కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -1
అసలే అందాల సీమలు .ప్రకృతి సోయగాలకు ఆటపట్టులు .ముక్కారు పంటలకు నిలయాలు .పవిత్ర దేవాలయ క్షేత్రాలు .కొబ్బరి తోటల పరవశాలు .ఒక్కసారి చూస్తె అక్కడి నుండి రాబుద్ధి పుట్టని ఆకర్షణ విలసితాలు కోనసీమ సీమలు .మరి వీటికి తోడు పవిత్రతా కలిస్తే,వేద గానాలు పరవశి౦పజేస్తే ,వీటికి మరింత శోభ తెచ్చే నిత్యాగ్ని హోత్రాలు ప్రజ్వరిల్లు తుంటే, ఆహితాగ్నులు పవిత్రాగ్నులను కంటికి రెప్ప లాగా కాపాడుకొంటూ ఉంటె ఇక ఆ అనుభవం ,అనుభూతి మరువగలమా ! అప్పుడు అది భూలోక స్వర్గం అనటం చాలుతుందా?చాలనే చాలదు .అందుకే ‘’కోనసీమ అందాలకు వేద పవిత్ర సొబగులు,సౌరభాలు అలదినట్లు౦ టాయని అన్నాను .దీనికి కారణభూతులు అక్కడి ఆహితాగ్నులు .ఆహితాగ్ని అంటే గృహం లో పవిత్రాగ్నిని అంటే వేద సంస్కాం ప్రకారం అగ్ని హోత్రాన్ని ఉంచుకున్నవాడు అని నిఘంటు అర్ధం .అగ్ని హోత్రాన్ని కాపాడే వాడు .ఆయననే సోమయాజి అనీ అంటారు .ఆహితాగ్నులు కోనసీమ ప్రాంతం లో ఉన్న బ్రాహ్మణ అగ్రహారాలలో ఉంటారు .వీరిని ‘’వేదం లో ఉన్నవారు ‘’అనీ పిలుస్తారు .వారు కూడా ‘’నేను వేదం లో ఉన్నాను ‘’అని చెప్పుకొంటారు .అది గౌరవం .గర్భాస్టమం లో ఉపనయన సంస్కారం జరిగి ,త్రికాల సంధ్యావందనం ,అగ్ని కార్యం చేస్తూ ,గురువు వద్ద ఉంటూ 82పన్నాల తైత్తిరీయ సంహిత ను ఎనిమిది నుంచి పన్నెండేళ్ళు లో నేర్చుకొంటారు .మధుకర వృత్తి నవలంబించి ,దానినే భుజిస్తాడు .తెల్లవారు ఝామున 4 గంటలకే కాలకృత్యాదులు తీర్చుకొని గురువు ఎదుట కూర్చుని ఆయన చెప్పింది మరలా చెబుతూ అంటే ‘’సమవర్తన ‘’చేస్తూ నేరుస్తాడు .ఇదంతా బ్రహ్మ చర్యం లో పూర్తవుతుంది .
రెండవ గృహస్థాశ్రమ౦ లోకి ప్రవేశించటానికి అగ్ని సాక్షిగా పెద్దలు కుదిర్చిన అనుకూల వతిఅయిన కన్యను భార్యగా పొంది గృహస్తు అవుతాడు .అర్దాంగితో నిత్య౦అగ్నిని ఆరాధిస్తాడు దీనిని గార్హస్పత్యాగ్ని అంటారు .అతడికి ఇంకా చదవాలని నేర్చుకోవాలని ఉంటె అగ్రహారం లోనే చెప్పగలిగిన గురువు వద్ద చేరి నేరుస్తాడు .లేక బయటి ప్రదేశాలకు వెళ్లి నేర్చుకుంటాడు పాఠం ,పద పాఠం ,క్రమ పాఠం లలో నిష్ణాతులౌతారు ఎక్కువ మంది ఇక్కడే ఆగి పోయి పరీక్షలకు హాజరై ,సర్టిఫికెట్లు పొంది సంతృప్తి చెందుతారు .ఇంకా ముందుకు పోవాలనుకోనేవారు ఇంతకన్నా కష్టమైన ఘన పాఠం నేర్చుకుంటారు .దీన్ని సాధించిన వారిని’’ ఘన పాటి ‘’లేక’’ ఘనా పాఠి ‘’అంటారు .వీరు వేదసభల్లో ,పండిత సభలో ఉపనయన, వివాహకార్యక్రమాలో పాల్గొని తమ విద్య ప్రదర్శించి బహుమతులు పొందుతారు .దీని పైది ‘’జటాపాఠం’’అనే మరింత క్లిష్ట ప్రక్రియ .ఎక్కువమంది దీన్ని నేర్చే ప్రయత్నం చేసినా బహు కొద్ది మందే దీని అంతు చూడగలిగి నిష్ణాతులవుతారు .కేరళలో ‘’రధపాఠం ‘’అనే మరో ప్రక్రియ ఉంది .దీన్ని నంబూద్రి బ్రాహ్మణులు ఎక్కువగా నేరుస్తారు .కాని తీరాంద్రలేక సాగరాంధ్ర లో అలవాటులో లేదు .
తైత్తిరీయ సంహిత ,బ్రాహ్మణాలు ఆరణ్యకాలు ,ఉపనిషత్తుల ను సంపూర్తిగా నేర్చినవారు ,మిగిలిన వేదాలను వాని శాఖలను నేరుస్తారు .ఋగ్వేదంను అదే గురువుకాని వేరొక గురువు వద్దకానీ అభ్యసిస్తారు .ఇంకా ఉత్సాహముంటే సామ వేదాన్ని నేర్చుకుంటారు .ఇది సోమ క్రతువులకు తప్పని సరి .గాన విధానం ఇందులో ప్రత్యేకత . ఇందులో జైమినేయ ,కౌతుమ ,రనయనీయ శాఖలలో అద్వితీయులయ్యే ప్రయత్నం చేస్తారు .
వేదం లోని లోతులను తరచటానికి ఈ ముఖీయ అధ్యయనం పెద్దగా తోడ్పడదు .అందుకని మీమాంస ,వ్యాకరణాలు చదివి వేదార్ధ ప్రవీణులౌతారు . వివాహాది కార్యాలు చేయించటానికి స్మార్తం నేరుస్తారు.ఆపస్తంభ ధర్మ సూత్రాలను క్షుణ్ణంగా నేర్చుకొంటేనే ఇది సాధ్యమవుతుంది .మిగిలిన వాటిలో కూడా సరి ఫికెట్లు కావాలంటే వాటినీ తరచి సాధిస్తారు .పురోహితుడు అనిపించుకుంటాడు .శ్రౌతం లో నిష్ణాతులు రుత్విజులౌతారు .గృహ్య సూత్రాలు నేర్చి నిత్యకర్మలు ఉపనయనాది కార్యాలు చేయిస్తారు. శ్రౌత సూత్రాలు నేరిస్తే యజ్ఞయాగాదులకు పనికొస్తారు .వేదం చదివి పండిత పరీక్షనిచ్చి ఉత్తీర్ణులైన వారిని వేదపండితులంటారు .
శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి ఋణం తీర్చుకోలేనిది
అన్నేళ్ళు కస్టపడి వేద విద్యనేర్చి పండితులైతే పొట్ట గడిచేది యెట్లా ? వారి ఇళ్ళల్లో పొయ్యిలో పిల్లి లేచేదేట్లా .కోనసీమ లో దీనిపై ముందుగా ఆలోచించి పరిష్కార మార్గం కనిపెట్టినవారు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు .ప్రతి దేవాలయం లోనూ వేద పండితుల చేత సామూహిక వేదపారాయణ రోజుకు కనీసం మూడు గంటలు చేయించారు ఇలా చేసే ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు .దీన్ని గమనించిన ప్రభుత్వం తిరుపతి తిరుమల దేవస్థానం కార్య ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేసింది .దేవాలయాలలో పూజారి ప్రసాదాలు మాత్రమేకాక వేద పారాయణ చేసే పండితులను నియమించింది .శ్రీశైలం, తిరుమల, బెజవాడ కనకదుర్గమ్మ మొదలైన ముఖ్య దేవాలయాలలో ఈ పధకం ముందు ప్రారంభమైంది .నాలుగువేదాలలో నిష్ణాతులైన పండితులు ఎనిమిది మందికి అవకాశాలు లభించాయి .దీనివలన అప్పుల్లో కూరుకుపోయిన బ్రాహ్మణ పండితులకు కొంచెం ఊరట కలిగింది .ప్రభుత్వం ప్రకటించిన గౌరవ వేతనం వలన పిల్లల పెళ్ళిళ్ళు చేసే వీలు కలిగింది .ఈ విధానాన్ని కోనసీమలో ప్రారంభింప జేసిన శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి చిత్రపటాన్ని ప్రతి బ్రాహ్మణ కుటుంబలో దేవుని మందిరం లో ఉంచి కృతజ్ఞత లు తెలుపు కుంటోంది.ఆయన్ను ప్రాతస్మరణీయులను చేసుకున్నారు కొనసీమవారు .పండితులు తమ పిల్లలకు కూడా వేదం విద్యనేర్పిస్తున్నారు ,ఈ వేదపండితులకు పెన్షన్ సౌకర్యం కూడా కలిగించమనే ఆందోళనా ఉన్నది .అయితే ఆహితాగ్నులు మాత్రం ‘’వేదాన్ని పండితులు అమ్ముకుంటున్నారు .ఇది వేద విక్రయం అవుతుంది ‘’అని బాధ పడ్డారు .
భారత దేశ వేద పండితులలో ప్రధమ స్థానం లో ఉన్నవారు శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రి గారు .1980 లో ఆయన 92వ ఏటకూడా ఆయన కాకినాడ స్వగృహం లో తైత్తిరీయ సంహితలోని అగ్ని సూత్రాలు ,అశ్వమేధ యాగ మంత్రాలు స్పుటంగా ,ఉచ్చైశ్వరం తో గానం చేశారు .ఎక్కడా తొట్రుపాటు వణుకు లేవట .ఒక మహర్షి మంత్ర పఠనం లాగా ఉందని చూసినవారు ఆశ్చర్య పోయారట .కారణ జన్ములాయన.దీనికి 74 ఏళ్ళ క్రితం అంటే ఆయన 18 వ ఏటనే ఒక క్రతువుకు అధ్వర్యులుగా ఉన్నారట .ఏమి జన్మ సుకృతం ?
గణపతి శాస్త్రి గగారు కోనసీమలో ప్రారంభించిన సామూహిక వేదపారాయణ ప్రతివారినీ చైతన్యవంతులను చేసి, వేద విద్య వ్యాప్తి, వేదపండితసత్కారం తమవిధి అని గుర్తించెట్లు చేసింది .దీనితో సంక్రమణం నాడులేక నెలకోసారి కాని స్థానిక బ్రాహ్మణ సంఘాలు వేదపండితులను ఆహ్వానించి మొదటి నలభై నాలుగు పన్నాలలో ఏదో ఒకదాన్ని వల్లించమని కోరేవారు .వారికి సంఘం తగిన పరితోషికమిచ్చి సత్కరించి పంపేది. ఈ సంస్కృతీ ఆంద్ర దేశమంతటా విస్తరించింది . వీలైన చోట్ల వేదసభలు శాస్త్రార్ద చర్చలు చేయించి గౌరవిస్తున్నారు .వాటిని చూసి ఆనంద పారవశ్యం పొందని వారు ఉండరు .కంచి, ,శృంగేరి పీతాదిపతులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహిస్తున్నారు .వేదపండితులు గ్రామ ,పట్టణాలు సందర్శించి తమ విద్వత్తు ప్రదర్శించి తగిన బహుమానాలు అందుకోవటం నేడు సర్వ సాధారణమై పోయింది .ఇదంతా శ్రీ ఉప్పులూరి గణపతి శాస్త్రిగారి పూనికా, వేదమాత సేవా భాగ్యమే
దేవాలయాలలో ఘనపండితుడికి నెలకు 1800 ,క్రమ పండితుడికి నెలకు 1500 రూపాయలు గౌరవ భ్రుతి ఇస్తున్నారు .రిటైరైనవారికి కూడా నెలకు వెయ్యి రూపాయలిస్తున్నారు .వీరికి అమెరికాలో గొప్ప ఆదరణ లభిస్తోంది .కాని కేరళ పండిత నంబూద్రి కుటుంబాలు మాత్రం అమెరికా వెళ్ళటానికి ఉత్సాహం చూపటం లేదట .ఇప్పటికీ కోనసీమ సంప్రదాయ కుటుంబీకులువేదం లో సర్టి ఫికేట్ ఉన్న కొడుకులను, మనవళ్ళను అమెరికా పంపటానికి ఇష్టపడటం లేదట . వీరు చెప్పే సామెత ‘’దూరపుకొండలు నునుపు ‘’.వేదపండిత సర్టిఫికేట్ ఉన్నవారినే పంపటానికి ఇష్టపడక పొతే నిత్యాగ్ని హోత్రులైన ఆహితాగ్నులు బయట దేశానికి ఎలా వెడతారు ?వారికి గృహమే స్వర్గ సీమ .వీరి విశేషాలు తర్వాత తెలుసుకొందాం .
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -25-7-18 –ఉయ్యూరు
—