చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు
1-కొత్త వంద రూపాయల నోటుపై స్థానం పొందిన రాణీగారి ఏడంతస్తుల దిగుడుబావి
‘’రాణీ కా వావ్’’అనే ప్రఖ్యాతమైన్న ఏడు అంతస్తుల దిగుడుబావి గుజరాత్ లోని పఠాన్ లో సరస్వతీ నదీ తీరాన ఉంది .11 వ శతాబ్దం లో 1022 –1064కాలపు సోలంకి నేలిన చాళుక్య రాజు మొదటి భీమ దేవ్ జ్ఞాపక చిహ్నంగా అంటే స్మృతి చిహ్నంగా ఆయన భార్య రాణి ఉదయమతి దీన్ని కట్టించింది .ఆమె కాలం లో మిగిలిపోయిన దాన్ని కొడుకు రాజాకర్ణ పూర్తి చేశాడు . 1304 కాలపు జైనకవి ‘’మేరుతంగ సూరి’’ తన ‘’ప్రబంధ చింతామణి ‘’లో దీనిని ఉదాహరించాడు . సుమారు వెయ్యేళ్ళ చరిత్ర ఉన్న ఈ బావి సరస్వతీ నదికి వచ్చిన వరదలో మట్టిలో పూడుకు పోయి’’మిట్టీమే సోనా ‘’గా మిగిలింది .64 మీటర్ల పొడవు ,20 మీటర్ల వెడల్పు ,27 మీటర్ల లోతుగా ఉన్న ఇది చూడటానికి రాతితో నిర్మించబడిన పెద్ద కోట లా ఉంటుంది .దీనికి అన్నివైపులా ఉన్న స్తంభాలపై భారతీయ చిత్రకళ అంటే మరు –ఘూర్జర శైలి తాండవం చేస్తుంది .ఏడు అంతస్తుల ఈ బావిలో 500శిల్పాలు ,మరో 800 కళా ఖండాలున్నాయి .వీటిపై దశావతారాలు ,సొల శృంగారం గా ఉన్న 16రకాల అప్సరసల శిల్పాలు ‘’వావ్! ఇదేం వావ్! ‘’అని పిస్తాయి . ఇంతపెద్ద విశాలమైన ప్రత్యేకమైన కట్టడం అపూర్వం గా భావిస్తారు .ఈ బావిలో కింద చివరి మెట్టువద్ద ఉన్న గేటు నుండి 30 మీటర్ల సొరంగం కూడా మట్టిలో పూడుకు పోయింది .ఈ సొరంగం నుండి వెడితే పఠాన్ వద్ద ఉన్న సిద్ధ పూర్ కు సురక్షితంగా చేరేవారు . ఈ బావి 1980 లో పురావస్తు శాఖ త్రవ్వకాలలో మళ్ళీ వెలుగు చూసింది .యుద్దాలకాలం లో లేక ఆపదలు సంభవించినపుడు రాజా౦తః పుర స్త్రీలు ఈ సొరంగం ద్వారా తప్పించుకొని బయటకు వెళ్ళేవారు .50 ఏళ్ళక్రితం వరకూ బావి చుట్టూ ఔషధ మొక్కలు ఉండేవి .ఇలాంటి దిగుడుబావులు మంచి నీటికోసమే కాక ఆధ్యాత్మిక చింతనకు , శిల్పకళా వైభవానికిచిహ్నాలు . 2014 యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో ఈ బావి చోటు దక్కించుకున్నది .2016 లో ‘’క్లీనెస్ట్ ఐకానిక్ ప్లేస్ ‘’గా అవార్డ్ పొందింది .అందుకే భారత ప్రభుత్వం కొత్తగా ముద్రిస్తున్నవంద రూపాయల నోటు పై స్థానం పొంది కను విందు చేస్తూ ,చారిత్రిక నిదర్శనం గా దర్శనమిస్తోంది

