కాళిదాస శ్లోక శతపత్రం
‘’మహా కవి కాళిదాసు రఘు వంశకావ్యం లో మొదటి 9 సర్గలు పీఠిక .తరువాత 6 ప్రధానమైన రామకధ.చివరి 4 సర్గలు ఉపసంహారం ఉన్నాయి ..6 కదల రామ కధకు 9 సర్గల పీఠిక ఏమిటి అనే సందేహం వస్తుంది .దైవ విగ్రహ ప్రమాణం దేవాలయ ప్రమాణం లో యెంత ఉంటుంది ?ఇదీ అంతే.కాళిదాసమహాకవి ముందు 9 సర్గలలో వెనక 4 సర్గలలో ఒక దివ్య ధామం నిర్మించి అందులో రామ కదా రూప దైవ మూర్తిని ప్రతిష్టించారు ‘’ .అని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారు తమ ‘’కదంబ వనం ‘’పుస్తకం లో ‘’రఘు వంశ రసహేల ‘’లో వివరించారు .ఆ హేలా విలాసాన్నే నేను మీకు అందిస్తున్నాను .
షోడశ కళా పురుషోత్తముడైన పరమేశ్వరుడు శ్రీ రామునిగా అవతరించటానికి ఆ 16 లక్షణాలనూ క్రోడీకరించాడు కవి .తన కావ్యం వేదసమ్మితమని ,వైవస్వత మనువు ప్రణవ సద్రుశుడైతే ,ఆ వంశ రాజులు వేద సదృశులై తే భగవంతుడు ఆ వంశం లో ఉద్భవి౦చటానికి గొప్ప యోగ్యతకలుగుతుంది .అందుకే కవి దిలీప మహా రాజును ప్రవేశ పెడుతూ –
‘’తదన్వాయే శుద్ధి మతి ప్రసూతః శుద్ధి మత్తరః -దిలీప ఇతిరాజేందు రిన్దుః క్షీరనిధాఇవ ‘’అన్నాడు .చంద్రుడికి 16 కళలుంటాయి .అందుకే రాజును ‘’ఇందు’’ రూపమన్నాడు .ఈ షోడశ కళలు శ్రీరామునికి ముందున్న ఆ వంశ రాజు లందరికీ వర్తిస్తుంది .మరో మాట ‘’ప్రణవోపమ’’.ప్రణవం లాంటి వాడు .ఇదీ ఆ వంశం వారందరికీ వర్తించే ఉపమానమే .వివశ్వతుని కుమారుడు .వివస్వంతుడు అంటే అసమాన్యుడైన మకర కుండల కేయూర హారాలు ధరించి సరసిజాసన సన్నివిస్టుడై ,సర్వ జన ధ్యేయుడైన శ్రీమన్నారాయణ మూర్తికి తన మండలాన్ని గుడి గా చేసుకొన్నపుణ్య పురుషుడు .రఘు వంశం ఒక సూర్య మండలం అయితే దాని మధ్య శ్రీ రామ వృత్తాంతం నెలకొని ధ్యేయంగా ఉన్నది .క్షీర నిధి అనే మాటలో కల్ప వృక్షం కామ ధేనువు మొదలైన మహా పదార్ధాలు పాల సముద్ర మధనం లో ,అమృతంఉద్భ వి౦చటానికి ముందే పుట్టినట్లు , రఘు వంశం లో రాముడుద్భవి౦చ డానికి ముందే వీరు జన్మించారని సూచన . మహా గొప్ప ఉపమానాలు .దివ్యోపమలు ఇవి .’’కాళిదాసు భాషను కాని ,కధను కాని సృష్టించలేదు .ఉన్న భాషను ఉపయోగించి ,శబ్ద శక్తి తెలిసి సిద్ధమైన కధను స్నిగ్ధమైన రచనతో మనకు అందించాడు ‘’అన్నారు శలాక వారు .కాళిదాసు భారతీయత నిలువెల్లా జీర్ణించుకొన్న కవి .ప్రతి పలుకులో వేదనాదం ఉంటుంది .అర్ధ ,పురుషార్ధాలకే అధిక ప్రాధాన్య మిస్తాడు .’’దీనికి మించి అమృతాయమానమైన రస స్రోతస్సు భావుకుడిని అనుభూతిలో ముంచేస్తుంది .కాళిదాసు మూర్తీభవించిన ‘’భారతీయత ‘’అన్న శర్మ గారి పలుకులు ‘’ప్రాబలుకులే ‘’(వేద వాక్యాలే ) .
రఘు వంశ కావ్యం లో దిలీప ,రఘు ,అజ ,దశరధ కధలు మనోజ్ఞ శిల్పాభి రామాలైన ప్రాకారాలు .అందుకే అవి ధర్మార్ధ కామ మోక్ష పురుషార్ధ స్వరూప వ్యాఖ్యాన రసవత్కావ్యాలు గా నిలిచాయి .దిలీప మహా రాజుకు శాపవశాన సంతాన౦ కలుగ లేదు .దీన్ని రూపుమాపుకొని సంతాన తంతువును అందుకొని వంశాన్ని నిలబెట్టు కోవాలని భార్య సుదక్షిణ తో సహా గురువు సందర్శించాలన్న కోరికతో ముందుగా సృష్టికర్తను అభ్యర్ధించాలనుకొని గురువు ను దర్శించిఆయనలో బ్రహ్మను దర్శించాడు –
‘’తయా హీనం విదాతర్మాం కధం పశ్య న్నదూయసే –సిక్తం స్వయ మివ స్నేహా ద్వంధ్య మాశ్రమ వృక్షకం ‘’ అని ప్రార్ధించాడు .ఇందులో గురువును విధాత అని సంబోధించాడు .కనుక రాజు కోరికలో కొడుకు పుట్టాలన్న తపన జ్యోతకమైంది ఇలా చెప్పటం కావ్య పధ్ధతి అన్నారు శర్మగారు .దయాళువైన గురువు సంతానం కలగక పోవటానికి కారణం గ్రహించి దంపతులకు గోపూజ ను విధించాడు .ఆ విధి విధానాన్ని ఉపదేశించాడు-
‘’ప్రస్థితాయాంప్రతి స్టేథాః స్థితాయాం స్థితి మాచరేః-నిషణ్ణాయాం నిషీదాస్యాం పీతాంభసి పిబే రపః ‘’అని హెచ్చరికలు చెప్పాడు –గోవు నడిస్తే నడువు ,నిలబడితే నిలబడు ,కూర్చుంటే కూర్చో ,నీళ్ళు తాగితే తాగు .అన్నాడు .తు చ తప్పకుండా దిలీప సుదక్షిణ దంపతులు అలానే గో సేవ చేశారు .ఎలా చేశారో కవి చెప్పాడు –
‘’స్థితః స్థితా ముచ్చలితః ప్రయాతాం –నిషే దుషీ మాసన బంధ ధీరః –జలాభి లాషీ జలమాదదానాం-ఛాయేవతాం భూపతి రన్వ గచ్ఛత్ ‘’
గురువు ‘’నిశీధ ‘’అని చెబితే శిష్యుడు ‘’ఆసన బద్ధ ధీరుడు ‘’అయ్యాడు .ఆపః పిబే ‘’అని గురువు అంటే ‘’జలాభి లాషి ‘’అయ్యాడు .నీళ్ళు తాగాడో లేదో చెప్పలేదుకవి .అలా నిలువెల్లా నిస్టతో గోవును సేవించారు దంపతులు .చాయా అనే శబ్దానికి అర్ధం నీడ లాగా కాదని సర్వాత్మనా తనను పరిహరించుకొని గోవును అనుసరించాడని శర్మ గారు చెప్పిన అర్ధం చాలా సమంజసం గా ఉంది .
పరమ ఉదాత్త నిగ్రహం ప్రాణ వస్తువుగా ,ప్రత్యక్షర శిల్పాన్ని చేసిన వాడు కాళిదాస మహా కవి .ఆవేశం ఎక్కువై ,ఆకర్షణ అమితమై న వాడు భవ భూతి మహా కవి .గోసేవకు పరమానందం పొందిన గోవు దిలీపుని దీక్షకు మెచ్చి’’నాయనా !అని సంబోధించి వరం కోరుకో మన్నది .అప్పుడు మహాకవి మహా రాజుతో అని పించిన శ్లోకం ప్రత్యక్షర శిల్ప శోభితం –ఇదే శ్లోక శతపత్రం .
‘’తతః సమానీయ స మానితార్దీ –హస్తౌ స్వహస్తార్జిత వీర శబ్దః –వంశస్య కర్తార మనంత కీర్తిం –సుదక్షిణాయాం తనయం యయాచే ‘’
ఎంత అదుపులో మనస్సు పెట్టుకొని దిలీపమహా రాజు గోవును అర్ధించాడో తెలియ జెప్పే మహా వాక్య ప్రమాణమైన శ్లోకం ఇది –మహా రాజు ‘’మానితార్ది ‘’అంటే ఎవరు యాచి౦చ టానికి వచ్చినా కోర్కెలు తీర్చే కల్ప వృక్షం వంటి వదాన్య వరేణ్యుడు.తాను అడిగేది కామ దేనువుకు ప్రతిరూపమైన నందిని ధేనువును .ఏ మాత్రం వివేకం కోల్పోయి అడిగిన వరం శాపం కావచ్చు .జీవితం లో ఎప్పుడూ ఇవ్వటమే కాని పుచ్చుకొన్నవాడు కాదు .అందుకే కవి ‘’హస్తౌ సమానీయ ‘’అన్నాడు .ఆ చేతులతో ఎన్నో యుద్ధాలు చేసి వీరుడు అని పించుకొన్నాడు ఇప్పుడు ఆచేతులు యాచకుని చేతులులా ఉన్నా వాటిలో దాన ,యుద్ధ వీరాలున్నాయి .అంటే దానం తీసుకోవటానికి తగిన అన్ని యోగ్యతలు అర్హతలు ఉన్నాయని అర్ధం .మరి రాజు అడిగింది దేనిని ?తనయుడిని అంటే తన తనువునుండి పుట్టేవాడినే ఇవ్వమని అర్ధం .మరి ఆకొడుకు ఎలా ఉండాలి ?’’వంశస్య కర్తారం ‘’గా ఉండాలి వంశాన్ని వృద్ధి చేసేవాడుగా వర్ధిల్లాలి .మరి వాడి లక్షణాలు ఎలా ఉండాలి?’’అనంత కీర్తిం ‘’అనంతమైన కీర్తి ప్రతిష్టలు కలవాడై ఉండాలి .ఇక్కడ అనంత శబ్దం సాభిప్రాయంగా కవి ప్రయోగించాడని ,అనంత అంటే ఆదిశేషుని లాగా అలసట లేకుండా అనంతకాలం భూ భారం మోసే సమర్ధత కలవాడుగా ఉండాలన్న అర్ధమూ ఉందని శర్మగారి వ్యాఖ్యానానికి జేజేలు .అంతాబాగానే ఉంది –తనకే సమర్ధుడైన కొడుకే ఇవ్వమని కోరాడు .ఆ కొడుకు ధర్మ పత్ని సుదక్షిణాదేవి సుక్తి ముక్తాఫలమై ఉండాలని ఒక ఝలక్ ఇచ్చాడు. అందుకే రాజు నోట ‘’సుదక్షిణాయాం ‘’అనే సాభిప్రాయమైన మాట వచ్చింది .రాజు పొందిన శాపం సుదక్షిణ కూ తగిలింది .కనుక శాప విముక్తి ఇద్దరికీ కలగాలి .ఇంత పకడ్బందీ గా కాళిదాస మహా కవి ఈ శ్లోకం రాసి దిలీప మహా రాజుతో అనిపించి సఫల మనో రధుడిని చేశాడు .
ఇందులో దిలీప సుదక్షిణా దంపతుల సంతానాభి లాష ,వ్రత దీక్ష ,గో రక్షణ కై ప్రాణ త్యాగానికైనా వెను దీయని ధర్మా భిరతి ,ఫలాభి సంధి కి తొణకనితనం ,గర్భ రక్షణ లో చూపిన శ్రద్ధ ,పుత్రుడికి సంస్కారాలు చేయటం లో చూపించిన నైపుణ్యం ,సరైన సమయం లో కుమారుడు రఘువుకు రాజ్య భారం అప్పగించటం ,వార్ధక్యం లో ముని వ్రుత్తి చేబట్టటం మొదలైన అంశాలను కాళిదాసు మహా ధార్మిక విధానం లో తీర్చి దిద్దాడని అందుకే ఇది ‘’ధర్మ పురుషార్ధ పరి పాక స్పోరక గాథ’’గా చిరస్మరణీయ మైనదని ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మ గారు ప్రవచించారు .ఇలాంటి వ్యాఖ్యాన శిరోమణుల వలననే మహా కవుల కవితా శిల్పం అర్ధం చేసుకో గలం.ఈ జాతికి వారు ధర్మ భిక్ష అందజేసిన పుణ్యమూర్తులు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-17 -కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్
.
—

