గీర్వాణ కవుల కవితా గీర్వాణం -3
49-తత్వ చింతామణి ప్రతిభ కర్త –సచ్చిదానంద మిశ్ర (1971 )
1-3-1971 న ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి లోబస్తీ గ్రామం లో జన్మించిన వారణాసి సంస్కృత మహా విద్వాంసుడు సచ్చిదానంద మిశ్ర .ఆయన మాతృవిద్యాలయం సంపూర్ణానంద సంస్కృత విశ్వ విద్యాలయం .బెనారస్ హిందూ యూనివర్సిటిలో ఫిలాసఫీ, రెలిజియన్ ప్రొఫెసర్గా పని చేశాడు . .ఆయన సంస్కృత భాషా సేవను గుర్తించి ఆయనకు 2009 లో రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ ‘’మహర్షి బాదరాయణ వ్యాస పురస్కారం ‘’ప్రదానం చేశారు .సంస్కృత వ్యాకరణం భారతీయ ఫిలాసఫీలపై గొప్ప అధ్యయనం చేసి గ్రంధాలు రచించాడు .అందులో ముఖ్యమైనవి ‘’తత్వ చింతామణి ప్రతిభ ‘’,మానసోల్లాసం – మానసోల్లాస వార్ధినిఅనే ఆనంద కుమార వ్యాఖ్యతో,ఆపదేవ వ్యాఖ్యతో సదానందుని వేదాంత సార ,న్యాయ దర్శన్ మే అనుమాన ,వ్యుత్పత్తి వాద హిందీలో విపుల వ్యాఖ్యతో రచించాడు
50-సంస్కృతం –మానవ భాషా పరిణామం పై పరిశోధించిన –సంపదానందమిశ్ర (1971 ).
ఒరిస్సాకు చెంది ,పాండిచ్చేరి సంస్కృత విద్వాంసుడైన సంపదానంద మిశ్రా 17-11-1971 న జన్మించాడు .కుటుంబం సంస్కృత విద్యలో పునీతమైంది .ఉత్కల్ యూని వర్సిటి నుండి సంస్కృతం లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొంది ,పాండి చేరి యూని వర్సిటిలో డా వెంపటి కుటుంబ శాస్త్రి వద్ద సంస్కృతం లో ఎంఫిల్ చేసి ,స్వర్ణ పతకం అందుకున్నాడు .’’సంస్కృతం –మానవ భాషా పరిణామం ‘’పై ధీసిస్ రాసి ఉత్కల్ యూని వర్సిటి నుండి పి .హెచ్. డి.పొందాడు. పాండిచేరిలో అరవిందో సొసైటీ ఆధ్వర్యం లో నిర్వహింప బడుతున్న ‘’అరబిందో ఫౌండేషన్ ఫర్ ఇండియన్ కల్చర్ ‘’కు ప్రస్తుతం డైరెక్టర్ గా ఉన్నాడు .
విద్యార్ధి ,అధ్యాపక బృందాలకు సంస్కృతం మంత్రం ,యోగ ,భగవద్గీత లపై నిత్యమూ మిశ్రా వర్క్ షాపులు ,ట్రెయినింగ్ ప్రోగ్రాములు ,పునశ్చరణ తరగతులు నిర్వహిస్తూ ఉంటాడు .సంస్కృత, ఇంగ్లీష్, ఒడియా భాషలో పత్రికలకు వ్యాసాలూ కవితలు పాటలూ రాస్తూ ఉంటాడు .సంగీతం కూరుస్తాడు .అరవింద సొసైటీ నిర్వహించే 24 గంటల సంస్కృత రేడియో ప్రోగ్రాం తోపాటు ,అనేక సంస్కృత ప్రాజెక్ట్ లను సమర్ధంగా మమేకమై నిర్వహిస్తాడు .
మిశ్రా రాసినవి , సంపాదకత్వం లో వచ్చినవీ పుస్తకాలు –సాంస్క్రిట్ అండ్ ఇవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ స్పీచ్ ,ఏ బుక్ ఆఫ్ హిమ్స్ అండ్ ప్రేయర్స్,ది సెంచరి ఆఫ్ లైఫ్ ఆఫ్ శ్రీ అరబిందో విత్ ది ఒరిజినల్ వెర్సెస్ ఆఫ్ భర్త్రు హరి ,అరబిందో అండ్ సాంస్క్రిట్ ,ది వండర్ దట్ ఈజ్ సాంస్క్రిట్ ,హాస్య రంజని ,ఎ హాండ్ బుక్ ఆఫ్ సాంస్క్రిట్ ప్రోసడి.
వందేమాతరం ట్రస్ట్ కు మిశ్రా ముగ్గురు సభ్యులలో ఒకడు .500 మత,మతాతీత సంస్కృత గ్రంధాలను అనువాదాలతో సహా ప్రచురించటం ఈ సంస్థ లక్ష్యం .మూర్తి క్లాసికల్ లైబ్రరి ఆఫ్ ఇండియా కు దీటుగా ,అంతకంటే నాణ్యంగా ,సాధికారికంగా ,సాంస్కృతిక నేపధ్యం తో భారతీయ ఆత్మ ప్రతిబి౦బి౦చేట్లుసంస్కృత గ్రంధ ముద్రణ తేట సరళ అనువాదాలతో ప్రచురించటమే ‘’వందేమాతరం ట్రస్ట్ ‘’ముఖ్య ఉద్దేశ్యం అని మిశ్రా వినమ్రంగా ప్రకటించాడు .ఈ బృహత్ ప్రచురణ లో రామాయణ భాగవత భారతాలు వేదాలు ఉపనిషత్తులూ ఉండటం మనమందరం గర్వించదగిన విషయం .
2012 లో సంపదానంద మిశ్ర సంస్కృత సేవా ధర్మానికి భారత రాష్ట్ర పతి శ్రీమతి ప్రతిభా పాటిల్ నుండి ‘’మహర్షి బాదరాయణ వ్యాస పురస్కారం’’ అందుకున్నాడు .సంస్కృత వ్యాకరణ అధ్యయన, అధ్యాపనం లో మిశ్రా జీవితం చరితార్ధక మౌతోంది .
మూడవ గీర్వాణం అర్ధ శతం (50 )అయిన సందర్భంగా శుభాకాంక్షలతో
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -24-1-17- ఉయ్యూరు
.

