వరద లో తేలి (రి)న తేట ఊట -6
31-కృష్ణశాస్త్రి -’’నా కఠినపాద శిలల కింద బడి నలిగి -పోయే నెన్నియో మల్లెపూలు మున్ను ‘’
ప్రాణ సఖుడె నాకోసమే పంపినాడు -పల్లకీ అన హృదయమ్ము జల్లుమనును .’’
ఆకాలం కవులందర్నీ ఇంటిపేరుతో పిలిస్తే శాస్త్రిగారినోక్కరినే కృష్ణ శాస్త్రి అని పిలిచేవారు దీనికి కారణం ఏమిటని ఆయన్నే వరద అడిగితె ‘’వాళ్ళు అంటే వాళ్ళ కవిత్వమే గుర్తుకు వస్తుంది కృష్ణ శాస్త్రి అంటే కవిత్వం తోపాటు నా వేషం కూడా గుర్తుకు వస్తుందని కుంటా ‘’అన్నారు .
అబ్బూరి ,చలం ,కృష్ణ శాస్త్రి ముగ్గురే ప్రతిభావంతులైన హాస్యప్రియులు అన్నాడు వరద ..చలం మాట్లాడుతుంటే నవ్వలేక ఆకలేసి అరటి పళ్ళు ఆరగా ఆరగా తినేవాడట పోలేపెద్ది సుబ్బారావు ..చలం శాస్త్రిగారు కూచుని మాట్లాడితే ఆకాశమే నవ్వేది అన్నాడు వరద .సమయస్ఫూర్తితో హాస్య ప్రసక్తి చేయగల నేర్పు శాస్త్రిగారిది . తెలుగు జాతికి హాస్య స్ఫూర్తి తక్కువ అని అబ్బూరి కృష్ణశాస్త్రి భావించేవారు . ఈ హాస్య త్రయం ఆంద్ర దేశానికి బయటే మరణించటం యాదృచ్చికం ‘శాస్త్రిగారు పద్యం చదువుతుంటే ఒక విచిత్రానుభూతికి లోనవుతాం .అయన పద్య పఠనం రికార్డ్ కాకపోవటం దురదృష్టం .
అశ్లీలాల తోకూడా హాస్యం గా పద్యాలు రాశారు .
శ్రీ తిరుపతి గారిపై –
‘’ముదియొకడు బాహుమూలల్లో మరోరెండు -దాడి యొకడు ,తమిళనాడొకండు -వెరసి పంచ శిఖలు తిరుపతి యోగికి -విశ్వ దాభిరామ వినుర వేమ’’అని సరదా పద్యం చెప్పారు .
శాస్త్రిగారి ప్రముఖ పద్యం -’’నాకనుల క్రాగు చీకట్లు ప్రాకు చోట -లేదు నెత్తావి ,మధువేని లేదు ,లేదు -ప్రాణ ,మొక్క లావణ్యమ్ము లేదు -యేను రుజనైతి ,జర నైతి ,మృత్యువైతి ‘’ఈ పద్యానికి ప్రతిరూపంగా స్టీఫాన్ జ్వీ గ్ రాసిన ‘’ఏ లెటర్ ఫ్రేమ్ ఆన్ నోన్ ఉమన్ ‘’ లో ఉత్తరం రాసిన ఆ స్త్రీ ని తలచుకొంటే శాస్త్రిగారి పై పద్యం గుర్తుకు వస్తుందని వరద తో పాటు శాస్త్రిగారూ అన్నారు .
వరద జైలులో ‘’చెరకాలం ‘’రాస్తూ శాస్త్రిగారిపై -’’ఆశలే చివురించని శైశవాన -మీ కవిత్వాన్ని నేనెంత మెచ్చుకొంటి -ఊర్వశీ ప్రవాసమ్మున పూర్వ గతిని -కంఠ పాఠ మ్మొనర్చిన గాథ కలదు ‘’అని రాశాడు
‘’మీ శిరోజాలు రోజాల రాశివో లె -మ్మారిపోయిన ప్రాయాన మంచి మంచి -పాట లెన్నేని వ్రాసిరి నేటి దనుక -మరల నా యభిమానమ్ము తిరిగి వచ్చే .’’
‘’నేడు చెరసాల మృత్యు సాన్నిధ్యమందు -నా కొరకు నా విచిత్ర దైన్యమ్ము జూచి -చెమ్మగిలు నయనమ్మేని చెంత లేదు -ఏ లకో నా యెడంద మీ మ్రోల వ్రాలి పోవు ‘’వీటిని శాస్త్రిగారికి పంపాడు ఆయన మళ్ళీ పద్యాలు రాసిపంపారు ..అందులో ఒకటి –
‘’కారు మబ్బు వానకారు ,వాగులు పొంగి -నిండినదులు వరద నింగి కెగసె -వానలోన నీవు ,వాన కావల నేను -అంతే బతుకు ,చివరికంతె ,అంతే ‘’
32-మాధవ పెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి -పద్యం చదవటం లో చెళ్ళపిళ్ళ ,విశ్వనాధ వేలూరి ని మించిన ప్రఙ్ఞకలవాడు .ఆయన శైలి అనితర సాధ్యం .హాస్య చతురోక్తులలో అందెవేసిన చెయ్యి ..వెంకట శాస్త్రిగారి శిష్యులలో సంగీత నిష్ణాతులు బుచ్చి .. కవిత్వం వలన తెలుగునాట బతకటం కల్ల అని నమ్మాడు ..తెనాలి అంటే పంచప్రాణాలు వదిలి ఉండేవాడుకాదు.’’స్వర్గం ఎలా ఉంటుందో తెలియదుకనుక దానికి వెళ్ళను .నరకం ఎలా ఉంటుందో స్వానుభవం వలన తెలుసుకున్నాకానుక నరకానికి పోతా ‘’అనేవాడు .
‘’రసజగన్నాధనటరాజ రంజమాన -మంజుతారాళి అద్దియే మా తెనాలి ‘’అని చాటువు చెప్పాడు .
ఒకసారి కాలువగట్టు వెంట నడుస్తుంటే మూడు బొమికలు కనిపిస్తే ఆయన ఆకాశం వెనక చూసి ఆశువుగా పద్యం చెప్పాడు –
‘’చూడ0జూడ మహాశ్మశాన మనిపించున్ -నాకు నీ లోక ,మిం -దేడన్ గాలిడ బోవ నేరపయినో -యే వేయు చున్నట్టులే -లో డక్క య్యెడి గాని నీ మహిమ -యాలో నే నివారించి ,నీ -క్రీడా రంగమటన్న మాట స్మృతికి0 -గీలించు మృత్యుమ్ జయా ‘’
అని చెప్పి గట్టిగా నవ్వి వెనక్కి పోదాం పద -జీవితం లో ఎప్పుడూ ముందుకు పోలేం ‘’అని విరక్తిగా అన్నాడు వరదతో .
33-అబ్బూరి రామ కృష్ణారావు -1919 లో కలకత్తా వంగ దేశీయాంధ్ర సమితి వార్షికోత్సవం లో అధ్యక్షుడైన సర్ సి వి రామన్ ప్రక్క ఉపాధ్యక్ష స్తానం లో ఒక విద్యార్థిగా రామ కృష్ణారావు ఉండి ముఖ్య అతిధి ,ఏ హిస్టరీ ఆఫ్ ఇండియన్ లాజిక్ ‘’అనే మహా గ్రంధాన్ని రాసిన విఖ్యాత తర్క శాస్త్ర వేత్త సతీష్ చంద్ర విద్యాభూషణ్ సమక్షం లో అరగంట సేపు సంస్కృతం లో అనర్గళం గా ప్రసంగించి అందర్నీ ఆశ్చర్యపడేట్లు చేశారు . రామన్ ,అబ్బూరి భుజంతట్టి ‘’దక్షిణ భారత దేశ గౌ రవాన్ని నిలబెట్టావు ‘’అని అభినందించాడు . ఆసభలో ఉప్పల లక్ష్మణరావు మాగంటి బాపినీడు వంటి ప్రముఖులున్నారు .
రెండేళ్లు మైసూరు సంస్కృత కాలేజీలో చదివి అప్పటికి కలకత్తా వచ్చారు అబ్బూరి .రాళ్లపల్లివారు మైసూర్ లో సహాధ్యాయి .అప్పుడే రాసిన ‘’మల్లికాంబ ‘’ప్రచురితం .ఆంద్ర భారతి లో గురజాడ అబ్బూరి రాయప్రోలు రాసేవారు ..దీని తర్వాత ఆంద్ర గ్ర 0ధాలయ సర్వస్వము వస్తే అందులో ఖండకావ్యాలు రాశి ప్రచురించారు ..అయ్యంకివారు సంపాదకులు . అయ్యంకి ‘’ఆధునిక కవిత్వానికి గురజాడ అబ్బూరి రాయప్రోలు కవిత్రయం ‘’అన్నారు . కలకత్తా లో ఉండగా కొన్ని పద్యాలు రాశారు
‘’నోటి నిండుగ భుజింపఁగనోచుకొ నము-ఉదయ గీతులుపాడ నో పెదముగాని -కన్నతల్లుల ప్రేమమార్గమ్ము గనము -లలితగతి వీణ వాయింపగలము గాని -తొడిమ లెడ సేయగా రాలిపడిన పూల -వలపు లేవి ?భిక్షా0 దేహి భవతి భవతి ‘’
కలకత్తా యూ ని వర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆయన పద్య సంకలనం’’ఊహాగానం ‘’ మద్రాస్ నుంచి1918 లో వెలువడింది .ఆధునికాంధ్ర కవిత్వానికి శ్రీకారం చుట్టిన కొద్దిపుస్తకాలలో ఒకటయ్యిందిఅది .దుష్ట సమాసమే అయినా ఎవరూ ఆక్షేపించలేదు ఆయన సంస్కృత ఆంద్ర విద్వత్తును చూసి ..విప్లవాత్మక పద్ధతిలో పద్యాల పేర్లు తీసేశారు మొట్టమొదటిసారిగా .తరువాత చాలామందికవులు దీన్నే అనుసరించారు .
ప్రముఖ మల్ల యోధుడు కోడి రామ మూర్తిమీద అబ్బూరి పద్యాలు రాశారు .వాటిని ఆయన రుమాళ్ల మీద అచ్చు వేయించి అందరికి పంచిపెట్టాడు ..ఆయన ప్రదర్శనలో ముందువరుస రెండు కుర్చీలు అబ్బూరి దంపతులకు కేటాయించి భక్తి ప్రకటించేవాడు ..కలకత్తా లో డిగ్రీ పొంది కొంతకాలం శాంతి నికేతన్ లో గడిపి ఇంటికి వచ్చారు .
కొడవటి గంటి వెంకట సుబ్బయ్య రాసిన పద్యాలను వరద ప్రసిద్ధ ఆంగ్లకవి డబ్ల్యు హెచ్ ఆడెన్ కు చదివి వినిపించాడు అమెరికా లో –
‘’ఈ అతి లోక మోహన మహీతల మందున తోడులేక పా-ధేయము లేక సిగ్గిలి మదీయ మనోహర భావ పల్లవ -చ్చాయలలోన వ్యర్ధపు విచారము తో నవవాప్త కామ్యముల్ -రోయుచు భగ్నమాలికలు ప్రోవులు సేయుచు సంచరించెదన్ ‘’
దుగ్గిరాల వారి పరిచయం తో అబ్బూరివారి జీవితం మారిపోయింది -రాజకీయ ప్రవేశం జరిగి రచన వెనకబడింది దుగ్గిరాలకు యమునా కల్యాణి అంటే మహా ప్రాణం
మళ్ళీ పుంజుకొని గజళ్ళను మొదటిసారిగా తెలుగులో రాశారు భుజంగ ప్రయాతాన్ని రగడ ను మధ్యాక్కరను విభిన్న ధోరణిలో ప్రయోగించారు . ఇన్ని చేసినా అక్కిరాజు ఉమాకాంతం ‘’నేటికాలపు కవిత్వం ‘’లో అబ్బూరిని ముట్టుకోలేదు .అలా ఎందుకు చేశారు అని గంటి సూర్యనారాయణ గారు అడిగితె ‘’చక్కని భాషా అలంకార జ్ఞానం కవన ప్రజ్ఞా ఉండటం లోపాలు లేకపోవటం వలన వదిలేశాను ‘’అని ఉమాకాన్తమ్ ఉవాచ .
దుగ్గిరాలవారి చీరాల సత్యాగ్రహానికి అబ్బూరి కుడిభుజంగా నిలిచారు . దీనికి పిత్రార్జితం అంతా ‘’కరారావుడి ‘’చేసేశారు ..చీరాల విఫలమైనతర్వాత మద్రాస్ వెళ్లి చందమామ అనే బాలల పత్రిక కోసం ప్రయత్నించారు .దానికి ప్రమోదకుమార ఛటర్జీ గుర్రం మల్లయ్య రహ్మాన్ చుగ్తాయ్ వంటి ప్రసిద్ధ చిత్రకారులు చిత్రాలు వేసిపంపారు . దానికోసం కొన్న ఖరీదైన పేపరు ఆంద్ర పత్రికా ఫీసు లో చెదలుపెట్టి పనికిరాకుండా పోయింది .ముఖ చిత్రం ఒక్కటే అచ్చయింది తర్వాత చక్రపాణి దాన్ని తెచ్చాడు .ఈ నాడు అనే పేరుతో దినపత్రిక తేవటానికి కర్నూలు మిత్ర బృందం వారికి డిక్లరేషన్ తెప్పించారు అబ్బూరి . తర్వాత అది రామోజీ రావు కు దక్కింది .
‘’అసలు నేనెందుకు రాయాలి /’’అనే శీర్షిక పెట్టి ఎందరెందరితోనో రాయించారు అబ్బూరి.
విశాఖలో ఆంద్ర విశ్వ విద్యాలయగ్రంథాలయాన్ని ఒకే పుస్తకం ఒకే కుర్చీతో అబ్బూరి ప్రారంభించారు . జగన్నాధ పండితరాయలు ఢిల్లీ దర్బారులో లో ‘’లవంగీ దృగంగీ కరోతు ‘’అని చెబితే దుగ్గిరాల ‘’ఫరంగీ ఫరంగీ దృగంగీ కరోతు ‘’అని పేరడీ చేశారు . అబ్బూరి చివరి రోజుల్లో ఢిల్లీలో వరద ఇంట ఉన్నాడు .స్నానాల గదిలో జారిపడికాలు విరిగి మంచానికే అతుక్కుపోయారు .పురాణం సుబ్రహ్మణ్య శర్మ వచ్చి ఆయన చాటువుకులన్నీ చంకనేసుకు పోయాడు .పత్రికలో ప్రచురణకు .,ఎజ్రాపౌండ్ జైలు జీవితం పై పుస్తకాన్ని ,ఆల్డస్ హాక్స్లీ భార్య లోరా రాసిన గ్రంధాన్ని చదివి వినిపించుకొనేవారు ..మంచం లో ఉండగా అబ్బూరి చెప్పిన చివరి పద్యం –
‘’చచ్చి పోయి జీవి ఎచ్చటి కేగునో -ఏమి యగునో ఎవరికెరుకరాదు -ఎరుక లేని వార లేమెమో చెప్పగా -విని తపించువారు వేనవేలు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-4-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

