విశ్వ విజేత అలేక్సాండర్ అవాక్కైన సందర్భం
మాసిడోనియా చక్ర వర్తి అలేక్సాందర్ ఒక సారి ఆఫ్రికాలో ఒక మారుమూల దేశానికి వెళ్ళాడు .ఆ దేశం బంగారుగనులతో అతి భాగ్య వంతం గా ఉంది .ఆ దేశ ప్రజలు బుట్టలనిండా బంగారు పళ్ళు తెచ్చిఇచ్చిఅలేక్సాండర్ ను దర్శించి కానుకగా ఇచ్చారు. ‘’ఈ పళ్లన్నీ మీరే తీసుకొని అనుభ వించండి .నేను మీ సంపద చూడటానికి రాలేదు ‘.మీ ఆచార వ్యవహారాలను తెలుసుకోవటానికి వచ్చాను ‘’అన్నాడు .ప్రజలు ఆయన్ను రాజుగారు నేరాలు విచారించి తీర్పు చెప్పే చోటికి తీసుకు వెళ్ళారు .
అదే సమయం లో ఒక పౌరుడు వచ్చితనతో వచ్చిన వాడిపై రాజుకు కు ఒక విషయం ఫిర్యాదు చేశాడు ‘’రాజా !నేను ఈ అబ్బాయి దగ్గర ఒక బస్తా ఊక కొన్నాను .ఇంటికెళ్ళి చూస్తే ఆ బస్తాలో చాలా బంగారం ఉంది.నేను ఊకనే కొన్నాను కాని బంగారాన్ని కాదు .అది నాదికాదు. అమ్మినతనిదే .ఇతడు ఆ బంగారం తీసుకో నంటున్నాడు .మీరే నచ్చ చెప్పి అతని బంగారం అతనికి ఇప్పించేయ్యండి ‘’అన్నాడు .
ఆ రెండో వాడు ‘’నాకు అన్యాయం సొమ్ము వద్దు మహాప్రభూ !నేను అతనికి ఊకతో సహా అందులో ఉన్న అమా౦ బాపతు తోపాటు అంతా అమ్మేశా. అదంతా అతనిదే నాదికానే కాదు .ఆ సొమ్ము అతనికే చెందుతుంది. మీరే నచ్చచెప్పి అతనికి అది ఇప్పించండి ‘’అన్నాడు .పెద్ద ధర్మ సంకటమే వచ్చిందని రాజు తెలివిగా మొదటివాడిని ‘’నీకు కొడుకు ఉన్నాడా “’?అని రెండోవాడిని ‘’నీకు కూతురు ఉందా ?’’అని ప్రశ్నించాడు ఉన్నారన్నారిద్దరూ .’’అయితే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి మీరు వియ్యంకులు అవండి. పెళ్ళికి బస్తాలోని బంగారం వాళ్లకు కానుకగా ఇవ్వండి ‘’అని రాజు తీర్పు చెప్పాడు ;
ఆ తీర్పు విన్న అలేక్జాండర్ అవాక్కై బోల్డు ఆశ్చర్య పోయాడు .రాజు ప్రపంచ విజేతత తో ‘’నేనేమైనా తీర్పు తప్పు చెప్పానా ఆశ్చర్య పోతున్నారు ?’’అని అడిగాడు .’’అబ్బే .లేదు మా దేశం లో అయితే ఈ తీర్పు వేరే విధంగా ఉండేది ‘అన్నాడు .’’ఎలా ఉంటుందో చెబుతారా ?’’రాజు ప్రశ్నించాడు .
‘’వాది,ప్రతివాది లిద్దరికీ తలలు తెగి పోయేవి .ఆ బంగారం రాజుగారి కోశాగారం చేరేది ‘’అన్నాడు అలేక్సాండర్.ఇది విన్న రాజు విపరీతంగా చప్పట్లు కొట్టి ‘’మీ దేశం లో సూర్యుడు వెలుగుతాడా ,ఆకాశం మీ మీద వర్షం కురిపిస్తుందా ?’’అని అడిగాడు .’’ఆహా ‘’అన్నాడు అలేక్సా౦డర్ .’’అయితే అవి మీ దేశం లోని అమాయక జంతువులకోసమే అయి ఉంటుంది .అలాంటి మనుషులమీద సూర్యుడు ప్రకాశించకూడదు .ఆకాశం వర్షించ కూడదు ‘’అన్నాడు ఆఫ్రికా దేశ రాజు .మరోసారి అవాక్కయ్యాడు అలేక్సాండర్ .
ఇది జర్మన్ కవి జోహాన్ గాట్ ఫ్రీడ్ హెర్డేల్(1744 -1803) సేకరించి ,రాసిన న ‘’ఆఫ్రికా వాసి తీర్పు ‘’కద
ఆధారం –జర్మన్ సంప్రదాయ సాహిత్య దర్పణం –మధ్యయుగాల నుండి నేటి వరకు -1971 లో సదరన్ లాంగ్వేజెస్ బుక్ ట్రస్ట్ –మద్రాస్ ప్రచురణ
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్-2-11-16 –ఉయ్యూరు

