గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
35-సంస్కృత చలన చిత్ర దర్శకుడు –జి.వి.అయ్యర్ (1917 -2003 )
సంస్కృతాన్ని రచనలద్వారా వ్యాప్తి చెందించిన వారినీ, నాటక ప్రదర్శనల ద్వారా వ్యాప్తి చెందించిన ఎందరి గురించో తెలుసుకొన్నాం .ఇప్పుడు మహానుభావుల చలన చిత్రాలను సంస్కృతం లో నిర్మించిన సంస్కృత భాషా వ్యాప్తి చేసిన డా.జి.వి.అయ్యర్ జీవిత విశేషాలను గురించి తెలుసుకొందాం .
గణపతి వెంకట రమణ అయ్యర్ అంటే ఎవరికీ తెలియదు .జి వి అయ్యర్ అంటే చాలామందికి తెలుసు .సంస్కృత చలన చిత్ర నటుడు దర్శకుడు అయిన అయ్యర్ 3-9-1917 న కర్ణాటకలోమైసూర్ జిల్లా నంజన్ గూడ లో జన్మించాడు .భారతీయ చలన చిత్ర దర్శకులలో సంస్కృత చలన చిత్రాలను నిర్మించి దర్శకత్వం చేసిన ఒకే ఒక్కడు అయ్యర్ .అందుకనే ఆయనను ‘’ ‘’కన్నడ భీష్మ’’ అంటారు .8 వ ఏటనే గుబ్బి వీరన్న దియేటర్ గ్రూప్ లో చేరి నటుడయ్యాడు.’’రాధారమణ’’ సినిమాలో మొదటి సారిగా నటించి సినీ నటుడయ్యాడు .తరువాత మహా కవి కాళిదాసు ,సోదరి ,హేమావతి ,హరి భక్త ,బేదర కన్నప్ప మొదలైన సినిమాలలో నటించాడు .
అయ్యర్ ఆ తర్వాత స్వంతంగా సినిమాలకు దర్శకత్వం చేయాలని భావించి ‘’హంస గీతే ‘’అనే కన్నడ సినిమాను డైరెక్ట్ చేశాడు .దీనికి డా మంగళం పల్లి బాల మురళీ కృష్ణ సంగీత దర్శకత్వం చేశారు. టి .జి .లింగప్ప ,బి .వి.కారంత్ మొదలైన వారు నటించారు .ఈసినిమా విపరీతం గా విజయం సాధించి అందరికి మంచి పేరు తెచ్చింది అయ్యర్ కీర్తి దశ దిశలా వ్యాప్తి చెందింది .ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు .కదా ,స్క్రీన్ ప్లే ,డైలాగ్స్అన్నీ తానే సమకూర్చుకొని అయ్యర్ .వరుసగా చాలా కన్నడ సినిమాలు తీశాడు,డైరెక్ట్ చేశాడు .ఆయన గొప్ప చిత్రం ‘’రణధీర్ కంఠీరవ’’.1970 వరకు కమ్మర్షియల్ చిత్రాలే తీశాడు .
కన్నడ ,సంస్కృతాలలో గొప్ప పాండిత్యం ఉన్న అయ్యర్ దృష్టి సంస్కృత చిత్రాపై పడింది .1983 లో మొట్టమొదటి సారిగా ‘’ఆది శంకరాచార్య ‘’సంస్కృత సినిమా డైరెక్ట్ చేశాడు .ఈ సినిమా జాతీయ స్థాయి లో ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే,ఉత్తమ సినిమాటోగ్రఫీ,ఉత్తమ ఆడియోగ్రఫీ లకు బహుమతులను అందుకున్నది .కళాఖండం గా ఈ సంస్కృత చిత్రం చిర స్థాయిగా నిలిచి పోయింది .అయ్యర్ ప్రతిభ అందర్నీ అప్రతిభులను చేసింది .ఈ సినిమా అయ్యర్ పై గొప్ప ప్రభావం చూపింది .ఈ సినిమా తీసిన తర్వాత అయ్యర్ జీవన విధానమే మారిపోయి చెప్పులు వేసుకోవటం కూడా మానేశాడు .
తర్వాత కన్నడం లో ‘’మాధవా చార్య ‘’తమిళం లో ‘’రామానుజాచార్య ‘’సినిమాలు తీశాడు అయ్యర్ .1933 లో సంస్కృతం లో రెండవ సినిమాగా ‘’భగవద్గీత ‘’తీశాడు .ఇది ఉత్తమ చిత్రం గా జాతీయ స్థాయిలో బహుమతి పొందింది .ఇది ‘’బగోటా ఫిలిం ఫెస్టివల్ ‘’లో ప్రదర్శింప బడింది .
అయ్యర్ కొన్ని టెలివిజన్ సీరియల్స్ తీశాడు అందులో ‘’నాట్య రాణి శాంతల ‘’అనేది హోయసల రాణి శాంతల పై నిర్మించిన చారిత్రాత్మక సీరియల్ .ఆమెను వైష్ణవ రాజు కిచ్చి వివాహం చేశారు .దీన్ని హిందీ,కన్నడ భాషలలో లోనూ తీశారు .
స్వామి వివేకానంద జీవితాన్నిహిందీ చలన చిత్రంగా నిర్మించాలనినిశ్చ యించుకొన్న అయ్యర్ మిదున్ చక్రవర్తిని శ్రీ రామ కృష్ణ పరమ హంస పాత్రకు ఎంపిక చేసి నటి౦ప చేశాడు .మిదున్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా జాతీయ బహుమతి వచ్చింది .మిదున్ –పరమహంసగా తన నటనా విశ్వ రూపాన్ని ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నాడు .సర్వదమన బెనర్జీ వివేకానండునిగా నటించాడు. హేమామాలినికూడా ఉంది . కాని ఈ సినిమా కమ్మర్షియల్ సక్సెస్ పొందలేదు.
సంజయ దత్తును రావణాసుర పాత్రగా రామాయణాన్ని తీయాలని సంకల్పించాడు అయ్యర్ .దురదృష్ట వశాత్తు అయ్యర్ 21-12- 2003 న 87వ ఏట అకస్మాత్తు గా మరణించాడు . బెంగళూర్ దగ్గర కేంగేరి లో దొడ్డ అలదమార దగ్గరున్న భరద్వాజ ఆశ్రమం లో అయ్యర్ అంత్యక్రియలు నిర్వహించారు .
అయ్యర్ మొత్తం మీద రెండు సంస్కృత ,ఒక హిందీ ,ఒక తమిళ చిత్రాలను ,23 కన్నడ చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించాడు .2001 లో కృష్ణ లీల తీయాలని ప్రయత్నించాడు .10 సినిమాలో అయ్యర్ నటుడుగా నటించి రాణించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -15-1-17-ఉయ్యూరు

