గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 –నాలుగవ భాగం
3-సంగీత గిరిజాస్టక కర్త –అభినవ కాళిదాసు -తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి (1902 –1982 )-2
‘’భారతీ తారామాల ‘’ప్రతి జటప్రోలు సంస్థానం లో ఉన్న వెల్లాల సదాశివ శాస్త్రి గారికి చేరి విమర్శ తో ఒక పుస్తకమే రాశారు .దీనికిశాస్త్రిగారు ప్రతిఖండనం రాసి గ్రంధంగా ప్రచురించారు .శాస్త్రిగారు బెజవాడలో ఉన్నప్పుడు మరుపూరి వారు ,బాలక్రిష్ణారెడ్డి గారు సంస్కృతం అభ్యసించారు .ఆరునెలలలో తెనాలిలో ‘’ప్రౌఢ మనోరమ ‘’చదివి ఆరి తేరారు .ఇరవై రెండు ఏళ్ళ వయసులో వనపర్తి అయ్యప్పగారి కూతురు కృష్ణ వేణమ్మను మేనరిక వివాహమాడారు . ఈ సందర్భంగా శాస్త్రిగారు ‘’కాంతా స్వయం వరం ‘’కావ్యం రాశారు. ప్రతి ఏడాది మన్నెం కొండ నుండి గద్వాల జాతరకు వెళ్ళేవారు .రాణీ గారిపై శ్లోకాలు రాసి చదివారు. చివరి శ్లోకం లో ‘’ఫలకారీ ‘’అనే ప్రయోగం చేశారు .సభలోని పండిత కవి బృందం ఆనందంగా చప్పట్లు కొట్టి అభినందించారు. శృంగేరి వెళ్లి విద్యా తీర్ధ స్వామి ఆశ్రమ స్వీకార మహోత్సవం లో ‘’శారదా నవరత్న మాలిక ‘’ఆశువుగా చెప్పారు. లలితాంబ ను ద్వితీయం చేసుకొని అమ్మవారిపై .’’లలితా స్తవ ఝరి’’రెండవ కావ్యం రాశారు .రాజాపురం గ్రామప్రజలు ఏకగ్రీవంగా శాస్త్రి గారిని సర్పంచ్ గా ఎన్నుకోగా ఆయన గ్రామాభి వృద్ధికి గొప్ప కృషి చేశారు .ఒకసారి రాణి గారి ఎదుట ‘’హయగ్రీవ శతకం ‘’నుండి కొన్ని శ్లోకాలు వినిపించగా రాణి గారు ముప్పై రూపాయల వార్షికం ఏర్పాటు చేశారు .ఒక శ్లోకం –
‘’యద్రాజ్యం ప్రావి మాశ్య గుణ్య సచివం ధర్మాత్మ భీరాజభిః-సన్యాయం సజనాభి వృద్ధి సబుధా మేనం పురా రక్షితం
తుద్యు చ్ఛేజ్జన మధ్య దుర్జన క్షిత క్షోభం కలౌతే యుగే –హా కష్టం విధ వాహ్య వంతి మకుటిలా నేపధ్య మధ్యస్థితా’’
కంచికామ కోటి స్వామి గద్వాల వచ్చి రాణీ గారి ఆతిధ్యాన్ని అందుకుని ,అగ్రహారం లో శాస్త్రి గారి ఆధ్వర్యం లో భిక్ష గ్రహించిహైదరాబాద్ వెళ్ళిపోయారు .సత్సంతానం పొంది సతీ సమేతంగా తీర్ధ యాత్రలు చేసి పుణ్యఫలం మూటగట్టుకున్నారు .
27-3-1914 న ‘’యావర్ణ సప్తాహం’’ గోవింద నాయక్ నిర్వహించారు .108 బ్రాహ్మణులు రామాయణ పారాయణ ,చేయగా ,రుద్రయాగం లో 40 మందిపాల్గొనగా వేలాది మంది వీక్షించారు .12 ఏళ్ళ శాస్త్రి గారు పాల్గొన్నారు . రోజూ నాలుగు వేలమందికి భోజనం . 1927 లో హైదరాబాద్ గౌళి గూడ లో ‘’కృష్ణాజీ సప్తాహం ‘’జరిగింది .అలాగె ఉల్లెండ కొండ సప్తాహం ,పెంట్ల వెల్లి సప్తహాలలో పాల్గొని సత్కారాలు అందుకున్నారు .
శాస్త్రి గారి విద్వత్తు కు తగిన ‘’అభినవ కాళిదాస ‘’’’కవి కులాలంకార ‘’,కవి కల్ప ద్రుమ ‘’బిరుదులు పొందారు .1970 లో ఉత్తమ సంస్కృత విద్వాంసుని గా అకాడెమి గుర్తించి సత్కరించింది . అకాడెమీ అధ్యక్షులు బెజవాడ గోపాల రెడ్డిగారు .సన్మానపత్రం రాసి చదివినవారు శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు .శాస్త్రిగారు కేశవపంతుల నరసింహ శాస్త్రిగారికి సుందరకాండ మంత్రోపదేశం చేసి అకాడెమీ నుండి ఆర్ధిక సాయం వచ్చే ఏర్పాటు చేయించారు .2016 కృష్ణా పుష్కరాలలో శాస్త్రి గారు 40 ఏళ్ళ క్రితం రచించిన ‘’భజే కృష్ణ వేణీం ‘’స్తోత్రాన్ని సిడి గా విడుదల చేసి గౌరవించారు .
శాస్త్రి గారి గీర్వాణ రచనలు 29 ఉన్నాయి .అందులో వాసర సరస్వతీ స్తుతి ,భారత ధరణి స్తుతి ,చెన్నకేశవ కుసుమాంజలి, చంద్ర శేఖర సరస్వతీ పంచ రత్న స్తుతి ,శ్రీ జయేంద్ర సరస్వతీ స్తుతి ,శారదా శతకం ,హయగ్రీవ శతకం ,ధూమ శకట ప్రమాదం ,రవీంద్ర తపః ఫలం ,అయ్యప్ప పంచ రత్నాలు ,జితామిత్ర స్వామి చరిత్ర ,బీచుపల్లి ఆంజనేయ సుప్రభాతం మొదలైనవి .శాస్త్రి గారి సంస్కృత రచనలోని విశేషాలను తర్వాత తెలుసుకొందాము .
ఆధారం –శ్రీమతి పాణ్యం మీనాకుమారి రచన –‘’తెల్కపల్లి రామ చంద్ర శాస్త్రి ‘’మోనోగ్రాఫ్
సశేషం
2018 నూతన సంవత్సర శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-12-17-ఉయ్యూరు


అద్భుతం
LikeLike