శ్రీ యాజ్ఞవల్క్య మహర్షి చరిత్ర -7
మిథిలానగరానికి దగ్గరలో ఒక ఆశ్రమం లో ‘’కతుడు ‘’అనే ఆయన ఉండేవాడు . .ఆయన కుమార్తె కాత్యాయని .అందం తో పాటు బుద్ధి శాలిని .యుక్తవయసురాగానే కతుడు భార్యతో కూతురు వివాహ విషయం చర్చించాడు .శుభ లక్షణాలున్న తమ కూతురు సాక్షాత్తు లక్షీస్వరూపమని భావించారు .గంగాతీరం లో ఒక మహాత్ముడు ఆశ్రమం లో ఉంటూ బ్రహ్మజ్ఞానం బోధిస్తున్నాడని అతడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడని లోకుల ద్వారా తెలుసుకొని అతనికి తమ కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని తలచారు.కతుడు అతని వివరాలు స్వయంగా తెలుసుకోవటానికి బయల్దేర యజ్నవల్క్యాశ్రమం చేరి ఆతనితో ‘’మాకు లక్ష్మీదేవి వంటి కాత్యాయని అనే కూతురు ఉంది .విష్ణు స్వరూపంగా ఉన్న మీరామెను వివాహం చేసుకోమని విన్నవి౦చటానికి విచ్చేశాను ‘’అన్నాడు . సంతోషం తో అంగీకరించి ,ఋషి బృందంతో కలిసి యాజ్న్యవల్క్యుడు వెళ్లి ,ఒక శుభ ముహూర్తం నాడు కాత్యాయనిని పరిణయమాడాడు . కాత్యాయినీ కళ్యాణ వైభోగాన్ని చూసి అందరూ ఆనందించారు .
యాజ్ఞ్యవల్క్యుడు బాదరాయణునికి దౌహిత్రుడైన బ్రహ్మ దత్తునికి తాను నేర్చిన శుక్ల యజుర్వేదాన్ని క్షుణ్ణంగా అభ్యసింప జేసి ,ప్రయోగం ఎలాచేయాలో యాగాలు కూడా చేయించాడు .ఆకాలం లో యాగాలు అన్నిటికన్నా శ్రేష్టమైన కర్మలని భావించేవారు .పిలిచినా ,పిలవకపోయినా యాగాలు చూడటానికి రుషి గణం ఉత్సాహంగా వచ్చేది.శాకల్యుడు అనబడే వైశంపాయనుడు ,ఉద్దాలకుడు ,తిత్తిరి ,శ్వేతకేతుడు ,కహోళుడు మున్నగు ఋషులు కూడావచ్చియాజ్ఞవల్క్యుడు చేయించే యజ్న విధానాన్ని చూసి ఆశ్చర్య పోయేవారు .మేనల్లుడిని తన ఇంటి నుంచి తరిమేస్తే ఇంతటి ప్రభావ శీలి అయినందుకు మేనమామ శాకల్యుడికి ఈర్ష్య కలిగింది .తనతో వచ్చినవారితో పూర్వం నుండి వస్తున్నకల్పాలన్నిటినీ మార్చేసి ,కొత్తవి కల్పించి చేయిస్తున్న తీరు నచ్చలేదని చెప్పాడు .ఉద్దాలకుడు ‘’ఈ వేదం యాజ్ఞవల్క్యుడు కల్పించినట్లుగా ఉన్నది ‘’అన్నాడు . మిగిలిన ఋషులు తొందర పడటం మంచిదికాదని ,ఈ విధులన్నీ ఎవరి వద్ద నేర్చాడో తెలుసుకోవాలని అన్నాడు .క్రోధం ఉంటె అవతలి వారిలో ఉన్న గుణం దోషంగా కనిపిస్తుంది అని వారించారు .
వారు యాజ్ఞావల్క్యుని చేరి ‘’మహాత్మా !ఈవేదం పేరేమిటి ?దానిలో విషయమేమిటి ?ఎవరి దగ్గర నేర్చావు ‘’అని సవినయంగా ప్రశ్నించారు .దానికి ఆయనకూడా అత్యంత వినయం తో ‘’ఋషి పు౦గవులారా ! దీన్ని శుద్ధ యజుర్వేదం ,ఏకాయనం ,యాతయామ అంటారు .ఇది వ్యవస్థితి ప్రకరణం ,సర్వకర్మ నిరూపకం ,పూర్వ ,ఉత్తరాంగ సహితం .స్వయంభు బ్రహ్మనుండి ఏర్పడి సర్వ తేజో రాశి అయిన సూర్యుని వద్ద అధ్యయనం చేశాను ‘’అని విన్నవించాడు .సాకల్యుడికి అంతటి తేజో రాశి అయిన సూర్యుని ఎలా చూశావని అడిగాడు .కావాలంటే దర్శనం కలిగిస్తానని చెప్పి తేజో మయమైన తన రూపాన్ని చూపించగా వాళ్ళు మూర్ఛ పోయారు .కాసేపటికి తేరుకొని యాజ్ఞావల్క్యుని అవతార పురుషునిగా భావించి ,ఆయన సాక్షాత్తు పరాత్పరుడే అని నిశ్చయం చేసుకొని ఆయనవద్దే అన్నీ నేర్చుకొందామని నిర్ణయానికి వచ్చారు .
మిగిలిన ఋషుల అభిప్రాయాన్ని మన్నించని శాకల్యుడు వారికి వెర్రి ముదిరిందని ,అదంతా అతని మాయాజాలమని కొట్టిపారేసి ,తనపై కోపంతో గురుకులం నుంచి వచ్చి ,ఇక్కడ తానేదో వెలగబెడుతున్నాడనిఅన్నాడు ,అప్పుడు ఆ ఋషులు తమలో తాము యాజ్ఞవల్క్యుడు తమ వేదాన్ని అపహాస్యం చేయనే లేదని ,తాముకాని తమ శిష్యులు కానీ అయన చేసే విమర్శలకు సమాధానం చెప్పలేక తలది౦చుకోవాలని అనుకోని ‘’మంత్రం బ్రాహ్మణం వేర్వేరుగా ఉండాలా ?స్వరం మొదలైన భేదాలు లేకుండా ఒకటిగానే ఉండాలా?ఒకటిగా ఉంటే ,మంత్రం అని బ్రాహ్మణం అని రెండు పేర్లెందుకు ?మంత్రం అంటే, బ్రాహ్మణం అంటే ఏమిటి ?శాస్త్రాలలో రెండిటికీ భేదం చూపించారా లేదా ?బ్రాహ్మణం మంత్రానికి వ్యాఖ్యానం అవుతు౦దా కాదా ?కాదు అంటే బ్రాహ్మణం లో ‘’ఇషేత్వా ‘’మొదలైన మంత్ర ప్రతీపకాలకు ఎందుకు వ్యాఖ్యానం చేశారు ?ఇదికాదు అంటే నేరం కాదా ?పోనీ బ్రాహ్మణం అయినా మనకు సమగ్రంగా ఉందా ?లేదుకదా .అలాఉంది అంటే ‘’పరాయాతం ‘అనే పేరు మన బ్రహ్మణ౦ లో కొంతభాగానికి ఎందుకొచ్చినట్లు?మన బ్రాహ్మణాలలో కొన్నిభాగాలను ‘’కాఠకాలు ‘’అని ఎందుకు పిలుస్తారు ?ఇది కఠశాఖ నుంచి రాలేదని చెప్పగలమా ?మంత్రానికి మంత్రం ,బ్రాహ్మణానికి బ్రాహ్మణం వేర్వేరుగా లేకపోవటం మన వేదానికే కాని రుగ్వేదాదులకు ఉందా ?లేదుకదా .వాటికి బ్రాహ్మణాలు సంహిత లతో కలిసి ఉండకుండా ప్రత్యేకంగా ఉన్నాయికదా ?అన్ని వేదాలకు మంత్ర బ్రాహ్మణం స్వరం మొదలైన భేదాలతో వేటికవి అలా ప్రత్యేకంగా ఉంటే , వేదానికి మాత్రం అలా లేకపోవటాన్ని ఏమనాలి ? .అది అలాఉండనీ –
‘’క్రియలన్నీ మంత్రాలతోనే చేయాలా ?మంత్ర వ్యాఖ్యానాలైన బ్రాహ్మణాలతో చేయాలా ? దీనిపై స్పష్టత లేదుకదా?అలాయితే శాస్త్ర విరుద్ధమవుతుంది .అన్ని క్రతువులు మంత్రాలలో అంటే సంహితలలో ఉన్నాయా ?ఉన్నాయంటారా ?సౌత్రామణి,పురుషమేధం సంహితలలో ఎక్కుడున్నాయో చెప్పగలమా ?పైగా ,సర్వ మేధం ,పితృ మేధం ,ప్రవర్గ్యలు మనకు బ్రాహ్మణాలలో కనిపించవుకాని ,ప్రత్యేకభాగాలుగా ఉన్న ఆరణ్య కాలలో ఉంటాయికదా . ఆరణ్య కానికి యేమని అర్ధం చెపుతాం ?అరణ్యాలలో అధ్యయనం చేసినందుకే కదా వాటికి ఆరణ్యకాలు అనే పేరొచ్చింది ?దీనికి సార్ధక్యం ఉందా ?మనకు’’శుక్రియ ‘’ భాగం సంహితలో ఉందా ?లేదే .శుక్రియలంటే సూర్యుడు ఉండగా పఠించే మంత్రాలుకదా?’’అని తర్జన భర్జన పడ్డారు .ఇంకా సందేహాలు తీరక ప్రశ్నించుకొన్నారు .వాటిని తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-9-18 –ఉయ్యూరు
—

