గౌతమీ మాహాత్మ్యం-9
పదకొండవ అధ్యాయం- కుమారతీర్ధం
బ్రహ్మ నారదునితో కార్తికేయ తీర్ధ వివరాలు చెప్పాడు- ‘’తారకాసుర సంహారం జరిగాక స్వర్గం లో మామూలు పరిస్థితులేర్పడి పార్వతీ దేవి కుమారస్వామితో తండ్రి, తన అనుగ్రహం వలన ముల్లోకాలలో మనసుకు నచ్చినచోట భోగాలను అనుభవించమని చెప్పింది .తల్లి’’ పచ్చ జెండా ‘’ఊపగానే , దేవ స్త్రీలను,దేవపత్నులను వారి ఇష్టం తో, బలాత్కారం గా కూడా అనుభవించాడు .అతడిని వారిచటం ఎవరి వల్లాకాలేక పార్వతీ దేవితో చెప్పుకొన్నారు .తల్లి చాలా సార్లు చెప్పినా ,దేవతల శాపం తగుల్తుందని వారించినా వినలేదు .ఇక ఇలా లాభం లేదనుకొని కుమారుడి దృష్టి ఏ స్త్రీమీదపడితే ఆ స్త్రీ రూపం తానుపొంది తనరూపం వాళ్ళకిచ్చింది .ఇప్పుడతనికి తాను కామించిన స్త్రీలో తల్లి రూపే కనిపించి సిగ్గుపడి జగత్తు అంతా మాతృమయం అనే ఎరుకకలిగి , వైరాగ్యభావం పొంది ,తర్వాత తనకు బుద్ధి చెప్పటానికే అలాచేసిందని గ్రహించి, తల్లి చేసిందంతా హాస్యాస్పదం గా తోచి గౌతమీ తీరం చేరి ‘’అమ్మా గౌతమీ !ఈ క్షణం నుంచి ఏ స్త్రీ అయినా నాకు తల్లి తో సమానం అని శపథం చేస్తున్నాను ‘’అన్నాడు .శివుడికి తెలిసి, జరింగేదో జరిగిపోయింది అలాంటి ఆలోచన మానుకొమ్మన్నాడు .అందరితో అయన ‘’నేను సురపతిని సేనాపతిని ,నీపుత్రుడిని నాకు ఇంకే వరమూ అక్కరలేదు .కాని ఎవరైనా గురు పత్నిని సంగమించి మహాపాతకం చేస్తే, వారు గౌతమీ స్నానం చేస్తే పాపప్రక్షాళన పొందేట్లు ,కురూపులు మంచి రూపాన్ని పొందేట్లు అనుగ్రహించు ‘’అని కోరాడు .తధాస్తు అన్నాడు తండ్రి .అప్పటినుంచి ఇది కుమార తీర్ధమయింది .
13-కృత్తికా తీర్ధం
బ్రహ్మ ‘’తారకాసుర సంహారం లో అగ్ని శివుని రేతస్సును తాగాడు .రేతో గర్భుడైన అగ్నిని చూసి రుషిపత్నులు మోహ౦ చెందారు.అరు౦ధతీదేవి తప్ప, మిగిలిన ఆరుగురు మునిపత్నులు అగ్ని స్పృహమాత్రాన గర్భవతులయ్యారు .చేసిన తప్పుకు బాధపడుతూ చేసేదిలేక గంగానదికి వెళ్లి గర్భాలను పిండుకొన్నారు .ఆ గర్భాలు నురుగు రూపం లో నీటిలో చేరాయి .గాలి వలన ఆరూ కలిసి’’షణ్ముఖునికి జన్మనిచ్చాయి.కడుపులు ది౦చేసుకొన్న మునిభార్యలు ఇళ్ళకు చేరగా, భర్తలు చీత్కరించి వెళ్ళిపోమ్మన్నారు.దిక్కులేక విలపిస్తుంటే నారదుడువచ్చి ‘’కార్తికేయుని శరణు పొందండి ‘’అని హితవు చెప్పాడు .వెళ్లి తమబాద చెప్పుకొన్నారు .జాలిపడిన తారకాంతకుడు ‘గౌతమి అనే గంగానదికి వెళ్లి స్నానం చేసి పునీతులై శివుని పూజించండి ‘’అని చెప్పాడు .వారు అట్లాగే చేసి స్వర్గం చేరారు అని నారదుడికి బ్రహ్మ చెప్పాడు .
14-దశాశ్వమేధ తీర్ధం
నారదునికి బ్రహ్మ దశాశ్వమేధతీర్ధ వివరాలు చెబుతూ ‘’విశ్వకర్మకొడుకు విశ్వ రూపుడు.ఇతని మొదటి భార్య కొడుకు ‘’భౌవనుడు ‘’ ఇతని పురోహితుడు కశ్యపుడితో తనకు పది ఆశ్వమేధ యాగాలు చేయాలనే కోరిక ఉందని చెప్పగా బ్రాహ్మణ శ్రేస్టలు ఎక్కడెక్కడ చేయమంటే అక్కడ చేయమని చెప్పాడు .అన్ని సంబారాలతో దశాశ్వమేదాలు విధి విధానంగా ఒకే సారి ప్రారంభించాడు.కాని అనేక విఘ్నాలవలన అవి సంపూర్ణం కాలేదు.గురువును సంప్రదిస్తే ,ఇద్దరూకలిసి బృహస్పతి పెద్దన్నగారు సంవర్తనుడు దగ్గరకు వెళ్ళారు .ఆయన బ్రహ్మ దగ్గరకు పంపాడు .ఆయన గౌతమీతీరం లో కశ్యపమహర్షి ఆధ్వర్యం లో ఒక అశ్వమేధం చేయమని లేక అందులో స్నానం చేస్తే చాలు పది అశ్వమేధాలు చేసిన ఫలితం కలుగుతుంది అని చెప్పాడు .
భౌవనుడు గౌతమీ తీరం లో హయమేధం ప్రారంభించి పూర్తి చేశాడు .భూమిని దానం చేయాలని సంకల్పించగా ‘’కశ్యపమహర్శికే శైల వన ,కాననాలతో కూడిన పృద్విని దానం చేస్తానని అనటమే చాలు భూ దానం చేసినట్లే .కనుక ఆప్రయత్నం వదిలి అన్నదానం చేయమని గంగా నది ఇసుకతిన్నెలపై చేసే అన్నదానికి మించిన పుణ్యం లేదని అనుమానం వద్దని ఆశరీరవాణి వినిపించింది .అప్పుడు భూదేవి రాజుతో ‘’నన్ను మాటిమాటికీ దానమిస్తే నేను నీళ్ళలో మునిగిపోతాను కనుక నన్ను దానమివ్వద్దు ‘’అని చెప్పింది .ఏదానం చేయాలో చెప్పమని అడిగితే ‘’గౌతమీనదీ తీరం లో చేసిన దేదైనా అక్షయమైన దానం అవుతు౦ దికనుక అన్నపు ముద్ద దానం చేయి దానివలన అన్నీ దానం చేసిన ఫలితం వస్తుంది ‘’అన్నది .ఆమె మాటలను ఆచరణలోపెట్టి బ్రాహ్మణులకు విశేషంగా అన్నదానాలు చేశాడు .ఆతీర్ధమే దశాశ్వ మేధ తీర్ధం అయింది .అని బ్రహ్మ నారదుడికి చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -16-11-18-ఉయ్యూరు

