వ్యాఖ్యాన చక్రవర్తి కోలాచలం మల్లినాద సూరి మనీష -6
మల్లినాధుని సృజన రచనలు
మహాకావ్య వ్యాఖ్యానం తో పాటు మల్లినాద సూరి స్వీయ రచనలూ చేసి తన కవితా సామర్ధ్యాన్ని తెలియ జేశాడు ,ఆయన సృజలలో 1-రఘువీర చరితం అనే 17 కాండల కావ్యం .శ్రీ రాముని అరణ్య వాసంనుండి పట్టాభిషేకం వరకు .1531 శ్లోకాలున్నాయి .ఇవి కాళిదాస రఘువంశ కావ్యం కంటే కొంచెం తక్కువ శ్లోకాలతో ఉంది .
2-వైశ్య వంశ సుధాకరం –వైశ్య కులం లో వచ్చిన కొన్ని సమస్యలపై మల్లినాధుని తీర్పు .మొదటి ప్రౌఢదేవరాయలకాలం లో ముఖ్య న్యాయ నిర్ణేతగా మల్లినాధుని నియమించి వైశ్య సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి తీర్పు చెప్పమని కోరాడు . తనకిచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసి వైశ్య కుటుంబ మూల విషయాలను త్రవ్వి తీసి ,నేపధ్యాన్ని అధ్యనం చేసి వెలువరించిన తీర్పు ఇది .వైశ్య శబ్దాలకు చారిత్రాత్మక అర్ధాలను సేకరించి వివరించాడు .అందులోని భిన్నతరగతుల వారి విధులను విధానాలను తెలియ జేశాడు. దీనివలన వారికి వర్తక వాణిజ్యాలలో గొప్ప ఉపయోగమే కలిగింది .ఆకాలం లోమల్లినాధుని తీర్పు ఒక శాసనం (టెస్ట్ మెంట్ )అయింది
అమర కోశాన్ని పూర్తిగా చదివి అర్ధం చేసుకొని దానిపై ఉన్నకాశీ రామస్వామి ,వంధ్యాగతీయ,సర్వానంద ,లింగ భట్ట హరిదీక్షిత గురుబాల ప్రబోధిని వంటి తెలుగు సంస్కృత వ్యాఖ్యానాలను పరిశీలించి .రాసిన కావ్యం ఇది .
3-ఉదార కావ్య 4-భక్తి రహస్య 5-నక్షత్ర పాఠా ధ్యాయం కూడా మల్లినాద కృతులే అంటారు .అయితే అది పూర్తిగా నిరూపింప బడలేదు .
మల్లినాద కావ్య వ్యాఖ్యాన రచనలు
1-కాళిదాస మహాకవి రచించిన 1-రఘు వంశం
2-కుమార సంభవం
3-మేఘ దూతం లకు సంజీవని వ్యాఖ్య రాశాడు .
4–భారవి రాసిన –కిరాతార్జునీయం కు ఘంటాపాఠ వ్యాఖ్యానం
5–మాఘకవి రచన –శిశుపాల వధ కు –సర్వంకష వ్యాఖ్యానం
6 -శ్రీ హర్షుని నైషధీయ చరిత కు –జీవాతువు వ్యాఖ్యానం
7 -భట్టి రాసిన భట్టి కావ్యానికి-సర్వ పాఠీన వ్యాఖ్య రాశాడు
శాస్త్ర గ్రంధాలకు వ్యాఖ్య
1- విద్యా ధరుడు రచించిన ఏకావలి అలంకార గ్రంధానికి –తరల అనే పేరుతో వ్యాఖ్యానం రాశాడు
2- వరద రాజ కృతి –తార్కిక రక్షాస్టిక కు ఒకటవ పరిచ్చేదం పై మాత్రమే-నిష్కంటక వ్యాఖ్యానం రచించాడు
న్యాయ శాస్త్ర గ్రంధ వ్యాఖ్యానం
మూడు శాస్త్ర గ్రంధాలకు వ్యాఖ్యానం రాశాడు
1-తంత్ర వార్తిక –కు సిద్దా౦జన
2-స్వర మనోజ్ఞ మంజరి కి పరిమళ వ్యాఖ్య
3-ప్రశస్త పాదాభ్యాస కు నిష్కంటక వ్యాఖ్యానం రాశాడు
అంటే మొత్తం మీద 12 గ్రంధాలకు మల్లినాధుడు వ్యాఖ్యానాలు రాశాడు .ఇవికాక 1-లఘు శబ్దేందు శేఖర 2-అమర కోశ 3-నలోదయ వ్యాఖ్యానాలకూ కర్త మల్లినాదుడే అంటారు .అయితే అది అనుమానాస్పదం అన్నారు ‘
ఏ వ్యాఖ్య తరువాత దేన్నీ రాశాడనే దాన్ని స్పష్టంగా నిర్దుష్టంగా వివరించి చెప్పటం కష్టమే .కొన్ని సూచనలు మాత్రం కనిపిస్తాయి అవే ఆధారాలు .ఆయన రాసిన ఇతర వ్యాఖ్యానాలలో వీటి గురించి ప్రస్తావన కనిపిస్తుంది .కనుక వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం దొరుకుతుంది .
శిశుపాల వధ కు రాసిన సర్వం కష వ్యాఖ్యానం లో కాళిదాస రచనలకు రాసిన సంజీవని ప్రస్తావన చేశాడు .కనుక సర్వంకష కు ముందే రఘువంశ కుమార సంభావ మేఘ దూత లపై సంజీవని వ్యాఖ్య రాశాడని తెలుస్తుంది .మేఘ దూత భట్టి కావ్యాలలో రఘువంశ సంజీవని వ్యాఖ్య ప్రస్తావన ఉంది .కనుక ఈ రెండిటికంటే ముందే రఘువంశ వ్యాఖ్యానం రాశాడని భావించ వచ్చు .శిశుపాల వధకు రాసిన సర్వం కాషలో సర్వం కష విషయం ఉన్నది కనుక అదే పేరుతొ ఇంకోదానికి రాయలేదని అనుకోవటానికి దారితీయదు .ఘంటా పద వ్యాఖ్య విషయం సర్వం కషలో .సర్వ పాతఠీనం రఘు వంశ సంజీవనిలో కనిపిస్తుంది .కనుక మేఘ దూత, భట్టి కావ్య వ్యాఖ్యానాలకంటే ముందే భారవి కావ్యం పై వ్యాఖ్య రాశాడని తెలుస్తోంది .జీవాతువు వ్యాఖ్య గురించి దేనిలోనూ ప్రస్తావన కనిపించలేదు .కనుక అన్ని వ్యాఖ్యానాల తరువాతే జీవాతువు రాశాడని చెప్ప వచ్చు .జీవాతువులో మల్లినాధుని ఇతర వ్యాఖ్యానాల ప్రస్తావన లేదు .ఒక వేళ దీన్ని అన్ని వ్యాఖ్యానాల కంటే ముందే రాశాడేమో ?ఏమో ,అయి ఉండచ్చు .
తరల వ్యాఖ్య ను తన ఇతర వ్యాఖ్యానాలో సూరి ప్రస్తావించలేదు .తార్కిక రక్ష కూడా అంతే.అయినప్పటికీ మల్లినాధుని ‘’పంచ కావ్యాది టీక’’కు వర్తిస్తుంది తార్కిక రక్షకు ముందే వాటికీ వ్యాఖ్యానాలు రాశాడని అనుకోవాలి .మల్లినాధుడు పంచకావ్యాలు అని అన్నాడే కాని పంచ మహా కావ్యాలు అనలేదు . అంటే అయిదు ప్రసిద్ధ కావ్యాల గురించే ఆ మాట అని ఉంటాడు .అవే పంచ మహా కావ్యాలు .తరల వ్యాఖ్యలో తంత్ర వార్తిక వ్యాఖ్యాన ప్రస్తావన ఉన్నది .ఏతా వాతా మల్లినాధుని వ్యాఖ్యానాల వరుసక్రమం ఈ విధంగా ఉందని చెప్పవచ్చు-ఘంటా పదం,సంజీవని ,సర్వ పాఠీన ,జీవాతువు ,స్వర మంజరి పరిమళ ,ప్రశస్త పాదాభ్యాస టీకా ,తార్కిక రక్షా టీకా ,తంత్ర వార్తిక టీకా ,తరల, మల్లినాధుని కుమారుడు కుమార స్వామి ప్రతాప రుద్రీయానికి రాసిన’’రత్నాపన’’వ్యాఖ్యానానికి కు మల్లినాధుడు విద్యాధరుని ఏకావలి కి రాసిన ‘’తరల’’ వ్యాఖ్యానం ఒక కర దీపిక ,మార్గ దర్శి అని ప్రసిద్ధ సంస్కృత విద్వా౦సుడు,విమర్శకుడు శ్రీ ప్రమోద్ గణేష్ లాల్యే అభిప్రాయ పడ్డాడు .. . సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్-2-11-16 –ఉయ్యూరు

