నాదారి తీరు -114 బాలబందు ను సత్కరించ లేక పోయాం

నాదారి తీరు -114

బాలబందు ను సత్కరించ లేక పోయాం

తెలుగులో బాలసాహిత్యం రాసిన వారు బహు అరుదుగా ఉన్నారు .శ్రీ చింతా దీక్షితులుగారు బాలసాహిత్యం లో అపూర్వ సృష్టి చేశారు .’’లక్కపిడతలు ‘’మొదలైన ఆయన రచనలు బాగా వ్యాప్తి చెందాయి .ఆ తర్వాత తరం లో బాలబందు శ్రీ బి వి నరసింహారావు ,బాలసాహిత్య చక్రవర్తి శ్రీ ముదునూరు వెంకటేశ్వరరావు ,సోమంచి రామం అని పిలువబడే శ్రీ సోమంచి శ్రీరామ చంద్ర మూర్తి ముఖ్యులు .దాదాపు మూడు నాలుగు దశాబ్దాలు వీరు బాలసాహితీ సృజన చేశారు  .ఉపాధ్యాయులుగా ,స్కూళ్ళ ఇన్స్పెక్టర్ గా బాలబందు వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూనే సాహిత్య సృష్టి చేసి బాలలు మాట్లాడు కొనే భాషలో రాయటమేకాదు అలా పలకటమూ చేసి తనకున్నసంగీత  నృత్య ప్రాభవాన్ని రంగరించి వారి హృదయాలకు చాలా దగ్గరయ్యారు .శ్రీ ముదునూరువారు ‘’బాలభారతి ‘’స్థాపించి అనేక కధలు పాటలు నాటికలు రాసి  పిల్లలతో వేయించి ,రేడియోలో కార్యక్రమాలు నిర్వహించి తనకూ బాలసాహిత్యానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టి’’ బాల సాహిత్య చక్రవర్తి ‘’అని పించుకున్నారు .సోమంచి రామం గారు  కృష్ణా  జిల్లా పరిషత్ లో సోషల్ టీచర్ గా ,సమర్డులైన ఆదర్శ ప్రధానోపాధ్యాయులుగా  ,ప్రెసిడెంట్ అవార్డీగా , ప్రముఖులయ్యారు .కొత్తగా పదవి చేబట్టే హెడ్ మాస్టర్స్ కు  కరదీపికగా ఆయన  చిన్న పుస్తకం రాశారు .మాలా౦టివారందరికీ ఆయనా ,ఆయన పుస్తకం మార్గ దర్శకం .యవ్వనం నుండీ ఆయన గొప్ప కథకులు  వందలాది కథలను పిల్లలకు పెద్దలకోసం రాశారు .పాటలు, చిన్న నాటికలుకూడా  రాశారు  .విజయవాడ రేడియో లో అవి అనేకసార్లు పునః ప్రసారాలు .రామంగారు నాకు ,శ్రీ ఆంజనేయ శాస్స్త్రి, శ్రీ కోసూరి ఆదినారాయణ వంటి వారికి మెంటార్.ఆయన మాట మాకు సుగ్రీవాజ్నే .ఇప్పటికి సుమారు గా 95 ఏళ్ళు వచ్చి ఉంటాయి .అయిదారు ఏళ్ళ క్రితం  వరకు తరచూ కలుసుకొనే వాళ్ళం  ఫోన్ లో మాట్లాడుకొనే వాళ్ళం .ఆయనకు వినికిడి శక్తి తగ్గటం తో కుదరటం లేదు .ఆయన సమకాలీన సమస్యలపై గొప్ప కథలు రాసేవారు .వృద్ధాప్యం లో ఉన్న సమస్యలపై రాసేవారు .అవి ప్రచురణ అవగానే లేక ప్రసారం అవగానే నాకు పంపటం నేను కార్డు మీద మిల్లీ మీటరు కూడా ఖాళీ లేకుండా నా స్పందన తెలియ జేయటం అరిగేది  .వెంటనే ఆయన ఫోన్ చేసి తమ ఆనందాన్ని వ్యక్త పరచేవారు .

శ్రీ పాలంకి శ్రీరామ చంద్ర మూర్తి శ్రీ కే సభా వంటి వారు కూడా బాలసాహిత్యం లో అద్భుత కృషి చేశారు .తర్వాత శ్రీమతి డి.సుజాతాదేవిని పేర్కొనాలి .ఈమె ఉస్మానియాలో బాల సాహిత్య శాఖలో ఉండేవారు . ఉయ్యూరు సాహితీమండలి కి ఈమెను ఆహ్వానించి కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారి ఆధ్వర్యం లో ఒక నడివేసవి సాయంత్రం సన్మా నించాం .ముదునూరు వారినీ అడ్డాడ హై స్కూల్ కు ఆహ్వానించి ఘన సత్కారం చేశాం .సరసభారతి ఏర్పాటు చేశాక వారిని ఉయ్యూరు లో సన్మానించాం  కూడా .ఒక్క బాలబందు గారినే అడ్డాడ హై స్కూల్ లో సత్కరించలేక పోయిన దురదృష్టం మాది .

నాకు గ్రాయకం వచ్చిన దగ్గరనుండి బాలబందు గారి గురించి వింటూ, చదువుతోనేఉన్నాను .నేను ఉయ్యూరు హై స్కూల్ లో సైన్స్ మాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు ఆయనను ఆహ్వానించి ,పిల్లలకు ఆయనచేత అద్భుత ప్రసంగాన్ని వినిపించి గొప్ప ప్రేరణ కలిగించాం .ఆయన స్వరం బహు సున్నితంగా ,’’ఫెమినైన్ క్వాలిటీ ‘’తో ఉండటం ప్రత్యేకం .ఆయన అభినయం బహు విధాలుగా చూపరులకు ఆకర్షణీయంగా ఉండేది .మాటలు బహుమెత్త గా ఉండేవి .పాటలు బహుకమ్మగా పాడేవారు .పాడుతూ ఆయన చేసే అభినయం చూస్తే హృదయాలు రసప్లావితమయ్యేవి .ఎన్ని వేలమంది ఉన్నా ఆయన ప్రసంగం అమితంగా ఆకర్షించేది .నాట్యం చేస్తే అప్సర చేసినట్లు ఉండేది .సకల కళా వల్లభుడు ఆయన .ఆయనతో మాట్లాడటం ఒక ఎడ్యుకేషన్ అనిపించేది .ఉయ్యూరు స్కూల్ లో చూసినతర్వాత మళ్ళీ ఆయన్ను ఎక్కడా కలుసుకోలేదు .కలిసి మాట్లాడాలని లోపల కోరిక గాఢంగా ఉండేది .

అడ్డాడ లో చేరిన తర్వాత బాలబందుగారు గుడివాడలోనే నే విశ్రాంత జీవితం గడుపుతున్నట్లు పేపర్ల ద్వారా తెలిసింది .మా స్టాఫ్ మెంబర్లు ఒకరిద్దరిని వారి గురించి వాకబు చేయమని చెప్పాను .వారు వివరాలు సేకరించి చెప్పారు .గుడివాడ మెయిన్ రోడ్ లో రెండస్తుల స్వంత భవనం లో వారు ఉంటున్నారని వారబ్బాయి ,లోకల్ స్కూల్ లోనో జిల్లాపరిషత్ స్కూల్ లోనో లెక్కల మేష్టారు అనీ తెలిపారు ..బాలబందు ను ఎలాగైనా కలిసి మాట్లాడి వారిని అడ్డాకు ఆహ్వానించి వారి చేత విద్యార్ధులకు ప్రేరణ కలిగించాలన్నది నా తాపత్రయం .అందుకే ఇంత తపన .డ్రిల్ మాస్టర్ నాగేశ్వర రావు ను వారింటికి వెళ్లి  ఫలానా రోజు మేము వారిని చూడటానికి వస్తున్నామని తెలపమన్నాను .ఆయన అలాగే వెళ్లి వారిని కలిసి  అంగీకారం తీసుకున్నాడు .ఒక రోజు సాయంత్రం స్కూల్ అయ్యాక నేనూ నాగేశ్వరావు ,సేకండరీగ్రేడ్ వీరభద్ర రావు కలిసి గుడివాడ వెళ్లి నరసింహా రావు గారింటికి వెళ్లాం .ఆయన మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు .తేనె రంగు దేహ చ్చాయ వారిది .ముసలితనం లోనూ బహు చలాకీగా ఉన్నారు .ఉయ్యాలబల్లపై ఊగుతూ కనిపించారు .కాఫీ ఫలహారాలు ఇప్పించారు .వారితో సంభాషణ సాగించాం .వారు తమకొచ్చిన అవార్డ్ లు ,జరిగిన సత్కారాలు ,రచించిన బాలసాహిత్య పుస్తకాలు చూపించి తమ ప్రతిభా సర్వస్వాన్ని ఆవిష్కరించారు .అప్పటిదాకా వారి గురించి నాకు తెలిసింది బహు స్వల్పం అని పించింది వారి శేముషీ వైభవం సంపూర్తిగా ఇప్పుడు అర్ధమయింది .వారితో మాట్లాడుతూ ఉంటె కాలమే తెలియలేదు. అంత ఆనందంగా సమయం గడిచింది .మాకూ వారికీ అనుకూలమైన రోజున అడ్డాడ హై స్కూల్ కు విచ్చేసి తమ బహుముఖ ప్రజ్ఞా పాటవాలను విద్యార్ధులకు తెలియజేసి వారికి స్పూర్తి కలిగించాలని కోరాం.వారు మా ఆహ్వానం తమకు ఎంతో సంతృప్తి కలిగించిందని తప్పక అతి త్వరలోనే వస్తానని ,అది తన ధర్మ౦ అని  అంగీకారం గా తెలిపారు.  చాలా సంతోషించాం ముగ్గురం .వారికీ కృతజ్ఞతలు తెలియజేసి ఇంటికి బయల్దేరి వచ్చేశాం .

బాలబందును ఆహ్వానించి ప్రేరణాత్మక ప్రసంగం చేయించటానికి స్టాఫ్ మీటింగ్ పెట్టి అందరి అంగీకారం

 

తెలుసుకొన్నాక విద్యార్ధులకు కూడా అసెంబ్లీలో  తెలియ బరిస్తే  వాళ్ల ఆన౦దానికి అవధులు లేవని పించింది .అడ్డాడ కు అత్యంత సమీపం లో గుడివాడ లో ఇంత గొప్ప లెజేండరి పర్సన్  ఉన్నట్లు చాలా మందికి తెలియదు .దీన్ని సార్ధకం చేసి వారిని ఈ స్కూల్ విద్యార్ధులకు పరిచయం చేసి దానివలన వారికి స్పూర్తి కలిగించాలని ఎంతో ఆలోచించాం .అందరికీ అత్యంత ఇష్టమైన కార్యక్రమంగా భావించాం  .     కాని మాకు వారిని ఆహ్వానించి సన్మానించే అదృష్టం దక్కలేదు .మేము వారిని కలిసి వచ్చిన కొద్ది రోజులలోనే వారు మరణించారని తెలిసి హతాశులయ్యాం   వారి భౌతిక కాయాన్ని దర్శించి నివాళు లర్పించి వచ్చాం .అంతా మన చేతులలో లేదు అంటారందుకే  అనుకోవటమే మనిషిపని .అనుకున్నవన్నీ జరగవు కొన్ని అన్నపాట ఈ వేదాంతం లోంచి వచ్చిందే .

కంకిపాడు మండలం తెన్నేరు లో శ్రీ దేవినేని మధుసూదనరావు గారు ఉన్నారు .ఆయన కు గన్నవరం దగ్గర పెద అవటపల్లిలో హై టెక్ ప్రింట్స్ సంస్థ ఉండేది .మంచి మోతుబరి .అక్కడ అమెరికా స్టైల్ లో గొప్ప రాజప్రాసాదం కట్టుకున్నారు. ఆర్గానిక్ వ్యవసాయం లోదిట్ట .చుట్టుప్రక్కల చాలాగ్రామాలకు ఆయన ఆదర్శం .కృష్ణాజిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘానికి వెన్ను దన్నుగా ఉండేవారు .డియివో గారు యేర్పాటుచేసే ప్రధానోపాధ్యాయుల సమావేశానికి ఆయన స్పాన్సర్ గా ఉండేవారు . ఉదయం బ్రేక్ ఫాస్ట్ మధ్యాహ్న భోజం సాయంకాలం స్నాక్స్ అన్నీ ఆయనే ఏర్పాటు చేసేవారు . విద్యారంగం పై అంత మక్కువ ఉండేది  .సమావేశానికి ఎజెండా తయారు చేయటం ,దానికి పేపర్స్ ప్రిపేర్ చేయటం అన్నీ ఆయన ఇంటి దగ్గరే జరిగేట్లు చూసి  అందరినీ స్వంత బంధువులులాగా చూసుకోనేవారు. వారి శ్రీమతి కూడా వారికి అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉండేవారు .ఆతిధ్యం ఇవ్వటం అంటే అంత సరదా వారిద్దరికీ .శ్రీమతి ప్రమీలారాణి,నేను ,రామ౦ గారు, ఆదినారాయణ ,రాజు ,విశ్వం మొదలైన వారందరం ఆయనకు బాగా సన్నిహితులం .తరచూ ఫోన్ లో మాట్లాడుకునేవాళ్ళం .మేమందరం రిటైర్ అయినా విద్యాసంబంధమైన ఏదో ఒక విషయం పై వారింట్లో సమావేశం జరిపేవారం .మమ్మల్ని తీసుకువెళ్లటం దింపటం అక్కడ సాపాటు అంతా ఆయనదే .ఒక బయటి వ్యక్తి విద్యా విషయాలలో ఇంత ఆసక్తి చూపటం ,ప్రతిఫలాపేక్ష లేకుండా పనిచేయటం ఆశ్చర్యకర విషయం .

మధుసూదనరావు గారు తమ తల్లిగారు ‘’దేవినేని సీతారావమ్మ ఫౌండేషన్ ‘’స్థాపించి ఎన్నౌఉపయోగకరమైన పనులు చేస్తున్నారు. చాలా పుస్తకాలు ముద్రించి స్కూళ్ళకు లైబ్రరీలకు అందించారు .శ్రీరరమణ రాసిన ‘’మిధునం ‘’కథ ను పునర్ముద్రించి అందరికీ అందుబాటులోకి తెచ్చారు .బాలబందు అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం .బాలబందు సమగ్ర సాహిత్యాన్ని మూడు భాగాలుగా చాలా అందంగా ముద్రించి అందరికీ ఉచితంగా ప్రత్యేక నారసంచిలో పెట్టి అందజేశారు. ఆవిష్కరణసభకూ మాకు ఆహ్వానం వస్తే పై బృందం అంతా వెళ్లాం .మొదటిభాగం లో జీవన రేఖలు ,బివి వ్యాసాలూ ,,బివి గురించి మిత్రుల కొత్తవ్యాసాలు ,చలంతో లేఖలు ఉన్నాయి . దీనికి ప్రముఖ చిత్రకారులు సంజీవ దేవ్ ముందుమాట రాశారు .రెండవ భాగం లో కథలు ,గేయాలు ,గేయనాటిలున్నాయి .మూడవ భాగం లో బాలవాజ్మయం ,పద విపంచి ,ఆంద్ర పదావళి ,అమృతాంశం ఉన్నాయి .ఇలా సమగ్ర బాలబందు సాహిత్యం ముద్రించి బాలసాహిత్య స్పూర్తి కలిగించి నరసి౦హా రావు గారి ఆత్మకు శాంతి కలిగించారు దేవినేని గారు .

ప్రపంచ ప్రసిద్ధ ఆర్దికవేత్త మా ఉయ్యూరుకు చెందిన కాలిఫోర్నియా వాసి శ్రీఆరిగపూడి ప్రేమ్ చ౦ద్ గారిని ఆహ్వానించి  20 08 డిసెంబర్ లో ఉయ్యూరులో సాహితీ మండలి తరఫున శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి పూనిక సౌజన్య సహాయ  సహకారాలతో సన్మాని౦చినపుడు దేవినేనిగారు విచ్చేసి మాట్లాడారు .మైనేనిగారితో దేవినేని గారికి గొప్ప అటాచ్ మెంట్ ఉండేది .దేవినేనిగారికి ఆంధ్రప్రదేశ్ విద్యామంత్రి స్వర్గీయ దేవినేని రమణ గారితో ఎంతో సాన్నిహిత్యం ఉండేది .హెడ్మాస్టర్స్ మీటింగ్ కు రమణ గారిని ఆహ్వానించి జయప్రదం చేయటమేకాదు దాని స్పాన్సర్ బాధ్యతకూడా ఆయనే తీసుకున్నారు  .విద్యారంగం పై  అభిరుచి ,పాధ్యాయులపై ఆయనకున్న గౌరవం  వెలకట్ట లేనివి .మేమందరం రిటైర్ అయినా మాకు ప్రేరక శక్తిగా ఆయన ఉన్నారు .ఇంకా విద్యారంగానికి ఏదోచేయాలన్న తపన ఆయనది .ఇంత మక్కువ ఉన్నవారు ఉండటం అరుదైన విషయం .మరొక్కసారి బాలబందును బాలలకే కాదు సాహిత్య ప్రియుల౦దరకు సన్నిహితం చేసిన ఘనత సాధించిన శ్రీ దేవినేని మధుసూదనరావు గారికి అభినందన శతం .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-6-18 –ఉయ్యూరు

— 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.