గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
24-యంత్ర చింతామణి రచయిత-దామోదర భట్ట (19 శతాబ్ది ఉత్తరార్ధం )
16 వ శతాబ్ది ఉత్తరార్ధం లో జీవించిన సంస్కృత విద్వాంసుడు దామోదర భట్టు ‘’యంత్ర చింతామణి ‘’లేక ‘’కల్ప చింతామణి ‘’అనే గ్రంధాన్ని రాశాడు ఇది పూర్తిగా ‘’అభిచార ‘’పద్ధతులను తెలియ జేస్తుంది ఈ గ్రంధం ఆధారంగానే ప్రాంతీయ భాషలలో దానికి సంబంధిన పుస్తకాలు ప్రచురితమయ్యాయి .ఈ గ్రంధాన్ని మొట్టమొదటి సారిగా అధ్యయనం చేసి ,1939లో ఫ్రెంచ్ భాష లోకి అనువదించినవాడు జీన్ మార్కేస్ రివేర్రీ ‘.ఇటీవలికాలం లో హన్స్ జార్జ్ టూర్స్టిగ్ దీనిపై విపులమైన వ్యాఖ్యానం రాశాడు .గుడున్ బూహేన్మాన్ ఈ గ్రంధాన్ని సంక్షిప్తం చేసి ‘’యంత్రాస్ అండ్ మండలాస్ ‘’పేరిట ప్రచురించింది .
25-స్వామి దయానంద సరస్వతి గురువు –విరజానంద దండీశ (1777 -1868)
పంజాబ్ లోని జలంధర్ దగ్గరున్న కర్తార్ పూర్ లో 1778 లో మొహియాల్ వంశం లో విరజానంద జన్మించాడు .చిన్నప్పుడే 5 వ ఏట మసూచిక౦ వచ్చి కంటి చూపు పోయింది .ప్రాధమిక సంస్కృత పాఠాలు నేర్పిన తండ్రి చనిపోయాడు .ఆదుకోవాల్సిన అన్నా వదిన ల దాష్టీకం భరించలేక ఇంటి నుండి వెళ్లి పోయాడు .దేశాటనం చేస్తూ హృషీకేష్ చేరి అక్కడే తపస్సు ధ్యానం తో గడిపాడు .దైవ ఘటన వలన విరజానంద హరిద్వార్ చేరాడు .అక్కడ పూర్ణ నాద్ అనే యోగి,సంస్కృత పండితుడు విరజానంద్ కు సన్యాసం ఇచ్చి ,సంస్కృత వ్యాకరణం బోధించి ,ఆర్ష సంప్రదాయాన్ని బాగా వంట పట్టించి ,హిందూత్వాన్ని బలంగా హృదయం లో నాటాడు .అన్ని సంస్కృత సాహిత్య శాఖలలో ఆరి తేరి కొంతకాలం విద్యా బోధనా చేశాడు విరజానంద .
విద్యలకు కాణాచి అయిన కాశీ చేరి 10 ఏళ్ళు గడిపి మీమాంస ,ఆయుర్వేద ,వేదాలను క్షుణ్ణంగా అభ్యసింఛి గొప్ప విద్వాంసుడై కాశీ లోని విద్వాంసులలో ముఖ్యుడయ్యాడు . గయ కు వెళ్లి ఉపనిషత్తులపై సాధికారత సాధించి ,కలకత్తా వచ్చి దేశం లోనే ప్రముఖ సంస్కృత విద్వాంసుడనే ఖ్యాతి పొందాడు .తనకున్న సంస్కృత వ్యాకరణ సాహిత్య పాండిత్యం తో మంత్రముగ్ధమైన స్వర౦ తో సమ్మోహపరచాడు . నగరం లో నుంచి బయటపడి గంగానది ఒడ్డున గడియా ఘాట్ వద్ద నివాసమేర్పరచుకొని ఉండగా ఆల్వార్ మహా రాజు విరజానంద్ ను దర్శించి ,ప్రభావానికి లోనై ,ఆహ్వానించగా ఆల్వార్ వెళ్లి ఆస్థానం లో ఉండి ,రాజు కోరికపై ‘’శబ్ద బోధ ‘’రాశాడు దీని వ్రాత ప్రతి ఆల్వార్ లైబ్రరీలో భద్రపరచబడి ఇప్పటికీ అతి విలువైనది గా పరిగణింప బడుతోంది .ఆల్వార్ నుండి సోరోన్ ,అక్కడి నుంచి మధురకు విరజానంద చేరుకొన్నాడు.
మధుర లో ఒకపాఠ శాల స్థాపించి నడిపాడు .దేశం లోని పలు ప్రాంతాలనుండి విద్యార్ధులు వచ్చి చేరి చదువుకున్నారు .ఈ సంస్థ నిర్వహణ రాజుల విరాళాలతో నిర్వహించబడింది .అదే సమయం లో సరైన గురువుకోసం దయానంద సరస్వతి దేశమంతటా అన్వేషిస్తూ మధుర చేరాడు .అక్కడ పూర్ణ శర్మ స్వామి అనే యోగి వలన తగిన గురువు విరజానంద ఒక్కడే అని తెలుసుకొన్నాడు 1860 లో మధురలో విరజానంద ను దర్శించాడు .విద్య పరమార్ధం ఏమిటి అని విరజానంద దయానందను అడిగి ,ఆయన ‘’కౌముది ‘’సారస్వత ‘’అనే రెండు ప్రముఖ వ్యాకరణ గ్రంధాలు ఆపోసన పట్టాడని తెలుసుకొని ఆరెండిటిని యమునా నదిలో విసిరేసి తనదగ్గరకు రమ్మన్నాడు విరజానంద .
విరజానంద నే గురువుగా భావించి ఆయన చెప్పినట్లే చేసి కాళ్ళపై పడ్డాడు దయానంద . అంధుడైనా విరజానంద విద్యా బోధన చాలా క్రమ శిక్షణతో నడిచేది .శిష్యుల అనుమానాలను పుస్తకం లేకుండానే తీర్చగల సర్వ సమర్ధుడు విరజానంద గురువు .దయానంద ను తీర్చి దిద్ది తనంతటి వాడిని చేశాడు .విరజానంద దయానంద ను హిందూమత పునరుద్ధరణ మే తన గురు దక్షిణగా కోరాడు .ఆర్ష ,వేద సాహిత్య వ్యాప్తికి అంకిత మవమని శిష్యుని ఆదేశించాడు .గుర్వాజ్నను శిరసావహించి దయానంద మహర్షి వేద ఆర్ష సాహిత్య వ్యాప్తి చేస్తూ హిందూమతాన్ని పునరుద్ధరించటానికి జీవితం ధార పోశాడు .విరజానంద 90 వ ఏట 14-9-1868 న మహా సమాధి చెందాడు .గురువు మరణానికి స్పందిస్తూ శిష్యుడు స్వామి దయానంద ‘’ఇవాళ వేద వ్యాకరణ తేజో భానుడు అస్తమించాడు ‘’అన్నాడు .కేంద్ర ప్రభుత్వం 14-9-1971 న విరజానంద స్మారక పోస్టల్ స్టాంప్ విడుదల చేసి గౌరవించింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -2-1-17 –ఉయ్యూరు

