వరద లో తేలి (రి)న తేట ఊట -7(చివరిభాగం )
34-తర్క తీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి -మహారాష్ట్ర సతారా జిల్లా ‘’వాయి ‘’గ్రామం లో ప్రముఖ సంస్కృత పాఠ శాల ఉన్నది .అక్కడ సంస్కృతం నేర్పటానికి తెలుగు దేశం నుండి పండితులు వెళ్లి నేర్పారు .దాన్ని తీర్చి దిద్దినవాడు తర్కతీర్ధ లక్ష్మణ శాస్త్రి జోషి . అబ్బూరి కి మంచి మిత్రుడు . ఇద్దరూ సంస్కృతం లోనే మాట్లాడుకునేవారు .ఆయనకు పిలక ఉండేది . 1940 లో ఇద్దరూ కలకత్తా వెళ్లి ఒక రెస్టారెంట్ లో విస్కీ కొడుతున్నారు ..జోషిగారిపిలక ,పండితవేషం విస్కీ తాగటం జనం విడ్డూరంగా చూశారు .. అబ్బూరి వెంటనే రెస్స్టారెంట్ యజమాని నుంచి కత్తెర తెచ్చి జోషీ పిలక కత్తిరించారు .అప్పుడాయన ‘’కామ్రేడ్ రామ కృష్ణారావు ! ఈ దేశం లో ఏదీ బహిరంగం గా చెయ్యరాదు ‘’అన్నాడట .. జోషీ గాంధీకి కూడా సన్నిహితుడు . ఆయన పాండిత్యం లో బ్రహ్మదేవుడంతటివాడని అంటారు . హరిజన దేవాలయ ప్రవేశం కోసం గాంధీ ఆయన్ను కాశీలో పండితులతో తర్కించమని పంపారు .కాశీ పండితులు వ్యతిరేకించారు .రాయుడు శాస్త్రిగారు జోషీని సమర్ధించగా పండితులు కిమిన్నాస్తి అయ్యారు .. హరిజన దేవాలయ ప్రవేశం యధా విధిగా జరిగిపోయింది
35-దుగ్గిరాల గురించి మరిన్నీ విషయాలు -దుగ్గిరాల వారి ‘’రామదండు ‘’దుష్టసమాసం అన్నాడు రామ సుబ్బయ్య ..వెంటనే ‘’మీ పేరు లో ఏ సమాస0 ఉంది ?అని ఎదురుప్రశ్నించాడు ..రామదండు సభ్యులందరూ కాషాయ వేషం తలపాగా రుద్రాక్షలు ,నుదుట కుంకుమ ధరించేవారు .బెజవాడ అఖిలభారత కాంగ్రెస్ సభకు రామదందే వాలంటీర్లు .వేల సంఖ్యలో ఉన్న వీరించి చూసి మహమ్మదాలీ ‘’రెడ్ ఆర్మ్ ‘’అన్నాడు ..దుగ్గిరాలవంటి మహా వక్త నభూతో అంటాడు వరద .చీరాలలో పురపాలక సంఘాన్ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వ ప్రతినిధులువచ్చారు .సభ పెట్టారు .పోగేసుకొచ్చిన జనం పారిపోకుండా ప్రాంగణం చుట్టూ కంచెవేసి పోలీసు పహారా పెట్టారు ..సంగతి తెలిసిన దుగ్గిరాల ప్రాంగణం ప్రక్కనే ఉన్న తాటి తోపు లోకి వెళ్లి తాటి చెట్లను సంబోధిస్తూ ఉపన్యాసం మొదలు పెట్టారు .ఇంకేముంది చెవిన పడిన జనం క0చె దూకి తాటితోపు కు పరుగులు తీశారు. అవాక్కయింది బ్రిటిష్ ప్రభుత్వం .’’నర చరిత్రలో జరగని గొప్ప విశేషం ‘’అన్నాడు దీన్ని కట్టమంచి .
గాంధీతో అభిప్రాయం భేదాలున్న గోపాల కృష్ణయ్యగారు ‘’మన ఇతిహాసం లో సత్యాగ్రహ సాధనాన్ని మొదట ప్రయోగించినవాడు ప్రహ్లాదుడు .తండ్రి హిరణ్యకశిపుడు ఎంత బాధ హింసా పెట్టినా కొంచెం కూడా చలించలేదు .అహింసాత్మకంగా సత్యాగ్రహం చేసిన ప్రహ్లాదుని లక్ష్యం ఎలా ఫలించింది ?ప్రపంచం లోనే కనీ వినీ ఎరుగని హింసా స్వరూపం తో నృసింహావతారము ప్రత్యక్షమైంది .కనుక అహింసను మనం ఆరాధిస్తే హింస ప్రత్యక్షం కాక మానదు ‘’అన్నారు ..గాంధీ గారికి ఈ వార్త చేరి మైండ్ బ్లాకై ‘’దుగ్గిరాలను ఇలా ఇకనుంచి అహింసా సిద్ధాంతం పై మాట్లాడవద్దు ‘’అని చెప్పమని కొండా వెంకటప్పయ్య గారికి జాబు రాశాడు .
గోపాల కృష్ణయ్యగారు శ్రావ్యమైన కంఠం తో పాడేవారు .ప్రతి బహిరంగ సభలో సాయంత్రం ‘’సాయంకాలే వనాంతే’’అనే శ్రీ కృష్ణ కర్ణామృతం లోని శ్లోకం పాడేవారు ..ప్రేక్షకులు ముగ్ధులు వశ్యులు అయ్యేవారు .ఆతర్వాత ఆయన ఏది చెప్పినా వేదవాక్యంగా విని అనుసరించేవారు .అంతటి జన వశీకరణ శక్తి ఆయనది . ఆయన పాట పాడే తీరును మహానటులు శ్రీ అద్దంకి శ్రీరామ మూర్తిగారు అనుకరించారు బాగా ..మంచి హాస్యప్రియులైన దుగ్గిరాల ఛలోక్తులు నిలయం నవ్యకవులను ‘’కొత్తిమేర కవులు ‘’అనేవారు .ఆశువుగా హాస్యంగా పద్యాలు చెప్పేవారు .ఆయన ప్రభావం పడని నవ్యకవులు లేరు ..ఆయన సన్నిహితులు భట్టిప్రోలు సూర్య ప్రకాశరావు .రావు గారితో పద్యాలు చెప్పించాలని ఎందరు ప్రయత్నించినా కుదర్లేదు ..ఒక రోజు అబ్బూరి ని రెచ్చగొడితే గోపాలకృష్ణయ్య గారిపై ఆశువుగా ‘’
ఉపమాపై పెసరట్టు పై ఇడి లిపై హుమ్మంచు చూపించు నీ-జపసంబద్ధ పరాక్రమ క్రమ కటాక్ష శ్రేణి మన్నించి శు -భ్రపు జిల్లే బీ ,పకోడీ లడ్వ గయిరాపై కొంత రానిమ్ముశ్రీ -చపలా0గ సితాంగ నా హృదయ పాశా పూజ్య వస్తుప్రియా ‘’అని చెప్పారు ..గిలగిలా లాడిపోయిన రావు గారు . నేనూ చెబుతా కాసుకోండి అని –
‘’కొండ వెంకటప్ప మొండుపన్యాసంబు -సీతారామ శాస్త్రి జ్యోతిషంబు -అడివి బాపిరాజు అడివి కవిత్వంబు -ఎరగనట్టు ఆంద్ర ఎదవ ఎవడు ‘’అని చదివారు . వరదను గోపాల ఎత్తుకొని ఆడించారు చిన్నప్పుడు . అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్ రూథర్ ఫర్డ్ .ఆయనకు డిప్యూటీ కలెక్టర్ గా అబ్బూరి మేనమామ రావు సాహెబు వడ్లమూడి బ్రహ్మయ్య పంతులు ఉండేవాడు .అందుకని మేనల్లుడు అబ్బూరిని అరెస్ట్ కాకుండా కాపాడేవాడు .అబ్బూరి ఎన్నిప్రయత్నాలు చేసినా అరెస్ట్ కాలేదు .జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని బుర్రకధగా రాసి ప్రచురించారు .అచ్చు వేసిన వాడిని అరెస్ట్ చేసి అబ్బూరి జోలికి రాలేదు .. తనను ఎందుకు అరెస్ట్ చేయటం లేదో అబ్బూ రికి అర్ధమయ్యేదికాదు . 35 ఏళ్లతర్వాత రూథర్ ఫోర్డ్ మద్రాసులో గవర్నర్ సలహాదారుగా ఉండేవాడు ..ఆయన ఈయన్ను గుర్తుపట్టి చీరాల వ్యవహారాలూ చెబుతూ అరెస్ట్ చేయకపోవటానికి కారణం చెప్పేదాకా అబ్బూరి ఆ రహస్యం తెలియదు అన్నాడు వరద .తాను జైలుకు పోలేక పోతున్నానే అని తెగ మధానపడేవారు అబ్బూరి .
గోపాలకృష్ణయ్య గారి మరణంపై బసవరాజు అప్పారావు చిరస్మరణీయ గీతాలు రాశారు –
‘’కాలక్రమము గతి గడచి తెనుంగు భావి భాగ్యమెల్ల పండిన వెనుక -ఆనాటి కెవరైననడుగగా పోరు -గోపాలకృష్ణుడే గోష్ఠి వాడంచు-భాగ్య వశమ్ము న భావికాలాన అమృత తుల్యమ్ములు నతి భావ భరిత -ములు నైన నా గీతములు వినినంత గోపాల కృష్ణుని గొప్ప దీపించు ‘’
దటీజ్ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య .
దుగ్గిరాలవారి ‘’రామనగరం ‘’లో కులాలు లేవు అందరిదీ ఒకటే కులం ‘’నాన్ బ్రాహ్మిన్ కు అర్ధం లేదు ‘’అన్నారు .జాగర్లమూడి కుప్పుస్వామి జస్టిస్ పార్టీ నాయకుడు దుగ్గిరాల అవసాన దశలో వచ్చి చూశాడు .రామనగరులో పూరిపాకలో చిక్కి శల్యావశిస్టం గా పడి ఉన్నారు చౌదరిని పలకరించటానికి లేవ బోయారు .సహాయం చేస్తానన్నాడాయన లేవటానికి .. నవ్వుతూ ‘’నడుం లో నాన్ బ్రాహ్మినోయ్ ‘’అని చమత్కరించారు .ఆయన ఆపుకోలేక పగలబడి నవ్వాడు . అప్పటికి నాలుగు రోజులనుంచి నడుం నెప్పితో బాధ పడుతున్నారు దుగ్గిరాల . వెళ్లిపోతుంటే ‘’రామార్పణం ‘’అన్నారు .వాళ్ళు వెళ్ళాక అవుటపల్లి నారాయణ రావు తో ‘’ఒరే శ్రీరామ చంద్రుడు చిత్తు కాగితం పంపించారురా .కానీ ఆ దూతకు తగిన ఆతిధ్యం ఇవ్వలేక పోఇందిరా ఈ ఘటం ‘’అన్నారు గోపాల .ఆ చిత్తుకాగితం వంద రూపాయల నోటు
36- కొండా వెంకటప్పయ్య -అంతః కక్షలకు దూరంగా ఉండేవారు .పెద్దమనిషి తరహా . సాధువుగా మాట్లాడినా కోపం విసుగూ ఎక్కువ .అణ చు కోలేక పోతున్నానని బాధ పడేవారుకూడా దుగ్గిరాల కొండా పై ‘’కొండెం కటప్పయ్య కొండంత కోపాన -చిర్రు బుర్రు మనుచు చిందులేసే ‘’అని అందరికీ తెలిసేట్లు పద్యం లో శాశ్వతం చేశారు .అతి నిరాడంబర జీవి సుఖాలకు అతి దూరం గాంధీ కి అత్యంత సన్నిహితుడు . అందుకే ఆయనకు ఒక ప్రత్యేక హోదా ఏర్పడేది ..లక్నో కాంగ్రెస్ కు వెళ్లి స్నానం చేద్దామనుకొంటే వేడినీళ్లు పెట్టిస్తాం అంటే ‘’మేమంత నాజూకు వాళ్ళం కాదు .మహాత్ముని అనుచరులం .మాకు వేన్నీళ్ళ భోగం అనవసరం ‘’అని చెప్పినా వినకుండా చన్నీటి స్నానం చేసి స్నానాల గదిలో కొయ్యబారి పోయారు . చాలాసేపటి కానీ ఎవరూ గుర్తించలేదు. అప్పుడు హాస్పిటలూ ట్రీట్ మెంట్ జరిగింది .దీనితో ‘’గాంధీకి మనోవాక్కాయ కర్మల సన్నిహితుడిని అనే అహంభావం పోయింది ‘’అన్నారు .’’యవ్వనం లో నాటకాలు వేసి ఒప్పించాను మెప్పించాను నమ్మించాను కానీ ఇప్పటి నాటకం లో పాత్ర రక్తి కట్టలేదు ‘’అని వ్యధ చెందారు .
37-చిత్ర నళీయం -యడవల్లి సూర్యనారాయణ నలుని పాత్ర బాగా పోషించేవాడు ఉప్పులూరి సంజీవరావు దమయంతి వేషం కట్టేవాడు అల్లం మస్తాన్ అనే వస్తాదు బాహుకుడిగా వచ్చి పెద్ద సైజు కట్టెల్ని తొడమీద పెట్టి తేలికగా విరిచి పారేసేవాడట .నలుడు బాహుకుడుగా మారితే చిక్కి శల్యం అవ్వాలికాని ఇంతబలం ఎక్కడిది అని ప్రేక్షకులు చెవులు కొరుక్కునేవారట .యడవల్లి నలునిపాత్రపై అబ్బూరి –
‘’యడవల్లి సూర్యనారాయణ -చెడ దొబ్బెను నలుని పార్టు ఛీ !ఏ ముండా -కొడుకిచ్చే వీనికిం ,బలి -చెడుగుడు నాట్యమ్ము కొరకు చీనాంబరరముల్ ‘’అని చెడ తిట్టారట –
వరద లో తేలి (రి )న తేట ఊట ఇంతటితో సమాప్తం
ఈ 7వ ఎపిసోడ్ కు ఆధారం ‘’వరదకాలం ‘’ మిగిలిన 6 ఎపిసోడ్ లకు ‘’కవన కుతూహలం ‘’ఆధారం అని మరోక్క్కమాఱు వినయంగా తెలియ జేస్తున్నాను .
ఇందులో చాలామంది చాలామందికి తెలిసే ఉంటారు .కానీ లోతులు తెలిసిఉండవు నేను తెలుసుకొని ఆనందించి మీరూ అనుభూతికి లోనవుతారని రాశాను . నేనేదో ఇది చదివానని మీరు చదవలేదని చెప్పటానికి కాదు మహా మహుల సంస్మరణం శ్రేయోదాయకం అని నమ్మి రాశాను
మీ -గబ్బిట దుర్గా ప్రసాద్ -14-4-17 -కాంప్ -షార్లెట్ -అమెరికా

