పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -3
11-యత్నా దాపాద్య త్రిభువనమవైర వ్యతికరం –దశాస్యో యద్బాహూ నభ్రుత రణ కండూ పరవశాన్
శిరః పద్మ శ్రేణీ రచిత చరణా౦భోరుహ బలేః –స్థిరా యా స్తద్భక్తే స్త్రిపుర హర !విస్ఫూర్జిత మిదం ‘’
భావం –త్రిపురారీ శివా !పదితలల రావణుడు ఏ శ్రమా లేకుండా మూడు లోకాలలో తన్ను ఎదిరించే వాడు లేడనుకొన్నాడు .అతని 20 చేతులూ ఎప్పుడూ ఎవరితోనే యుద్ధం చేయడం తో తీట కు లొంగిపోయాయి .దీనికి నీ అనుగ్రహమే కారణం .నీ పాద పద్మాలను తన శిరస్సు లనే పద్మాల మాలలతో అర్చించటం చేత అది అతనికి సాధ్యమైంది. నీ పూజపై స్థిర భక్తి ఉండటం దీనికి కారణం.నీపాదారవి౦దాలపై దృఢ భక్తి వల్లనే అతనికి అది సాధ్యమైంది .12-అముష్య త్వత్సేవా సమదిగత సారం భుజ వనం –బలాత్ కైలాసే పి త్వదదివసతౌ విక్రమ యతః
అలభ్యా పాతాలే ప్యలస చలితాంగుస్ట శిరశి-ప్రతిష్టా త్వయ్యాసీ ద్ధ్రువ ముపచితో ముహ్యతి ఖలః ‘’
భావం –ఈశ్వరా ! రావణుడు నీ అనుగ్రహానికి పాత్రుడై 20 భుజాలు పొందాడు .నీకృపతో లభించిన ఆభుజాలశక్తితో నువ్వు నివశించే కైలాసపర్వతం పైనే తన ప్రతాపం చూపించాడు. వెంటనే నువ్వు అనాయాసంగా నీ బొటన వ్రేలిమొన తో అణచి వేయగా పాతాల లోకం లో కూడా ఉండటానికి వీలు లేకపోయింది .దుష్టుడు ఉపకారం పొంది దాన్నిమరచి ఉపకారిపైనే బలప్రదర్శనకు దిగటానికి పూనుకోవటం లోక సహజం .
13-యదృద్ధిం సుత్రామ్ణో వరద పరమోచ్చైరపై సతీ –మధశ్చక్రే బాణః పరిజన విదేయ త్రిభువనః
న తచ్చిత్రం తస్మిన్వరి వసితరి త్వచ్చరణయో –ర్న కస్యా ఉన్నత్యై భవతి శిరస స్త్వయ్య వనతిః’’
భావం-భక్తుల కు వరాలిచ్చి కోర్కె తీర్చే పరమేశా !బాణాసురుడు మూడు లోకాలను తన సైన్యం తో స్వాధీనం చేసుకొన్నాడు .సంపద విపరీతం గా సాధించి ఇంద్ర పదవిని తన పదవి కంటే తక్కువ చేసేశాడు .నీ పద భక్తుడు కనుక అతనికిది ఒక విశేషమే కాదు .నీకు ఎవరైనా శిరసువంచి నమస్కరిస్తే వాడు ఏ ఉన్నతినైనా సాధించగలడు .అలాంటి వరదుడవు నువ్వు .
14-అకాండ బ్రహ్మాండ క్షయ చకిత దేవాసుర కృపా –విదేయస్యాసీ ద్యస్త్రి నయన విషం సంహృత వతః
స కల్మాషః కంఠే న తవ కురుతే న శ్రియ మహో –వికారో పి శ్లాఘ్యో భువన భయ భంగ వ్యసనినః ‘’
భావం –ముక్కంటీ !అమృతం కోసం సముద్ర మధనం చేసేటప్పుడువెలువడిన కాల కూట విషాన్ని చూసి దేవ రాక్షసు లు ప్రళయం వస్తోందని భయపడ్డారు .వాళ్ళపై నీకు పార కరుణ ఉండటం చేత ఆ విషాన్ని మింగి నీ కంఠం లో దాచుకున్నావు .దీనితో నీ కంఠం లో ఒక నల్లని మచ్చ ఏర్పడింది .తెల్లని నీ శరీరం లో ఆ నల్ల మచ్చ కూడా నీకు శోభనే తెచ్చింది .వికారంగా లేదు కూడా .లోకుల భయాలను తొలగించే వారి శరీర వికృతి కూడా కొనియాడ దగిందే అవుతుందికదా .
15-అసిద్దార్దా నైవ క్వచిదపి స దేవాసుర నరే –నివర్త౦తే నిత్యం జగతి జయినో యస్య విశిఖాః
స పశ్యన్నీశ త్వామితర సుర సాధారణ మభూత్ – స్మరః స్మర్తవ్యాత్మా న హి పధ్యః పరి భవః ‘’
భావం -సర్వ సృష్టికి అధిపతి ఐన సర్వేశా !సృష్టి దేవ రాక్షస మానవులతో కూడి ఉంది .మన్మధ బాణాలు ఎప్పుడూ వ్యర్ధం కావు .ఎవరిపై ప్రయోగిస్తే వారు దాని కి తగుల్కొని బాధపడక తప్పదు .అవి జయ స్వభావం కల బాణాలు అలాంటి శక్తిగల మన్మధుడు నువ్వు సామాన్య దేవతగా భావించి నీపై పుష్పబాణాలు ప్రయోగించి నీ మూడవ కంటి అగ్నికి ఆహుతై శరీరం కోల్పోయి ,అనంగుడు అయ్యాడు .ఇంద్రియ నిగ్రహమున్న వారిపై అవమానం లేక బల ప్రయోగం ఆరోగ్య ప్రదం కాదు .వినాశ హేతువే అవుతుంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-11-16 –ఉయ్యూరు

