డా.శ్రీ రంగ స్వామి గారితో 22 ఏళ్ళు గా సాగుతున్న సాహితీ అనుబంధం
1994 ఫిబ్రవరి లో అఖిలభారతీయ సాహిత్య పరిషత్ సభలు మూడు రోజులపాటు రాజమండ్రి లో జరిగాయి .ఆ సంస్థ అధ్యక్షులు కదా రచయితా విమర్శక,విశ్లేషకులు నాకు పరమ ఆప్తులు కుటుంబ స్నేహితులు స్వర్గీయ ఆర్ ఎస్.కె మూర్తి గారు రమ్మని ఆహ్వానిస్తే, నేనూ మా బావమరది ఆనంద్ కలిసి వెళ్లాం .మూడు రోజులు కవితా గోస్టులు సాహిత్య ప్రసంగాలు ,చర్చలు దిశానిర్దేశాలు ,కవి సమ్మేళనాలు పెండ్లి భోజనాలకు మించిన షడ్ర సోపేత భోజనాలూ జనాలను అలరించాయి.సు.ప్రసిద్ధ కధకులు శ్రీ కప్పగంతుల మల్లికార్జున రావు గారు చాలా సమర్ధంగా నిర్వహించారు .జీవితం లోమర్చి పోలేని మహానుభవం అది .అక్కడే మొదటిసారిగా శ్రీ జానకీ జాని పరిచయం అయ్యారు .ఆ మూడు రోజులూ వారి వెంటే మేమిద్దరం తిరిగాం .వారు విశ్వనాధ కల్పవృక్షాన్ని మాకు ఆవిష్కరి౦చి చెబుతూంటే మధ్యమధ్యలో చుట్టకాలుస్తూ ఆనందిస్తుంటే మాకు సభలు పూర్తీ అయినాక అర్ధ రాత్రిదాకా జానకీ జాని తోనే కాలక్షేపం .ఆ మూడు రోజులు మాకు మూడు స్వర్ణ యుగాలు అనిపించాయి .అక్కడే ఆచార్య జి వి సుబ్రహ్మణ్యం ,మల్లంపల్లి శరభయ్య గారు ,సుప్రసన్న, సంపత్కుమారాచార్య గార్లు ,తనికెళ్ళ భరణి ,వాకాటి పాండురంగా రావు గారు మొదలైన హేమా హేమీలతో తోలిపరిచయమైంది .అప్పుడే డా టి రంగ స్వామి గారితోనూ పరిచయమైంది .
తొలి పరిచయం మలి పరిచయంగా వారు వరంగల్ లో శ్రీలేఖ సాహితీ ఆధ్వర్యం లో జరిపిన రెండు రోజుల సాహితీ కార్యక్రమానికి ఆహ్వానించగా నేను వెళ్లాను .నిండైన కార్య క్రమ రూప కల్పన చేసి విజయవంతం చేశారు .ఇక్కడ తమిళ దేశం వాడు విశ్వనాధ వేయి పడగలలో సాంఘిక విషయాలపై అనేక వ్యాసాలూ పుస్తకాలు రాసిన నట రాజన్ ?గారితో పరిచయం అయింది .స్వామిగారితో పరిచయం తర్వాత లేఖలద్వారా గట్టిపడింది .ఫోన్ల సంభాషణ సాగింది సరసభారతి స్థాపించి పుస్తకాలు ముద్రించాక మన పుస్తకాలు వారికి పంపటం ,వారివి మనకు అందజేయటం తో సాహిత్య బంధం ద్రుఢతరమైంది .ఇలా 22 ఏళ్ళుగా ఈ బంధం ,సాహితీ అనుబంధం కొనసాగుతోంది .సాహితీ లబ్ధ ప్రతిస్టులైన స్వామి ఆ రంగం లో నడక నేర్చుకొంటున్న నాతో ఈ బంధాన్ని సాగించటం వారి హృదయ వైశద్యానికి తార్కాణ. విశ్వ నాద పై సమగ్ర గ్రంధం వెలువరిస్తున్నామని ,ప్రచురణ పూర్వ విరాళం ౩౦౦ రూపాయలని ,నాకు సుమారు 20 ఏళ్ళ క్రితం జాబు రాశారాయన.విశ్వనాధపై నాకూ అమిత భక్తీ ఆసక్తీ ఉన్నా ‘’ఆ ! ఈయన పుస్తకం తెస్తాడో లేదో ఎందుకు చేతి చమురు ?’’అని డబ్బు పంపలేదు నేను .ఆయన పుస్తకం తేవటం ,అలాంటివి ఎన్నో గ్రంధాలు ప్రచురించటం జరిగింది. ఆ పుస్తకాన్ని నేను ఎక్కడా కొననూ లేదు సేకరించనూ లేదు.ఆ లోటు అలాగే మిగిలి పోయింది . ఇవాళే వారు నాకు ఆప్యాయంగా పంపిన వారి 2015 వ్యాసాల సంకలనం ‘’విష్ణు పద ‘’(గంగ )అందింది ఆబగా చదివేశాను .అందులోని ముఖ్య విషయాలు వివరించే ముందు మీకు వారి ని పరిచయం చేస్తాను .
డా.టి రంగ స్వామి
16-7-190న కరీం నగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపల్లి లో శ్రీ టి. రామానుజ స్వామి ,శ్రీమతి తాయమ్మ దంపతులకు జన్మించారు .బి కాం ,తర్వాత తెలుగు ఎం ఏ ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య వారి పర్య వేక్షణలో ‘’విశ్వనాధ వారి కృష్ణ కావ్యాలు ‘’అంశం పై పరిశోధించి పి హెచ్ డి.పట్టా పట్టారు .మధుర ,శిఖర, మానస సంచరరే ,నిరంతరం ,నీల మోహనాస్టకం,సమజ్న,లఘు కావ్యాలు ’’శర వోయె నుండి ఏక శిలకు ‘’అనే అనుసృజన వెలువరించారు .వరంగల్లు జిల్లా రచయితల వాజ్మయ జీవిత సూచిక ,కోవెల సుప్రసన్నా చార్యుల వాజ్మయ ,జీవిత సూచిక ,దేవులపల్లి రామానుజ రావు ,విశ్వనాధ వారి కృష్ణ కావ్యాలు పై పరిశోధన చేసి గ్రంధాలుగా తెచ్చారు .
విపంచి ,సాహితీ గవాక్షం ,శ్రీవ్యాసం ,సమూహ,విశ్వనాధ రామ కృష్ణ ,పొనుక, భారత సవురు మొదలైన వ్యాస సంపుటులను ,సజీవ చిత్రాలు , షుగర్ లెస్ కాఫీ ,కదా సంపుటాలు .70 పుస్తకాలకు ముందుమాటలు రాశారు .
శ్రీలేఖ సాహితీ సాహిత్య సంస్థ స్థాపించి 116 పుస్తకాలను స్వీయ సంపాదకత్వం లో 50 గ్రంధాలను ముద్రించారు .ఇంతటి సాహితీవిభవ సంపన్నునికి తగిన గౌరవ పురస్కారాలే లభించాయి .అందులో విజయనగరం విజయ భావన పురస్కారం ,పాలకుర్తి వరంగల్ సోమనాధ కళాపీఠపురస్కారం ,తేజ సాహిత్య పురస్కారం ,వానమామలై వరదాచార్య స్మారక పురస్కారం ,తెలుగు విశ్వ విద్యాలయ కీర్తి పురస్కారం వంటివి ఎన్నో అందుకున్నారు.
గోదావరి ఖని కళాజ్యోతి వారు ‘’దశాబ్ది ఉత్తమ విమర్శక ‘’బిరుదు ,ఎస్ ఇ టి ఒంగోలు వారు ‘’సాహిత్య రత్న ‘’,వరంగల్ సాహితీ సమితి ‘’నవభారత సాహిత్య రత్న ‘’చీరాల సహజ సాహితీ ‘’సాహితీ వశిష్ట ‘’,బిరుదులను ప్రదానం చేశాయి .నాలుగు శతాబ్దాల సాహిత్య కృషికి అభినందన గా ‘’సుధా వర్షి ‘’ప్రత్యేక సంచికను వెలయించారు .
సాహితీ హిమోత్తుంగ రంగ స్వామిని గారిని ఈ కొంచెం ‘’పరిచయ అద్దం ‘’మీకు చూపించాను .
విష్ణుపద
కవిత్వం రాయటం కంటే విమర్శ రాయటం గొప్ప సాహిత్య సేవ అన్నారు శ్రీ స్వామి .కవిత కవికి పేరు తెస్తే విమర్శ కవితకు పేరు తెస్తుంది అన్నారాయన .ఇందులోని 12 వ్యాసాలూ 2015 లో రాసినవే .వాటిని ఇక్కడ కూర్చారు.ఉత్తర గోదావరీపరీవాహక సాహిత్యం ,కాళోజీ గారి అన్న కాళోజీ రామేశ్వర రావు గారి గురించి ,విశ్వనాధ ‘’కేదార గౌళ ‘’లోని మాధుర్యాన్ని ,విహారి పద చిత్ర రామాయణం లోనిరామ సుగ్రీవ మైత్రి ,దాశరధి రంగా చార్య నవల ‘’రానున్నది ఏదినిజం ‘’పైనా ఒద్దిరాజు సోదరుల సాహితీ సేవ మొదలైన వాటి గురించి రాస్తూ ఆ ప్రాంతం లోని కవులను సాధ్యమైనంతవరకు స్పృశిస్తూ వారి రచనలను పేర్కొంటూ ఒక రకంగా కైమోడ్పు ఘటించారు . ప్రతి విషయాన్నీ లోతుకు వెళ్లి శోధించి నిజాలు వెల్లడించటం స్వామిగారి ప్రత్యేకత .ఆ యా ప్రాంతం లో జనం నాలుకలపై నర్తిచే సామెతలు ,ఉర్దూ మిశ్రితపదాలు వాటి అర్ధాలు వాటి వాడుక ,తెలంగాణా మాండలిక పద సౌందర్యం,జాతీయాలు ,బాసర నుండి భద్రాచలం వరకు ఉన్న ఉత్తర గోదావరీ పరీవాహక సాహిత్యం కవులు,కావ్యాలు పుణ్య క్షేత్రాలు ప్రత్యేకతలు ,తెలంగాణా అస్తిత్వ వాదం లపై సంక్షిప్తంగా సమగ్రంగా రాశారు .ఆత్మ కధలను సామాజిక ప్రతీకలుగా చూపారు .చివరగా తన ఆరాధ్య ‘’సంపత్ సార్’’గారితో సాగిన సాహితీ మైత్రిని కనులు చెమర్చేలా రాసి నివాళి అర్పించారు . ‘’విష్ణు పద’’ఈ 15 ఘాట్లనుండి ప్రవహించి పవిత్రం చేసింది .అర్ధవంత మైనముఖ చిత్రం లోపలి అంశాలకు మరింత శోభ కూర్చింది .
ఈ వ్యాస సంకలనం నిజంగా ‘’విష్ణు పద ‘’అంటే సాహితీ గంగా లహరి .ఈ పవిత్ర’’ త్రిపధ’’ సాహితీ జలాన్ని ఒడ్డునే ఉండి తీర్ధంగా పుచ్చుకొన్నా, మునిగి తనివి తీరా స్నాని౦చినా జన్మ చరితార్ధ మవుతుంది .నాకంటే 10 ఏళ్ళు చిన్నవారైన శ్రీ స్వామి మరిన్ని రచనలు చేస్తూ ,చేయిస్తూ వన్నెకెక్కుతూ శ్రీలేఖకు వన్నె తెస్తూ వెలుగు లీనాలని కోరుతున్నాను .మా ఈ సాహితీ బంధం కలకాలం కొన సాగాలని కోరుకొంటాను .
పుస్తకం ముఖ చిత్రాలను జత చేశాను చూడండి
మీ
గబ్బిట దుర్గా ప్రసాద్ -19-1-17 –ఉయ్యూరు



