గీర్వాణ కవుల కవితాగీర్వాణ౦ -4
106-భూ ,పురుష పరిక్రమ ల కర్త –విద్యాపతి థక్కూర (13 50-1440 )
విద్యా పతి రాసిన పాటలు మిధిలా సామ్రాజ్యం లో ప్రతిధ్వనించేవి .బెంగాలీ వాసనలతో గుబాళించేవి .బెంగాలీ వాడినని చెప్పుకున్నా మిదిలలోనే ఉండి పోయాడు .తండ్రి గణపతి .తాత జయదత్తుడు .ముత్తాత’’ మహా వార్తిక నైబంధిక దీరేశ్వరుడు .వీరిది ‘’గాధా బిసాపి ‘’కుటుంబం .కాశ్యప గోత్రం .దేవ సింహ ,కీర్తి సింహ ,శివ సింహ ,పద్మ సింహ ,లక్షిమ దేవి ,విశ్వాస దేవి రాజాస్థానాలలో కవి గా విరాజిల్లాడు .క్రీశ 13 50 లో జన్మించి 14 40 లో 90 వ ఏట మరణించాడు కాని ప్రొఫెసర్ ఆర్ కె చౌదరి ఇతనికాలాన్ని 13 60-14 80 గా చెప్పాడు .
మైధిలీ భాష లో రాసిన పాటలు విస్తృత ప్రచారం పొందినా విద్యాపతి సంస్కృత ,అవహత్తా భాషలలో రచనలు కూడా చేశాడు .వీటిలో నీతి శాస్త్రం ,న్యాయ శాస్త్రం ,ధర్మశాస్త్రం తాంత్రిక విషయాలు ఉన్నాయి .దొరికిన వాటిలో భూ పరిక్రమ ,పురుష పరిక్రమ ప్రసిద్ధి చెందినవి .
107-సంస్కృత గీతాల కర్త –చంద్ర కళా దేవి (14 00 )
విద్యాపతి కోడలు ,అతని పెద్దకొడుకు మహామహోపాధ్యాయ హర పతి థక్కూర భార్య చంద్ర కళాదేవి .లోచనుడు తన రాగ తరంగిణి లో కళావతి సంస్కృత గీతాలు ఉదాహరించాడు .సంస్కృత –మైధిలీ కలగలుపు గీతాలు కూడా రాసింది .
108-రసదీపిక వ్యాఖ్య కర్త –జగద్ధార (15 00 )
సురగణ వంశానికి చెందిన మిదిలావాసి జగద్ధార పరాశర గోత్రీకుడు .’’ధర్మాధి కరణీకుడు’’అంటే మత ధర్మ సంరక్షకుడుగా ఉన్నాడు .ధర్మసింహ రాజు ఆస్థానకవి .రత్నధార దమయంతి దంపతుల కుమారుడు .విద్యాధరుని మనవడు .తాంత్రిక గదాధరుని ముని మనవడు .మీమాంసక చండేశ్వరుని ‘’ఇని మనవడు ‘’.(ముని మనవడి కొడుకు ).కవి కాలం 15 వ శతాబ్ది గా భావిస్తారు .జగద్ధార గొప్ప వ్యాఖ్యాన కర్త .కాళిదాస మేఘ దూత కావ్యానికి రసదీపిక వ్యాఖ్యానం రాశాడు .గీత గోవింద శైలిలో ‘’సారదీపిక ‘’రాశాడు .భగవద్గీత కు ‘’ప్రదీప’’వ్యాఖ్యానం చేశాడు .దేవీ మహాత్మ్యానికి వ్యాఖ్య రాశాడు .శివ స్తోత్రం కూడా రాసినట్లు చెబుతారు .
మరో జగద్దారుడు ‘’కుమార సంభవం ‘’కు వ్యాఖ్యానం రాసినట్లు తెలుస్తోంది .
109-అన్యోక్తి శైలిలో రచించిన –మహా మహోపాధ్యాయ భావనాధ మిశ్ర (15 వ శతాబ్ది పూర్వార్ధం )
శోడారపుర వంశం సారస్వత శాఖకు చెందిన శ్రోత్రియ బ్రాహ్మణుడు భావనాధ మిశ్ర .15 శతాబ్ది పూర్వార్ధం వాడు .తండ్రి మహా మహోపాధ్యాయ రవి నాధుడు .మందార వంశానికి చెందిన మహా మహోపాధ్యాయ వటేశ్వరుని కూతురు కొడుకు .తత్వవేత్తలలో పేరెన్నికగన్నవాడు మిశ్ర .విద్యాకర మిశ్రా సంతరించిన ‘’విద్యా కరణ సహస్రిక ‘’లో భావనాధుని శ్లోకాలు ఉదాహరింప బడినాయి .కొడుకు మహా మహోపాధ్యాయ శంకర తో అన్యోక్తిగా చెప్పిన శ్లోకాలకు సాహిత్యం లో విశేష స్థానం పొందాయి .దేనికీ చెందని భావ ధార ఉండటం తో ఈయనను ‘’అయాచి ‘’అని మారు పేరుతో పిలుస్తారు .
110 –రసార్ణ వ కర్త –మహామహోపాధ్యాయ శంకర మిశ్ర (16 వ శతాబ్ద పూర్వ భాగం )
భావనాధ మిశ్ర కుమారుడే శంకర మిశ్ర .తల్లి భవాని .మిధిలా నగర మహోన్నత తత్వ వేత్తగా మహామహోపాధ్యాయ శంకర మిశ్రా కీర్తి గడించాడు .న్యాయ ,వైశేషికాలలో అఖండుడు .కవి నాటకకర్త కూడా .తన కవితలను ‘’రసార్ణవం ‘’గా ప్రచురించాడు .వీటిలో అతని కవితావేశం భావ ఉద్దీపనం ప్రస్పుటం గా కనిపిస్తాయి .అతని ‘’అన్యోక్తి ‘’కీర్తి శిఖరాలను ఎక్కించింది .సాధారణ చదువరి కూడా అందులోని చమత్కారానికి మురిసి నమస్కారం చేయాల్సిందే .భాను దత్తుని ‘’రస పారిజాత౦ ‘’తో సరితూగుతుంది .అలాగే కవి శేఖర భాద్రీనాద్ ఝా ‘’అన్యోక్తి సహస్రి ‘’కి సరి తూగుతుంది .శంకర రాసిన మరో అద్భుత రచన ‘’రస కల్లోల సారోద్ధారం ‘’అరుదైనదిగా మహా పండితకవులు కీర్తించారు .’’పండిత విజయం ‘’కూడా రాసినా అలభ్యం .ఆనాడు మిధిల లో శంకర కవిని అపర శంకరునిగా ఆరాధించారు .ఆయన విజయ గాధలను ఇప్పటికీ చెప్పుకుంటారు .
111-సుభాషిత సుధా రత్న భండార కర్త –గణపతి (1435 )
గనేశ్వర ,గణనాధ ,గణపతి అని పిలువబడే గణపతి మహాదేవుని కుమారుడు శంకర మిశ్రా చిన్నతమ్ముడు .మిధిలానగర్ ఆస్థానకవి ఆలంకారికుడు పద్య వేణి ,పద్యామృత తరంగిణి ,సూక్తి సుందర ,సభ్యాలంకరణ ,సుభాషిత సార సముచ్చయ లలో గణపతి పద్యాలు ఉదాహరింపబడినాయి .ఇతని కొడుకు భాను దత్తుడు తన రసమంజరి ,రసతరంగిణి ,అలంకార తిలక ,రసపారిజాతం లలో తండ్రి శ్లోకాలను చేర్చాడు .రసపారిజాత౦ లో గణపతి రాసిన 104 శ్లోకా లున్నాయి .తండ్రి కవితా మాధుర్యాన్ని కొడుకు భానుదత్తుడు అద్భుతంగా ఆవిష్కరించాడు .అందుకే తండ్రి గణపతి ని ‘’కవికులాలంకార చూడామణి ‘’అని శ్లాఘించాడు .గణపతి’’ మహా మోద ‘’కూడా రత్న భాండారం లా గా సంపుటీకరించాడు .
112- భక్తి రత్నావళి కర్త –జయ కృష్ణ పరమహంస విష్ణు పూరి (15 వశతాబ్దం )
15 వ శతాబ్దికి చెందిన జయ కృష్ణ పరమహంస విష్ణు పూరి కరమహా వంశానికి చెందినతరుణీ శాఖ వైష్ణవకవి .రతిదర ,మౌర ల కుమారుడు .భక్తి రత్నావళి అనే విష్ణు భక్తీ శ్లోకాలు రాశాడు .ఇతని శిష్యుడు ప్రేమానంద పూరి ‘’ప్రేమ చంద్రిక ‘’రచించాడు .
113-గీతా గౌరీపతి కావ్య కర్త –కవిరాజ భానుదత్తుడు (15 వ శతాబ్దం )
గణపతి కుమారుడైన భానుదత్తుడు 15 వశతాబ్దివాడు .శివుని పై తన అనన్య భక్తికి నిదర్శనంగా ‘’గీతా గౌరీపతి కావ్యం ‘’రచించాడు .ఇందులో సూర్య గణేశ అగ్ని దుర్గ శివులైన శివ పంచాయతనం వర్ణించాడు .తన రసమంజరిలో అర్ధనారీశ్వర తత్త్వం వివరించాడు .శివుడిని అనేక రకాలుగా అభివర్ణించి గీతా గణపతి అని పించుకున్నాడు జయదేవునిగీత గోవింద శైలి అనుసరించాడు .అలంకారిక తిలకం లో సరస్వతీ దేవి ప్రార్ధన అత్యుత్తమంగా చేశాడు .10 అద్యాయాలతో ‘’రస పారిజాత౦ ‘’రాశాడు .వీటికి పల్లవాలు అని పేరుపెట్టాడు .రసబంధుర కవిత్వం తో దీన్ని తీర్చి దిద్దాడు .గీతా గౌరీ పతి కావ్యానికి తానే వ్యాఖ్యానం రాశాడు అది అలభ్యం .
114- అజ్ఞాత కవి –రుచికార (15 శతాబ్ది )
శ్రోత్రియ బ్రాహ్మణుడు రుచికార థక్కూర-మాహో కున్న 5 గురు సంతానం లో పెద్దవాడు .గొప్ప కవిత సంపద ఉన్నవాడు . .ఇతని సవతి తమ్ముడు మహామహోపాధ్యాయ గోవింద ‘’కావ్య ప్రదీప’’లో రుచికారను గొప్పకవిగా చెప్పాడు .కాని రచనలు దొరకలేదు ‘
115-సుపద్మ వ్యాకరణ కర్త –పద్మనాభ మిశ్ర (15 వ శతాబ్దం )
15 వశతాబ్దికి చెందిన పద్మ నాభ మిశ్రా –‘’వాణీభూషణ ‘’కర్త దామోదర మిశ్రా కుమారుడు .దీర్ఘ ఘోష అనే మైధిల బ్రాహ్మణ వంశానికి చెందినవాడు .సుపద్మ వ్యాకరణం ,గోపాల చరిత్ర రచించాడు శిశుపాల వధ ,ఆనంద లహరి లకు వ్యాఖ్య రాశాడు .
ఇందులోని 10 6-నుండి 115 వరకు కవుల చరిత్రకు ఆధారం –మాఅబ్బాయి శర్మ సేకరించి పంపిన ‘’contribution of Mithila to Sanskrit Kavya and Sahitya Sastra ‘’.
సారీ-నిన్న 106 నుంచి ”ఢిల్లీ ”దారిపడతానని రాశా .కానీ మధ్యలో ”మిథిల”ఆకర్షించింది .ఎంతైనా మిథిల మా గోత్రీకురాలైన సీతమ్మ తల్లి పుట్టిన నగరం కదా
సశేషం
రధ సప్తమి శుభాకాంక్షలతో
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -24-1-18 –ఉయ్యూరు

