హాస్యపు’’ వరద ‘’
మా శ్రీ మైనేని గోపాలకృష్ణగారు (అమెరికా )నాకు ఆప్యాయంగా అబ్బూరి వరద రాజేశ్వర రావు గారి స్మృతిగ్రంధం ‘’వరద స్మృతి ని ‘’27-10-16 న పంపారు .ఆనాడే చదవటం మొదలు పెట్టాను కానీ వరుసగా చదవటం కుదరక అప్పుడప్పుడు చదువుతూ ఈ మధ్య పది రోజులు నుంచి రాత్రిళ్ళు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఈ రోజు అంటే 25-1-17 కు అంటే సుమారు మూడు నెలలకు పూర్తి చేయగలిగాను .అందులో చాలా చాలా గొప్ప విషయాలు సాహిత్యం ,జర్నలిజం ,రాజకీయం పై ఉన్నాయి .ఆ విషయాలు ఈ కాలపు చాలా మందికి తెలియదని పించింది . ఇది నా అజ్ఞానం కావచ్చు .అందుకని అందులో కొన్ని విషయాలు కొన్ని ఆర్టికల్స్ గా రాయాలని అనుకొన్నాను .అందులో మొదటి సారిగా వరదలోని హాస్య ప్రియత్వాన్ని ఆయనభార్య శ్రీమతి అబ్బూరి చాయాదేవి తెలియ జెప్పిన ,అందులోనూ ఆయన రిపబ్లిక్ డే పై చెణికిన హాస్యపు తునకతో పాటు ‘’హాస్యపు ‘’వరద ‘’గా పారిస్తున్నాను . .
1-ఢిల్లీ లో రిపబ్లిక్ డే పెరేడ్ చూడటానికి అంత చలిలోనూ జనం వేలం వెర్రిగా వెళ్లి పేవ్ మెంట్ల మీద పడిగాపులు పడుతూ చూడటాన్ని ‘’ఇది వెర్రిపబ్లిక్ డే’’అన్నాడు వరద .
2-పుస్తకాల ఆవిష్కరణ ను’’ఆవిష్కర్మ ‘’అని జోకాడు .
3-ఢిల్లీ లో వరద ఇల్లు మెయిన్ రోడ్డు పై ఉండటం తో వాహనాల రొద ఎక్కువగా ఉండేది. దాన్ని ‘’శబ్ద రత్నాకరం ‘’అన్నాడు ముద్దుగా .
4-‘’ఉదయం –సపరివార పత్రిక ‘’లో బాపు భాగవత చిత్రాలు కొన్ని వారాలపాటు వచ్చేవి .వాటిని చాయా దేవిగారు ఒక గుడ్డ మీద పొడుగ్గా వరుసగా అంటించి జాగ్రత్త చేసేవారు .చిత్రాలు ఒక దానిపై ఒకటి వచ్చేట్లు జాగ్రత్తగా మడతలు పెట్టి రిబ్బను తో కట్టేవారు .ఎవరికైనా చూపించాల్సి వచ్చినప్పుడు దాన్ని విప్పి పరిస్తే కృష్ణలీలలన్నీవరుసగా పరుచుకొని కనిపించేవి .దాన్ని వరద ‘’దేవుడి గోచి ‘’అని చమత్కరించేవాడు .
5-చాయా దేవిగారి అన్న కూతురు వారింటికి వచ్చింది .బయటనుంచి ఇంట్లో ప్రవేశిస్తున్న వరదకు ఆమె మాటలు వినిపింఛి ‘’ఇంట్లో ఏదో’’ నీసు’’ వాసన వస్తోందే ‘’అన్నాడు .ఆ ఇద్దరూ వాసన చూసి మాకేమీ వాసన అనిపించటం లేదే అన్నారు అమాయకం గా .ఆయన నవ్వుతూ ఆ పిల్లతో ‘’నువ్వు’’ నీసు ‘’(niece ) వి కదే నువ్వు వస్తే నీసు వాసన వెయ్యదూ ?అందుకే నీసు వాసన అన్నానన్నాడు .పగలబడి నవ్వుకున్నారు .
6-మేనకోడలు నృత్య ప్రదర్శన సావనీర్ ప్రచురణ ఆలస్యమైంది. ఆమె రోజూ గూటిస్తోంది ఎప్పుడేప్పుడని .విసిగిన వరద ‘’వీళ్ళు నన్ను సావనీరు బతకనీరు ‘’అన్నాడు .
7-ఏ గృహిణి అయినా చారు రుచిగా చేస్తే ‘’చారు శీల’’అవుతు౦దనేవాడు .
8-దూర దర్శన్ నేషనల్ నెట్ వర్క్ లో ‘’అప్నా ఉత్సవ్ ‘’చూస్తున్నరోజుల్లో ఎవరైనా బాత్ రూమ్ కు వెడితే ‘’అప్ నా’’ఉచ్చ’’వ్ కి వెళ్ళాడని చమత్కరించేవాడు .
9-పెళ్లి అయిన కొత్తలో జబ్బు చేసి బాగా చిక్కిపోయిన భార్య చాయాదేవిని ‘సతీ డొక్కూ బాయ్ ‘’అని హేళన చేసేవాడు
10-. తిరుపతి వెంకన్న ‘’లార్డ్ వెంకటేశ్వర ‘’కాదు ‘’లడ్డూ వెంకటేశ్వర ‘’అనేవాడు .
11-ఇంటికి నేం ప్లేట్ తయారు చేయమని ఒకాయనకు ఆర్డర్ ఇస్తే అక్షరాలను సన్నగా పొడుగ్గా ఏదో రకంగా పూర్తీ చేసి తెచ్చాడు .ఆ అక్షరాలను చూసి ‘’ఇవి మామిడి పూడి వెంకట రంగయ్య గారి ‘’లా ఉన్నాయని గురువుగారైనా సంకోచం లేకుండా అనేశాడు .
12-కలర్ ప్రింటింగ్ వచ్చిన కొత్తలో రంగులు ముట్టుకొంటే అంటుకొనేట్లు’’ గాడీ ‘’గా చవుక బారుగా ఉండేవి .దీన్ని వరద ‘’పేపర్లు ముట్టుకొంటే ‘’కలరా ‘’ అంటుకొనేట్లుంది ‘’అన్నాడు .
13-దోమలకు ‘’ఓడో-మాస్ ‘’రాసుకోమని సలహా ఇస్తే ‘’ఓ దోమాస్ ‘’అని పిలుస్తుంటే కుట్టకుండా ఉంటాయా ?’’అన్నాడు
14-మార్క్సిస్ట్ లు ‘’దాస్ కాపిటల్ ‘’నుచీటికీ మాటికీ ఉదహరిస్తుంటే ‘’వీళ్ళు ‘’కేపిటల్’’ దాసులు ‘’ అని వ్యంగ్యబాణాలు సంది౦ చేవాడు వరద .
15-ఎప్పుడూ ఎవరో ఒకర్ని తిట్టేవాడిని ‘’పద్మ దూషణ్ ‘’అనేవాడు .
16-చాయా దేవి ఒక బొమ్మగీసి ‘’ఏమండీ’’ అగ్లీ ‘’గా ఉందా ?’’అని అడిగితే ‘’ అగ్లీగా ఉన్నవాళ్ళు మాత్రం లోకం లో లేరుటే! “’అని పరోక్షంగా ఆమెనే అన్నాడు .
17 –ఎప్పటికప్పుడు కొత్త చేతి కర్రలు కొనటం వరద సరదా .’’అప్పుడే కర్ర పట్టుకోన్నారేమిటి ?’’అని ఎవరో అడిగితే’’కట్టెలే మనకు చుట్టాలు కదా ‘’అని నగ్న సత్యాన్ని నర్మ గర్భంగా అన్నారు .
18-వరద చనిపోవటానికి సుమారు నెల ముందు ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయ భాస్కర రెడ్డి వరద ను అధికార భాషా సంఘ అధ్యక్షుని చేశారు .ఒక మిత్రుడు అభినది౦చటానికి వస్తే అప్పటికే 70 వ పడిలో ఉన్న వరద ‘’ఈ వయసులో రంభనిస్తే ఏం చేసుకోను? అని చమత్కరించాడు .మరో మిత్రుడితో ఈ విషయాన్నే ‘’పాత చింతకాయ పచ్చడి జబ్బు పడ్డ వాళ్ళకే ఇస్తారు ‘’అన్నాడు .
19-తల్లి అంటే వల్లమాలిన ఆరాధన వరదకు .ఆమె ముసలితనం లో చీటికీ మాటికీ ‘’వంట్లో బాగుండలేదు డాక్టర్ని పిలవరా ‘’అని అని చెబితే ‘’పైన దేవుడు పిలుస్తుంటే మళ్ళీ ఈ డాక్ట రెందుకే బాబూ’’అంటూనే కారేసుకొని డాక్టర్ కోసం పరిగెత్తే వాడు .
20-‘’వైద్యో నారాయణో హరిః’’ అంటే –వైద్యుడు వచ్చి ‘’నారాయణా’’ అంటే ,రోగి ‘’హరీ ‘’అంటాడు అని తమాషా అర్ధం చెప్పాడు వరద .
రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-17 –ఉయ్యూరు

