గీర్వాణకవుల కవితా గీర్వాణం -4 116-హరి విజయ కావ్య కర్త –రత్నపతి (16 వ శతాబ్దం )

గీర్వాణకవుల కవితా గీర్వాణం -4

116-హరి విజయ కావ్య కర్త –రత్నపతి (16 వ శతాబ్దం )

అమరావతి కి చెందిన కవిరత్న కుమారుడు ,దారి హర వంశీకుడు ,కాశ్యప గోత్రీకుడు మహా మహో పాధ్యాయ రత్నపతి .భావదేవుని సోదరి రత్నావతి ని పెళ్ళాడాడు .భావదేవుడు రత్నపతి కొడుకు మహా మహోపాధ్యాయ ఉమాపతికి మేనమామే కాకు గురువుకూడా .ఉమాపతి ‘’పదార్ధయా దివ్య చక్షు ‘’రాశాడు .రత్నపతి హరివిజయం రామ చరిత కావ్యాలు ,వివేకోదయం  రచించాడు.హరి విజయాన్ని మాఘుని శిశుపాల వధ పద్ధతిలో రాశానని కవే చెప్పాడు .రామ చరిత గురించి ఒక్క చోటే పేర్కొన్నాడు కాని గ్రంధం దొరకలేదు .

117-గీతా గోపీశ్వర కర్త –మహోపాధ్యాయ రామనాధ థక్కూర (16 వ శతాబ్దం )

తర్క పంచానన ,మహామహోపాధ్యాయ  సప్త కౌముది కర్త దేవనాద థక్కూర పెద్ద కొడుకు మహోపాధ్యాయ రామనాధ థక్కూర ..తల్లి  సావిత్రి .16 వ శతాబ్ది ప్రధమ భాగం లో తండ్రి దేవనాధ సాహితీ సామ్రాజ్యం యేలితే ,ద్వితీయార్ధం లో కొడుకు రామనాధ సాహితీ విజ్రు౦భణ చేశాడు .రస తరంగిణి లో తాను చెప్పుకున్నట్లు రామనాధ గీతా గోపీశ్వర ,శృంగార శతక ,మదన మంజరి ,కృష్ణహాస్య చంద్రిక కూడా రాశాడు .

118-అనిరుద్ధ (16 వ శతాబ్దం  )

మందార వంశం సిహౌళి శాఖకు చెందిన మహామహోపాధ్యాయ అనిరుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణుడు .రాఘవ ఝా కుమార్తె దేవ సేన ఇతని భార్య .మారుటిసోదరుడు మహామహోపాధ్యాయ హరిహర కంటే దేవసేన పెద్దది .అనిరుద్ధుని కొడుకు మహామహోపాధ్యాయ మోహన తన ‘’భావసింహ విరుదావళి’’లో తన తండ్రి అనిరుద్ధుడు అక్బర్ ఆస్థానం లో గొప్ప పేరున్నవాడు అని చెప్పాడు .రాజా మాన్ సింగ్ ను స్తుతిస్తూ అనిరుద్ధ చెప్పిన శ్లోకాలు ‘’విద్యాకర సహస్రిక ‘’లో మాత్రమె లభించాయి.

119- వి(బి)రుదావళి కర్త –దిగంబర థక్కూర(16 వశతాబ్దం )

 దిగంబర థక్కూరవంశం వారందరూ మహా మహోపాధ్యాయ బిరుదాన్ని వంశపారంపర్యంగా సాహిత్య ప్రతిభతో పొందినవారే .మిథిల శ్రోత్రియ బ్రాహ్మణ వంశం ఘుశాంత కు చెందినవాడు .కుటుంబం వారంతా సంస్కృతం లో ఉద్దండ పండితులే .ఈ వంశం లో మహామహోపాధ్యాయ ప్రజ్ఞాకార నుండి 8 వతరం వాడు దిగంబర.యితడు రాసిన ‘’విరుదావళి ‘’ వ్రాత ప్రతి దర్భంగా సంస్కృత విశ్వ విద్యాలయం లో భద్రంగా ఉన్నది .కూర్మాచల లేక కుమౌన్ వంశ రాజు ఉద్యోతనుడిని కవిత్వం లో ఆకాశానికి ఎత్తేశాడు .విరుదావళి పొ పేర్కొన్న దానిని బట్టి ఈ కవి ‘’ఉషా కర బంధ కావ్యం ‘’కూడా రాసినట్లున్నది కాని అలభ్యం.వృత్త రహస్యం అనే చందోగ్రంధం రాశాడు . అదీ కనిపించలేదు

120-భర్తృ హరి నిర్వేద కర్త –హరిహర (17 వ శతాబ్దం )

బిత్తూ గ్రామవాసి మహామహోపాధ్యాయ హరిహర కరమహా వంశీకుడు .సాదుపాధ్యాయ రాఘవ ఝా కుమారుడు .రుచిపతి తండ్రి మహామహోపాధ్యాయ నీలకంఠ పెద్దన్నగారు .మహాకవి నాటకకర్త హరిహర –సూక్తిముక్తావలి ,ప్రభావతీ పరిణయం ,భర్తృ హరి నిర్వేదం రాశాడు .ఇతని సూక్తిముక్తావలి లేక హరిహర సుభాషితం ముక్తకాల కూర్పు .ఆశువుగా సందర్భాన్ని బట్టి చెప్పిన శ్లోక సముదాయం .ఇందులో దేవీ,దేవతలు పిల్లలు వారి సంరక్షణ ,యువత,రాజధర్మాలు ,రాజకీయం వగైరాలున్నాయి .దీనికి చారిత్రిక ప్రాదాన్యమూ ఉన్నది .16, 17 శతాబ్దాల మిధిలానగర జన జీవిత విదాన విషయాలు కళ్ళకు కట్టినట్లు ఇందులో హరిహర  వర్ణించి చెప్పాడు, చూపాడు .అంతకు ముందు ఎవరూ వినని ‘’రామేశ్వర కవి ‘’గురించి పేర్కొనటం మరో విశేషం .

121 –భావ సింహ బిరుదావళి కర్త –మహామహోపాధ్యాయ మోహన (17 వ శతాబ్దం )

అనిరుద్ధ ,దేవ సేనలకుమారుడు మోహన .రాజా మాన్ సింగ్ కుమారుడు రాజా భావ  సి౦హుని  ఆస్థాన కవి .భావ సింహ విరుదావళి తోపాటు అన్యోక్తి శతకమూ రాశాడు .17 వశతాబ్ది కవి .విరుదావళి 8 అధ్యాలు .అన్యోక్తి వంద శ్లోకాల శతకం .

122-భ్రు౦గ  దూత కర్త –కవీంద్ర గంగానంద  (17 వశతాబ్దం )

17 వశతాబ్ది కవీంద్ర గంగానంద తాను ‘’తైరభుక్త ‘’అంటే తిర్హూట్ నివాసి అని చెప్పుకున్నాడు .మాతామహుని ఇంట్లోసారిసవ గ్రామం లో పెరిగాడు .ఆ గ్రామాన్ని ‘’గ్రామ రత్న ‘’గా పొగిడాడు .ఈ గ్రామ తరతరాలుగా సంస్కృతానికి పట్టు కొమ్మ .తాను ‘’పౌత్రి తనూజుడు ‘’గా అంటే తాతగారి కొడుకుగా చెప్పుకున్నాడు .తండ్రి పండిత రాయ రఘునందన .కవిత్వం లో గంగా నంద ప్రసిద్ధుడై కవీంద్ర బిరుదు పొందాడు .ఒకనాటకం ,నాలుగు అలంకార గ్రంధాలు రాశాడు . భ్రుంగ  దూతం అనేది 171 శ్లోకాల ఖండ కావ్యం .మేఘ దూతం బాణిలో ఉంటుంది .దూతకావ్యాలలో పేరు పొందింది .కాళిదాసు లాగా మందాక్రాంత  వృత్తాలనే వాడాడు .దీనికి  దర్భాంగ రాజు మహారాజాధిరాజ రామేశ్వరసింహ ఆస్థానకవి ,నవతోలగ్రామవాసి చేతనాద ఝా ‘’రామేశ్వర ప్రసాదిని ‘’పేరిట మంచి వ్యాఖ్యానం రాశాడు .గంగానంద కు బికనీర్ రాజు కర్ణ సింహ ఆశ్రయం కల్పించాడు .రాజు కోరికపై ‘’కర్ణ భూషణ౦ ‘’అనే అలంకార శాస్త్రం రాశాడు .

123-నరపతి జయ చర్య కర్త –మహోపాధ్యాయ వంశీమణి ఝా (17 వశతాబ్దం )

17 వ శతాబ్ది మహోపాధ్యాయ వంశీ మణి ఝా –మహోపాధ్యాయ రామచంద్ర ఝా కొడుకు ,దామోదర ఝా మనవడు మిధిలా వాసి భారద్వాజ గోత్రీక బ్రాహ్మణుడు .తల్లి జయమతి దేవి నేపాల్ లోభక్తపూర జగాజ్యోతిర్మల్ల రాజు ఆస్థాన కవి గా ఉన్నాడు .నరపతి జయ చర్య రాశాడు .రాజు పట్టాభిషేకం తర్వాత హరి కేళి మహాకావ్యం అద్భుత ధారా శుద్ధితో రాశాడు

124- జహంగీర్ బిరుదావళి కర్త –హరిదేవ మిశ్రా (1535-16 40 )

‘’అవిలంబిత సరస్వతి ‘’బిరుదాంకితుడు హరి దేవ మిశ్రా  15 35 లో పుట్టి 1640 లోచనిపోయాడు .తలిదండ్రులు విశ్వేశ్వర మిశ్రా ,కుముదినీ దేవి .జహంగీర్ గొప్పతనాన్ని కీర్తిస్తూ విరుదావళి రాశాడు .అనుప్రాస ,ఉత్ప్రేక్ష లను గుప్పించి చక్రవర్తి గొప్పతనాన్ని పెంచేశాడు .

125- షాజహాన్ బిరుదావళి కర్త –మహామహోపాధ్యాయ రఘునాధ మిశ్ర (17 వశతాబ్దం )

బాలకవి ,పండిత రాయ ,శ్రుతి ధర బిరుదులున్న మహామహోపాధ్యాయ రఘునాధ మిశ్రా 17 వ శతాబ్ది కవి .రఘుదేవ ,కుముదిని దేవి లపుత్రుడు .జమతారి నివాసి .16 38 లో ఢిల్లీ చక్రవర్తి శాహజాన్   ఆస్థానానికి వెళ్లి తన ప్రతిభా సంపన్నత ,జ్ఞాపక శక్తి తో మెప్పించి ఆస్థానకవి అయ్యాడు శాహజాన్ పై ‘’బిరుదావళి ‘’రాశాడు .మెచ్చిన చక్రవర్తి కవిని అతని అన్న హరి దేవ ను ఘన౦గా సత్కరించాడు .వారి విద్వత్తుకు అబ్బురపడి ఇద్దరికీ ‘’సరస్వతి ‘’బిరుదు ప్రదానం చేశాడు . రఘునాధ శ్లోకాలు విద్యాకరుని సంకలనం లో చోటు చేసుకున్నాయి .బిరుదావళి ని చిన్నతమ్ముడు సదానంద కు అంకితమిచ్చాడు మిశ్రా .యమక ,అనుప్రాసలతో షాజహాన్ కీర్తి మారు మోగేట్లు రాశాడు .సాగర పురానికి చెందిన చక్రధర ఝా దీనికి చక్కని వ్యాఖ్యానం ‘’విబుధ రాజిరంజిని ‘’రచించాడు .

ఇందులోని 11 6-నుండి 125 వరకు కవుల చరిత్రకు ఆధారం –మాఅబ్బాయి శర్మ సేకరించి పంపిన ‘’contribution of Mithila  to Sanskrit Kavya and Sahitya Sastra ‘’

  సశేషం

 26-1-18 శుక్రవారం భారత రిపబ్లిక్ డే శుభాకాంక్షలతో

   మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -25-1-18 –ఉయ్యూరు

 

 

 

 .

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.