డా .శ్రీ మొవ్వ వృషాద్రి పతి గారి ‘’శ్రీ కృష్ణ దేవరాయ విజయ ప్రబంధం ‘’ -4
కావ్య విమర్శపై ఆచార్య తుమ్మపూడి వారి అభిప్రాయాలు మాన్యమైనవి –అందులోకొన్ని-
చరిత్రను లేక లోకాన్ని కావ్యంగా పరిణమింప జేయటం ,రసలోకాలలో విహరి౦పజేయటం లేదా రసమయ తనువుగా ఆవిష్కరింప జేయటం ఎలా ?ఇది కవి సమస్య .దీనికి మార్గ దర్శనం చేసింది ప్రాచీనకవులే .రామకథ భారతం చరిత్రలే .అంటే ఒకప్పుడు జరిగిన కథలే.కల్పనలు కావు ,వాటిని కావ్య వస్తువుగా మలచటం ,శిల్పించటం ఎలా ?ఆకావ్యాలతో మనకు అనుబంధం ఉంటేనే తెలుస్తుంది అన్నారు తుమ్మపూడి .రాయలు పొట్నూరి దగ్గర నాటించిన విజయ స్థంభం 1516 మార్చి నాటి చరిత్ర .దాన్ని అల్లసాని పెద్దన ‘’అభిరతి కృష్ణ రాయడు జయాంకములన్ లిఖియించి ,తాళ స-న్నిభముగా పొట్టునూరి కడనిల్పిన కంభము ‘’పద్యం లో శిల్పీకరించాడు .ఇందులో మొదటిరెండుపాదాలు చరిత్ర .ఇది భౌతికం .దీన్ని కవి తన మహా దర్పణం అంటే పట్టకం లో ప్రతి బింబింపజేసి ,తనభావనలో దానిని రంగరించి వక్రీభ వింప జేయటం వలన –సూర్యకిరణం స్పటికం అంటే పట్టకం ద్వారా పరివర్తన పొంది సప్తవర్ణాత్మక ఇంద్ర ధనుస్సు అయినట్లు కవిత్వమైంది అన్నమాట .కావ్యం లోకం తో ఎక్కడ విడిపోతోంది ?రెండిటికీ మధ్య సరిహద్దు రేఖ ఏమిటి ?సాధారణ దృష్టి వాస్తవికంగా వస్తు సంబందియే .త్రిదశాత్మక వస్తువే .కవి భావన సరస్వతీ రూపం .స్ఫురణ ప్రతిభామయం కనుక ఆవస్తువును రసమయం చేసి ఆవిష్కరిస్తుంది అన్నారు ఆచార్య .ఈ రస దృష్టికి వ్యక్తీకరణయే, శబ్ద౦ మొదలైనవి . వ్యావహారిక శబ్దం వేరు ,కావ్య శబ్దం వేరు.అంటే భావనమాత్రమే తప్ప భౌతికంకాదు అని వివరించారు .గడ్డిపరక అందరికీ గడ్డిపరకే .కానీ కవికి అది మహాకావ్య వస్తువు .అది కవికి చిత్రకారుడికి ఒక రసవద్వస్తువుగా ,చిత్ర వర్ణాత్మకంగా గోచరిస్తుంది .భక్తుడికి అదే ఆత్మపదార్ధంగా భాసిస్తుంది . మొవ్వకవి గారికి ఈ సమస్యే ఎదురైంది .చారిత్రిక పద్య కావ్య రచన సంక్లిష్టం అనిపించింది అందులో విఘాతాలు ఎక్కువ .సత్యాలు, అసత్యాలూ ఎదురౌతాయి .దేన్ని తీసుకోవాలనే సందిగ్ధత ఏర్పడుతుంది .ఒక్కో గ్రంథం ఒక్కో రీతిగా చరిత్రను రాయటం కవికి ఇబ్బంది కలిగించేవిషయం .దీనికి విరుద్ధంగా ప్రజాబాహుళ్యంలో అనుస్యూతంగా వచ్చే చరిత్ర కూడా లెక్కకు తీసుకోవాల్సి వస్తుంది .దీనికి ఉదాహరణ తాజమహల్ .ఓక్ అనే చరిత్రకారుడు అది శివాలయం అని నిరూపించాడు .కనుక చరిత్రకు వాస్తవానికి సరైన సరిహద్దు ఉండదు .విజయనగర సామ్రాజ్యం పై అనేక ఉద్గ్రంధాలు వృషాద్రి పతి గారు మధించారు .విజయనగరసామ్రాజ్య స్థాపనకు విద్యారణ్యు లవారు పల్లకీలో వచ్చినట్లు కవి రాశారు .అది ఆనాటి ప్రయాణ సాధనం గా భావించాలి .అంతేకాదు దీనికి ఆధారంగా ఒక చిత్రం హంపీ విరూపాక్ష దేవాలయం గోడ లోపల కనిపిస్తు౦దికూడా. ఈ బొమ్మే కవిగారి పద్యానికి ఆధారమైంది అన్నమాట .దీనినే కావ్యాన్వయం అంటారని విశ్లేషించారు కోటేశ్వరార్యులు.కాని చదువరికి ఆ చరిత్ర విస్మ్రుత మయింది. అసలు విజయనగర చరిత్రనే ‘’విస్మృత సామ్రాజ్యం –‘’ఎ ఫర్గాటెన్ ఎంపైర్’’ అన్నారు కూడా
ఈనాటి ఆంధ్రులకు ఆంధ్రుల చరిత్ర చాలామందికి తెలియదు .దీనితోబాటు మహాకావ్య సంప్రదాయమూ కూడా కనుమరుగైంది లేక అవుతోంది. తెలియక పోవటం రెండు విధాలు కావ్యస్వారస్యం.ఇది ఈనాటి పాఠకుడికి మృగ్యం .చదివే వాళ్ళు బహుకొద్దిమంది అవటం. వావిళ్ళవారు’’ హరివంశం ‘’రెండో సారి ముద్రించినపుడు పీఠిక లో శతావధాని వేలూరిశివరామ శాస్త్రిగారు’’రెండో సారి ఈ మహా కావ్యం 50 ఏళ్ళ తర్వాత ముద్రణమౌతోంది అంటే ఏమనుకోవాలి ?’’ అని బాధపడ్డారట .అంటే తెలుగువారిలో కావ్య రసాస్వాదన లోపిచింది అని భావం .ఇదే బాధ ఈకవీ అనుభవించాడు రాయకావ్యం లో –
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -3-7-18 –ఉయ్యూరు
—

