గీర్వాణకవుల కవితా గీర్వాణం -3
51-మహా భారత౦పై విపుల వ్యాఖ్య రాసిన –అర్జున మిశ్ర
మహా భారతం పై తిరుగు లేని వ్యాఖ్య రాసిన అర్జున మిశ్రా 15 వ శతాబ్ది సంస్కృత మహా విద్వాంసుడు .గోవర్ధన పాథక్ కు సమకాలికుడు .బెంగాల్ లోని వరేంద్ర చంపాహేత్తియగ్రామం లో జన్మించాడు .బెంగాల్ ను గణేష్ రాజ్య వంశం పాలిస్తున్న కల్లోల పరిస్థితులలో అంటే 1450 -1500 కాలంనాటి వాడు అన్నమాట .ఆయన మహా భారతం పై 1534 లో రాసిన వ్యాఖ్యాన వ్రాతప్రతి ఇప్పటికీ ఉన్నది .మిశ్రా వ్యాఖ్యానం ను17 వ శతాబ్దం లో మహా భారతం పై మహా గొప్ప వ్యాఖ్యానం రచించిన వారణాసి మహా పండితుడైన నీలకంఠ విస్తృతంగా ఉదాహరించాడు .ఇంతకంటే అర్జున మిశ్రా వివరాలు మనకు తెలియటం లేదు .
52-మహాభారతానికి అద్వైత వ్యాఖ్యాన౦ రాసిన –నీల కంఠ చతుర్ధర
17 వ శతాబ్ది ఉత్తరార్ధం లో వారణాసి లో నివసించిన సంస్కృత మహా పండితుడు నీల కంఠ చతుర్ధర .ఈయన జీవిత విశేషాలూ మనకు దొరకకపోవటం మన దురదృష్టం .గోదావరీ తీరం పై నివసించిన మహారాష్ట్ర సంస్కృత విద్వాంసుడు ఈయన .ఇక్కడ నుంచి వారణాసి చేరి వేద వేదా౦గ ,మీమాంస ,శ్రౌత,యోగ శైవ ,తర్క ,అద్వైత వేదాంత శాస్త్రాలను గొప్ప గొప్ప విద్వాంసుల వద్ద అధ్యయనం చేసి పారమెరిగాడు .అప్పుడు వారణాసి మహా విద్వాంసుల కు నిలయంగా సరస్వతీ దేవి కొలువు కూటంగా భాసించేది..తన గురువులు లోకమాన్య ,లక్ష్మీ నారాయణ,నారాయణ తీర్ధ అని తానే చెప్పుకున్నాడు .నీలకంఠుని అద్వైత రచనలు వ్యాఖ్యానాలు మధుసూదన సరస్వతి ,నృసి౦హాశ్రమ ,అప్పయ్య దీక్షితులవంటి మహా మహోపాధ్యాయులను ప్రభావితం చేశాయి .
మహా భారతం పై ‘’భారత భావదీప ‘’అనే ఉద్గ్రంధం అనితర సాధ్యంగా ,పరమ ప్రామాణికంగా నీల కంఠ రచించాడు .అద్వైత వేదాంత భూమికగా రచించిన ఈ వ్యాఖ్యానాన్ని మించినది ఇంతవరకు లేదు అని పించు కొన్నది .ఇప్పటికీ దానినే అందరూ ఉదాహరిస్తూ సందేహాలు తీర్చుకొంటూ ,భారత ఆమ్నాయం లోని అనర్ఘ రత్న మాణిక్యాలను దర్శిస్తూ ఆ వెలుగులలో జీవితం ధన్యం చేసుకొంటున్నారు .
ఈ వ్యాఖ్యానాన్ని మొదటిసారిగా కేసరీమోహన్ గంగూలీ ఇంగ్లీష్ లోకి అనువదించి ప్రపంచ దృష్టికి తెచ్చాడు. దాని అనుభవం వర్ణనాతీతం . మహా భారతానికి మహా వ్యాఖ్యానం నీల కంఠ దీక్షితుని ‘’భారత భావ దీప౦ ‘’నిజంగానే వెలుగులు చిమ్మింది .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -27-1-17 –ఉయ్యూరు
.

