్ళ వాచాలత్వం నింద్యం అనిపిస్తోంది .
సర్వ వ్యాపక చైతన్య స్వరూపుడు పరమాత్మ ఒక్కడే ‘’ఎకమేవా ద్వ్తీయం బ్రహ్మా ‘’అని వేదం ఘోషించింది
10-తదైశ్వర్యం యత్నాద్య ద్యుపరి విరించో హరి రధః –పరిచ్చేత్తుం యాతావనల మనల స్కంద వపుషః
తతో భక్తి శ్రద్ధా భర గురు గ్రుణద్భ్యాం గిరిశ! యత్ –స్వయం తస్థే తాభ్యాం తవ కిమను వ్రుత్తిర్న ఫలతి ‘’
భావం –పరమ శివా !ప్రజ్వలిస్తూ ఉండే అగ్ని స్తంభంగా నువ్వు ఉండగా ,నీ మహిమ ఎలాంటిదో తెలుసుకోవాలనే చాపల్యం తో బ్రహ్మ తన వాహనం హంస నెక్కి ఊర్ధ్వ లోకాలకు ,విష్ణువు యజ్న వరాహ రూపం తో పాతాలలోకాల క్రిందకూ వెళ్ళారు .కాని నీ శిఖరం,నీ మొదలు వాళ్లకు కనిపించనే లేదు .ప్రయత్న విఫలురైన వాళ్ళిద్దరూ నిన్ను స్తుతించారు .వారికి దర్శన భాగ్యం కలిగించి ఆదరించావు .నీకు చేసిన సేవ ఎప్పుడూ వృధా కాదని రుజువైంది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-1-11-16-ఉయ్యూరు

