శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -6
బృహదారణ్యకం లోనే సన్యాస విషయం సమగ్రంగా చెప్పబడింది .శుక్ల యజుర్వేదానికి చెందిన ‘’జాబాలోపనిషత్ ‘’కూడా సన్యాసం గురించి చెప్పింది .శంకర భగవత్పాదుల వంటి వారలకు బ్రహ్మ చర్యం నుండే సన్య సించవచ్చు అని దారికూడా చూపింది .యాజ్ఞావల్క్యుడే మొదట సన్యాసం స్వీకరించాడు అన్నమాట యదార్ధం .పరివ్రాజక ధర్మం గురించి విశేషంగా చెప్పింది జాబాలికోపనిషత్ .యజ్న రహస్యాలను ఆలంకారికంగా వర్ణించింది. బృహదారణ్యకంలో ముఖ్యంగా ఆత్మజ్ఞాన బోధ ఉంది. ఇందులో .యాజ్ఞావల్క్యుడే ప్రధాన భూమిక వహించాడు యాజ్ఞవల్క్య ,విదేహరాజుల మధ్య సంభాషణలో చెప్పాల్సిన విశేషాలన్నీ చోటు చేసుకొన్నాయి. దీనిలోనే బ్రహ్మవాదినులైన మత్రేయి, గార్గి ల వర్ణన కూడా ఉంది .మైత్రేయీ బ్రాహ్మణమైన దీనిలో ‘’ఆత్మావా అరే ద్రస్టవ్యః ‘’అనే వాక్యం వేదాంత శాస్త్రం అంటే ఉత్తర మీమాంసకు విషయం అయింది .
శుక్ల యజుర్వేదం అభ్యాసకులైన కాణ్వ, మాధ్య౦ది నులకు కాత్యాయనుడు రచించిన ‘’శ్రౌత సూత్రం ‘’ఉన్నది .దీనిలో 26 అధ్యాయాలు .ఇది ఖచ్చితంగా ‘’శత పథం’’అనుసరించే రాయబడింది .మొదటి 18 అధ్యాయాలు బ్రాహ్మణం లోని మొదటి 11 కా౦డలననుసరించి ఉంటే ‘’సౌత్రామణి’’,19లో, అశ్వమేధం 20 , పురుమేధం , సర్వమేధం ,పితృమేధం 21అధ్యాయాలలొ చెప్పబడ్డాయి తర్వాత ఉన్న మూడిటిలో ఏకాహం,సత్రం వగైరా ఉన్నాయి .25 లో 14 వ కాండలో చెప్పిన ప్రాయశ్చిత్తం ,చివరిదైన 26 అధ్యాయం లో 16 వ కా౦డ లోని ‘’ప్రవర్గ్య ‘’విశేషాలున్నాయి . స్వర సంస్కార నియమాలకు ‘’ప్రాతిశాఖ్య ‘’,ఋషి ,దేవతాదులు తెలుసుకోవటానికి ‘’కాణ్వ సర్వానుక్రమ సూత్రం’’ గృహ్య కర్మలకు ‘’పారస్కర గృహ్య సూత్రం ‘’ఉన్నాయి .అంటే కాత్యాయనుడు శుక్ల యజుర్వేదం అంతటికీ ప్రయోగ శాస్త్రం రాశాడన్నమాట .
యాజ్ఞవల్క్య మహర్షి కి మధ్య౦దినుడు ,జాబాలి ,బోధి ,శాపేయుడు , గాలవుడు అనే అయిదుగురు ముఖ్య శిష్యులున్నట్లు, వారు శుక్ల యజుర్వేదాన్ని అధ్యయనం చేసినట్లు విష్ణు పురాణం మొదలైన వాటిలో ఉన్నది .అయితే ఇప్పుడున్నవి కాణ్వ ,మాధ్యందిన శాఖలురెండే అని ముందే తెలుసుకొన్నాం .రెండిటిలో విషయం ఒక్కటే అయినా ,అధ్యాయ విభాగం ,వ్యాకరనణా౦శాలలొ భేదం ఉన్నది .ఋషి భేదాన్ని బట్టి వచ్చినవే. ఇవి విషయంలో తేడా ,దేశాలలో తేడా బట్టి భాషా భేదం ఉండచ్చు .ఆంగ్లేయ పరిశోధకులు కూడా ‘’ఎన్ సైక్లోపీడియా బ్రిటాన్నికా’’లో ‘’ఈ రెండింటిలో విషయభేదం చాలాతక్కువ .శైలిలో చాలాభేదం ఉంది ‘’అన్నారు .కాణ్వ పాఠం ఋగ్వేద సంప్రదాయం లో ఉంటుంది. మాధ్యందిన పాఠం కొన్ని చోట్ల కృష్ణ యజుర్వేదాన్ని పోలి ఉంటుంది .మాధ్య౦దినం కంటే కాణ్వం సర్వవిధాలాల శ్రేస్టం అని కూడా ముందే చెప్పుకున్నాం .మాధ్యందిన శాఖా సంహితలో 40 అధ్యాయాలు ,303 అనువాకాలు ,1975 ఖండికలు ఉన్నాయి .బ్రాహ్మణం లో 14 కాండాలు ,100 అధ్యాయాలు ,438 బ్రాహ్మణాలు ,7,624 ఖండికలు ఉన్నాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-18 –ఉయ్యూరు ,,,
—

