– గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
7- మహేశ చంద్ర న్యాయ రత్న భట్టాచార్య
22-2-1836 న కులీన బ్రాహ్మణ కుటుంబం లో మహేశ చంద్ర భట్టాచార్య బెంగాల్ లో జన్మించాడు .నారిత్ కు చెందిన ఈ కుటుంబం తరతరాలుగా సంస్కృత భాషా పాండిత్యం లో పండిపోయింది .ఆ కుటుంబం వారందరూ దాదాపు సంస్కృత మహా విద్వా౦సులే.తండ్రి హరినారాయణ తర్క సిద్ధాంతం లో అద్వితీయుడు .ఒక బాబాయి గురుప్రసాద్ తర్క పంచానన బిరుదు పొందితే మరో బాబాయి ఠాకూర్ దాస్ చౌరామణి విశిష్ట పండితునిగా గుర్తింపు పొందాడు .పెద్దన్న పండిట్ మాధవ చంద్ర ‘’సార్వ భౌమ ‘’బిరుదు నందుకుని మహిషాదల్ రాజ్య సభా పండితుడైనాడు .
హుగ్లీ లోని జహానాబాద్ కు చెందిన పండిత రామ చదర తర్క భాగిస్ కుమార్తె మందాకినీ ని వివాహమాడి మనోరమ ,మన్మధ నాద విద్యార్ధ భట్టాచార్య ,మునీ౦ద్ర నాద్ భట్టాచార్య,మహిమ నాద భట్టాచార్య లకు తండ్రి అయ్యాడు .పెద్దకొడుకు మద్రాస్ రాస్ట్ర మొదటి ఇండియన్ అకౌంటంట్ జనరల్ .
మహేశ భట్టాచార్య 70 వ ఏట 12-4-1906 న మరణించాడు .
18 7 6 లో ప్రసన్న కుమార్ సర్వాధికారి స్థానం లో సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు .ప్రిసిపాల్ గ 19 ఏళ్ళ పాలనలో సంస్కృతం లో ప్రతిభ గల విద్యార్ధులకు అర్హతలను బట్టి గౌరవ స్థానాలను కల్పించాడు .స్వగ్రామం నారిత్ లో ఆంగ్లో –సాంస్క్రిట్ సెకండరీ స్కూల్ ఏర్పాటు చేశాడు .కావ్య ప్రకాశ ,మీమాంస దర్శన ,కృష్ణ యజుర్వేదాల ను విలువైన పీఠికలు రాసి సంపాదకత్వం వహించి ప్రచురించాడు .దయానంద సరస్వతి వేద భాష్యం పైనా,తులసీ ధర మీమాంస పైనా ,మృచ్చకటిక కర్త పైనా ,లుప్త సంవత్సరం పైనా అనేక పత్రాలు రాశాడు .దయానంద భాష్యంపై భట్టాచార్య చూపించిన అభ్యంతరాలకు దయానంద స్కూల్ సంస్కృత విద్వాంసుడు తెలియ బరచిన వివరాలను ఒక పుస్తకంగా ప్రచురించాడు .సంస్కృత విద్యా వ్యాప్తికి భట్టా చార్య కృషి ప్రశంసనీయం .సంస్కృత విద్యాలయాలకు కావలసిన నిధి సేకరణ కూడాచేసి వాటి నిర్వహణకు తోడ్పడ్డాడు .
నారిత్ గ్రామంలోను ,పరిసరాలలోనూ మంచి రోడ్ల నిర్మాణం చేబట్టాడు .స్వంత జిల్లా హౌరా లోని ట్రా౦ రోడ్ల విషయం లోనూ శ్రద్ధ చూపాడు .16-2-1887 న విక్టోరియా రాణి పట్టాభిషేక రజతోత్సవ నాడు ‘’మహా మహోపాధ్యాయ ‘’బిరుదాన్నిచ్చి గౌరవించారు .’’మోస్ట్ ఎమినేంట్ ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ ‘’ భట్టో పాధ్యాయ గుర్తింపు పొండాడు .భారతీయ సంస్కృత విద్వాంసులు ‘’న్యాయ రత్న ‘’బిరుదం తో సత్కరించారు .హ౦గేరిలోని బుడాపెస్ట్ లో ఉన్న ‘’హంగేరియన్ అకాడెమి ఆఫ్ సైన్సెస్ ‘’ఫారిన్ మెంబర్ గా ఎన్నుకో బడ్డాడు .కలకత్తా విశ్వ విద్యాలయం ,బెంగాల్ లోని టెక్స్ట్ బుక్ కమిటీ ,బీహార్ సాంస్క్రిట్ సమాజ్ బొంబాయిలోని ఆంధ్రో పలాజికల్ సొసైటీ లలో గౌరవ సభ్య స్థానం పొందాడు..హిందూ హాస్టల్ కమిటీ జాయింట్ సెక్రెటరిగా ,బెతూన్ కాలేజి మెంబర్ గా ,హౌరా ఇంజినీరింగ్ కాలేజి కి విజిటర్ గా ఉన్నాడు .బెంగాల్ ప్రెసిడెన్సిలో అంటే బెంగాల్ బీహార్ ఒరిస్సాప్రాంతాల సంస్కృతానికి న్యాయ రత్న స్థాయి లో ఇంచార్జి గా సేవలు అందించాడు .ఉత్తర కలకత్తాలోని శ్యాం బజార్ కు ‘’భట్టా చార్య బజార్ ‘’అని గౌరవ నామం పెట్టి గౌరవించారు .వందలాది ఆయన వద్ద విద్య నేర్చి సంస్కృత మహా విద్వాంసు లయ్యారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -14-11-16 –ఉయ్యూరు

