శ్రీ యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -5
28 నుంచి 31 వరకు ఉన్న 4 అధ్యాయాలలో యజుర్గణనం మొదట్లో చూపిన అధ్యావస్థ విషయాలకే సంబంధించింది .కనుక తగిన చోట్ల ఉపయోగిస్తారు .32 నుంచి 39 వరకు 8 అధ్యాయాలలో పురుష మేధం ,సర్వ మేధం, పితృ మేధం ,ప్రవర్గ్యం మొదలైన వి కొత్తవి అని కొందరి భావన .కాని దీనికి విలువలేదు .40 వ అధ్యాయం లో ఈశా వాస్యం ఉన్నది .దీనికి ముందున్న అధ్యాయాలలో కర్మ గురించి చెప్పి ఇప్పుడు దీనిలో బ్రహ్మాన్ని గురించి చెప్పటం చేత ఇది ఉపనిషత్తు అని పిలువబడి ‘’ఈశావాస్యోపనిషత్’’ అయింది .సంహిత లో యే వేదం లోను బ్రహ్మ విద్యను తెలిపే భాగం లేదు .ఇలా ఒక అరుదైన విషయం వాజసనేయ సంహిత లోనే ఉంది .కనుక’’ వాజసనేయ సంహితోపనిషత్’’ అయింది .అందుకే ఉపనిషత్తు లన్నిట్లో ప్రధమ స్థానం పొందింది .దీని ప్రత్యేకత ఏమిటి ?ఇందులో కర్మ విషయాన్ని, బ్రహ్మ విషయాన్ని సాకల్యంగా చర్చించి బ్రహ్మ విషయమే శ్రేష్టం అని నిక్కచ్చిగా న్యాయాధికారిగా తీర్పు చెప్పింది .జగత్తు అంతా పరబ్రహ్మం చేత వ్యాప్తమై౦దని ,బ్రహ్మం లేనిది జగత్తు లో ఏదీ లేనే లేదని చెప్పింది. కనుక మమత్వం అంటే నాది నీది అనే భేదభావం ,లేకుండా సర్వం బ్రహ్మమయం అని భావించి భజించాలి అని నిష్కర్షగా తెలియ జేసింది .కనుక ఇందులోని మొదటి మంత్రమే సర్వోత్క్రు స్టం.
రెండవ మంత్రం ‘’కుర్వాన్నే వేహ కర్మాణి ‘’లో ఒక వేళ సన్య సించినా,మనో వాక్కాయ కర్మలతో విషయాల క్రియలను మానేసి ముఖ్యమైన ఆత్మ చి౦తనాన్నిచేయ లేకపోతె ,బ్రతికి ఉన్నంతకాలం ఏ రోజూ మానకుండా సంధ్యావందనం మొదలైన విహిత కర్మలు మాత్రం చేస్తూ ఉండాల్సిందే .మూడవమంత్రం కామ్య కర్మలు సంసార బద్ధుని చేస్తాయి కాని ,పరబ్రహ్మార్పణం గా,జ్ఞానం కోసం చేసే కర్మలు మనలను అంటవు అని బోధించింది .మిగిలిన 16 మంత్రాలు మొదటి మూడు మంత్రాల పరిపూర్ణమైన వివరణ మాత్రమే .
17 వ కాండ సంహితలో చివరది అయిన 40 వ అధ్యాయం కూడా బ్రహ్మ విద్యనే బోధిస్తుంది కనుక దీనికి ‘’బృహదారణ్యకోపనిషత్ ‘’అన్నారు .దీనిలో బ్రహ్మవిద్య కరతలామలకంగా బోధి౦పబడింది అని విద్యారణ్య స్వామి శతపథ బ్రాహ్మణ వ్యాఖ్య లో తెలియ జేశారు –‘’కరామలక వద్యత్ర పరం తత్త్వం ప్రకాశితం –యా కా చిత్తాదృశీశాఖా త్వయా వ్యాఖ్యాయతామితి ‘’.సాధారణంగా సంస్కృతం లోని సంజ్ఞావాచకాలన్నీ ఏదో ఒక ధర్మాన్ని బోధించేవే .శంకర భగవత్పాద ,విద్యారణ్యమొదలైన గురు దేవులంతా ‘’ చిత్త వృత్తి నిరోధానం కోసం అరణ్యాలలో నివసించే టప్పుడు ,ముందుగా గురువులు చెప్పుకుంటూ పోతుంటే ,వెనకున్న శిష్యులు దాన్ని ఉచ్చరిస్తూ ఉన్న జ్ఞాన శాస్త్రాన్ని’’ ఆరణ్యకం ‘’అన్నారు .అంటే చిన్నతనం నుంచి ముసలితనం వరకు వివిధ విషయాలపై పరిగెత్తే మనసును ఎప్పటికప్పుడు వెనక్కి మరలిస్తూ ,ఆత్మచింతనం చేయాలని అర్ధం .ఇలా అరణ్యాలలో సాధన చేయకుండా ,గ్రామాలలో చేస్తే ఇంద్రియాలు, మనసు స్వాదీనంకావు .విషయవాంఛ బలీనమై మనసును ఒక చోట నిలువ నీయదని గ్రహించాలి .బ్రహ్మ విద్యా ప్రాప్తి కోసం వేదాంత గ్రంథాలను అధ్యయనం చేయాలని ,అలాంటి ఆరణ్యకాలే వేదాలకు ముఖ్యమైనవి అని మహా భారతం చెప్పింది –
‘’భారతస్య వపుర్హే తత్సత్యం చామృత మేవచ –నవనీతం యదాదధ్య్నో ద్విపదాం బ్రాహ్మణో యధా
‘’ఆరణ్యకం చ వేదేభ్య శ్చౌషధిభ్యోమృతం యధా –హ్రదానాముదధిః శ్రేష్టో గౌర్తరిస్ఠోచతుష్పదాం ‘’.ఋగ్వేదానికి ఐతరేయ శాఖా రణ్య కాలు ,కృష్ణ యజుర్వేదానికి తైత్తిరీయారణ్యకాలు , శుక్ల యజుర్వేదానికి బృహదారణ్యకాలు ఉన్నాయి ’.వీటిలో పరిమాణం లో,అర్ధ గౌరవం లో శుక్ల యజుర్వేద ఆరణ్యకం పెద్దది కనుక ‘’బృహదారణ్యకం ‘’అనే పేరొచ్చింది అనిదీనికి వ్యాఖ్యానం రాస్తూ ఆది శంకరాచార్యాదులు తెలియ జేశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -17-9-18 –ఉయ్యూరు


i am waiting for శ్రీ యాజ్ఞ వల్క్య మహర్షి చరిత్ర -6
LikeLike