రాచకీయ కలగూరగంప

రాచకీయ కలగూరగంప

ఎడ్డీ జిడ్డీ ముఖం

నిన్న కర్నాటక 23వ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన ఎడ్డీ ముఖం చూశారా ?సంతోషం కాని ఆనందం కాని గెలుపు ఉత్సాహం కానీ ఆ మోహంలో నాకు కనిపించలేదు. తెచ్చిపెట్టుకున్ననవ్వు ,ఏదో గెలిచానులే అన్నట్లు చేతులూ  వేళ్ళూ ఊపటం కృతకంగా ఉంది.తాను చెప్పిన రోజే పదవి చేబట్టానన్న కొంచెం పాటి గర్వం తప్ప ముఖం అంతా వైట్ సిమెంట్ పూసినట్లు ఉంది .మనసులో గద్దె నిలుస్తుందా లేదా అన్న ఆందోళన ,ఎరకు ఎమ్మెల్యేలు ఎంతమంది పడతారన్న ఆవేదన ,సుప్రీం ఏం తీర్పు ఇస్తుందో నన్నభయం  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నామేమో అన్న సంకోచ౦ నాకు కన్పించాయి .మీకు కన్పించాయో లేదో ?చూసేవాడిని బట్టి ఉంటుంది .కనుకనే గప్ చిప్ గా  9-30 కు జరగాల్సిన తంతు ను 9 కే నిమిషాలలో ముగించి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది .దీనితర్వాత అసలు ముఖ్య కార్యం క్రమం కూడా ఉందిగా .పోలీసాఫీసర్ల బదిలీలు ,అనుకూలమైనవారి నియామకాలు కాంగ్రెస్ జే డి కాంప్ లవద్ద భద్రత తొలగించటాలు  వగైరాలు చకచకా చేసి ఎడ్డీ మార్క్ ప్రజాస్వామ్యాన్ని చాటుకున్నాడు .గుబులుకు మనసులో మరో కారణం కూడా ఉండి ఉండచ్చు .’’మా౦త్రిక ద్వయ౦’లేకుండా ‘గద్దె పండగ’’ జరగటం .ఏమైతేనేం తాను ప్రకటించిన 17 వ తేదీకే  గవర్నర్ ను ఒప్పించి ప్రమాణం చేయటం .బహుశా సమీప భూతకాలం లో ఇలా జరగటం ఇదే ప్రధమమేమో ?

విలువలవలువలూడ్చి

ఇందిరా గాంధీ రాజ్యమేలిన కాలం లో ప్రజాస్వామ్య వ్యవస్థ అంతా  భ్రస్టు పట్టించింది .రాజ్యాంగం అంతా ఖానీ అయింది .ప్రజాస్వామ్య విలువల వలువలూడ దీయించి గోచీతో, బికినీ తో నిలబెట్టింది .అయ్యో ఇందిర ప్రజాస్వామ్య ద్రోహి అని గుండెలు బాదుకున్నాం .ప్రతి వ్యవస్థను తన కాలి కింద అణచిపెట్టి పాలన చేసింది. కోటరీ దే ఇష్టారాజ్యం .కాదన్నవాడు కాసుకు కొరగాకుండా చేసింది . ఎన్నికలు అంటే గెలుపే అన్నది ధ్యేయం అయింది.మూలాలన్నీ నాశనమై పోయాయి .పూచికపుల్లను నిలబెట్టినా గెలుస్తుంది అన్న అతి విశ్వాసం ఏర్పడి ఇందిరే ఇండియా అనే భజన పరుల బందీగా చిక్కింది .ప్రజలు  చేష్ట లుడిగి  చూస్తూ ఊరుకునే స్థితికి వచ్చారు .చివరికి కూష్మాండం బద్దలై ,పాపాల చిట్టా బద్దలై జయ ప్రకాష్ నారాయణ్ నేతృత్వం లో ఏర్పడిన జనతా పార్టీతో పునాదులన్నీ కదిలే పోయాయి .ఊహించని అపజయం ఏర్పడి పీచేమూడ్ అయింది .అంతర్గత వైరుధ్యాలతో జనతా కల కలగా త్వరలోనే అంతమై స్వయం కృతాపరాధమై  మళ్ళీ ఇందిరే గద్దేనేక్కింది .ఆ తర్వాత ఆమె వారసులే పాలన చేశారు .మహా ప్రజాస్వామ్య ఉదారవాది వాజ్ పేయి అన్ని పార్టీల సహకారం తో గద్దెనెక్కి మన దేశ పరువు ప్రతిష్టలను విదేశాలలోనూ చాటాడు ..’’మనపంతులు’’రావు అధికారం పొంది సంస్కరణలతో దేశ ప్రగతిని మార్చేశాడు .తర్వాత ఆయన్ను దించి తాను ఎక్కే వీలు లేక ‘’మౌన ముని ‘’’’కోటు జేబుల్లో చేతులాయన ‘’ని ఎక్కించి పదేళ్ళు బాక్ సీట్ డ్రైవింగ్ తో రాజ్యాంగేతర శక్తిగా పాలన చేసిని ఇటలీ యువతి మాజీ ప్రధాని కోడలిగా .భార్యగా అవతారం దాల్చి౦ది  .అప్పటిదాకా దేశమంతా దాదాపు కాంగ్రెస్ పాలనలోనే ఉంది .ప్రదానికాని, పార్టీ ప్రెసిడెంట్ కాని కాగితం ముక్క చేతిలో లేకుండా ఒక్క అక్షరం కూడా మాట్లాడ లేని పరిస్థితి .

దీనితో ప్రజల్లో విరక్తి పుట్టటం అవినీతి ఆరోపణలతో దిక్కు తోచని స్థితిలో మాటల గుజరాత్  మాంత్రికుడు  ఆయన శిష్యుడు కమలం పార్టీకి దిక్కు అయి ముసలి ముఠా ను మూలకు తోసి ,చరిత్రలో లిఖించదగ్గ విజయం సాధించి మోడీ ప్రధాని అయ్యాడు .మొదట్లో మాటలలో ప్రజాస్వామ్యం విలువలు రామ రాజ్యం  క్షణం తీరిక లేకుండా విదేశీ పర్యటనలు దేశం లో మారుమూల ప్రాంతాలూ తిరుగుతూ ప్రజల మనిషిని అనే గొప్ప భ్రమకలిగించాడు .కాంగ్రెస్ కు దిక్కు లేకుండా పోయింది .జరిగిన ప్రతి ఎన్నికలో ఓడిపోయి తెల్ల జెండా యెత్తేసింది .ఈనాటికి కర్నాటకతోకలిసి 23 రాష్ట్రాలు కమలం హస్తగత మై మరో రికార్డు  సృష్టి జరిగింది .రికార్డ్ లు బాగానే ఉన్నాయి కాని ప్రాస్వామ్యం ,అంతర్గత ప్రమాణాలు మృగ్యమైపోయాయి .ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తామన్న కమల నాయకులు పితామహుడు ఆద్వానీనే నాయకుడు అవమాన పరుస్తుంటే కిం అనక పోవటం తో ప్రజాస్వామ్యం ఆహాస్యం పాలైంది .గెలవటానికి అన్ని నీచ పద్ధతులను లోగడ కాంగ్రెస్ వాడినట్లే వాడేస్తున్నారు .మీడియా లో చాలా పల్చబడి పోయింది పార్టీ ప్రతిస్ట ,ప్రభుత్వ పరువుకూడా  .బయట పల్లకీ మోత ఇంట్లో ఈగలమోత చందం అయింది కేంద్ర ప్రభుత్వం పని .ప్రజలప కాంగీ  పెనం మీదనుంచి కమలం పొయ్యిలో పడిన చందమే అయింది .ప్రజాస్వామ్య విలువల వలువలు పూర్తిగా చి౦పేసి  దబాయి౦పు  సెక్షన్  తో  నిస్సిగ్గుగా బజార్లో నిలబెట్టారు .శాంతం పాపం .

ఇప్పుడు కర్నాటక సీన్ రసకందాయం గా మారింది .ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ ఖూనీ చేసినవాళ్ళే అరుస్తున్నారు .శాసన సభ్యులను జారిపోకుండా కాపాడుకోవటానికి’’ కాంపుల కంపు ‘’నడిపిస్తున్నారు .తమ మనుసులమీద నమ్మకం లేక అవతలి వారిపై అరుస్తున్నారు అందరూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినవారే  పొడుస్తున్నవారే .’’దొంగతనం చేసి ‘’దొంగను పట్టుకోండి ‘’అని అరుస్తున్న వాళ్ళే .కనుక గొంగట్లో తింటూ ఎందుకు బాధ పడటం ?అనుభూతి కవి తిలక్ కోరినట్లు ‘’దేవుడా రక్షించు నా దేశాన్ని ‘’

జెపి గా మారబోతాడా జెడి

జెపి అంటే లోక్ నాయక్ కాదు .లోక్ సత్తా నాయకుడు .బంగారం లాంటి ఉద్యోగం చేసుకుని అందరికి మంచి సలహాలిస్తూ కన్సల్టంట్ గా పేరు తెచ్చుకుని కుళ్ళు రాకీయ రొంపిలోకి  పార్టీ పెట్టి దిగి తాను ఒక్కడుమాత్రమే గెల్చి చివరికి ఏమీ చేయలేనని తెలుసుకొని పార్టీని రద్దు చేసుకుని పెద్దమనిషిగా బుద్ధి మంతుడుగా ఉన్నాడు జెపి .మనలాగే దేశం అంతా  కుళ్ళిపోయింది వ్యవస్థ భ్రస్టు పట్టిందని సమూలంగా మార్చేద్దామన్న మంచి కోరికతో లక్షల జీతం వచ్చే ఉద్యోగం అధికారం వదిలేసి శ్రీ జెడి లక్ష్మీ నారాయణ రాజకీయాలలో చేరుతానని పగటి కలలు కంటున్నాడు .ఇలాంటి వాళ్ళు ఒడ్డున ఉండి జనాన్ని నడిపించ గలరేకాని  వీళ్ళమాట విని జనం ఓటు వేస్తారంటే నమ్మరానిమాట .జెపి లాగా జెడి రొంపిలోకి దిగి మునగటం  మంచిదికాదు  .ఏదైనా పార్టీలో చేరి సేవ చేయచ్చు అప్పుడు తాను అనుకున్న విలువలు ఆచరించటం అసాధ్యం అని త్వరలోనే గ్రహిస్తాడు .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-5-18 –ఉయ్యూరు

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

1 Response to రాచకీయ కలగూరగంప

  1. Anna's avatar Anna says:

    JP and JD taken foolish decision

    Like

Leave a reply to Anna Cancel reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.