గౌతమీ మాహాత్మ్యం -20
31-కద్రూ సుపర్ణా సంగమ తీర్ధం
సుపర్ణ(వినత ) ,కద్రూ సంగమ తీర్దాలగురించి బ్రహ్మదేవుడు నారదర్షికి తెలియజేశాడు .ఇక్కడే అగ్ని ,రుద్ర ,విష్ణు ,సూర్య ,చంద్ర ,బ్రహ్మ ,కుమార ,వరుణ కుండాలున్నాయి .అప్సరానదీ సంగమం కూడా ఇక్కడే ఉంది .పూర్వం వాలఖిల్య మహర్షులు ఇంద్రునిచే పీడింపబడి ,కశ్యపమహర్షి దగ్గరకు వెళ్లి తమతపస్సులో సగభాగం ఆయనకిచ్చి దేవేంద్రునితో సమానుడైన పుత్రుడిని కనమని చెప్పగా ఆయన సరే అన్నాడు .కశ్యపుడు తనభార్యలు సుపర్ణ , కద్రువలకు గర్భాదానం చేసి ,తాను వేరొక చోటికి వెళ్ళే పని ఉందని ,వారిద్దరిని బయట తిరుగవద్దని తిరిగితే శాపగ్రస్తులౌతారని హెచ్చరించి వెళ్ళాడు .
గంగాతీరం లో బ్రాహ్మణులు యజ్ఞం చేస్తుంటే చూడాలని ఈ ఇద్దరూ వెళ్ళారు .అక్కడ యవ్వనమదమత్తులై,బ్రాహ్మణులు వద్దని చెబుతున్నా ,హవిస్సులను ,మంత్రాలను వికృతం చేస్తుంటే ,వారి అపామార్గ ప్రవర్తనకు నదులు కమ్మని శపించగా కద్రూ వినతలు నదులైపోయారు .ఇంటికి తిరిగొచ్చిన కశ్యపప్రజాపతి ,ఋషులవలన జరిగింది తెలిసి ,వాలఖిల్యులకిచ్చిన మాట గుర్తుకొచ్చి వారికి చెప్పగా వాళ్ళు గౌతమీస్నానం చేసి,మధ్యమేశ్వరుడు అనే పేరుతొ అక్కడున్న మహేశ్వరుని ధ్యానిస్తే మంచి జరుగుతుందని చెప్పగా ,అలాగే చేయగా ,కరుణించిన శివుడు ప్రత్యక్షమై వరాలు కోరుకోమనగా తనభార్యలను మళ్ళీ ప్రసాదించమని కోరాడు ముని .శివుడు నదీ రూపాలు పొందిన కద్రూ వినతలు గంగాసంగమం వలన స్వస్వరూపం పొందుతారన్నాడు ,అలాగే భార్యలు పూర్వ రూపాలు పొందారు .
కశ్యపుడు భార్యలను పొంది ,గౌతమీ తీరం లోనే విప్రుల సమక్షం లో భార్యలకుసీమంతం జరిపింఛి మృష్టాన్నభోజనాలు పెట్టించాడు .కద్రువ బుద్ధిమారక బ్రాహ్మణులను ఒక కంటితో పరిహసి౦చగా ,ఆకన్ను చితికి పోతుందని శపించగా కద్రువ గుడ్డిది అయింది. ఈమెయే పాములతల్లి ..అప్పటినుంచే పాములకు కళ్ళు కనిపించటం లేదు .కశ్యపుడు అనుగ్రహించమని వేడుకోగా వారు అనుగ్రహించగా గౌతమీ స్నానం చేసి అందరూ పవిత్రులైనారు .ఈతీర్ధమే వినతా కద్రువ తీర్ధం అయింది .
32-సరస్వతీ సంగమ –పురూరవ –సబ్రహ్మ –సిద్దేశ్వర తీర్ధ౦
ఒకసారి పురూరవ మహా రాజు బ్రహ్మ దగ్గరకు వెళ్లి ,అక్కడనవ్వుతున్న దేవనది సరస్వతి ని చూసి ,కారణమేమిటని ఊర్వశిని అడిగాడు .‘’ఈమె బ్రహ్మపుత్రిక సరస్వతి .రోజూ ఇక్కడికి వచ్చిపోతుంది ‘’అని చెప్పగా ఆమెను తనదగ్గరకు తీసుకొని రమ్మని ఎంతో ధనమిచ్చి పంపగా ,ఆమె వెళ్లి చెప్పగా ,అలాగే వస్తానని వెళ్ళింది .సరస్వతీ నదీ తీరం లో పురూరవరాజు ఆమెతో చాలా ఏళ్ళు సుఖించగా ,వారికి సరస్వతుడు అనే కొడుకు కలిగాడు .ఇతనికొడుకు బృహద్రధుడు .రోజూ రాచగృహానికి వెళ్ళే సరస్వతిని చూసి కోపించి మహానది గా మారమని శపించగా ,తన శాపం తొలగించుకోవటానికి గంగానదిని చేరి వివరించగా ,కనికరించి గంగ బ్రహ్మతో’’శాపమిచ్చిన నువ్వే శాపవిమోచనం చేయాలి స్త్రీలు చంచలస్వభావులని నీకు తెలుసు ‘’అనగా బ్రహ్మ శాపం ఉపసంహరింఛి ‘’సరస్వతి దృశ్యమగుగాక ‘’ అన్నాడు .అప్పటినుంచి సరస్వతీ నది దృశ్య, అదృశ్యంగా ఉంటోంది .
శాపతాప్త సరస్వతి గంగానదితో కలిసిన చోట ,పురూరవమహారాజు తపస్సు చేసి ,సిద్దేశ్వర హరుని అర్చించి ,గంగా దేవి అనుగ్రహం తో ,శంకరుని కరుణతో సకల కామాలు సిద్ధింప జేసుకొన్నాడు .ఆనాటి నుండి అది పురూరవ తీర్ధమైనది అని బ్రహ్మ నారదునికి చెప్పాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -28-11-18-ఉయ్యూరు
—

