గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3 23-కవి కళానిధి దేవర్షి శ్రీ కృష్ణ భట్ (1675-1761 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3

23-కవి కళానిధి దేవర్షి శ్రీ కృష్ణ భట్ (1675-1761 )

18 వ శతాబ్దపు జైపూర్ రాజు రెండవ సవాయ్ జైసింగ్ కు సమకాలికుడైన శ్రీ కృష్ణ భట్ కవి ,సంస్కృత పండితుడు చరిత్రకారుడు వ్యాకరణ వేత్త .బుండీ,జైపూర్ రాజాస్థానాలలో సంస్కృతం వ్రజ భాషలకు విశేష ప్రాచుర్యం కలిగించినవాడు .ఆంద్ర ప్రదేశ్ లో వెలనాటి కుటుంబం కు చెందిన వీరు 15 వశతాబ్దిలో ఉత్తరదేశాలకు వలస వెళ్లి అక్కడే రాజాస్థానాలలో  స్థిరపడ్డారు . తండ్రి లక్ష్మణ భట్టు .

తెలంగాణా నుంచి జైపూర్ కు

జైపూర్ రాజు రెండవ సవాయ్ జైసి౦గ్ (1688-1743 )సాహితీ సమరాంగణ సార్వ భౌముడు .ఆయన రాజ్య పాలనలో దేశం లోని సంస్కృత విద్వాంసులను కవి గాయక నర్తకులను శిల్ప చిత్రకారులకు తన ఆస్థానానికి సగౌరవంగా ఆహ్వానించి ఆస్థాన విద్వాంసులుగా నియమించాడు .అలా వచ్చినవారిలో మనకవి  దేవర్షి శ్రీ కృష్ణ  భట్టు ఉన్నాడు.మహారాజు 1716 లో చేసిన అశ్వమేధ యాగానికి ,1734 లో నిర్వహించిన వాజపేయానికి  జైపూర్ నగర నిర్మాణానికి మనకవి సాక్షీభూతుడు .కృష్ణ భట్టు రాసిన ‘’ఈశ్వర విలాసం ‘’మహాకావ్యం జైసి౦గ్ మహారాజు ఆతనికుమారుడు ఈశ్వర సింగ్ ల రాజ్యపాలనా చరిత్ర ను వర్ణించిన దే.

హరి హర భట్టు రాసిన ‘’కుల ప్రబంధం ‘’లో తెలంగాణాకు చెందిన భట్టు వంశీయుల మొదటి తరం వారు అక్కడినుంచి ఇక్కడికి వచ్చి చేరారో తెలియ జేస్తుంది .శ్రీ శంకరాచార్య ,శ్రీ వల్లభాచార్య లవంటి గురువుల శిష్యులై, వారి దేశాటనం లో భాగస్వాములై వీరు ఉత్తర భారతానికి  చేరారట .వీరి ప్రతిభా పాండిత్యాలకు రాజులు అబ్బురపడి తమ సంస్థానాలలో గౌరవ స్థానాలు అందజేశారట .వీరిలో రాజ గురువులైనవారు ఆస్థాన కవులు ఆస్థానపండితులు ఆస్థాన విద్వాంసులు  అయిన వారెందరో ఉన్నారట .కాశీ లాంటి పట్టణాలలో  విద్యాభ్యాసం  కోసం వచ్చిన వారి సామర్ధ్యాన్ని గుర్తించి  రాజాస్థానాలకు  ఆహ్వానించి ఉన్నత స్థానాలను రాజులు కల్పించారట .క్రమంగా వీరు తమ తెలుగును మర్చిపోయి హిందీ లేక తాము ఉన్న ప్రాంత భాషకు అలవాటు పడిపోయారని కుల ప్రబంధం తెలియ జేస్తోంది .

ఇలా వచ్చినవారిలో తెలంగాణాలోని దేవర కొండకు చెందిన బావాజీ దీక్షిత కుటుంబం వల్లభాచార్యుల వారి తో 15వశతాబ్దిలొ ఉత్తర భారత దేశానికి చేరింది .ఆనాటి విద్యా కేంద్రాలైన కాశీ  ,ప్రయాగలలో దీక్షితులు విద్య నేర్చి స్థిరపడ్డాడు .సంతానమూ ఇక్కడే ఉండి పోయింది ..అప్పుడు ఈ రెండుప్రాంతాలూ మధ్య ప్రదేశ్ కు చెందిన రేవా సంస్థానం లోనే ఉండేవి .దీనికి ప్రయాగ సరిహద్దు.బావాజీ దీక్షితుల మనవడు మండన దీక్షితుల ప్రతిభా వికాసాలను గుర్తించిన రాజు గోపాల్సింగ్ తన  రాజగురువు గా  రేవా సంస్థానానికి ఆహ్వానించి ‘’దివ్రికీయ ‘’ గ్రామాన్ని రాసిచ్చి గౌరవించాడు .ఈ గ్రామం పేరు ఆంద్ర ప్రదేశ్ లోని వారి గ్రామం పేరు దేవరకొండను జ్ఞాపకం చేసేదిగా పెట్టుకొనగా  క్రమంగా ఇంటిపేరు ‘’దేవర్షి ‘’అయింది .ఈ వంశం లోనే కవి కళానిధి దేవర్షి శ్రీ కృష్ణ భట్టుకవి జన్మించాడు 1755 -1809 వరకు రేవాను పాలించిన అజిత్ సింగ్ అనే బాంధవ్ నరేష్ పాలనలో ఈ కుటుంబం ఉన్నది .

బుండీ సంస్థానం లో గౌరవ స్థానం .

రేవా ,బుండీ రాజులు పరస్పరం వియ్యం అందుకోవటం వలన రెండు రాజ్యాలు మరింత సన్నిహితమయ్యాయి .భుండీ రాజులూ కవి పండితాభి మానులు అందువలన కవిపండితులు రేవా నుంచి బుండీ కి  ఆహ్వానించి తమ ఆస్థానం లో గౌరవ స్థానాలలో నియమించి గౌరవించారు .అలా కవికళానిది దేవర్షి శ్రీ కృష్ణ భట్టు1696-1735 కాలం లో బు౦డీని పాలించిన రాజా బుద్ సింగ్  ఆస్థాన పురోహితుడై రాజుకు  అత్యంత  సన్నిహితుడైనాడు ..

వేద వేదా౦గ పురాణ ,ఉపనిషత్ వ్యాకరణ సంగీతాలలో అసమాన ప్రాభావమున్న క్రష్ణభట్టు కు బుండీ రాజ్యం లో ప్రజలలకు అత్యంత గౌరవాభిమానాలు౦డేవి .వీటితోపాటు కవిత్వం లోనూ అపార ప్రతిభ ఉన్నందున సంస్కృత , ప్రాకృత, వ్రజ భాష లలో గొప్ప కావ్యాలు రచించాడు .మహా వక్త కూడా అయిన క్రష్ణభట్టు  వాక్ ప్రవాహానికి జనం ముగ్దులయ్యేవారు .ఆయన రచించిన ‘’అలంకార కళానిధి ‘’,’’శృంగార రసమాధురి ‘’,విదగ్ధ రస మంజరి ‘’,మంచి ఖ్యాతిని ఆర్జించాయి .

బుండీ నుండి జైపూర్ కు

కృష్ణ భట్ట కవి  అసాధారణ ప్రతిభకు ముగ్ధుడైన బు౦డీ రాజు బుద్ సింగ్ బావగారు అంబర్ అంటే జైపూర్ మహారాజు రెండవ జైసింగ్ బావగారిని ఒప్పించి  భట్టు అంగీకారం తో కవి కళానిధి దేవర్షి కృష్ణ భట్టు ను సర్వ లాంచనాలతో తన జైపూర్ సంస్థానానికి సగౌరవంగా  ‘’రాజ పురోహితుని’’గా  ఆహ్వానించి గురు గౌరవం కలిగించాడు .ఈ విషయాలన్నీ అనేక చారిత్రిక గ్రంధాలలో ఉల్లేఖించ బడి ఉన్నాయి -‘’బుండీ పతి బుధ సింహ సౌరి ల్యే ముఖ సౌరి యాచి ‘’అంటే జై సింగ్ బుండీ బుద్ సింగ్ నుస్వయంగా ముఖతా వేడుకొని శ్రీకృష్ణ భట్ ను అంబర్  పేట్ అంటే జైపూర్ కు తీసుకొని వెళ్ళాడు ‘’అని ఒక డాక్యుమెంట్ ఉన్నది .

కృష్ణ భట్టు ‘’ఉత్తర భారతీయ ఆంద్ర తెలగాణ్య  భట్టు వంశ వృక్షం ‘’ గ్రంధం లో తమ భట్టు వంశం వారు ఆంధ్రనుండి  ఉత్తరభారతానికి వలస వెళ్ళిన వివరాలు వర్ణించి చరిత్ర తెలియ జేశాడు .ఇందులోనే’’ వెలనాడు తెలంగాణా బ్రాహ్మణ వంశం ఉత్తర భారత౦ చేరిన వైనమూ ఉన్నాది .భట్టుకుటుంబం  లో ద్వారకానాద భట్టు ,జగదీశ్ భట్టు, వాసుదేవ భట్టు మండన భట్టు, దేవర్షి రమణయ్య శాస్త్రి ,భట్ట మధురానాద శాస్త్రి , ,దేవర్షికాలనాద శాస్త్రి వంటి సంస్కృత కవి దిగ్గజాలవంటి వారెందరో ఉన్నారు .

రామ రాస కావ్యం

క్రష్ణ భట్టు ప్రతిభా సామర్ధ్యాలకు మెచ్చిన జైసింగ్ మహా రాజు ‘’కవికళానిది ‘’రామ రాసా చార్య ‘’అనే ఉత్తమ బిరుదులూ ప్రదానం చేసి సన్మానించాడు .రామ రాసాచార్య బిరుదు నివ్వటం వెనుక ఆసక్తికరమైన ఒక చిన్న కద ఉంది .ఒక రోజు రాజా జైసింగ్ రాజదర్బారులో అకస్మాత్తుగా ‘’శ్రీ కృష్ణ రాస లీలలు ‘’లాగా ‘’శ్రీరామ రాస లీలలు ‘’గ్రంధం ఉందా ?అని అడిగాడు .సభ అవాక్కైంది.ఎవరూ చెప్పలేక పోయారు .సభలో కృష్ణ భట్టూ ఉన్నాడు .అప్పుడు భట్టు లేచి ‘’కాశీలో ‘’రామ రాసలీలలు ‘’పుస్తకం ఉందని చెప్పాడు .రెండు నెలలలోగా ఆపుస్తకాన్ని సంపాదించి తనకు చూపించమని రాజు ఆనతిచ్చాడు .కృష్ణ భట్టు ఇంటికి వచ్చి దానిపైనే ఆలోచించటం ప్రారంభించాడు .అలాంటి పుస్తకం లేదని తెలుసు .కాని సభలో ఉందని తానే చెప్పాడు ఎలా ?ఇక తానే రెండు నెలల గడువులోపల రాసి పూర్తి  చేసి ,రాజు కు చూపించాలనే నిర్ణయానికి వచ్చాడు .అంతే ‘’రామ రాస ‘’కావ్యాన్ని వ్రజభాషలో రామాయణం లాగా రాయటం ప్రారంభింఛి గడువులోపల పూర్తి చేసి సభలో జైసింగ్ మహా రాజుకు సమర్పించాడు .పరమానంద భరితుడైన మహా రాజు భట్టును విశేష ధనకనక వస్తువాహనాలతో సత్కరించి ‘’రామ రాసాచార్య ‘’అనే బిరుదు ప్రదానం చేశాడు .

కృష్ణ భట్ట కవితా గీర్వాణం

కవి కళానిధి కృష్ణ భట్టు –ఈశ్వర విలాస మహాకావ్యం ‘’,వ్రజభాషలో అలంకార కళానిధి ,సుందరీస్ట వరద ,పద్య ముక్తావళి ,వ్రుత్తి ముక్తావళి ,జాజౌ యుద్ధ ,రామ చంద్రోదయ ,వ్రజ భాష లో  శృంగార రరసమాధురి,వృత్త చంద్రిక ,వేదాంత పంచదశి ,సంభర యుద్ధ ,రామ రాస  ,జయసింహ గుణ సరిత  ,విదగ్ధ మాధురి ,టీకా ఉపనిషత్ ,నఖ శిఖ వర్ణన,బహుదుర విజయ , రామగీతం,దుర్గా భక్తి తరంగిణిమొదలైనవి రచించాడు .రామకృష్ణ భట్టు 1761 లో 86 వ ఏట శ్రీ రామ ,శ్రీ కృష్ణ విలాసానికి శాశ్వతంగా వెళ్లి పోయాడు .

సశేషం

2017   నూతన ఆంగ్ల సంవత్సర శుభా కాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-1-20 17 –ఉయ్యూరు

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.