గీర్వాణకవుల కవితా గీర్వాణం-4
332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ(1958)
సుప్రసిద్ధ కవిపండిత వంశం లో జన్మించి ,సంస్కృత సాహిత్య మధనం చేసి సాహిత్యవిద్యాప్రవీణులై ,ధర్మ సూరి విరచిత ‘’సాహిత్య రత్నాకరం ‘’ను పరిష్కరించిన నేర్పరియై ,నౌకామంధర సహిత వ్యాఖ్యాతయై , ఎం.వో.ఎల్.,ఆంద్ర ఎం.ఏ.,పొంది ,’’ధ్వని –మనుచరిత్ర ‘’పై పరిశోధన గ్రంథం రచించి పి.హెచ్ .డి .అందుకొని ,హైదరాబాద్ పటేల్ కళాశాల ఉపన్యాసకులై ,సంస్కృత నలచరిత్ర,,ధర్మపురి లక్ష్మీ నరసింహ సుప్రభాతం ,మొదలైన సంస్కృతాంధ్ర గ్రంథరచన చేసిన ‘’సంస్కృత సాహిత్య రత్న ‘’విద్యాప్రవీణ ,ఒకప్పటి కరీం నగర్ ఇప్పటి జగిత్యాలజిల్లా ధర్మపురి వాస్తవ్యులు డా.కొరిడె రాజన్న శాస్త్రి ,శ్రీమతి సులోచనా దేవి గార్ల పుత్రరత్నమే డా . కొరిడెవిశ్వనాథశర్మ గారు .తండ్రికి దీటైన ,కొండొకచో తండ్రిని మించిన సంస్కృతాంధ్ర భాషా పండితులు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల అధ్యాపకులుగా ప్రవేశించి, ప్రిన్సిపాల్ స్థాయికి ఎదిగిన విద్వన్మూర్తి ,పరిపాలనా దక్షులు శర్మగారు ..
విశ్వనాధ శర్మగారు 4-6-1958 న కొరిడె వారి సంస్థానం ,పవిత్రగోదావరీ తీరంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం ధర్మపురిలో జన్మించారు .సంస్కృతం లో బి .వో.ఎల్ .,తెలుగులోఎం.ఏ .డిగ్రీలు పొందారు .’’లింగ పురాణం –విమర్శనాత్మక పరిశీలనం ‘’పై పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం నుండి పరిశోధన చేసి పి .హెచ్ .డి .అందుకున్నారు ‘
సంస్కృతం లో 1- శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాతం 2-పెద్దాపురం లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాతం రచించారు .తెలుగులో 1- భర్తృహరి సద్భావ లహరి 2-ధర్మపురి కావ్యం (అసంపూర్ణం )రాశారు .శర్మగారు ప్రసిద్ధ అనువాదకులుకూడా .1-లింగ పురాణం ను కీ.శే .డా .వి హన్మాన్ శర్మగారితో కలిసి అనువదించారు .2-బ్రహ్మ పురాణా౦తర్గతమైన 108 అధ్యాయాల బృహత్ సంస్కృత గ్రంథం ‘’గోదావరీ మహాత్మ్యం ‘’ను కూడా శ్రీ హనుమాన్ శర్మగారితో కలిసి అనువాదం చేశారు .మహా పౌరాణికులైన శర్మగారు తమ పితృపాదులు రచించిన ‘’శ్రీ ధర్మ పురి లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాతం ‘’కు తెలుగు వ్యాఖ్యానం రచించి సాహిత్య పిత్రూణ౦ తీర్చుకొన్నారు .ప్రస్తుతం 1-కీ.శే .తు౦గూరి శివరామ శర్మగారి అసంపూర్తి పద్యకావ్యం ‘’కాదంబరీ సంగ్రహం ‘’కు 2-భర్తృహరి విజ్ఞాన శతకం కు తెలుగు వ్యాఖ్యానాలు రాస్తున్నారు.
శర్మగారి సంపాదకత్వం లో 1-డా.వి.హన్మాన్ శర్మగారి ‘’పదవీ విరమణ అభినందన సంచిక’’ 2-కవితా శ్రీ శిల శ్రీనివాస్ వెలువరించారు .ఆకాశవాణి నుండి సుమారు 15సాహిత్య ప్రసంగాలు చేశారు .సప్తగిరి ఆరాధనహనుమ ,మాలిక పత్రికలలో వ్యాసాలు రాశారు .మాంచి భావకవి ఐన శర్మగారు కొన్ని ముద్రిత ,అముద్రిత భావకవితలు రాశారు .ఆలిండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ లలో పరిశోధక పత్రాలు రాసి సమర్పించారు . శర్మగారి విద్యాభ్యాసం అంతా ధర్మపురి లోనే జరిగింది .ఓరియెంటల్ స్కూల్ శ్రీ సీతారామలింగేశ్వర దేవాలయం అనే శివాలయం లోనే చాలా కాలం ఉండేది. ఇక్కడే చెట్లక్రింద అరుగులమీద చదువు సాగేది .కాలేజీ కూడా ఇక్కడే ప్రారంభమైంది .తర్వాత నూతనభవనాలలోకి మారింది .శార్మగారికీ శివాలయానికి అవినాభావ సంబంధం చాలాఉంది .ఈ ఆలయం లోనే కార్తీక మాసాలలో పురాణ ప్రవచనాలు చేస్తారు .ప్రస్తుతం ఒక గృహిణి కోరికపై వారింట్లో తాము అనువదించిన ‘’గౌతమీ మహాత్మ్యం ‘’ .పురాణం చెబుతున్నారు .ఇది వారి వృత్తికాదు, ధార్మిక ప్రవృత్తి..స్ఫురద్రూపం తో, వెడల్పు ముఖంతో, నుదుట తీర్చి దిద్దబడిన విభూతి రేఖలతో ,చక్కని వెడల్పు అంచు మల్లెపూవులాంటి ధోవతీ, అడ్డంగా భుజాలపై వ్రేలాడే ఉత్తరీయం తో బ్రహ్మ వర్చస్సు వెలిగిపోతూ ,బ్రాహ్మీమయ మూర్తిగా ,రాజసం ఉట్టిపడే నడకలో మరో శ్రీనాధ కవి సార్వభౌమునిలా , అపర కాశీ విశ్వనాథునివలె ఈ ధర్మపురి విశ్వనాథ శర్మ గారు గోచరిస్తారు . మంచి స్థితి పరులైన శర్మగారు బంగారానికి తావి అబ్బినట్లు, ఉదార గుణ సంపన్నులు .తమ ‘’కొరిడె సాహితీ సంస్థాన విజయాలకు చిహ్నంగా ,తమ కుటుంబ ,వంశ కీర్తి ప్రతిష్టలకు ,వినయవివేక సంపత్తికి గౌరవ భూషణ౦ గా , తమ రెండస్తుల మేడకు ‘’విజయ భూషణం ‘అని సార్ధక నామకరణం చేశారు .
శర్మగారి శ్రీమతి గొప్ప విదుషీమణి .ఈ దంపతులు అతిధి మర్యాదలకు పెట్టిందిపేరు .బ్రాహ్మణ్యం ఎవరొచ్చినా తమ ఇంటికి ఆహ్వానించి భోజనం పెట్టకుండా పంపరు .ఆమె ప్రవరాఖ్యుని ధర్మపత్ని లాగా ‘’వండనలయదు వేవురు వచ్చి రేని ,నడికి రేయైన’’ అనే సంప్రదాయం పాటించే ఉత్తమ గృహిణి .
ఈ దంపతులకు ఇద్దరు కుమారులు .మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డారు .
ఆధారం –శ్రీ విశ్వనాథ శర్మగారు నాకు ధర్మపురిలో 28-10-18 ఆదివారం వారింటిలో ఆత్మీయంగా అందజేసిన బృహద్గ్రంథం-‘’గౌతమీ మహాత్మ్యం ‘’.
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -1-11-18-ఉయ్యూరు

