యాజ్న వల్క్య మహర్షి చరిత్ర –2

యాజ్న వల్క్య మహర్షి చరిత్ర –2

మేనల్లుడు యాజ్ఞావల్క్యుని ఏమీ చేయలేక మేనమామ శాకల్యుడు శిష్యులనందర్నీపిలిపించి విషయం  చెప్పాడు .అదెంత పని అని ప్రచూడుడు ,పైన్గ్యుడు తమకు తపోమహిమ తక్కువేమీ లేదని ప్రకటించి ,రాజుకు మంత్రోదకం ఇవ్వటానికి వెళ్ళారు .రాజు వారిని నమ్మటానికి అక్కడ ఒక మొద్దు పడేసి దాన్ని మంత్రోదకం తో చిగురించేట్లుచేయమన్నాడు .ఎన్ని సార్లు మంత్రజలం చల్లినా వాళ్ల పాచిక పారలేదు .తెల్లమొహాలు వేసుకొని గురువును చేరి జరిగింది చెప్పారు .రాజు సుప్రియుడు గురువును పిలిపించి తాను అవమానించిన యాజ్న వల్క్యుడు మహా తపస్సంపన్నుడు అని తర్వాత తెలుసుకున్నానని అతడే వచ్చి మంత్రోదకం ఇస్తేనే తన వ్యాధి నయమౌతుండదనే నమ్మకం తో ఉన్నానని  అతడు రాకపోతే తానె అక్కడికి వస్తాననిప్రాదేయపడి ,గురువు వెంట ఆశ్రమ౦ చేరాడు .మేనల్లుని పిలిచి రాజు వచ్చాడని,మంత్రోదకం ఇవ్వమని చెప్పాడు .పట్టు వదలని అతడు ససేమిరా అన్నాడు .కోపం తో ఊగిపోతూ  రాజుల మన్నననలు పొందుతూ అభిమానం మొదలైనవి వదులుకోవాలని హితవు చెప్పాడు. దానికి బదులిస్తూ ‘’రాజు దయా ధర్మ భిక్షనాకక్కరలేదు .అవమానించిన వారి మోచేతి నీళ్ళు తాగటం నేను చేయను .ఆత్మ గౌరవం లేని బతుకు బతుకు కాదు ‘’అన్నాడు .అగ్గిమీద గుగ్గిలం అయి ‘’నేను చెప్పిన చదువంతా’’ కక్కేసి ‘’ నా ఇంట్లోంచి బయటికి వెళ్ళు ‘’అని ఆజ్ఞాపించాడు గురుమేనమామ .నిమిషం ఆలస్యం చేయకుండా యోగ బలం తో తాను నేర్చిన యజుర్వేదాన్ని మూర్తిమంతం చేసి, కక్కిపారేసి  అక్కడ నుంచి యాజ్ఞవల్క్యుడు వెళ్లి పోయాడు .ఆ కక్కిన దాన్ని వైశంపాయనుడు అనబడే శాకల్యుని శిష్యులు ‘’తిత్తిరి పక్షులు ‘’గా మారి తినేశారు .అప్పటినుంచి ఆవేదం’’ తైత్తిరీయం ‘’అనే పేరుతో పిలువబడింది .మేనమామ ఇంటినుంచి వెళ్ళిపోతూ మేనల్లుడు యాజ్న వల్క్యుడు ‘’నీ వేదం బుద్ధి మాలిన్యం తో పూర్వ ,ఉత్తరాంగ రహితమై ,అవ్యవస్తితమై ,కక్కినదాన్ని జనం ఎవరూ చూడక అసహ్యించు కోనేట్లుగా, నీ దగ్గర చదివిన యజుస్సులు అన్నీ స్మరణ కైనా రానీయను .ఇంతకంటే అనేక రెట్ల గొప్పదైన వేదాన్ని పొంది నీవేదాన్ని మూలపడేట్లు చేస్తా.’’అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయాడు .

  అక్కడినుండి బయల్దేరిన యాజ్ఞవల్క్యుడు హాటకేశ్వరం వద్ద ఉన్న విశ్వా మిత్ర హ్రదం చేరి

   స్నానం చేసి, వేదమాత ను ఉపాసించటానికి ముందు సూర్యోపాసన చేసి ,ప్రభాకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా ‘’ ఏ కొరతా లేని కర్మ బ్రహ్మ విద్యలు కలిగి శుద్ధ స్వరూపమైన వేదాన్ని ప్రసాదించు ‘’అని  వేడుకొన్నాడు .రవి యాజ్ఞవల్క్యుని నోరు తెరవమని చెప్పి సరస్వతీ రూపమైన తన తేజస్సు ను అతని నోటిలో ప్రవేశ పెడతానని ,దానివలన ‘’శుద్ధ (శుక్ల )యజుర్వేదమే కాక  అఖిలవిద్యలు నీకు    వశమౌతాయి .సకల జగద్రహస్యాలు తెలియ జేసే అద్వితీయమైన ‘’శత పథం’’నువ్వు రాస్తావు’’అని చెప్పి యాజ్న వల్క్యుని నోటిలో తన తేజస్సును ప్రవేశ  పెట్టాడు ఆదిత్యుడు .

  ఈ విధం గా యాజ్న వల్క్యుడు శుద్ధ యజుర్వేదాన్ని పొందాడు .వాజీ రూపాన్ని ధరించి ఐ శుక్ల యజుర్వేదాన్ని బోధించాడు .శుక్ల యజుస్సులు వాజస నేయుడైన యాజ్న వల్క్యు నివలన ‘’ఆదిత్యాలు ‘’ అని పిలువ బడ్డాయి   .అంటే ఆదిత్యుడు యానవల్క్యుని చేత చదివించిన తర్వాతే స్వయంభు ఐన బ్రహ్మనుండి బయల్వెడలిన శుక్ల యజుర్వేదాన్ని ఆదిత్యం అంటారని భావం .

  వినాయక చవితి శుభాకాంక్షలు

మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -13-9-18 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.