స.సు .మ.(కాసేపు నవ్వు కోవటానికే అని మర్చి పోరుగా!)

స.సు .మ.(కాసేపు నవ్వు కోవటానికే అని మర్చి పోరుగా!)

ఏమీ తోచక టి వి పెట్టి సిటీ వార్తలేవైనా చూద్దామను కొని రిమోట్ నొక్కా .స.సు. మ .అని ఒక చానల్ ప్రత్యక్షమైంది .ఇదేదో కొత్తగా ఉందే ఇంతవరకూ ఎప్పుడూ విన ,కన లేదే అనుకొంటూ నొక్కా .ఒక లావుపాటి గుంత పొంగనం లాంటి వాడు పళ్ళికిలిస్తూ అరుస్తున్నాడు ఎవరికోసమో,ఎందుకో తెలీదుకాని ,అవతలి వైపునుండి వెంటనే సమాధానం రాలేదు మనిషీ కనిపించలేదు .వీడు ఇక్కడ గీ పెడుతూనే ఉన్నాడు .కాని నో రిప్లై .కాసేపు గింజు కున్నాక బుజం మీద కెమేరాతో ఒక కల్పనా రాయ్ లాంటి శాల్తీ కనిపించింది .కుర్చీలో వాడు తల ముందున్న బల్లకేసి బాదుకుంటూ ‘’అరగ౦టయింది చానల్ తెరిచి కూర్చుని .ఒక్క న్యూస్ ఐటం కూడా నీ నుంచి రాలేదు .ఎక్కడున్నావ్ మబ్బూ ‘ అని గాండ్రిం చాడు .ఇకిలి వెకిలి నవ్వు నవ్వుతూ ఆ భామ ‘’సుబ్బూ !న్యూస్ కవరేజ్ కని బయల్దేర బోతుంటే ఎవరో ఫోన్ చేసి’’ బంజారాహిల్స్ లో  అద్భుతం ఒకటి ఉంది అర్జెంట్ గా వచ్చి కవర్ చేయండి ‘’అన్నాడు  .ఇక ఆగలేక ఆగమేఘాలమీద వచ్చి వాలేశాను .జనం పిచ్చగా గుమి గూడారు .వాళ్ళని తప్పించుకు వెళ్ళటానికే పావు గంట పట్టింది ‘’అంటూ కార్చిన  చెమట కర్చీఫ్ తో  తుడుచు కొంది.’’ఈ  సిటీ ఓళ్లకు పనీ పాటాలేదు. పిల్లి సమర్తాడింది అంటే చాలు  వాలిపోతారు ‘’అని’’ఇంతకీ అక్కడి విశేషమేంటి మబ్బూ ‘’అన్నాడు . డబ్బాలో రాళ్ళేసి మోగించినట్లు రాయ్  ‘’సుబ్బూ !నీకు సిక్స్త్ సెన్స్ ఉందేమో ?ఎలా పసికట్టేశావ్ ‘’అంది సిగ్గులు చిందిస్తూ .’’సిక్స్త్ సెన్సా వంకాయా ఊరికే అన్నా ‘’అన్నాడు పళ్ళు మరింత ఇకిలిస్తూ .’’అబ్బ సుబ్బూ !నే చెప్పలేను బాబూ సిగ్గేస్తోంది ‘’అంది ఒంకర్లు పోతూ జంబ లకిడి పంబ లో స్కూల్ లో విద్యార్ధినిగా ఉన్న కల్పనా రాయ్ ఉప్పు కప్పురంబు పద్యం మేష్టారుబాబూ మోహన్ కు అప్ప జెబుతూ చెబుతూ ‘’పురు –అబ్బ సిగ్గేస్తోంది బాబూ పురుషు –అయ్యో నే చెప్పలేను మాస్టారండీ  అని చివరికి పురుషులందు ‘’అనటానికి అరగంట పట్టినట్లు అభినయించింది ఇక్కడ మబ్బు . ‘’ఓసి నీ సిగ్గు చిమడా కవరేజ్ గాళ్ళకు సిగ్గూ ఎగ్గూ ఏంటి ?అసలు సంగతేడు’’అన్నాడు మండిపోతూ .’’సుబ్బూ సుబ్బూ ఇక్కడొక పిల్లి పిల్ల స—‘’అబ్బా నవ్వుస్తోంది నే చెప్పలేను బాబూ ‘’అంది మళ్ళీ .’’ఆహే పిల్లికేమైందో చెప్పి చావక  ఆ కులుకు లేంటి  ?’’సుబ్బుగోల .’’మరేమో మరేమోనే  మరి మరి పిల్లిపిల్ల నువ్వూహించినట్లే సమ –‘’అబ్బా నాకు బోల్డు సిగ్గేస్తోంది బాబూ ‘’అంది మళ్ళీ .’’చానల్ కట్టేసి వస్తావా ,అసలు విషయం చెబుతావా ఇప్పటికే స్టూడియోకి వందలాదిఫోన్లోచ్చి గగ్గోలుగా ఉంది ..టెన్షన్ తట్టుకోలేక వాళ్ళు ,ఊపిరాడక నేనూ ఉన్నాం’’ అన్నాడు మరీ కోపంగా .’’సుబ్బూ ! ఇక్కడ ఒక పిల్లి పిల్ల నిజంగానే సమర్తాడింది అబ్బ బాబోయ్ ఇక నే చెప్పలేను బాబూ నాకు బోల్డు సిగ్గు ‘’అంది మెలికలు ,మెలికలు తిరుగుతూ ,

సుబ్బు ‘’సరే మా౦చి హాట్ హాట్ న్యూస్ మబ్బూ .థాంక్యూ వెరీమచ్ .కొత్త చానల్ కు సరి కొత్త న్యూస్ ఐటం .ఇంతకీ ఆ పిల్ల సారీ పిల్లి పిల్ల పేరేంటి  ఎన్నేళ్ళు ,వయసు వచ్చాకనే అయిందా ? ప్రిమెచూరా? ఎవరిదాపిల్ల  ‘’?అడిగాడు  ‘’సుబ్బూ !అది ఊరపిల్లి .దాన్ని చూస్తే వయసు వచ్చాకే అయినట్లు అనిపించింది .పేరు ఎవరడిగినా ఎవరూ చెప్పటం లేదు సుబ్బూ !దాన్ని అడుగుదామంటే తొలి సమర్త కదా  మరీ సిగ్గు పడుతుందేమోనని పిస్తోంది ’’అంది మబ్బు .’’సరే మబ్బూ !దానికి రక్షణ కలిపించారా ?తాటాకులు కాని తాటాకు చాపలు కాని ప్రొవైడ్ చేశారా?’’సుబ్బు సూటి ప్రశ్న .’’అలాంటి వేమీ చేసినట్లు కనిపించటం  లేదు సుబ్బూ .జీవకారుణ్యం వాళ్లకు ఫోన్ చేయనా ,లేక మన స్టూడియో ఏదైనా ఫండ్ ప్రొవైడ్ చేస్తుందంటే నేనే అవి కొనిపించి ఏర్పాటు చేసి బిల్లు సబ్మిట్ చేస్తా ‘’అంది మబ్బు .’’ చానల్ అంటే మన డబ్బు ఖర్చు పెట్టేది కాదని నీ కింకా తెలీదనుకొంటా .మంది ని బాదుకొని పబ్బం గడపాలి .ఇక్కడిచ్చే జీతం ఎంత ?దీనికి తోడూ చేతి చమురు కూడానా ‘’అన్నాడు సుబ్బు .’’జీవకారుణ్యం వాళ్ళ సంగతి ?’’ప్రశ్నించింది మబ్బు .’’అమలా నాగార్జున్ వింటే డామేజ్ సూటేస్తుంది .ఒళ్ళు జాగ్రత్త ‘’అన్నాడు హెచ్చరి౦పుగా .

‘’అక్కడ జనాలకు మైక్ ఇవ్వు నేను కొన్ని  ప్రశ్నలడుగుతాను’’ ‘’అనగానే ఇచ్చింది .ఒక కాలేజి పిల్లాడు పాంట్  జుట్టూ సర్దుకొంటూ ముందుకొచ్చాడు –‘’హలో సార్ !ఈ ఇన్సిడెంట్ పై మీ స్పందన ఏంటి?’’అడిగాడు సుబ్బు .’’సార్.ఇది చాలా పెక్యూలియర్ సార్  .నేనెప్పుడూ ఇలా ప్రత్యక్షంగా చూడలేదు సార్.మీ చానల్ గ్రేట్ సార్.పాపం వాటికీ మనసుంటుందని గ్రహించి గొప్ప కవరేజ్ ఇచ్చి సబ్బూ చానల్ ను ఎలివేట్ చేశారు సూపర్ సార్ ‘’అన్నాడు .మరో’’ బామ్మ’’ లాంటి అంటే బాపూ బొమ్మ లాంటి అమ్మాయికి మైకిచ్చింది మబ్బు ‘’అమ్మా మీరేమనుకొంటున్నారు ?’’అన్న సుబ్బు ప్రశ్నకు బా–మ్మ ముసి ముసి నవ్వులు నవ్వుతూ ‘’ఆకాశం లో సగమైన ఆడవాళ్లకే రక్షణ ,కవరేజ్ లేని ఈ కాలం లో మీ సబ్బూ చానల్ ,నోరు లేని మూగజీవాల రుతుధర్మాన్ని కూడా బహిరంగం గా చిత్రించి భలే మేలు చేశార్ సార్.ఈ సారి న్యూస్ ఐటం అవార్డ్ మీకే గారంటీ సార్ ‘’అంది .రెచ్చి పోయిన ఆనందం లో సుబ్బూ మబ్బూ లు గిలగిలలాడిపోయారు .’’మబ్బూ !ఫైనల్ గా మైక్ పెద్దావిడ ఆ బామ్మ గారికివ్వు ‘’అన్నాడు .ఇకిలి౦పులు సకిలింపు లతో మబ్బు బామ్మగారికి మైక్ ఇచ్చి ఆవిడ ఏం చెబుతుందో విని మైకం లో ఊగి పోవాలను కొన్నది .’’అమ్మా బామ్మ గారూ !ఈ న్యూస్ ఐటం మీకు బాగా నచ్చినట్లు మీ మొహమే చెబుతోంది నిస్సంకోచంగా మొహమాట పడకుండా  స్పందించండమ్మా మీ పేరు చెప్పుకుంటాం ‘’అన్నాడు సుబ్బు  . మైకందుకొన్న బామ్మగారు ‘’మహా సంతోషంగా ఉంది నాయనా నా జన్మ తరించింది  .చానళ్ళ పరమ ప్రయోజనం ఏమిటో ఇప్పుడే నాకు తెలిసింది .పూర్వం పని లేని మంగలి పిల్లి తల గొరిగాడు అని మా బామ్మ సామెత చెబితే అప్పుడు అర్ధమై చావలా నాకు .ఇప్పుడు పూర్తిగా అర్ధమైంది .ఆహా సబ్బూ సుబ్బూ మబ్బూ కలిసి జనాన్ని మబ్బులో పెట్టి చెత్త వార్తల సబ్బు రాసి గబ్బు పట్టిస్తున్నారు .పవిత్రమైన చానళ్ళను భ్రస్టు పట్టించి  అపవిత్రం చేసి పబ్బం గడుపుకొంటున్నారు .రెండు నిమిషాల టైమిస్తా .దుకాణం బంద్ చేసిపారి పోయారా సరి, లేకుంటే నేనే ఏదో ఒక చానల్లోమిమ్మల్ని దూదేకి నట్లు ఏకిపారేసి, చాకి రేవులో ఉతికి నట్లు ఉతికేసి  ఎండగడతా ‘’అని బామ్మగారు మైక్ కట్ చేయటం , మబ్బు మైకందుకొని పారిపోవటం, నా ఎదురుగా ఉన్న స.సు. మ.చానల్  అంటే సబ్బు సుబ్బూ మబ్బూ చానెల్ అదృశ్యమవ్వటం ఒక్క సారిగా జరిగి పోయాయి ..

వసంత పంచమి శుభాకాంక్షలతో

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -1-2-17-

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.