పుష్పదంతుని శివ మహిమ్నః స్తోత్రం -6
26- త్వమర్కస్త్వం సోమస్త్వమసి పవనస్త్వం హుతవహ –స్త్వమాపస్త్వం వ్యోమత్వము ధరణి రాత్మా త్వమితిచ
పరిచ్చిన్నా మేవం త్వయి పరిణతా బిభ్రతి గిరం –న విద్వస్తత్తత్వం వయ మిహతు యత్వం న భవసి ‘’
భావం –మహేశా !పండితులు నువ్వు సూర్యుడివి ,చంద్రుడివి ,వాయువు ,అగ్ని ,నీరు ,ఆకాశం ,భూమి ,ప్రత్యగాత్మవు అని కూడా చెబుతున్నారు .అవన్నీ నీ స్వరూపాలుగా ,నీ స్వరూపాన్ని పరిమితం చేస్తూ వాక్కులతో కొలుస్తున్నారు .మేము మాత్రమీ చరా చర సృష్టి లో నువ్వు అసలు ఏ వస్తువు కావో తెలుసుకోలేక పోతున్నాం .
27-త్రయీం తిస్రో వృత్తీ త్రిభువన మథో త్రీనపి సురా –నకారా ద్వైవర్ణై స్త్రిభిరభి దధత్తీర్ణ విక్రుతిః
తురీయా తే ధామ ధ్వనిభి రవరుంధాన మణుభిః- సమస్తం వ్యస్తం త్వాం శరణద గృణోత్యోమితి పదం ‘’
భావం –భక్త హృదయావాసా పరమేశా !అకార ఉకార మకారాలు కలుపగా ఓం పదం ఏర్పడి మూడు వేదాలను ,మూడైనా సత్వ రజస్ తమోగుణాల వృత్తులను ,మూడులోకాలను ,బ్రహ్మ విష్ణు రుద్ర అనే ముగ్గురు దేవతలనూ బోధిస్తోంది .గుణాలకు అతీతం ,షడ్భావ వికార రహితం అయిన నీ నిర్గుణ రూపమే నీ నాల్గవ స్థితి .సూక్ష్మ నాదాలతో ఓంకారం ఆ స్థితినే స్తుతిస్తుంది విశ్వ మంతా సూక్ష్మ ఓంకారనాదాలు వ్యాపించి నీ నాల్గవది అయిన నిర్గుణ తత్వాన్ని అభి వర్ణిస్తున్నాయి ‘
‘’ఓమిత్యేకాక్షరం బ్రహ్మ ‘’అని వేదం .ఓంకారమే పరబ్రహ్మ వాచకం .ఓంకార మహాత్మ్యాన్ని ఛాందోగ్య ఉపనిషత్ విశేషంగా వ్యాఖ్యానించింది .
28-భవః శర్వో రుద్రః పశుపతి రథోగ్రః సహ మహాన్ –తథా భీమేశా నా వితి యదభిధానాస్టక మిదం
అముష్మిన్ ప్రత్యేకం ప్రవిరచతి దేవా శ్రుతి రపి-ప్రియా యాస్మై ధామ్నే ప్రణిహిత నమస్యో స్మి భవతే ‘’
భావం –శంభో !భవ ,శర్వ ,రుద్రా ,పశుపతి ,ఉగ్ర ,మహా దేవా ,భీమ ,ఈశాన అని నీ నామ అష్టకం ప్రసిద్ధి చెందింది .ఒక్కొక్క నామాన్ని గురించి శ్రుతి చక్కగా ప్రత్యేకంగా నిన్ను స్తుతిస్తోంది .అందరికీ ఇష్టుడూ ,ఈ రకమైన తేజస్స్వరూపుడు అయిన నిన్ను (నీకు)నమస్కరిస్తున్నాను
ఈ నామాల అర్ధం తెలుసుకొందాం
భవః –‘’భవతి భవతే వా సర్వ మితి భవః –‘’సర్వం తానె అయిన వాడు
శర్వః –‘’ప్రళయే భూతాని శ్రునాతి హినస్తీతి శర్వః ;;-ప్రళయ కాలం లో సమస్త ప్రాణులను హింసించే వాడు
రుద్రః –‘’రోదయతి శత్రూనితి రుద్రః –‘’-శత్రువులను దుఖపెట్టేవాడు –‘’స్వయం రురోద ఇతి వా రుద్రా ‘’-ఒకప్పుడు బ్రాహ్మ వలన జన్మ ప్రాప్తి౦చగా దుఖి౦చినవాడు –‘’రుదం రోదనం ద్రావయతి ఇతి వా రుద్రః ‘’-దుఖాన్ని పోగొట్టేవాడు
పశుపతిః-‘’పశూనాం జీవానాం పతిః’’పశువులు అనే జీవులు ప్రమధులైన వారికి ప్రభువు –‘’బ్రహ్మ విద్యాః స్తావరాంతా శ్చ పశవః పరికీర్తితాః-పశవః క్షేత్రజ్ఞాః తేషాం పతిః తేషాం త్రాతా ఇతి పశుపతిః’’-పశువులు అనే జీవులను సంసార బంధం నుంచి రక్షించేవాడు .
ఉగ్రః –‘’ఉగ్రత్వాత్ ఉగ్రః ;;-మిక్కిలి భయంకరుడు
మహా దేవః –‘’మహా౦ శ్చఅసౌ దేవః ‘’-శ్రేష్టు డైన దేవుడు
భీమః –‘’బిభేతి అస్మాత్ త్రైలోక్యం ఇతి భీమః ‘’-ముల్లోకాలను భయపెట్టేవాడు
ఈశానః –‘’ఈస్టే ఇతి ఈశానః ‘’-ఐశ్వర్యం కలవాడు .
29-నమో నేదిస్టాయ ప్రియదవ ! దవిస్టాయ చ నమో –నమః క్రోధిస్టాయ స్మరహర ! మహిస్టాయచ నమః
నమో వర్షిస్ఠాయ త్రినయన !యవిస్టాయ చ నమో –నమః సర్వస్మై తే తదిదమితి సర్వాయ నమః ‘’
భావం –అడవిలో ఉండటానికి ఇష్టపడే శివా !నువ్వు అందరికీ దగ్గరగా ఉంటావు .అలాగే దూరంగానూ ఉంటావు .మన్మధ సంహారా !మిక్కిలి సూక్ష్మ౦ గా ,మిక్కిలి పెద్ద ఆకారం గా కూడా ఉంటావు .ముక్క౦టీ!బాగా వ్రుద్దుడువు బాగా యువకుడివీ కూడా .అంతేకాక సమస్తమూ అయిన వాడవు .అంతేనా –ఇది అది అని నిర్దేశించి చెప్పే వ్యవహారమంతటినీ మించిన సర్వ స్వరూపుడవు నువ్వు .అట్టి నీకు నమస్కారం .
ఈశ్లోకం కృష్ణ యజుర్వేదం లోని నమక భాగం లోని ‘’నమస్సోమాయచ రుద్రాయచ ‘’అని నమః నమః అని చాలా సార్లు వచ్చే మంత్రానికి అనుసరణ .
30-బహుల రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమోనమః –జనసుఖ కృతే సత్వోద్రేకే మ్రుడాయ నమో నమః
ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః –ప్రమహసి పదే నిస్త్రైగుణ్యే శివాయ నమో నమః ‘’
భావం –జగదీశా !నువ్వు సమస్తసృస్టి కార్యం నిర్వహించేటప్పుడు రాజోగుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటావు .ప్రజాసుఖ పాలనలో సత్వ గుణాన్ని ,పొంది మృడుడవు అవుతావు .సృష్టి ని లయం చేసేటప్పుడు తమోగుణ సంపన్నుడవై హరుడు అనిపించుకొంటావు .కాని నువ్వు మీ మూడు గుణాలకు అతీతుడవే. గొప్ప తెజస్స్వరూపుడవై శివుడు అనిపించుకొంటావు.అంతటి విశిస్టుడ వైన నీకు నమోవాకాలు .
ఈపదాల అర్ధాలు గ్రహిద్దాం –
భవః –‘’భవతి భవతే వా సర్వ మితి భవః –అంతా తానె అయిన వాడు
మృడః-‘’మృడ యతి సుఖ యతి భక్తానితి మృడః;’’-భక్తులను సుఖింప జేసేవాడు –‘’స్వయం సుఖీ వా ‘’తాను సుఖం కలవాడు అని కూడా
హరః –ప్రళయం లో సమస్తమూ లయింప జేసేవాడు –‘’భక్తానాం ఆర్తి హరతీతి హరః ‘’భక్తుల పీడను హరించేవాడు
శివః –‘శామ్యతి పరమానంద రూపత్వాత్ నిర్వికారో భవతీతి శివః –‘’బ్రహ్మానంద స్వరూపుడు ,నిరాకారుడుకనుక శమించి ఉండేవాడు –‘’శేరతీ సజ్జన మనాంసి ఇతివా ‘’-ఇతనిలో సజ్జనుల మనస్సు ఉంటుంది –‘’శేతే సజ్జన మనస్సు ఇతివా ‘’-సాధుజన హృదయ వాసి –‘’శివం కల్యాణం తద్యోగాద్వా శివః ‘’-శుభం తో కూడిన వాడు .’’శివో ప్రదాత్ వా శివః ‘’-శుభాలనిచ్చేవాడు
.
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-11-16 –ఉయ్యూరు

