‘’చంద్రుని ‘’కో నూలుపోగు
నిన్న సాయంత్రం శ్రీ పూర్ణ చ౦ద్ ఫోన్ చేసి ‘’రేపు ఉదయం సాంస్కృతిక శాఖ డైరెక్టర్ శ్రీ డి .విజయ భాస్కర్ తోకలిసి రచయితలూ కవులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు ‘’ను కలవాలను కొన్నాము మీరు రేపు ఉదయం 9 కల్లా బెజవాడ ఘంటసాలసంగీత కళాశాలకు వచ్చేయండి అక్కడినుంచి ఏర్పాటు చేసిన వెహికల్ లో వెడదా౦’’అన్నారు సరే అన్నాను. ఎందుకు ,ఏమిటి అని నేనూ అడగలేదు ,ఆయనా చెప్పలేదు .
ఇవాళ ఉదయం 5 గంటలకే లేచి స్నాన సంధ్య పూజాదికాలు పూర్తి చేసి 7 గంటలకల్లా కాఫీ తాగి , బెజవాడ బయల్దేరా .ఈ లోపే మళ్ళీ పూర్ణ చ౦ద్ ఫోన్ చేసి, ప్రోగ్రాం జ్ఞాపకం చేశారు .సత్యనారాయణపురం లో ఘంటసాల మ్యూజిక్ కాలేజికి 8-40 కి చేరా .అప్పటికి ఎవరూ వచ్చిన దాఖలా కనిపించలేదు. దగ్గరే ఉన్న ఫుడ్ జంక్షన్ కు వెళ్ళా ఇడ్లీ తిని కాఫీ తాగుదామని .అది సాయం వేళమాత్రమే తెరుస్తారని ప్రక్కనే ఉన్న బేకరి ఆయన చెబితే వాళ్ళదగ్గరే రెండు కేకులు కొని, తిని, బి.పి. టాబ్లెట్ వేసుకొని టీ తాగి మళ్ళీ కళాశాల చేరా .కొందరు రచయితలు కనిపించారు .పూర్ణ చంద్ 9 కి వచ్చారు .అందరికీ ఎందుకు వెడుతున్నామో తెలీదు .నేను బహుశా బాబు ఐరాస లో వ్యవసాయం గురించి తెలుగులో మాట్లాడినదానికి అభినంది౦చ టానికేమో అన్నా. కావచ్చు అన్నారుఅంతా . సాంస్కృతికశాఖ తలొక చిన్న బిస్కెట్ పాకెట్ ఇచ్చింది .9-15 కు అందరం మాకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక’’ నాన్ ఎ.సి .’’బస్ ఎక్కాం .9-25 కు బస్ బయల్దేరింది .ఆంధ్రప్రదేశ్ నాటక అకాడెమి అధ్యక్షులు, పౌరాణిక నాటక నటులు శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ ,స్వర్గీయ మంగళం పల్లి బాలమురళీ కృష్ణ గారి బహిర్ ప్రాణం ,రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలమురళి స్మారక అవార్డ్ ను ఈ సంవత్సరం మొట్టమొదటి సాటిగా అందుకున్న ప్రముఖ వయోలిన్ విద్వాంసులు శ్రీ అన్నవరపు రామ స్వామి , కృష్ణా జిల్లా రచయితలసంఘ కార్యదర్శి డా .జి వి పూర్ణచంద్ ,శ్రీ విజయభాస్కర్ గార్లు కార్లలో బయల్దేరారు .
మా బస్ లో మాతో పాటు వచ్చినవారిలో అవధాన శిరోమణి డా శ్రీ పాలపర్తి శ్యామలాన౦ద ప్రసాద్ ,రమ్యభారతి సంపాదకులు ఆంధ్రప్రదేశ్ రాచాయితలసంఘ కార్య దర్శి శ్రీ చలపాక ప్రకాష్ ,కవి రచయితా ,లయన్ శ్రీ బందా వెంకటరామారావు ,నేనూ ,శ్రీ టేకుమళ్ళ వెంకటప్పయ్య ,శ్రీ శిఖా ఆకాష్ , శ్రీ ప్రసాదరావు ,శ్రీ వెంకట రామాచార్యులు, డా శ్రీమతి రేజీన ,శ్రీమతి కొకావిమలకుకుమారి శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసు౦దరి ,శ్రీమతి కోనేరు కల్పన,శ్రీమతి సామినేని శైలజ ,శ్రీమతి కొమాండూరి కృష్ణ భర్త గారు ,మాచవరం శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం ప్రధాన అర్చకులు (రిటైర్డ్ ),మల్లెపందిరి సంపాదకులు ,శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ ,శ్రీ పంతుల వేంకటేశ్వర రావు దంపతులు ,సంగీతకళాశాల విద్వాంసులు మొదలైన 30 మంది రచయితలూ, కవులు కళాకారులు ఉన్నారు .
10 .25 కు మా బస్ బెజవాడకు రాజధాని అమరావతికి మధ్యలో ఉన్న ముఖ్యమంత్రి నివాస గృహానికి అంటే ‘’ప్రజా వేదిక ‘’కు చేరింది .మెటల్ డిటెక్టర్ తో మమ్మల్ని అందర్నీ’’ తోమి ‘’,ఏ అపాయకర వస్తువులు లేవని నిర్ధారించి ,మరొక చోట మళ్ళీ చెక్ చేసి మా పర్సులు, సెల్ ఫోన్లు , కెమెరాలు తీసేసుకొని లోపలి పంపారు .అప్పటికే అక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్స్తున్న 60 మంది స్త్రీ,పురుష రైతులు లైన్ లో ఉన్నారు .మమ్మల్ని వాళ్ల వెనకాల నిలబడమన్నారు .’’మన్నాము’’.ఇంతలో ఒక సెక్యూరిటీ ఆయన నా దగ్గరకొచ్చి ‘’సార్ మీ ఏజ్ ఎంత ?’’అన్నాడు .’’79 పావు’’ అన్నా’భలే యాక్టివ్ గా ఉన్నారు సార్ ‘’అని కాంప్లిమెంట్ పడేశాడు. నవ్వా .ఇంకో ఆయన ఎవరెవరు సి ఏం గారిని కలుస్తారో పేర్లు చెప్పండి అన్నాడు నాకు తెలిసిన పేర్లు చెబితే నోట్ చేసుకున్నాడు.కాసేపటికి సెక్యూరిటీ వాళ్ళు మాతో ‘’సిఎం గారు అరకు వెళ్ళబోతున్నారు .లోపలి వెళ్లి కలిసే అవకాశం లేదు .ఆయనే మీ దగ్గరకు వచ్చి పలకరిస్తారు ‘’ అని ‘’చల్లగా’’ చెప్పాడు .అందర౦ అటేన్షన్ పోజు పెట్టాం .ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ముందుగా రైతుల దగ్గరకు చాలాదగ్గరగా నమస్కరిస్తూవచ్చి , ముందుకు సాగారు .ఆ తర్వాత మా దగ్గరకు నమస్కరిస్తూ వచ్చారు. నేను అందర్నీ తోసేసి ముందు వరుసలో నిలబడ్డా .నాదగ్గరకు ఆయన రాగానే , షేక్ హాండ్ కోసం చెయ్యి చాపా .నవ్వుతూ కరచాలనం చేశారు .ఇదే మొట్టమొదటి సారి బాబు గారిని అంత దగ్గరగా చూడటం షేక్ హాండ్ ఇవ్వటం కూడా .హైదరాబాద్ లో శ్రీ మాడుగులవారి ద్విశతావధానం లోనో సహస్రావధానం లో నో ఒకసారి ,దోమలగూడా రామ కృష్ణ మఠం లో ఒకసారి కొంచెం దగ్గరగానే సభా వేదికపై చూసిన గుర్తు .ఆయనంటే అభిమానమే అయినా సభలకూ ,సమావేశాలకూ ఎప్పుడూ వెళ్ళలేదు నేను .ఇవాళ తెల్లవారు ఝామునే ఆయన అమెరికానుంచి వచ్చినా మొహం లో ఎక్కడా అలసట కనపడ లేదు చాలా ఫ్రెష్ గా ఉన్నారు .నవ్వులో తేడా లేదు .అదే చిరు దరహాసం .నా దగ్గరకు రాగానే నాతో పాటు అందరితో ‘’మన్యం వెళ్ళాలి అర్జెంట్ గా .సమయం లేదు .అందుకే ఎక్కువ సేపు మీతో గడపలేక పోతున్నాను’’ అన్నారు అపాలజెటిక్ గా .అందరం అర్ధం చేసుకున్నాం .ఇంతలో ఒకాయన ‘’అరకు లో మధ్యాహ్నం 1-30 దాటితే మబ్బులు కమ్మి హెలికాప్టర్ ప్రయాణం ఇబ్బంది అవుతుంది ‘’అన్నాడు .నిజమే కదా .అందులోనూ నక్సలైట్ ల తుపాకి తూటాలకు బలైన ఏం .ఎల్ .ఏ .శ్రీ కిడారి సర్వేశ్వరరావు ,మాజీ ఏం. ఎల్ .ఏ. శ్రీ సోము గార్ల కుటు౦బాలను పరామర్శించటం ప్రదాకర్తవ్యం గా బయల్దేరు తున్నారు .
ముఖ్యమంత్రి కారులో బయల్దేరగానే రచయితలను, రైతులను అక్కడే ఉన్న ఎసి హాల్ లోకి వెళ్లి కూర్చోమని చెప్పారు .అక్కడ సిద్ధంగా ఉన్న కుర్చీలలో ఒక వైపు రైతులు, వారికి ఎదురుగా సాంస్కృతిక బృందం ఆసీనులయ్యాం .శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ చంద్రబాబు రైతులకు చేసిన సేవలు ,పట్టిసీమ ఎత్తిపోతల పధకం, పోలవరం ,గాలేరు నగరి ,హంద్రీ నీవా ,కొండగట్టు వాగు వలన అమరావతికి ముంపు రాకుండా ఈమధ్యే ప్రారంభించిన ఎత్తిపోతల పధకం ,అవుకు టన్నెల్ విశిష్టత మొదలైనవన్నీ తానే గొప్పగా రాసి గానం చేసిన పద్యం లో కళ్ళకు కట్టించి రైతులకు మేలు జరగాలంటే మళ్ళీ బాబే రావాలని చప్పట్ల మధ్యఅనిపించారు . ఇక సాంస్కృతిక బృందం తరఫున సాంస్కృతిక శాఖ సంచాలకులు, ముఖ్యమంత్రికి మిక్కిలి ఆప్తులు, కవి గొ ప్పరచయిత ,పని రాక్షసుడు శ్రీ దీర్ఘాసి విజయభాస్కర్ మాట్లాడుతూ ‘’ఐక్య రాజ్యసమితిలో జీరో బెసేడ్ బడ్జెట్ తో ప్రకృతి సేద్యం పై తెలుగులో ప్రారంభించి మాట్లాడి తెలుగుకు అంతర్జాతీయ వేదికపై గౌరవం కల్గించిన ముఖ్యమంత్రికి మనమందరం కరతాళ ధ్వనులతోఅభినందనలు చెబుదాం .ఇక్కడ కమతం చేసే రైతులు ,కవనం చేసే కవులు ఉండటం చాలా ఆనందంగా ఉంది .పోలంపండించి వాళ్ళు మనకు అన్నం పెట్టి రైతే రాజు అని చాటుతున్నారు .కలం తో కవులు, రచయితలూ మానసిక ఉల్లాసం కలిగించి జాతికి దిశా నిర్దేశం చేస్తున్నారు .ఈ ఇద్దరినీ రెండు కళ్ళు గా భావించి అందరికీ న్యాయం అందరికీ అభివృద్ధికోసం అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు ముఖ్యమంత్రి ..వారికి ఆంద్ర జాతి యావత్తు మద్దత్తు పలికి ఈ అభివృద్ధి కొనసాగటానికి మళ్ళీ ఆయన అధికారం లోకి వచ్చే ప్రయత్నం చేసే బాధ్యత మనందరి పైనా ఉంది ‘’అని కర్తవ్యమ్ బోధించారు .శ్రీ అన్నవరపు వారు ‘’బాబు గారి లాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి అవటం మన రాష్ట్ర౦ అదృష్టం .ఆయన ఎనర్జీ రిచార్జిఅవసరం లేని బాటరీ లాంటిది .కవులకూ కళాకారులకు ,రచయితలకు పించన్లు ఇతోధికంగా పెంచిన గోప్పమనసు ఆయనది .నాకు బాలమురళీ అవార్డ్ కింద 10 లక్షల రూపాయలు అందజేసి పెద్దమనసును చాటుకున్నారు.ప్రతిభఎక్కడ ఉన్నా ఆయన గుర్తించి ప్రోత్సహిస్తారు ‘’అన్నారు .డా .పాలపర్తి వారు ‘’చద్రునికో నూలుపోగు ‘’అనే శీర్షికతో పద్యాలు రాసి చదివి బాబుకు వేదాశీర్వచనంలా చేశారు .ఆశీర్శికనే నేను కాపీకొట్టి, దీనికి హెడ్డింగ్ గా పెట్టా ..శ్రీమతికోకా విమలకుమారి ఏదో మొదలుపెట్టి ఏదేదో మాట్లాడగా నేను లేచి గుమ్మడిగారికి నేను మాట్లాడతాను అని సైగ చేస్తే నన్ను రమ్మనగానే వెళ్లి ‘’ఇప్పుడు దేశం ధ్యేయం ‘’చంద్ర యాన్’’.కనుక రాష్ట్రం లో నూ, దేశం లోనూ అది సఫలం కావాలి అని ఆశిద్దాం ‘’అని ఒకే ఒక్కమాట ‘’ శ్లేష ‘’గా మాట్లడా .తర్వాత శ్రీ పంతుల మాట్లాడారు .ఈలోపు అందరికీ రెండుసార్లు కాఫీ ఇచ్చారు .తాగి బయటికి వచ్చి బస్సు ఎక్కి బెజవాడ చేరి ,ఇంటికి వచ్చేసరికి పావు తక్కువ రెండు అయింది .అన్నం తిని,కాసేపు విశ్రమించి లేచి ,ఇది రాశా .మా కెమెరాలు సెక్యూరిటీ తీసేసుకోవటం వలన ఫోటోలు తీయలేక పోయాం .అయినా నేను మీటింగ్ హాల్ లో కెమేరాతో ఫోటోలు తీశా . కొందరు ఇవాల్టి కార్యక్రమాన్ని ‘’చంద్ర భజన ‘’అనవచ్చుకాని .ఆయన మన రాష్ట్రానికి చారిత్రాత్మక అవసరం అనేది చారిత్రాత్మక సత్యం అని అందరూ అనుకొనేమాట .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -28-9-18- ఉయ్యూరు
—

