నిజమైన కవి స్వభాష లోనే రాయాలని చెప్పిన జర్మన్ కవి –జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డెర్
1744 -1803 కాలానికి చెందిన జర్మన్ కవి జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డర్. ఆయన వికాసవాద సాహిత్యం లో ప్రఖ్యాతుడు .ప్రకృతితో మానవ అనుబందాలనుండే కవిత్వం పుడుతుందని అది మౌలికమని ,దానికి కృత్రిమమైన ఛందస్సు వగైరా అనవసరమని అన్నాడు హీర్దర్.కవిత్వ౦ , భాష పైన తన అభిప్రాయాలను ‘’నిజమైన కవి స్వభాష లోనే రాయాలి ‘’అనే వ్యాసం లో వివరించాడు .అందులో కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకొందాం .ఇవి ఆనాడే కాదు నేడూ అనుసరణీయం అనిపిస్తాయి .
1-నేను ఏ భాషలో పదాలను అతి సమర్ధంగా ఎన్నుకోగలనో ,ఏ భాషపై నాకు పూర్తి అధికారం ఉందో ,వాటి గురించి సమగ్రమైన జ్ఞానం నాకు ఉందో నేను విధిగా ఆ భాషలోనే రాయాలి .నిస్సంకోచంగా అది నామాతృ భాషే అవుతుంది
2-మన వాగింద్రియాలు మనసు చెవి మాతృభాషకు అనుకూలం గా సహజం గా మలచినవి .కనుక నేను నా మాతృభాషలోనే నామనోభావాలను చక్కగా వ్యక్తం చేయగలను. మనస్వదేశం మన మాతృ భాషా మనకు ప్రియమైనవి మాతృభాష మిగిలిన భాషలకన్నా అతి మనోహరం గా కనిపిస్తుంది .
3-మన మనసు ఎప్పుడూ ఇతర భాషలను మనకు తెలియ కుండానే మాతృభాష భాషలోకి అనువది౦చు కొంటు౦ది .ఆ భాషలను నోటిలోనే ఉంచుకొని ,ఇంకా లోతులకు పోయి భాషల తార తమ్యాలు తెలుసుకొని పరిశీలిస్తుంది .వాటినీ గుర్తు పెట్టుకొంటుంది .కొన్ని విషయాలలో సంపన్నత, వైభవం విదేశ భాషలలో కనిపించినప్పుడు,అది తన భాషలోని సౌందర్యాలను గురించి ఆనందిస్తూనే ,సాధ్యమైనంతవరకు తన భాష లోని లోపాలను పూరించుకోవటానికి విదేశీ సంపదను తెచ్చుకుంటుంది .మనసును విదేశీ భాషలనే సముద్రం లో మునిగిపోకుండా కాపాడే సురక్షిత నౌక అది .ఆందోళన కలిగించే భాషా వైవిధ్యం లో అది ఐక్య భావం సాధిస్తుంది .నేను విదేశీ భాషలు నేర్చుకొంటాను, కాని అది నా భాషను మరచిపోవటానికి మాత్రం కాదు .నేను విదేశీ సంచారం చేస్తాను అక్కడి ఆచార సంప్రదాయాలు అలవర్చుకొని నేను పుట్టిన సంఘం లోని ఆచార వ్యవహార సంప్రదాయ మర్యాదలను మర్చి పోవటానికి కాదు .నేను ఇంకో దేశం లో పౌరసత్వం పొంది నా దేశం లోని పౌరసత్వాన్ని వదులు కోను .ఇలా చేస్తే నేను ఆర్జించిన దానికంటే కోల్పోఏదేఎక్కువ .నేను విదేశ ఉద్యాన వనాలలో పచార్లు చేస్తాను. అక్కడి వింత పూలతో నా ఆరామాన్ని అల౦కరించు కొంటాను అప్పుడు నా భాష నా భావనా విధానానికి ప్రియతమమవుతుంది .నా దేశ విధానాలను వివరించటానికి విదేశీ విధానాలు నేను పరి శీలిస్తా . విదేశ సూర్య రశ్మితో పండిన పండ్ల లాగా నా స్వదేశ ప్రతిభకు కానుక లిస్తాను . .
4-భావ వ్యక్తీకరణ కోరే కవి తన జన్మ భూమికి విశ్వాసపాత్రుడై ఉండాలి .నిజమైన భావోద్వేగాలను వ్యక్తం చేయటానికి దేశీయ భాషలోనే సాధ్యం .నా అసమర్ధతను అంగీకరిస్తున్నాను నేను ఒక్క భాష తప్ప పూర్తిగా అర్ధం చేసుకోలేనని సిగ్గు విడిచి చెబుతున్నాను .హోమర్ లాగా అంత సర్వాంగ సుందర౦గా ఎవరైనా అనేక భాషల్లో రాయగలరా ?పిండాల్ లాగా హోరేస్ లాగా ఏ మాతృభాషలోనైనా రాయ గలరా ?.షేక్స్ పియర్ ఆయన భాషలో తప్ప ఇంకే భాషలో నైనా అలా రాయగలడా ?లేరు .కనుక నేను నేల మీద సాష్టాంగ పడి,నా తల్లి నేలను ఆలింగనం చేసుకుంటాను .ఆమె భాషే నాకవితా దేవత ‘’
అని తల్లిభాషకు వందనం చేశాడు జోహాన్ గ్రాట్ ఫ్రీడ్ హెర్డేర్.
ఆధారం –జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం –మధ్యయుగాల నుండి నేటి వరకు -1971 లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ –మద్రాస్ ప్రచురణ .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-11-16 –ఉయ్యూరు

