గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
26-విశ్వనాధ వారి వేయి పడగలను సంస్కృతీకరించిన విదుషీమణి- డా.అయ్యగారి ప్రభావతీ దేవి -2
ప్రభావతీదేవి ప్రతిభా సర్వస్వం- ‘సహస్ర ఫణాః’’గా వేయిపడగలు సంస్కృతానువాదం ‘’.
విశ్వనాధ వేయిపడగలు అంటే ఆయన ‘’మేగ్నం ఓపస్’’ గా భావింపబడే ఆధునిక నవలేతి హాసం .వెయ్యి పేజీల బృహత్ నవల .దీనిని సంస్కృతం లోకి తర్జుమా చేయమని గురుస్థానీయులు శ్రీ ఏలూరి పాటి అనంతరామయ్యగారు సూచించటం వెంటనే ఆకార్యక్రమాన్ని చేబట్టి దిగ్విజయంగా పూర్తి చేయటం శ్రీమతి ప్రభావతీదేవికే చెల్లింది .అది ప్రభావతీ మేధో సర్వస్వమే అయింది .డిసెంబర్ 28 వ తేదీన వారి అపార్ట్ మెంట్ కు మేము వెళ్ళినప్పుడు వేయిపడగలు వ్రాత ప్రతి ఆమె టేబుల్ పై దర్శన మిచ్చింది .ముత్యాలవంటి స్వదస్తూరితో చక్కని వరుసక్రమం లో ఆమె వెయ్యి పేజీలలో సంస్కృతం లోకి అనువాదం చేశారు .ముచ్చటవేసింది ఆ సంస్కృత ప్రతి చూడగానే .ఫోటోలు తీశాను .పుస్తకం ఆవిష్కరణ జరిగిందని విన్నానే ఎలా చేశారు అని అడిగితే డి. టి. పి. చేసిన సుమారు వంద పేజీల స్పైరల్ బైండింగ్ చూపించి దానినే ఆవిష్కరించామని చెప్పారు .దీని ఫోటో కూడా తీసుకొన్నాను .’’అనువాదం లో మీ స్త్రీవాద ప్రభావం పాత్రలపై పడిందా’’ ?అని అడిగాను’’లేదు .ఏపాత్రనూ నేను ముట్టుకోలేదు.విశ్వనాధ వారు ఏది ఎలాచేప్పారో దాన్ని తు చ తప్పకుండా సంస్కృతం లో రాశాను .కనుక పాత్రలపై నా ప్రభావం పడే అవకాశం లేదు, నేను తీసుకోనూ లేదు’’అని చెప్పారు .’’ఇంతటి బృహద్రచన అనువాదం చేయటానికి ఏంతో ఓపికా సమయం కావాలి కదా .ఎంతకాలం లో రాశారు ?అని అడిగితే’’ఏలూరి పాటి గురువు గారి ఆదేశం, ఆశీస్సు ,ప్రోత్సాహం ఉండటం వలన ఎక్కడా ఆగకుండా జయప్రదంగా 2001 లో ప్రారంభించి మూడేళ్ళలో 20 04 కు పూర్తి చేశాను ‘’అన్నారు ..’’ఆయన ఆదేశం పై రాశానని అన్నారు కదా అసలు ఆ నవలపై మీకు అంతకు ముందు ఎలాంటి అభిప్రాయం ఉంది ?’’అని అడిగితే ‘’ఆ నవల గురించి వినటమేకాని ,పూర్తిగా చదవలేదు కాని అనువాదం కోసం చదవటం మొదలు పెడితే అద్భుతం అని పించింది .రెట్టించిన ఉత్సాహం తో రాసుకుంటూ వెళ్ళిపోయాను ‘’అన్నారు .’’మరి ఈ కాలానికి సంస్క్రుతానువాదం పనికొస్తుందా ?’’అని అడిగా .’’అది కాలం నిర్ణయిస్తుంది .మన ప్రయత్నం మనం చేయాలి ‘’అని చెప్పారు ‘’.అందులోని ఏ పాత్రలు మీకు నచ్చాయి ?అని ప్రశ్నిస్తే ‘’మంగమ్మా ,భర్త లు బాగా నచ్చిన పాత్రలు.కారణం జవం జీవం ఉన్నపాత్రలు కనుక ‘’అని ఠకీమని చెప్పారు .’’అందరికి ధర్మారావు అరుంధతి నచ్చుతారు కదా “’అన్నాను .’’వారివిషయం ఏమోకాని ధర్మా రావు విశ్వనాధ వారి ‘’టైలర్ మేడ్ షర్ట్ ‘’(ఈ మాట ఆమె అనలేదు కాని ఆమె భావానికి నేను పెట్టిన పేరు మాత్రమె )అని పిస్తాడు నాకు .మొదటి అరుంధతి అభిమాన పాత్ర .రెండో అరుంధతి నచ్చలేదు ‘’అన్నారు .’’అనువాదానికి న్యాయం చేశారని అనుకొంటారా’’ ?అనగానే ‘’నూటికి నూరు శాత౦ న్యాయం చేశాననే సంతృప్తి, సంతోషం నాకున్నాయి .’’అని ధీమాగా అన్నారు . ‘’నవల ముద్రణ ఎందుకు చేయలేకపోయారు “”?అని అడిగా ‘’నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటం ,అమెరికాలో ఎక్కువ కాలం ఉంటూ ఉండటం డి .టి .పి. చేసిన కాగితాలలో తప్పులు సరి చేయటానికి సంస్కృతం తెలిసిన వారు దొరకక పోవటమే ముఖ్య కారణాలు .2010 లోముద్రణకు ఇస్తే ఇ౦తవరకుఅది పూర్తి కాలేదు ‘’అని కొంత నిర్వేదంగా అన్నారు .నేను ఆమెకు చెప్పలేదుకాని సద్గురు శివానంద చారిటబుల్ ట్రస్ట్ వారికి కాని వారణాసి లోని సంస్కృత విద్యా సంస్థాన్ వారికి కాని ఇచ్చి ఉంటె ఎప్పుడో సంస్కృత వేయిపడగలు వెలుగు చూసి ఉండేదేమో అని పించింది .ఏమైనా’’ స్త్రీ సాహసం ‘’గా ప్రభావతీ దేవి గారు తెలుగు వారంతా గర్వపడే గొప్పపని గా’’ సహస్ర ఫణాః’’నుతెలుగువారికి అందించి ధన్యులయ్యారు .
2-‘’కృతో వా మానుష్యం ‘’.(మానవత్వం ఎక్కడ ?’’)
ప్రభావతీ దేవిగారి మరొక సృజన ‘’కృతోవా మానుష్యంఖండకావ్యం . ‘’52 శ్లోకాల ఈ కవిత్వాన్ని నాగర లిపి, తెలుగు లిపిలో నూ ఇచ్చి ఇంగ్లీష్ లోకి ఆమె కుమార్తె శ్రీమతి లలితా సుహాసిని అనువదిస్తే ,శ్రీ ఏలూరి పాటి అనంతరామయ్యగారు తెలుగు అనువాదమూ చేసి మరింత శోభ చేకూర్చారు .ఈ చతుర్వేణీ సంగమ కవితా ధార మధురం,సుందరం ఆలోచనా స్పందనం .ఇందులో లోకం లోని అన్యాయాలను ఎత్తి చూపి మానుష్యం యెటు పోతోంది అని ప్రశ్నించారు ప్రభావతీ దేవి .ఈ అన్యాయాలలో బ్రిటిష్ వారు చేసినవే కాక సమకాలీన కాలం లో పాకిస్తాన్ ,నేటి క్రికెట్ చేసే అన్యాయాలనూ ఏకరువు పెట్టారు . ఆతంక వాదుల ఆకతాయి తనం బాలబలాత్కారాలు ,గురుకుల విద్యార్దుల వధలు ,జైళ్ళల్లో చావులు ,అయోగ్యుల పదవీ అందలం, మతోన్మాదం రక్తపాతం వంటి సమస్యలలెన్నిటినో స్పృశించి తన లోకజ్ఞాత అచాటుకొన్నారు .సోదరులు ఆడపడుచులను ఆదుకోవటం లేదని బాధ పడుతారు .శ్రీ శ్రీకి లోకబాదే తనబాద అయినట్లు దేవిగారికీ అంతే .ఈ కృతిని తమ స్నేహితులు బి .జే .పి .సీనియర్ నాయకులు కేంద్రమంత్రి శ్రీ బండారు దత్తాత్రేయ గారికి అంకిత మిచ్చారు .శిఖరిణీ వృత్తం లో రాసిన ఈ శ్లోకాలు ఆమె చేతి పెంపుడు నెమలి లా నాట్యమాడాయి ..ఇందులోని కొన్ని సొగసులు చూద్దాం
మొదటి శ్లోకం-‘’ పవిత్రం త్వన్నామ ప్రధమ పదమాభాతి చ విధేః-ద్వితీయం సోపానం భవతి భవతాం దర్శన విధిః
భావద్విస్సల్లాపో నయతి నియతే రంతిమ పదం –క్రుతార్దాం త్వత్ స్నేహే తదియ భగవాన్ చిన్తయతుమాం ‘’
భావం – పవిత్రమైన నీపేరు పవిత్రతకు మొదటి మెట్టు గా ఉండి,నిన్ను దర్శించటం రెండవ మెట్టు అయింది నీతో సంభాషణ భాగ్యానికి చివరి స్థానానికి చేరుస్తుంది .నన్ను నీ స్నేహం కృతార్దురాలిని చేస్తుంది .కనుక భగవాన్ !నన్ను గురించి ఎప్పడూ నువ్వు ఆలోచిస్తూ ఉండు .
19 వశ్లోకం –‘ఇమే ప్రౌఢా బాలాఃభ్రమర సరణాసక్త మతయః –సరోషాఃనిర్లజ్జాః స్వహిత పర నిస్టాః పరవశాః
అహంకారేణాంధాః స తు కర్తుం చ కుశలాః –పిత్రూన్ నిర్ భర్ త్సైతేసుఖమివ హి జీవంతి తనయాః .
భావం –తాడి చెట్లలాగా ఎదిగి వీదుల వెంట బలాదూర్ తిరుగుతూతమబాగే చూసుకొనే పరాన్నభుక్కులైన ఈ కుర్రాళ్ళకు ముక్కుమీద కోపం సిగ్గు లేనితనం పొగరుతో కళ్ళు మూసుకు పోయి కన్నవారిపై కస్సూ బుస్సు మంటూ సుఖంగానే బతుకు తున్నారు .
24-‘’వర్షేస్మిన్ వృషనామ్నిమూఢ మతయః కార్తీక మాసే చతు-ర్దశ్యా మధ్య తిదౌచ దక్షిణ మహా యానే గురౌ వాసరే
అస్మద్భారతదేశ ముఖ్య నగరే ,ధిల్ల్యాంసభాయాం ప్రగే-సార్ధైకాదశ వాదనేచ సమయే గ్న్యస్త్రాణ్య ముంచన్ శఠాః’’
భావం -13-12-20 01 గురువారం పగలు 11 -30 కి ధిల్లీ పార్లమెంట్ వద్ద మూఢ బుద్ధులైన ఆతంక వాదులు బాంబులు ప్రయోగించారు అని తిదివార నక్షత్రాలతో సహా తెలియ జేశారు .
27- వ శ్లోకం లో నాటి ప్రధాని వాజ్ పాయ్ పాకిస్తాన్ కు గౌరవ ప్రదమైన మాటలతో యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తే ,ఆ మోసగాళ్ళు భారత సైన్యం పై విరుచుకు పడి నరమేధం సృష్టించారు. మానవత్వం ఎక్కడుంది ఆపపేరైనా ఎక్కడుంది అని ప్రశ్నించారు .
47 వ శ్లోకం –‘’ప్రజా తంత్రే తదపి చ భవెత్సేక్యులరితో –న హిందూ నే సాయీ జిన యవన భేదో న తు పరం
మహాన్త స్సంక్షోభా మత విషయకా రక్త సరితః –కుతో వా మానుష్యం బత తదభిదానం చ భవతి .
భావం –ప్రజా స్వామ్యమైన మన మతా తీత రాజ్యం లో హిందూ ముస్లిం క్రైస్తవ జైన భేదం లేదు .కానీ మత సంబంధ కొట్లాటలు కాట్లాలకు అంతు లేదు .రక్తం ఏరులై ప్రవహిస్తోంది .మానవత్వమెక్కడ దాని అడ్రస్ ఎక్కడుంది ?
52-‘’అయం కాంగ్రెస్ నేతా లయగమన రక్తో మునివరః –అయం లంపాకానా౦ ప్రతినిధి రయం సాదు చరితః
హతో రాగ్యా దుస్టైరదివ సమయే లోక పురతః –కుతో వా మానుష్యం బత తదభిధానం చ భవతి
‘’
భావం –కాంగ్రెస్ పార్టీ నాయకుడు ,దైవ భక్తుడు ,లంబాడీ ప్రజల ప్రతినిధి ,ఉత్తమ నడవడిక గలవాడు అయిన రాగ్యా నాయక్ నుపట్టపగలే అంతా చూస్తుండగా దుర్మార్గుల చేతిలో బలై పోయాడు .ఇంకెక్కడి మానవత్వం ?దాని చిరునామా యేడ?
ఏ సమస్యనైనా హాయిగాసులభంగా సుందరం గాశిఖరిణి లో మలిచి వన్నె తెచ్చి ,ఇంత తేలికగా సంస్కృతం లో రాయవచ్చా అని ఆశ్చర్య పరచారు ప్రభావతీ దేవి .ఈ కావ్యం మానవత్వానికి ఎత్తిన విజయ పతాక అని పిస్తుంది .
సశేషం
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -4-1-17 –ఉయ్యూరు
గీర్వాణకవుల కవితా గీర్వాణం -3

