నాదారి తీరు -111 అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2

  నాదారి తీరు -111

అడ్డాడ హైస్కూల్ లో నేనుచేసిన ప్రయోగాలు –సాధించిన సాఫల్యాలు -2

                     విద్యార్ధుల ప్రతిభకు పట్టాభి షేకం

ఇక్కడున్నది అందరూ వెనుకబడిన తరగతుల విద్యార్ధులే .తెలుగులో తప్పులు లేకుండా ఒక్క వాక్యం కూడా చదవలేని వారే .అయితే మట్టి లో మాణిక్యాలు దొరకవా వెతికితే ?అని పించింది .ప్రయత్నిస్తే సాధ్యంకానిది ఉండదని ఆర్యవాక్యం కదా .కనుక లోటు మనదగ్గర పెట్టుకుని పిల్లలపై నెపం వేయటం న్యాయమా అని వితర్కి౦చుకున్నాను .పిల్లలలో నైపుణ్యం ఉన్నవారిని శోధించి పట్టుకున్నాను .వీళ్ళు అన్నీ తెలిసిన వాళ్ళేమీ కాదు .సానబెడితే రాటు దేలే వాళ్ళు .వివేకానందస్వామి చికాగో లో చేసిన ప్రసంగానికి శతజయంతి దేశమంతటా ఉవ్వెత్తున జరుగుతోంది .మన స్కూల్ లో కూడా ఆయన స్పూర్తి నింపాలి అనే ఆలోచన వచ్చింది .దీనికోసం స్క్రిప్ట్ తయారు చేయాలి .పిల్లలను ఎంపిక చేసి వాళ్లకు చదవటం నేర్పించాలి .తప్పులు దొర్లకుండా చూడాలి .ఎన్నో రిహార్సిల్స్ చేస్తేనేకాని ఇది సాధ్యమయ్యే పని కాదు .పిల్లి మెడలో గంట ఎవరుకట్టాలి ?ఆలోచన నాదే కనుక ఆచరణా నాదే .అన్ని వార్తాపత్రిఅకలలో మాస వార పత్రికలలో ని విషయాలన్నీ సేకరించి విద్యార్ధుల స్థాయికి తగినట్లు వాళ్ళు సరదాగా మాట్లాడుకునే భాషలో ఒక రూపకం తయారు చేశా .చాలా బాగా వచ్చిందని పించింది .మగపిల్లలకంటే ఆడపిల్లల ఉచ్చారణ బాగా ఉందని పించి ముగ్గురు విద్యార్ధినులను ఎంపిక చేసి మధ్యాహ్నం ఇంటర్ వెల్ సమయం లో వాళ్ళకూ నాకూ ఖాళీ ఉన్న పీరియడ్స్ లో లేకపోతె స్కూల్ అయ్యాక ఒక అరగంట ప్రాక్టీస్ చేయించి ,స్క్రిప్ట్ చేతిలో నేఉంచుకుని చదివించా .బాగా చదివారు.  నా ఎక్స్ పెక్టేషన్ కు తగ్గట్టు గా చదివారు .దీనిని టేప్ రికార్డర్ పై రికార్డ్ చేయించి ముందుగా వాళ్ళకే వినిపించా .వాళ్ళే ఆశ్చర్యపోయారు అంతబాగా తాము చదివామా అని .తర్వాత మీటింగ్ హాల్ లో చికాగో సభ శతజయంతి ఘనంగా చేశాం .నేను మాట్లాడి  మిగిలిన టీచర్స్ తో మాట్లాడించి ,ఒకరిద్దరు స్టూడెంట్స్ తోనూ దాని ప్రాధాన్యాన్ని వివరి౦పజేసి  చివరికి నేను తయారు చేసిన రూపకాన్ని ప్రదర్శింప జేయించా .పిన్ డ్రాప్ సైలెన్స్ గా విద్యార్ధులందరూ శ్రద్ధగా విన్నారు .వివేకాన౦దుని ప్రసంగం చాలా స్పూర్తిదాయకం గా చదివారు అందులో .చప్పట్లు మోగిపోయాయి నాన్ స్టాప్ గా .పాల్గొన్న విద్యార్దినుల పేర్లు నాకు గుర్తు లేవు .కాని గ్రాండ్ సక్సెస్ .ఇసుకలో కూడా తైలం తీయవచ్చు ననే ధీమా కలిగింది .పిల్లల తప్పు ఏమీ లేదు మన ప్రయత్న లోపమే అని అందరికీ తెలిసింది .ఊళ్ళో వాళ్లకు ఈ రూపకం విషయం తెలిసి మమ్మల్ని బాగా అభినందించారు .మా ప్రతి సభలో స్కూల్ కమిటీ ప్రెసిడెంట్ రామ బ్రహ్మం గారు ఉండేట్లు చేసేవాడిని .పిల్లలలో ఆత్మ విశ్వాసం పెరిగింది .అదే నాకు కావలసింది .

            ఎంట్రన్స్ పరీక్ష కు ఒకే ఒక విద్యార్ధి

  రోజులు బాగానే గడిచిపోతున్నాయి .రోజూ ఉయ్యూరు నుంచే వచ్చి వెడుతున్నాను .మా దగ్గర పని చేస్తున్న సోషల్ మాస్టారు శ్రీ చీలి వెంకటేశ్వరావు గారు పామర్రు బదిలీ చేయించుకున్నారు .ఆయన స్థానం లో మేడూరు లో ణా దగ్గర పని చేసిన పామర్రు నేటివ్ మస్తాన్ గారు వచ్చారు .రావు గారు ఆయన చాలా కష్ట పడి బోధించేవారు .పిల్లలపై గొప్ప గ్రిప్ ఉండటమేకాదు వాళ్ల అభిమానాన్ని బాగా పొందారు .ఆయన మాట వేద వాక్కు గా ఉండేది వాళ్లకు .నాకు అత్యంత ఆప్తులు గా ఉండేవారు చిరునవ్వు ముఖంతో ప్రశాంతంగా ఉండేవారు .   ఆయన ఒక రోజు వచ్చి తన ఒక్కగానొక్క కూతురు నాగ లక్ష్మి ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష అడ్డాడలో రాసి జాయిన్ ఆవాలను కుంటో౦దని తనకూ ,ఆ ఆలోచన నచ్చిందని కనుక ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించమని కోరారు .అప్పటికి నేను చేరి రెండేళ్ళు అయింది .ఎవరూ ఇలా అడగలేదు .సాధారణంగా పెద్ద హైస్కూల్స్ అంటే పామర్రు ఉయ్యూరు లాంటి చోట్ల ఈ పరీక్షలు నిర్వహిస్తారు .ఇక్కడ నాకు మొదటి అనుభవం .ప్రశ్నా పత్రాలు  మా టీచర్స్ తోనే తయారు చేయించి దిద్దించి ఫలితాలు ప్రకటించాలి .స్టాఫ్ మీటింగ్ పెట్టి సంప్రదించాను .మనదగ్గర పని చేసిన మాస్టారు కనుక ఆయన అభ్యర్ధన మన్నించటం న్యాయం అన్నారు .సరే అని  ఆ కార్యక్రమ షెడ్యూల్ ప్రకటించి ,ప్రశ్నాపత్రాలు తయారు చేయించి పరీక్షలు నిర్వహించాం .నాగ లక్ష్మి ఒక్కతే పరీక్ష రాసింది . ఆ చిన్నారి కోసమే ఇంత ఏర్పాటు .పరీక్షలన్నీ బాగా రాసింది .పేపర్లు స్కూల్ లోనే దిద్దించి మార్కులతో సహా ఫలితాలు ప్రకటించి నాగలక్ష్మి ఉత్తీర్ణు రాలైనట్లు ప్రకటించి పై అధికారులకు వర్తమానం పంపాను .నాగ లక్ష్మి సన్నగా చలాకీగా ఎర్రగా చందమామ లాంటి వెడల్పు ముఖంతో ఆకర్షణీయంగా ఉండేది .ఆరవ తరగతి లో చేరి ,నేను ఇక్కడ రిటైర్ అయ్యే నాటికి అంటే జూన్ 1998 కి పదవ తరగతి స్కూల్ ఫస్ట్ గా వచ్చి పాసైంది .ఆ అమ్మాయి ఇక్కడ చేరటం తో మాకు ఆటలలో, పాటలలో ,సాంస్కృతిక కార్యక్రమాలలో  గొప్ప సహకారం లభించింది ఈ అయిదేళ్ళు .అన్ని సబ్జెక్ట్ లలో ఫస్ట్ మార్కులు సాధించేది .ఎప్పుడూ స్కూల్ బెస్ట్ ఆ అమ్మాయే .టెన్త్ లో స్కూల్ ఫస్ట్ వచ్చినందున నేను రిటైరయిన సంవత్సరమే మా తలిదండ్రుల పేరిట స్కూల్ ఫస్ట్ విద్యార్ధికి 500రూపాయలు నగదు బహుమతి ప్రకటించి మొదటి సారిగా నాగలక్ష్మికి అంద జేశాను . ఆతర్వాత నాలుగైదేళ్ళు ఇక్కడి స్కూల్ ఫస్ట్ విద్యార్ధికి నగదు బహుమతి అందజేశాను తర్వాత నా ఆరాటమే కాని స్కూల్ వాళ్లకు ఎవరికీ పట్టలేదు ఉత్తరాలపై ఉత్తరాలు రాసి ,విసుగు చెంది వదిలేశాను .నాగలక్ష్మి  మా అందరి మనసులను గెలిచిన చిన్నారి అయింది .డిబేటింగ్ లో వక్తృత్వం లో  ,పాటలలో వ్యాసరచానలో కబాడీలో  ,ఖో ఖో ఆటలో ,త్రో బాల్,ఒకటేమిటి అన్నిటిలో తన సృజన ,ప్రజ్ఞా,ప్రతిభ చాటుకున్న విద్యార్ధిని నాగ లక్ష్మి .మా కార్యక్రమాలను తన ఇంట్లో ఉన్న ఫిలిప్స్ టేప్ రికార్డర్ పై రికార్డ్ చేసి భద్రపరచిన ఆలోచనా శీలి అవి అన్నీ నాదగ్గర క్షేమ౦గా ఉన్నాయి .

 టెన్త్ అవగానే ఆ అమ్మాయి గుడివాడలో చేరి ఇంటర్ చదివి మంచి మార్కులతో పాసైంది.బి టెక్ చదువుతానని పట్టు బట్టింది .తండ్రి నా దగ్గరకొచ్చి సలహా అడిగారు .అంత డబ్బు పెట్టి చదివి౦చలేను .ణా ఆరోగ్యమూ అంతంత మాత్రం అన్నారు .’’మీ ఆలోచన సరి అయినదికాదు ఆ అమ్మాయికి ఇష్టమైన చదువు చదివించాలి .అందులో చదివి సాధించగల తెలివి తేటలున్న వాళ్ళను వెనక్కి లాగటం భావ్యం కాదు .మీకు ఆర్ధికంగా ఇబ్బందే కాదనలేను ఆ అమ్మాయి స్కాలర్ షిప్  లు తెచ్చుకుని మీకు ఆర్ధిక భారం తగ్గిస్తుంది .నా మాట విని చదివించండి ‘’అని సలహా చెప్పాను .’’మీరు చెప్పారు కనుక మీ మాటనాకు శిరో దార్యం .ఎన్ని కస్టాలు పడినా నాగలక్ష్మిని బి టెక్ చదివిస్తాను ‘’అన్నారు అలాగే చదివించారు .ఆ అమ్మాయీ చక్కగా చదివి మంచి మార్కులతో పాసై ,తలిదండ్రులు కుదిర్చిన దుబాయ్ ఇంజనీర్ కుర్రాడిని పెళ్ళాడింది. వివాహాన్ని వెంకటేశ్వరరావు గారు బెజవాడలో మహా వైభవంగా చేశారు .నన్ను తప్పక రమ్మని శుభలేఖ పంపటమేకాక ఫోన్ కూడా చేశారు. వెళ్లి ఆశీర్వ దించి వచ్చాను .ప్రతి జనవరి ఫస్ట్ కు ఆయన ఉయ్యూరు వచ్చి మాకు స్వీట్ పాకెట్, పళ్ళు ఇచ్చి వెళ్ళటం ఆనవాయితీగా చేసేవారు .అప్పటిదాకా నేను దీన్ని సీరియస్ గా తీసుకోలేదు .అప్పటినుంచి నేనూ స్వీట్ పాకెట్ కొని ఇంట్లో ఉంచి జనవరి ఫస్ట్ గ్రీటింగ్స్ తెలిపినవారికి స్వీట్ ఇవ్వటం అలవాటు చేసుకున్నాను .దీనికి నాకు ఆదర్శం  నాగలక్ష్మి తండ్రిగారు వెంకటేశ్వరరావు గారే .అడ్డాడలో నాగలక్ష్మి పుట్టిన రోజు పండుగలు , ఆమె బంతి అన్నీ చాలా వైభవం గా చేసి స్టాఫ్ అందరికీ భోజనాలు పెట్టేవారు . ఆతిధ్యం ఇవ్వటం లో ఆయన ఏ లోటూ చేసేవారు కాదు .ఆయనకు ఎలమర్రు దేవాలయం లో అర్చకత్వమూ ఉండేది .అన్నీ యధావిధిగా చేసేవారు .

   రెండేళ్ళక్రితం నాగలక్ష్మి ఫోన్ నంబర్ ఎవరో అడ్డాడ కుర్రాడు ఇస్తే వాట్సప్ లో మాట్లాడా .మద్రాస్ లో ఉంటున్నానని తన తండ్రి గారు చనిపోయారని తెలిపింది .మంచిమనసున్న ఆధ్యాత్మిక పరులు వెంకటేశ్వరావు గారు .అలాగే కాటూరి ఆనంద్ అనే కుర్రాడు ,రైల్వే లో ఇంజన్ డ్రైవర్ అయిన ఇంకో కుర్రాడు బాగా జ్ఞాపకం .వీళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలలో నాకు బాగా సహకరించారు .వీరందరికంటే బళ్ళారి నుంచి ఇక్కడికి వచ్చి 9 ,10 తరగతులు మాత్రమె చదివి ,అందరికీ తలలో నాలుకగా మెలగిన కోడూరు పావని గురించి ,పద్యనాటకం లో నటించి నాకూ వాళ్ళకూ కీర్తి గడించిపెట్టిన విద్యార్ధుల గురించి వచ్చే వ్యాసం లో తెలియ జేస్తాను .

   సశేషం

   మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -6-5-18—ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged , . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.