భక్త రామదాసు జన్మ దినాన గ్రంధ భక్త రామప్ప సంస్మరణ
శ్రీ నారా రామప్ప వాజ్మయ తపస్వి అన్నారు శ్రీ శలాక రఘునాధ శర్మగారు .విశ్వనాధ వారి వేయి పడగలు నవల ఒక్క రాత్రిలో ఏక బిగిన చదివి పూర్తి చేసిన పఠన దాహం కల వ్యక్తీ .మీసర గండ నారాయణ రాజు అనే గురువు అనుగ్రహం తో భారత ,భాగవత రామాయణాలు ,మను ,వసు చరిత్ర కావ్యాల సారాన్ని అంతటినీ ఒంట పట్టించుకోన్నాడు .వయసు పైన పడినకొద్దీ యెంత గొప్ప పండితుడు ఎదురైనా తోడ గొట్టి సవాల్ చేసే ధీమా ఏర్పడేట్లుశిష్యుడు రామప్పను గురువు నారాయణ రాజు తీర్చి దిద్దాడు .దీనికి తోడూ అల్లు నారాయణప్పగురుత్వమూ అబ్బి రామప్ప సాహిత్య వ్యవసాయం మంచి ఫలసాయాన్నిచ్చింది .ఆంద్ర వాజ్మయం లో ఆయన చదవని గ్రంధం లేదు. అంతటి గ్రంధ భక్తుడు రామప్ప .
ఏ కావ్య ప్రస్తావన వచ్చినా అందులోని రసవత్తర పద్యాలు రామప్ప నాలుకపై నాట్యం చేస్తాయి .ఈ సాహిత్య పిపాస ఆయనకొక వ్యసనం గా మారి పోయింది .గొడ్లను కాయటానికి వెడుతున్నా, బస్ కోసం రోడ్డుమీద ఎదురు చూస్తున్నా చేతిలో గ్రంధం ఉండాల్సి౦దే.పొలం గట్ల మీద యే మార్కండేయ పురాణమో పరవశించి చదువుకొంటూ ఉంటే కాళ్ళమీద మహా సర్పాలు పాకుతూ పోయినా గుర్తించలేని రస తుందిల హృదయం రామప్పది అంటారు శలాక వారు . మహా విద్వాంసులు కూడా తొంగి చూడటానికి సాహసించని తిక్కన భారతం శాంతి ,ఆనుశాసనిక పర్వాల పద్యాలను ఆయనను కలలో లేపి అడిగినా చెప్పగల సత్తా ఉన్న మనిషి .వాటిలోని భావ పుస్టికీ ,శబ్ద సౌస్టవానికీ,కూర్పు ,నేర్పులకు అనుక్షణం ఆనంద తాండవం చేస్తుంది రామప్ప హృదయం .
1996 లో రామప్ప 85 వ ఏట కూడా ఉత్తమ కవిత్వం ఎక్కడ వాసన కొట్టినా పరుగెత్తుకొని పోయి ఆస్వాదించే పసితనం ఆయనది .తెలుగు వ్యాఖ్యానాల సహాయం తో ఆయన సంస్కృత మహా కావ్యాలను ,రామాయణ భారత భాగవతాలను నిరంతరం అధ్యయనం చేశాడు .వాటిలోని కొత్తదనాన్ని యిట్టె పట్టేసే నేర్పు ఆయనది .దాన్ని సహచరులతో పంచుకొని పరవశిస్తాడు .ఇవి కాక ఆంగ్ల సాహిత్యం అంద చందాలు చవి చూడాలన్న ఆరాటమూ పెరిగింది రామప్పకు .వేదాంత సౌరభాన్ని తనివి తీరా తనవి చేసుకోవాలన్న తపన ఉన్నవాడు .ఒక్క చదవటం తోనే రామప్ప ఆగి పోలేదు .పల్లె టూరు కనుక సంప్రదాయం గా పురాణ ప్రవచనం అక్కడ ఒక భాగం .ఒక పాఠకుడు పరిస్తూ ఉంటే ,మరో ప్రవక్త అందులోని రహస్యాలను విప్పి చెప్పి ఆనంద పరుస్తాడు .అలానే రామప్ప పురాణ ప్రవచనమూ చేశాడు .దానికి ప్రతిఫలం గా ఆయన ఏమీ ఆశించలేదు తన కర్తవ్యంగా భావించి చేసిన ధర్మ యజ్ఞం ఆది.
నారా రామప్ప తలిదండ్రులు పెద్ద రామప్ప ,సుబ్బమ్మలు .అనంత పురం జిల్లాలో మన్నీలకు ఒక విశిష్టత ను చేకూర్చిన వాడు నారా రామప్ప .కులమతాలకు తావు లేకుండా మంచి విద్యార్ధులను స్వార్ధ రహితంగా తీర్చి దిద్దిన ఉత్సాహ శీలి రామప్ప .ఆయన శరీరానికే తప్ప మనసుకు వార్ధక్యం లేదు .రామప్ప ప్రతిభ యెంత గొప్పది అంటే గంటకు 300 పద్యాలను అర్ధ స్పూర్తి చెడకుండా గొంతెత్తి చదవగల సామర్ధ్యం 85 ఏళ్ళ వయసులోనూ ఉన్నవాడు రామప్ప .మరో గొప్ప విషయం –ఆ వయసులోనూ పుస్తకాలు చదవటానికి ఆయనకు కళ్ళజోడు అక్కర లేదు .అపురూపమైన పద్యాలు ఎక్కడ దొరికినా అవి ఎన్ని వేలు అయినా ఎత్తి రాసుకొని భద్ర పరచుకొంటాడు రామప్ప .అయన గ్రంధాలయం లో స్వదస్తూరి తో రాసుకొన్న పుస్తకాలు అనేకం ఉన్నాయి .
రామప్ప ఎందరెందరికో అక్షర భిక్ష పెట్టాడు .ఎనిమిదేళ్ళ వయసున్న రామప్ప మనుమరాలు మహా ప్రబంధాలను అర్ధ స్పోరకం గా చక్కని పదబంధాలు చెడకుండా చదువుతుంది .సుమారు 70 ఏళ్ళ వయసున్న కొండప్ప భాగవత పద్యాలను కమ్మని కంఠంతో స్కాలిత్యం రాకుండా గానం చేసి శ్రోతలను అలరిస్తాడు .మూడక్షరాల పదాన్ని కూడా తప్పు లేకుండా చదవ లేని ఒక హరిజన బాలుడు ఆముక్త మాల్యద లోని ‘’ఖనటత్పయోబ్ద వీక్ష్య రసాతలా న్యోన్య సంపీడితాంగ భీతా౦డజములు’’ వంటి సుదీర్ఘ పరుషాక్షర బహుళ సమాసాలను గ్రంధ సాహాయ్యం లేకుండా ఒప్ప జెప్ప గలడు.చల్లా కాటయ్యవంటి ఇలాంటి శిష్యుల నెందరి నో రామప్ప తీర్చి దిద్దాడు .కూలీ నాలీ చేసుకొనే ఎందరో హరిజనులు భారత ,భాగవత,రామాయణాది గ్రంధాలను యే మాత్రం పొరపాటు రాకుండా ,పండితులకు ఆహ్లాదం కలిగించే విధంగా పఠనం చేస్తారు .ఇదంతా రామప్ప ప్రభావమే .’’మేం రామప్ప గురువు శిష్యులం ‘’అని వీరాంతా గర్వం గా చెప్పుకొని ఆ గురువుకు గౌరవం కలిగిస్తారు .
ఇవన్నీ చూస్తుంటే రామప్ప ఒక ‘’సజీవ గ్రంధాలయం ‘’ తెలుగు సరస్వతి ముద్దు బిడ్డ’’అన్నారు శర్మగారు .ఆర్భాటం ప్రచారం పై ఆసక్తి లేని నిస్సంగా వాణీ సమార్చకుడు .పొద్దున్న ఇంత ‘’రాగి సంకటి’’ తింటే ఇక ఆరోజంతా రామప్పకు భోజనం తో పనేలేదు .ఆయనకు సాహిత్యాధ్యయనమే సర్వ సంపద .’’ఇలాంటి విద్యా తపస్విని చూసి తెలుగుతల్లి వెలుగు వెల్లువ నిరంతరం నింపు కొంటూ ఉంటుందని మా బోటి వారల నిండు నమ్మకం ‘’అన్నారు శ్రీ శలాక శర్మ గారు .శర్మగారికంటే రామప్ప వయసులో 30 ఏళ్ళు పెద్ద వాడు .అయినా తానంటే ఆయనకు మహా గౌరవం అన్నారు శర్మగారు .ఒకరి నొకరు చూసుకోకుండా వారం రోజులు కూడా ఉండగలిగే వారు కాదట .శర్మ గారింటి ఇల్లాలు ,పిల్లలు రామప్ప వస్తే ‘’అదిగో మన్నీల తాత వచ్చాడు ‘’అని సంబర పడేవారట .వీరిద్దరూ ఎప్పుడు కలిసినా కనీసం వంద పద్యాలైనా స్మృతి పధం లో మేదిలేవి అంటారు శర్మగారు .
శర్మగారు బెజవాడ, బందరు, తిరుపతి, బెంగుళూరుమొదలైన చోట్ల జరిగే సాహిత్య కార్యక్రమాలకు వెళ్ళే టప్పుడు రామప్ప ను వెంట తీసుకు వెళ్ళేవారు .ఎందరో మహానుభావులు శర్మగారి వలన రామప్ప వైభవాన్ని తెలుసుకొని హృదయం లో భద్రంగా నిలుపు కొన్నారు .ఒక సారి రామప్ప శర్మగారితో ‘’స్వామీ !నాది ఒక కోరిక .మీ ఇంటి ముందు వరండాలో మీ పటం ఒకటి పెట్టించండి .ఎందుకంటె నేను ఎన్నో సార్లు మీ ఇంటికి వస్తూంటాను .మీరు ఇంట్లో లేకపోయినా అమ్మాయీ ,పిల్లలు నన్ను ఎంతో ఆదరం గా పలకరించి కాఫీ ఇస్తారు .అవి నాకు ఆనందాన్ని ఇచ్చినా ,నాకు కావలసింది అవి కాదు కదా .మీ పటాన్ని చూసి నమస్కారం పెట్టి ,మీతో ప్రసంగం చేసిన అనుభూతి పొందుతాను ‘’అని ఆనందంగా చెప్పుకొన్న వీరాభిమాని రామప్ప .’’రఘునాదు’’నికి’’ రామప్ప’’ రామ భక్త హనుమాన్ .
ఒక సారి తిరుపతిలో డా మేడసాని మోహన్ సహస్రావదానానికి శర్మగారు రామప్పను వెంట తీసుకు వెళ్ళారు .అక్కడ ఎందరెందరో మహా కవి పండితులకు రామప్పను పరిచయం చేసి ‘’ఈయన ఎప్పుడూ నా వేంటనే ఉంటాడు ‘’అన్నారు శర్మగారు .వెంటనే రామప్ప ‘’అవునవును ,ధర్మ రాజు వెంట కుక్క లాగా ‘’అన్నాడు.రామప్ప .శర్మగారు ఒక్కసారిగా అవాక్కయ్యారు .వెంటనే వారి మనసులో ఒక భావనా తరంగం కదిలి –మనసులోనే ‘’నా ధర్మరాజుతనం నిజమైనా కాక పోయినా ,ఆయన కుక్కతనం లో ధర్మ స్వరూపం పరమ సత్య మైనది ‘’అను కొన్నారట .అదీ శర్మ గారి సంస్కారం ‘ సాహిత్యమే అధ్యయన అధ్యాపన సర్వస్వం గా జీవించిన మనీషి శ్రీ నారా రామప్ప 90 సంవత్సరాల వయసులో 7-2-2,000 రధ సప్తమి పుణ్య దినాన జీవన రధ యాత్ర చాలించారు .ఆయన చేసిన అనంత సాహిత్య తపస్సు ఆయనకు అక్షయ పుణ్య లోకాలను ప్రసాదిస్తుంది ‘’అని ఆకాంక్షించారు శర్మగారు .
ఆధారం –ప్రాచార్య శ్రీ శలాక రఘునాధ శర్మగారి ‘’కదంబ వనం ‘’లో ‘’వాజ్మయ తపస్వి రామయ్య ‘’వ్యాసం
భక్త రామదాసు జన్మ దిన శుభాకాంక్షలతో
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -31-1-17 –కాంప్-మల్లాపూర్ –హైదరాబాద్
.

