గౌతమీ మాహాత్మ్యం -11
18 అధ్యాయం –అహల్యా సంగమ ఇంద్ర తీర్ధం
బ్రహ్మ అహల్యాసంగమ క్షేత్రాన్ని నారదుని చెబుతూ ‘’ఒకసారి అత్యంత సుందరాంగిని సృష్టించి ,ఆమెను ఎవరు పోషించగలరా అని ఆలోచించి ,అన్నివిధాల శ్రేష్టుడైన గౌతమమహర్షికి ఇచ్చి యవ్వనవతిఅయేదాకా పోషించి తర్వాత తనకు అప్పగించమని చెప్పాడు .అలాగే పోషించి యవ్వనవతి అయిన ఆమెను బ్రహ్మకు అప్పగించాడు .ఆమెను ఇంద్ర అగ్ని వరుణాదులుతమకే ఇమ్మని కోరారు .అందరూ ఆమెకావాలన్నారు .ఎలాగైనా ఇంద్రుడు దక్కించుకోవాలని ఉన్నాడు .బ్రహ్మ అన్నీ ఆలోచించి ఆకన్యకకు గౌతముడే తగినవాడని నిశ్చయించి అందరి ని పిలిపించి ,ఆ బాలికచేత అందరి బుద్ధి ,ధైర్యం మధించ బడింది కనుక ఆమెకు ‘’అహల్య ‘’అనే పేరుపెదుతున్నానని ,ఎవరు ముందుగా భూ ప్రదక్షిణం చేసి వస్తే వారికి ఆమెను భార్యగా ఇస్తానని ప్రకటించాడు .సుర గణమంతా ప్రదక్షిణకు వెళ్ళారు .గౌతముడు మాత్రం అక్కడనుండి కదలలేదు .
ఇంతలో కామధేనువు అర్ధ ప్రసూత అయి అక్కడికి వచ్చింది .దానినే భూమిగా భావించి కామధేనువు చుట్టూ ప్రదక్షిణం ,లింగ ప్రదక్షణం చేసి గౌతముడుబ్రహ్మ దగ్గరకు వెళ్లి తన భూ ప్రదక్షిణ పూర్తయిందని చెప్పగా .అప్పటికి దేవతలెవరూ భూప్రదక్షిణ చేసి తిరిగి రానందున ధ్యానయోగం తో గౌతముడు చెప్పినది సత్యమే నని గ్రహించి అహల్యను గౌతమునికి ఇచ్చి వేద్దామనుకొని ఆయనతో ‘’అర్ధ ప్రసూత ఐన కామధేనువు సప్త ద్వీపవతి ఐన భూమి అవుతుంది .లింగ ప్రదక్షణకూడా భూ ప్రదక్షిణకు సమానం’’అని చెప్పి అహల్యను గౌతమమహర్షికి ఇచ్చేశాడు బ్రహ్మ .అహల్యా గౌతముల వివాహం అయిపొయింది .
అప్పుడు దేవతలంతా తిరిగి వచ్చి వారి దాంపత్యాన్ని అభినందించి ,ఆశీర్వదించి స్వర్గానికి వెళ్ళారు. బ్రహ్మగిరిపై అహల్యా గౌతములు హాయిగా కాపురం చేస్తున్నారు .ఇంద్రుడు ఇక్కడి వీరి వైభవానికి అసూయ చెంది ,ఏదో ఒక రూపంలో గౌతమభవనం చేరాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు .ఒకరోజు గౌతముడు పూర్వాహ్న క్రియలు నిర్వర్తించి శిష్యులతో ఆశ్రమం వదలి ,బయటికి వెళ్ళాడు .ఇదే అదను అనుకోని గౌతమ వేషంతో ఆశ్రమం ప్రవేశించి ,ఆమెతో సరసల్లాపాలు చేస్తూ ఉన్నా ఆమెకు వాడు ఇంద్రుడని తెలియక వాడితో రమించింది ..గౌతముడు తిరిగి రాగా ఆమె యధాప్రకారం ఎదురు రాలేదని గ్రహించగా ,ముని వనితలు ఆయనతో ‘’బయటా ,లోపలా మీరే ఉన్నారేమిటి స్వామీ . బహు వేషం ఆశ్చర్యంగా ఉందే ‘’అన్నారు .ఏదో కొ౦పమునిగిందని అహల్యను బిగ్గరగా పిలిచాడు .విషయం అర్ధమైన అహల్య మాయా గౌతముడిని ‘’గౌతమముని రూపం లొ వచ్చి మోసం చేసిన నువ్వెవరు ‘’అనగా కంగారు పడి బిడాల రూపం పొందాడు . మహర్షిభార్యను ‘’ఎందుకీ సాహసం చేశావు ?’’అని అడుగగా ఆమె మారాడక సిగ్గుతో నిలబడి పోగా, బిడాలాన్నితానెవరని ప్రశ్నించగా ‘’ఇంద్రుడిని .నేనే పాపం చేశాను .క్షమించు ‘’అనగా క్రోధంతో ‘’భగ ప్రీతితో పాపం చేశావు కనుక సహస్ర భగాలు కలవాడివైపో’’అనీ , అహల్యను ‘’ఎండిన నదిగా మారిపో ‘’అనీ ఇద్దర్నీ శపించాడు ముని.
అహల్య తన నిర్దోషిత్వాన్ని మునికి చెప్పింది’’అన్య పురుషులను కోరే స్త్రీలు అక్షయనరకం పొందుతారు .వాడు మీ రూపం లొ వచ్చాడు .దీనికి సాక్ష్యం రక్షకులే ‘’అనగా వాళ్ళు కూడా అహల్య సత్యమే చెప్పిందని చెప్పారు .జాలిపొందిన మహర్షి ఎండిన రూపం లొ ఉన్న అహల్యానది ఎప్పుడు గౌతమి నదితో కలుస్తుందో అప్పుడు స్వస్వరూపం పొందుతుందని చెప్పాడు .ఆమె అలాగే నదిగా మారి, ఎండిపోయి, గౌతమితో సంగమించగా , మళ్ళీ పూర్వ రూపం పొంది౦ది .ఇంద్రుడు గౌతముని ప్రార్ధించగా గౌతమీనదిలో స్నానం చేస్తే దోషం హరిస్తుందని చెప్పగా అట్లాగే చేసి మళ్ళీసహస్రాక్ష దేవేంద్ర రూపం పొందాడు .అప్పటినుంచి ఈ తీర్ధం అహల్యాసంగమం అనీ ,ఇంద్ర తీర్ధమని పేరు పొందింది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు ‘’
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -19-11-18-కాంప్ –మల్లాపూర్ –హైదరాబాద్ .

