ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి  పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా

ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి  పట్టాభిషేకానికి జైపూర్ నుండి లండన్ కు అపార గంగాజలం తో హాజరైన జైపూర్ మహారాజా

1902 లో ఎస్. ఎస్. ఒలింపియా నౌకను ఒకటిన్నర లక్షల రూపాయలతో కొని, జైపూర్ మహారాజు సవాయ్ రెండవ మాధవ్ సింగ్ అందులో రెండు అతి పెద్ద వెండి బిందెలలో 8 వేలలీటర్ల పవిత్ర గంగాజలం నింపి ,పురోహిత బృందం ,132 మంది సేవకులు ,600 లగేజి సామాన్లతో  ఏడవ ఎడ్వర్డ్  చక్రవర్తి పట్టాభిషేకానికి హాజరవటానికి జైపూర్ నుండి   బొంబాయి మీదుగా లండన్ వెళ్ళాడు  .ఈ మహావైభవ ,అట్టహాస ప్రయాణాన్ని 1902 జూన్ లో  ‘’ది గ్లోబ్ ‘’పత్రిక ‘’ఎ రిమార్కబుల్ సైట్ ‘’అని వర్ణించింది .

ఇందులో అతి గమనార్హమైన విషయం 5 వేల మైళ్ళ దూరం ఉన్న లండన్ కు పవిత్ర గంగాజలం తీసుకు వెళ్ళటం .ఆనాడు జైపూర్ మహారాజా భారత దేశం లో అత్యంత విశేషమైన రాజులలో ఒకరు .ఏడవ ఎడ్వర్డ్ పట్టాభిషేకానికి గౌరవంగా ఆహ్వాని౦పబడ్డాడు. విక్టోరియా మహారాణి నిర్యాణం తర్వాత చక్రవర్తి అయ్యాడు ఎడ్వర్డ్ .గ్వాలియర్ ,బికనీర్ మహారాజులతోపాటు జైపూర్ మహారాజు మాధవసింగ్ కూడా చక్రవర్తి పట్ల విశ్వాసం ప్రకటించటానికి వెళ్ళాడు  .చక్రవర్తికూడా భారత మహారాజుల సమక్షం లో పట్టాభిషేకం జరగటం తన పాలనకు ,తమ సార్వభౌమాధికారానికి గౌరవమని భావించాడు .

మహారాజా సవాయ్ రెండవ మాధవ సింగ్ రెండవ రాం సింగ్ మహారాజుకు దత్త పుత్రుడు .ఆల్బర్ట్ ఎడ్వర్డ్ యువరాజు కొన్ని దశాబ్దాల పూర్వం జైపూర్ సందర్శించినపుడు రాజా  రాం సింగ్ తండ్రి జైపూర్ సిటీ ని ‘’పింక్ సిటీ ‘’గా తీర్చి దిద్దాడు .రాం సింగ్ తన ప్రగతి శీల విదాలతో , సంప్రదాయ నడవడి తో  స్కూళ్ళు కాలేజీలు వైద్యాలయాలు  దేవాలయాలు నిర్మించి ప్రజాభిమానం పొందాడు .తండ్రి అడుగుజాడలలోనేకొడుకు మాధవ సింగ్ కూడా నడిచాడు .

మహారాజా మాధవ సింగ్ లండన్ చక్రవర్తి పట్టాభిషేకాంకి హాజరవటం లో కొన్ని చిక్కులెదురయ్యాయి .వెళ్ళకపోతే మర్యాదకు భంగం తో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది . వెడదాము అంటే ‘’కాలాపానీ ‘’అంటే సముద్రం దాటటం అనే ఘోర తప్పిదం చేయాలి .తాను అనుసరిస్తున్న  సంప్రదాయ హిందుత్వానికి భంగమేర్పడుతుంది .ఈ విచికిత్స లో కొంతకాలం ఊగిసలాడాడు .మంత్రులను ,పురోహితులను ,,సైనికసలహాదారులను సమావేశ పరచి ఈ ’’ ధర్మ సంకటం ‘’పై చర్చించాడు .అందరి సలహా పై, పైన చెప్పినట్లు పవిత్ర గంగా జలం తో వెడితే ఆత్మ సంతోషం ,సంఘ కట్టుబాట్లను గౌరవి౦చినట్లూ హిందూ ధర్మం పాటించినట్లుగా  ఉంటుందని నిర్ణయించాడు  లండన్ కు   బయల్దేరిన దగ్గరనుంచి మళ్ళీ తిరిగి వచ్చేదాకా అన్ని అవసరాలకు వాడ టానికి  సరిపడా గంగాజలం సేకరించాడు .14 వేల వెండి నాణాలు కరగించి పెద్ద వెండిపాత్రలు రెండు చేయించి గంగాజలం తో నింపి కూడా తీసుకు వెళ్ళాడు .పాత్రలను అతిభద్రంగా ఓడ పైకి ఎవరి చేతులూ పడనీయ కుండా కప్పీలు చక్రాల సాయంతో చేర్పించాడు .నౌక ఏడెన్ వద్దకు చేరగానే వాతావరణం అత్యంత భయానకం గా మారితే ,పురోహితులతో సంప్రదించి వారితో ఒక గంగాజల వెండిపాత్రను గాలిలోకి ఎగరేయించి  కొంతజలాన్ని సముద్రం లో కలిపించి వరుణ దేవుడికి శాంతి కలిగించాడు .

జైపూర్ మహారాజు మహారాజ వైభవంగా భారతీయ సంప్రదాయ పద్ధతిలో లండన్ ప్రవేశించాడు ‘’మహారాజుగారి సామాన్లు చాలాటన్నుల బరువున్నాయి .అందులో ఆయన నిత్యపూజ చేసే దేవతావిగ్రహాలు ,పవిత్ర గంగాజలం ఉన్నాయి ‘’అని ‘’అబెర్డీన్ జర్నల్ ‘’,దిడైలీ న్యూస్ ‘’పత్రికలు  ఆర్భాటంగా రాశాయి. ‘మన పాశ్చాత్య విధానాలకు అతి భిన్నంగా ప్రాచ్య సందర్శకుడు రావటం మహా విశేషం ,వింతగా ఉంది ‘’అనీ రాశాయి .’’పింక్ సిటీ జైపూర్ మహారాజు రాజా మాధవ సింగ్ గాలన్లకొద్దీ పవిత్ర గంగాజలం తన నిత్య కృత్యాలకు వెంట తీసుకు రావటం విశేషం  ఇప్పుడాయన తన పింక్ సిటీ  నుంచి అత్యంత విశిష్టమైన రంగు ను ప్రపంచానికి అద్దాడు ‘’అనీ రాశాయి .

జూన్ లో జరగాల్సిన పట్టాభిషేక మహోత్సవం ఎడ్వర్డ్ కు అత్యవసరంగాజరిగిన అపెండి సైటిస్  ఆపరేషన్ వలన ఆగస్ట్ కు వాయిదా పడింది .ఆగస్ట్ లో అనుకున్న తేదీకి అట్టహాసంగా పట్టాభిషేకంప్రారంభమైంది. బ్రటిష్ సామ్రాజ్య మిలిటరీ దళాల విన్యాసాలు ,అధికార దర్పం ,సామంతరాజులు మిలిటరీ అధికారులు,లార్డ్ లు ,రాజులు  అధికారులు సామాన్య ప్రజలు ,కెనడా ,ఆస్ట్రేలియా ,న్యూజిలాండ్ ,బెర్మూడా ,బోర్నియో ,ఫిజి ,గోల్డ్ కోస్ట్ నుంచి వచ్చిన సైన్యం రోడీ షియా ,కేప్ కాలని  నటాల్ ,సియర్రా లియోన్ ,గాంబియా ,నైజీరియా ఉగాండా  సిలన్, సైప్రస్ ,హాంగ్ కాంగ్  జమైకా ,వీహాయ్ వీ ,లాగోస్ ,మాల్టా  సెయింట్ లూసియా  సింగపూర్ ,ట్రినిడాడ్లనుంచి వచ్చిన సైన్యం  సమక్షం లో  కనువిందుగా జరిగింది .

జైపూర్ మహారాజు కొత్త చక్రవర్తి ఎడ్వర్డ్ కు అత్యంత విలువైన కానుకలు సంర్పించితన ప్రభు భక్తి ,విధేయత  చాటుకున్నాడు .తాను చక్కని హిందూ సంప్రదాయంతో చక్రవర్తి పట్టాభిషేకానికి వచ్చినందుకు  మహారాజుగా తన విధి తాను తృప్తిగా నిర్వహించినందుకు మనసునిండా సంతృప్తి పొంది స్వదేశానికి తిరిగి బయల్దేరాడు ‘.’నా ప్రవర్తన ఇప్పుడూ ఆతర్వాత కూడా నాప్రజలకు నచ్చుతుందని ,రాజపుత్రవీరుడు సముద్రాన్ని దాటినప్పటికీ ,హిందువుగానే ఉన్నాడని ,సామంతరాజు చేయాల్సిన విధిని సంతృప్తిగా నేరవేర్చానని  భావిస్తున్నాను ‘’అని  వార్తాత్రికలకు తెలియ జేశాడు .

పట్టాభిషేకం అయిన ఎనిమిదేళ్ళకు   ఎడ్వర్డ్  చక్రవర్తి చనిపోయాడు .మహారాజా మాధవ్ సింగ్ జైపూర్ లో యధాప్రకారం విద్యా, వైద్య,  సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తూనే  1922 లో మరణించాడు . గంగాజలం తో లండన్ తీసుకు వెళ్ళిన రజత పాత్రలు ప్రపంచం లోనే అతి పెద్ద పాత్రలుగా రికార్డ్ సృష్టించాయి .అవి జైపూర్ లో సిటీ పాలేస్ లో ‘’దివాన్ –ఇ –ఖాస్ ‘’   లో ప్రదర్శనలో ఉన్నాయి .వాటి తమ్ముడు  ఎక్కడో యెర్ర సముద్రం అట్ట అడుగున మునిగి పోయి ఉండిపోయాడు .

ఆధారం -23-9-18 ఆదివారం ‘’ది హిందు ‘’లో ఆదిత్య అయ్యర్ రాసిన ‘’వెన్ గాంజెస్ కేమ్ టు లండన్ ‘’వ్యాసం .

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -23-9-18 –ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.