రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-2
శ్రీ కృష్ణుని దివ్యత్వమే రాసలీల అంటుంది బెసెంట్ సతీమణి .వ్యాసర్షి భాగవత ప్రారంభం లో శ్రీ కృష్ణ జననం వివరిస్తూ శ్రావణ మాసంలో రోహిణీ నక్షత్ర యుక్తబహుళ అష్టమి నాడు కంసుని మధురలోని కారాగారం లో కృష్ణజననం జరిగిందని చెప్పాడు . భాగవత దశమస్కంధం మూడవ అధ్యాయం లో లో వ్యాసుడు ఆ సన్నివేశాన్ని వొడలు గగుర్పొడిచేట్లు వర్ణించాడు .గాడాంధకారం లో రాత్రివేళ దేవదేవుడుచంద్రుడు తూర్పు దిక్చక్రం లో ఉదయించి పెరుగుతున్నట్లు సాక్షాత్కరించాడు –కనిపించాడు అన్నాడు కాని, దేవకీ గర్భం నుండి జన్మించాడు అని చెప్పలేదు .ఆసన్నివేశం మహోత్క్రుస్టం –
‘’తమ్ అద్భుతం బాలక౦ అ౦బుజేక్షణం-చతుర్భుజం ,శంఖ గదార్యాయుదయుధం -శ్రీ వక్ష లక్షణం ,గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం –మహార్హ వైడూర్య కిరీట కుండలం –త్విషాపరిష్వక్త సహస్ర కుంతలం –ఉద్దామ కాన్చ్య౦గదకంకణాదిభిః-విరాజమాన౦ వసుదేవ ఐక్ష్యత ‘’
భావం –దేవకి భర్త వసుదేవుడు ఆ బాలకృష్ణుడిని-చతుర్భుజాలతో శంఖ గద చక్ర కమలాలతో ,ఉరమున శ్రీవత్స చిహ్నం తో,మెడలో కౌస్తుభ మాలతో ,పీతాంబర ధారియై ,నవనీల మేఘశ్యామల వర్ణం తో ,చిక్కని శిరోజాలు కర్ణాభరణాలపై అలంకరింపబడిన కిరీటం తో ,ధగద్ధగాయమానమైన వజ్రాది హారాలతో ,కటి ,హస్త ,ముంజేతులకు అలంకారాలతో దర్శించాడు .
మనం నమ్మినా నమ్మక పోయినా ఇది యదార్ధం .ఇది నమ్మకపోతే రాసలీల వ్యాసుని ఊహాలీల, కల్పితహేల అనిపించి ఇక చెప్పటానికేమీలేక వ్యాస రచన ను మాత్రమే చదవగలం .ఇదంతా పరమ సత్యం అని నమ్మితే ,శ్రీకృష్ణ రాసలీల కూడా యదార్ధమే నని నమ్మాల్సిందే .ఏదో నమ్మటం మాత్రమె కాదు. అప్పుడే దానిలో న్యాయ నిబద్ధత కనిపిస్తుంది .రాసలీలపై మంచి, చెడు అనుమానాలు వస్తే ,శ్రీ కృష్ణ జనన వృత్తాంతాన్ని తప్పక నమ్మాము అని మర్చిపోరాదు .కనుక శ్రీ కృష్ణుడు సర్వ శక్తిమంతుడు ,సంపూర్ణ అతీత మానస దివ్యమూర్తి అని గ్రహించాలి .
మనలాగా కృష్ణుడు ఒక సాధారణ మానవుడు అనుకొంటే రాసలీల అంతా హుళక్కి అని పిస్తుంది.ఆస్థాయి దాటి ఆలోచిస్తేనే, అందులోని పరమార్ధం ద్యోతకమౌతుంది .శ్రీ కృష్ణుని ఇంద్రియాతీత పారమార్ధిక దివ్య మూర్తిగా,సర్వాంతర్యామిగా ,సర్వజ్ఙునిగా సర్వ శక్తి వంతునిగా తెలుసుకోవాలి . ఈ చిత్త సంస్కారమే లేకపోతే,మనల్ని మనమే కోల్పోయి ,రాసలీల తత్వాన్ని చర్చించి అర్ధం చేసుకొని ఆన౦ది౦చటానికి అర్హత కోల్పోతాము .
సశేషం
వైకుంఠ (ముక్కోటి )ఏకాదశి శుభాకాంక్షలతో
మీ -గబ్బిట దుర్గాప్రసాద్ -18-12-18-ఉయ్యూరు

