మానవీయ మూర్తి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి
ధర్మ ప్రచారానికి సేవా ధర్మాన్ని కలిపి ,మానవ సేవే మాధవ సేవ అన్న సనాతన ధర్మానికి అనన్య ప్రచారం చేసి ,ప్రచారం తో సరిపుచ్చుకోక కార్యాచరణతో పరమార్ధాన్ని సాధించి చూపి ,మతం ఏదైనా అందరిలో ఉన్నది ఒకే పరమాత్మ తత్వమే నని బోధించి ,అనుసరించి అందరికీ మార్గ దర్శులైన మహనీయ మానవతా మూర్తి కంచి స్వామి శ్రీ జయేంద్ర సరస్వతి .క్లిష్ట సమస్యలను కూడా పలువిధ చర్చలద్వారా పరిష్కరించిన మహా నేర్పరి .దీనికి ఉదాహరణ అయోధ్యలో రామాలయ నిర్మాణ విషయం ముస్లిం పెద్దలను ఆహ్వానించి వారి మనో భావాలు తెలుసుకుని వారి మద్దతు కూడా కూడ గట్టె ప్రయత్నం లో సఫలత సాధించారు .భారతదేశ ప్రతిష్టకు ఆధారం హిందూ ధర్మమే నని నమ్మి మనసా వాచా కర్మణా ఆచరించి మార్గదర్శి అయ్యారు .ప్రతి మనిషిలో నారాయణు ని దర్సి౦చాలన్నది ఆయన సిద్ధాంతం .పరమాచార్య మార్గానికి మరింత సొబగులు కూర్చి,అందరికి అవకాశం కల్గించిన మానవీయ మూర్తి .
ముఖ్యంగా తెలుగు ప్రజలకు అత్యంత ఆరాధనీయులయ్యారు .ప్రతి గ్రామం పర్యటించి ధర్మ బోధ తో మరీ దగ్గరయ్యారు .వారి కాలం లో ఎన్నో దేవాలయాలు నూతనంగా నిర్మించబడి మరెన్నో వాటికి జీర్ణోద్ధరణ జరిగి ,ఇంకెన్నో వాటికి మహా సంప్రోక్షణాదులు జరిగాయి . క్రియా శీలకం గా ఉండటం వలననే ప్రజలకు మరింత చేరువయ్యారు .చాలా దేవాలయాలను కంచి మఠం. స్వీకరించి పరి రక్షించింది .దిక్కూ దివాణం లేని అనేక దేవాలయాల జీర్ణోద్ధరణ కోసం ప్రభుత్వాలను ఒప్పించి వాటికి వెలుగులు తెప్పించారు స్వామి. ఇదంతా వారి పూనికా సంకల్పమే .ధార్మిక కార్యక్రమాలకు ఇచ్చినంత ప్రాధాన్యం సామాజిక సేవాకార్యక్రమాలకూ ఇవ్వట౦ వారి ప్రత్యేకత . గోశాలలు నిర్మించి గోవులను పెంచే కృషిని అమలు పరచారు . అనుక్షణ ‘’నారాయణ మంత్ర’’ఉచ్చారణ వారిని శివకేశవ భేద రహితులను చేసి హరిహరాద్వైతాన్ని ఆచరణలోకి తెచ్చింది .
మారుతున్నకాలం లో విస్తరిల్లుతున్న విజ్ఞానం అందరికి అందుబాటు లోకి తెచ్చే యోచనతో కంచి పీఠం ద్వారా కంప్యూటర్ ట్రెయినింగ్,టైప్ రైటింగ్ సంస్థలను స్థాపించి యువతీ యువకుల శక్తి యుక్తులను సార్ధకం చేయిస్తున్నారు .పరమా చార్యుల వారి స్పూర్తి నరనరానా జీర్ణించుకున్న జయేంద్ర సరస్వతీ స్వామి ‘’చంద్ర శేఖర విశ్వ మహా విద్యాలయం ‘’నిర్మించి వేలాది మందికి విద్యాదానం చేశారు . హిందూ ధర్మ పరి రక్షణకోసం విస్తృతమైన సమావేశాలెన్నో నిర్వహించి స్పూర్తి ప్రేరణ కలిగించారు .సామాన్య మానవుల హృదయాలలో దైవాన్ని ప్రతిస్టింప జేయటమే లక్ష్యంగా వారు ప్రతి అడుగూ వేశారు .సనాతన కంచి పీఠ ధర్మాలను సంప్రదాయ బద్ధంగా పాటిస్తున్నా, వారి హృదయపు లోతులలో లౌకిక భావ దీప్తి ఉన్నది. అందుకే శంకర నేత్రాలయాలలో, ఇతర వైద్యాలయాలలో అన్ని మతస్తులవారు ఉచిత వైద్య సేవలు అందుకుంటున్నారు .ఇదే వివేకానందుని అనుస్టాన వేదాంతం .మానవుని మహోన్నత మానవునిగా చేయటమే ధ్యేయంగా వారు ప్రవర్తించి సర్వమానవులకు ఆదర్శ ప్రాయులయ్యారు .అందుకే వారిని ‘’సనాతన దీప్తి ,సాంస్కృతిక ప్రదీప్తి ‘’అన్నది ఆంద్ర భూమి .శ్రీ శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి వారి ఆధ్యాత్మిక తేజస్సు స్పూర్తి ప్రేరణ అందరకు మార్గ దర్శనం చేస్తాయి .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -1-3-18-ఉయ్యూరు
