గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
38-పద్మ విభూషణ్ –గోపీనాధ కవిరాజ్ (1887 -1976 )
బెంగాల్ తత్వ వేత్త వైకుంఠ నాద కుమారుడే గోపీనాధ కవి రాజ్ .ప్రస్తుత బంగ్లాదేశ్ లోని ఢాకా జిల్లా ధర్మరాయ్ గ్రామం లో జన్మించాడు .అక్కడే ప్రాధమిక విద్య పూర్తీ చేసి ఢాకా లోని కె.ఎల్.జూబిలీ హై స్కూల్ లో 7 వ తరగతిలో చేరి 10 వ తరగతి పాసై నాడు .ఇంటిపేరు బాగ్చి .కవి రాజ్ ఆయన బిరుదు .
1906 లో జైపూర్ చేరి నాలుగేళ్ళుమహారాజా కాలేజి లో చదివి డిగ్రీ పాసయ్యాడు .అలహాబాద్ యూని వర్సిటీనుండి ఎం .ఏ. పొందాడు గురువులు మధుసూదన ఓఝా ,షాశ్ధర్ తర్క చూడామణి .తరువాత వారణాసిలోని దేవనాధ పురం చేరి ఎం .ఏ.డిస్టింక్షన్ లో పాసైనాడు .వారణాసి లో చివరి ఏడాది చదువు ఆర్ధర్ వెనిస్ వద్ద సాగింది . ఆయన ఈయన్ను వారణాసి సంస్క్రుతకాలేజి సరస్వతిభవన్ లైబ్రరీ కి లైబ్రేరియన్ గానియమించాడు ఈ కాలం లో తంత్ర శాస్త్రం పై దృష్టి పెట్టాడు .వారణాసిలో అనేక తంత్ర శాస్త్రాలను అధ్యయనం చేశాడు .1918 లో శ్రీ విశుద్ధానంద భారతి స్వామిని దర్శించి ,ఆయన టిబెట్ దగ్గర జ్ఞాన్ గంజ్ లో చూపిన యోగ విన్యాసాలకు ఆశ్చర్యపడ్డాడు .
1924 లో సంస్కృత కాలేజి ప్రిన్సిపాల్ అయి,తర్వాత వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత యూని వర్సిటి ప్రిన్సిపాల్ అయ్యాడు .సరస్వతి భవన్ గ్రంధమాలకు ఎడిటర్ అయ్యాడు .రిసెర్చ్ మీద అమితాసక్తి ఉండటం ,స్వీయ ఆధ్యాత్మికానుభవ సాధనకోసం స్వచ్చందంగా 1937 లోగురువు విశుద్ధానంద మరణం తర్వాత పదవీ విరమణ చేశాడు .తర్వాత పూర్తికాలాన్ని తంత్ర సాధన ,పరిశోధనలో గడిపాడు .వారణాసి లోని గురువుగారి ఆశ్రమ సంరక్షణ చేస్తూ ,కాశీ పై అమిత భక్తితో అక్కడే ఉండిపోయాడు .పద్మ విభూషణ్ స్వీకరించటానికి మాత్రమే కాశీని వదిలి వెళ్ళాడు అంతే .అనిర్వణ్అనే విద్వా౦సునితో కలిసి కాశ్మీర్ శైవ మతాన్ని అధ్యయనం చేయటానికే కాలం వెచ్చించాడు .జీవిత చరమాంకం లో1928 లో మొదటి సారి దర్శించిన మాతా ఆనంద మాయికి గాఢ భక్తుడైపోయాడు .
సంస్కృత భాషా సేవకు 1934 లో మహా మహోపాధ్యాయ బిరుదును పొందాడు .తర్వాత వారణాసిలోని వారణాసీయసంస్కృత విశ్వ విద్యాలయం లో నూతనం గా ఏర్పాటు చేసిన ‘’యోగ –తంత్ర డిపార్ట్ మెంట్ కు అధిపతి గా 1964 నుండి 1969 వరకు పని చేశాడు .ఆరోగ్యం సహకరించక పదవికి రాజీనామా చేసి భాడైని ప్రాంతం లో ఉన్న మాతా ఆనంద మాయి ఆశ్రమం లో గడిపాడు . .
తూర్పు బెంగాల్ లో విద్వద్ వంశానికి చెందిన కుసుమ కుమారి ని 1900 లో వివాహమాడి ఇద్దరు పిల్లలకు తండ్రి అయ్యాడు .గోపీనాధ కవిరాజ్ 1-భారతీయ సంస్కృతీ ఔర్ సాధన 2-తాన్త్రిక్ వాజ్మి మే శాక్త దృష్టి 3-శ్రీ కృష్ణ ప్రసంగ 4-కాశీకీ సారస్వత్ సాధన 5-పత్రావళి 6-స్వ సంవేదన్ 7-అఖండ మహాయోగేర్ పదే 8-విశుద్ధానంద ప్రసంగ 9-తాన్త్రిక్ సాహిత్య 10-సాదు దర్శన్ ఏవం సత్ ప్రసంగ .గోపీ నాద కవి రాజ్ పై నాలుగు గ్రంధాలు వెలువడినాయి .
మహా మహోపాధ్యాయ ,పద్మ విభూషణ్ లతోపాటు కవి రాజ్ డి.లిట్,.,సాహిత్య వాచస్పతి ,దేశికోత్తమ ,,సాహిత్య అకాడెమి పురస్కారం ,సాహిత్య అకాడెమి ఫెలోషిప్ అందుకున్నాడు .
12-6-1976 న కవిరాజ్ 89 వ ఏట పరమపదించాడు .కేంద్ర ప్రభుత్వం ఆయన గౌరవార్ధం ప్రత్యేక స్టాంప్ విడుదల చేసింది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -16-1-17 –ఉయ్యూరు

