మహిళా మహిమ విహంగ -గబ్బిట దుర్గా ప్రసాద్
(11-1-17 న విహంగ వార్షికోత్సవం సందర్భంగా)
సరైన వనరులు ,సాంకేతిక పరిజ్ఞానం లేని సమయం లో తెలుగులో ఒక వెబ్ మహిళా మాసపత్రికను స్థాపించి దిగ్విజయంగా ఆరేళ్ళు నడిపి విహంగ రెక్కలకు గట్టితనం చేకూర్చిన సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత గారిని మనసారా అభినoదిస్తున్నాను .పత్రిక మహిళలకు ప్రత్యేకం కనుక వారి సమస్యలు, చిక్కుముడులు, బాధ్యతలు ,సంఘంలో స్థానం ఆకాశంలో సగం అయినా దక్కని హక్కులూ వంటి వాటిని అందరి దృష్టికి తెస్తూ సరైన న్యాయం కోసం పదం కలుపుతూ కదం తొక్కిస్తూ విహంగ అందరి దృష్టినీ ఆకర్షించింది .వినోదం విజ్ఞానం ,యాత్రా సాహిత్యం లేఖలూ ,సాహిత్య వ్యాసాలూ ,పుస్తక సమీక్షలూ అన్నిటికీ సమానమైన స్థానం కల్పిస్తూ పత్రికా నిర్వహణ జరిగింది .
హేమలత గారితో నాకు పరిచయం విజయవాడలో సుమారు 5 ఏళ్ళ క్రితం జరిగింది . శ్రీ గంధం వేంకాస్వామి శర్మగారి కధా సంపుటి ‘’అమృత హస్తాలు ‘’పై శ్రీ అలిసేటి నాగరాజు పరిశోధన చేసి పుస్తకం ప్రచురి౦చి ఆవిష్కరణ జరిపినపుడు శ్రీ శర్మగారు నాకూ ఆహ్వానం పంపి తప్పక రమ్మని ఫోన్ చేస్తే వెళ్లాను .
అప్పుడు హేమలత గారు నన్ను పలకరించి నేను నడుపుతున్న సరసభారతి బ్లాగ్ బాగా ఉందని తాను రెగ్యులర్ గా చూస్తున్నానని అందులో నా ఫోటోను బట్టి గుర్తుపట్టానని చెప్పారు .తాను విహంగ అనే మహిళా వెబ్ మాసపత్రికను నిర్వహిస్తున్నానని ,వెబ్ సాహిత్యం పై పరిశోధనకూడా చేస్తున్నాని తెలియ జేసి విహంగను చూసి అభిప్రాయం చెప్పమని ,వీలైతే ఏదైనా రాస్తే మరీ సంతోషిస్తానని అన్నారు .సరే అన్నాను .20 12 ఏప్రిల్ లో అమెరికా వెళ్ళినప్పుడు ఒక వ్యాసం మెయిల్ చేశాను .బాగుందని విహంగలో వేసి ,ప్రతినెలా ఒక వ్యాసం వ్రాయమని కోరారు . సాంఘిక సేవలో తరించినవారు ,విలువైన సాహిత్యాన్ని సృష్టిoచినవారు , మహిళాహక్కులకోసం ఉద్యమాలు నిర్వహించిన వారు జాతీయోద్యమ నాయకులు ,అధికారం లో ఉన్నవారు అయిన ప్రపంచ వ్యాప్త మహిళ గురించి ప్రతినెల ఒక ఆర్టికల్ రాస్తూనే ఉన్నాను .విహంగ లో ప్రచురిస్తూనే ఉన్నారు .
వైవిధ్యానికి ప్రాధాన్యత నిస్తూ ,ఎవరి దృష్టి లోనూ పడని దాదాపు 60 మంది మహిళామతల్లుల గురించి విహంగకు రాసి ఉంటాను .అందులో కొన్ని నేను రాసి సరసభారతి తరఫున ప్రచురించిన ‘’మహిళా మాణిక్యాలు ‘’పుస్తకంలో చోటు చేసుకొన్నాయి కూడా .నేను రాసిన పుస్తకాలపై సమీక్షలూ చేయిస్తూ హేమలత గారు నా రచనలు రిసెర్చ్ వర్క్ లాగా ఉన్నాయని అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నారు..
క్రమంగా మాసపత్రిక వారపత్రిక గా మారి మరిన్ని అందాలు నింపుకొని ,అలరిస్తూ క్రమం తప్పకుండా సాహితీ విహంగం ఎగురుతూనే ఉంది.మనసులకు హాయి ,ఆనందాలను పంచుతూనే ఉంది. అందరి అభిమానాన్ని పొందుతూనే చేరువౌతూనే ఉంది. ఈ విజయ యాత్ర ఇలానే అనంతంగా కొనసాగాలని కోరుతూ నిర్వహణలో నైపుణ్యం ,వాసి , వన్నెచూపిస్తున్న శ్రీమతి హేమలత గారిని అభినందిస్తున్నాను .
– గబ్బిట దుర్గా ప్రసాద్
————————————————————————————————
—
గబ్బిట దుర్గా ప్రసాద్

